Monday, April 15, 2019

పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోస్టర్లు అతికించినందుకు జైలు......వైఆర్కే మొదటి జైలు అనుభవం .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోస్టర్లు అతికించినందుకు జైలు  
వైఆర్కే మొదటి జైలు అనుభవం
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (16-04-2019)
1949 సంవత్సరంలో జరుపుకోవాల్సిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరసన దినంగా-బ్లాక్ డేగా పరిగణించాలని కమ్యూనిస్ట్ పార్టీ, ఒక రోజు ముందర, ఆగస్ట్ 14 న పిలుపిచ్చింది. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. "కాటూరు ఎలమర్రు సంఘటన"లో చోటు చేసుకున్న పోలీసు దౌర్జన్యానికి, హింసా కాండకు వ్యతిరేకంగా, వైజాగ్ పట్టణంలో గోడలకు పోస్టర్లు అంటించే కార్యక్రమాన్ని రాధాకృష్ణమూర్తికి-ఆయన స్నేహ బృందానికి అప్పగించింది పార్టీ. స్నేహితులను పోగు చేసుకుని, పోస్టర్లు తయారు చేసి, రాత్రి పూట అతికించ సాగారు రాధాకృష్ణమూర్తి బృందం. సగానికి పైగా పట్టణంలో అతికించడం పూర్తైంది. వీళ్లు చేస్తున్న పని రాత్రి పూట గస్తీ తిరుగుతున్న బీట్ కానిస్టేబుల్ దృష్టిలో పడింది. అందరినీ పట్టుకుని దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్‍కు తీసుకెళ్లారు. మెడికల్ కాలేజీ విద్యార్థి ఐన వై ఆర్ కె ను వుంచి, మరో (.వి.ఎన్) కాలేజీ విద్యార్థులను వదిలేశారు. వై.ఆర్.కె స్టేషన్లోనే వుండి పోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో, అలా దొరికిన వాళ్లను పట్టుకుని కాల్చేయడమో, డిటెన్యూలుగా పంపడమో ఆనవాయితీ. మరో పక్క తెలంగాణాