Friday, April 12, 2019

మహానుభావుల నుండి పాఠాలు వినడం గొప్ప అదృష్టం .... వైఆర్కే బాల్యం...కుటుంబ నేపధ్యం-5 .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


మహానుభావుల నుండి పాఠాలు వినడం గొప్ప అదృష్టం
వైఆర్కే బాల్యం...కుటుంబ నేపధ్యం-5
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (13-04-2019)
తెలుగు అధ్యాపకుల ప్రస్తావన తెచ్చారు. సర్వా శేషయ్యగారు సంస్కృతం, తెలుగు రెండింటిలో ఎం.ఏ చేశారట. మనిషి వేష ధారణ పేద బ్రాహ్మణుడిలా వుండేది. మొహాన విభూతి రేఖలు, మధ్య కుంకుమ బొట్టు! ఆయన "గిరిజా కల్యాణం" పుస్తక పాఠం చెపుతుంటే, సాధారణంగా తరగతులు ఎగ్గొట్టే విద్యార్థులు కూడా తప్పకుండా హాజరయ్యేవారట. హాస్యం, వ్యంగ్యం, శృంగారం - సకల రసాలు ఆయన కంఠంలో అలవోకగా వచ్చేవంటారు. మరొక గొప్ప తెలుగు దిగ్గజం పువ్వాడ శేషగిరి రావు గారి గురించీ చెప్పారు. ఆయన వేషం సంప్రదాయ, ఆధునికతలు కల బోసి వుండేదట. అందమైన వ్యక్తి. "తిక్కన"పై ఆయనకు చెప్పలేనంత అభిమానం. తన కుమారుడి పేరు కూడా తిక్కన అని పెట్టుకున్నారు. స్వయంగా ఆయనొక కవి. అప్పటికే "గోవత్సం", "13-04-2019)ముంతాజ్ మహల్" అనే ఖండ కావ్యాలు రాశారు. మొదటిది బి.. పాఠ్య గ్రంథంగా కూడా పెట్టారు. "పంచవటి" కావ్యాన్ని ఆయన శ్రావ్యంగా - రాగ యుక్తంగా వినిపిస్తూ, అద్భుతంగా చెబుతూనే, మధ్య - మధ్య తిక్కన గారి భారత పద్యాలు వినిపించి, వాటి విశిష్టత వివరించేవారు. నిజంగా అలాంటి మహానుభావుల నుండి పాఠాలు వినడం తనకు లభించిన గొప్ప అదృష్టంగా చెప్పారు డాక్టర్ గారు.

సైన్స్ సబ్జెక్ట్స్ - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ - బోధించిన మాస్టర్లు కూడా గుర్తుంచుకోదగిన వారే నంటారు. వారి అధ్యాపక నైపుణ్యం వల్లే, తనకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో, ఆ మూడు సబ్జెక్ట్స్ ‍లో డిస్టింక్షన్ మార్కులు వచ్చాయన్నారు. అప్పటికి "ట్రిపుల్ డిస్టింక్షన్" ఒక గొప్పగా వుండేదట. ఐతే, తనకిష్టమైన తెలుగులో డిస్టింక్షన్ రెండు మార్కులతో మిస్ కావడం ఆ రోజుల్లో ఆయనను కాస్త బాధించిందట! తనకు పరీక్షల విషయంలో, తల్లిదండ్రుల నుండి ఎలాంటి వత్తిడి వుండేది కాదన్నారు. ట్యూషన్ల ప్రమేయమే లేదట. పాఠాలు శ్రద్ధగా వినడం, బుద్ధిగా చదువుకోవడం చేసేవారట! ఇంటర్‍లో మిత్రులుగా వుండి, ఆ తరువాత, వివిధ వృత్తులలో స్థిరపడిన ఆర్.వి. కృష్ణారావు, పోలవరపు వెంకటేశ్వరరావు, నాంచారయ్యలతో పాటు పలువురు స్నేహితుల పేర్లను గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు.

1944 లో, ఆయన ఇంటర్ రెండో సంవత్సరంలో వున్నప్పుడు, పెద్ద ఎత్తున జరిగిన ఆ నాటి "బెజవాడ" అఖిల భారత రైతు మహా సభలను జ్ఞాపకం చేసుకున్నారు. అవి ఈ నాటికీ, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ముఖ్య ఘట్టాలుగా చెప్పుకుంటారన్నారు. ఆ సందర్భంగా బందరు నుండి తన మిత్రులతో కలిసి, ఆ మహా సభలకు ప్రేక్షకులుగా వెళ్లడం, చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య, చలసాని వాసుదేవరావుగార్లతో పాటు, బీహారుకు చెందిన ప్రసిద్ధ రైతు నాయకుడు స్వామీ సహజానందను (కాషాయ వస్త్రాలతో) వేదిక మీద చూసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే, ఆనాటి విద్యార్థి ఫెడరేషన్ (AISF) తో సంబంధాలుండేవి డాక్టర్‍గారికి. పార్టీతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, పట్టణ విద్యార్థి ఫెడరేషన్ కమిటీలో తీసుకున్నారు డాక్టర్‍గారిని. అప్పటినుంచే, దాసరి నాగభూషణరావు (ఆ తరువాత ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకుడుగా, రాజ్య సభ సభ్యుడుగా వున్నారు) గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఇంటర్‍లో హ్యుమానిటీస్ సెక్షన్‍లో చదువుతుండేవారట.

ఆ సందర్భంగా మరొక సంఘటన గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా వున్న కాట్రగడ్డ నారాయణరావుగారిని, ఉపన్యాసకుడుగా, ఒక విద్యార్థి బహిరంగసభకు ఆహ్వానించారట. బెజవాడకు చెందిన కాట్రగడ్డవారి కుటుంబం (సోదరులు మధుసూధనరావు, నారాయణరావు, "నవయుగ" శ్రీనివాసరావుగార్లు)కాంగ్రెస్ పార్టీలో వున్నప్పటికీ, వామపక్ష అభిప్రాయాలతో ఏకీభవించుతూ, సుందరయ్య-రాజేశ్వరరావుగార్లతో సన్నిహిత సంబంధాలు కలిగుండేవారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో, నారాయణరావుగారు బహిరంగంగానే కమ్యూనిస్టులకు అనుకూలంగా మాట్లాడేవారు. ఆనాటి నారాయణరావుగారి ప్రసంగం తనకు కొంత స్ఫూర్తినిచ్చిందంటారు డాక్టర్‍గారు.


మంచి మార్కులతో ఇంటర్ పాసైన తరువాత, ఏం చేయాలో - ఏం చదువుతే భవిష్యత్ బాగుంటుందో గైడ్ చేసేవారు ఎవరూ లేరట అప్పుడు. స్నేహితులతో సంప్రదించి, ఆంధ్రా యూనివర్సిటీకి ఒక అప్లికేషన్, ఆంధ్రా మెడికల్ కాలేజీకి మరొక అప్లికేషన్, మార్కుల జాబితా జతపర్చి పంపించారట. కొన్ని రోజుల తరువాత ఆంధ్రా యూనివర్సిటీ నుండి వుత్తరం వచ్చింది. (అప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ గుంటూరు నుండి పనిచేసేది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ యుద్ధ విమానాలు విశాఖ హార్బర్ మీద బాంబులు వేశాయి. ఆ భయంతో యూనివర్సిటీ గుంటూరుకు మార్చారు). బీ.ఎస్సీ. (ఆనర్స్), జియో ఫిజిక్స్ లో సీట్లు వచ్చినట్లు తెలవడంతో, ఏదో ఒకటి అనుకుని వెళ్లి ఫీజు కట్టి వచ్చారట. ఇంకా తరగతులు ప్రారంభం కాకముందే, మరో వారం లోపున, మెడికల్ కాలేజీనుండి సీటు వచ్చినట్లు ఉత్తరం వచ్చింది. 

మెడికల్ కాలేజీలో సీటు రావడం ఇప్పట్లో చాలా కష్టమనీ, ఆ రోజుల్లో తేలిగ్గా వచ్చేదన్న కొందరి అభిప్రాయం సరైంది కాదన్నారు డాక్టర్ గారు. అది నిజం కాదని అంటూ, అప్పుడు సర్కారు - సీమ జిల్లాలకు కలిపి ఒకే ఒక్క మెడికల్ కాలేజీ వుండేదని, సీట్లు మొత్తం 54 మాత్రమే వుండేవని, వాటిలో ఎంపీసి (లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్టులు తీసుకున్న వారికి - సైన్స్ లో బి., బి.ఎస్సీ చేసిన వారికి కూడా అవకాశం వుండేదని అన్నారు. రాధాకృష్ణమూర్తిగారి బాచ్ లో 54 మందికి గాను, 28 మంది గ్రాడ్యుయేట్లే. అందులో ఇద్దరు ఎమ్మెస్సీ చేసిన వారున్నారు. ఒకరు (విజయనగరానికి చెందిన రామ మోహన రావు గారు) పూనాలో ఇంటర్ + ఎల్ ఎల్ బి చేసి వచ్చారు. (సశేషం)

No comments:

Post a Comment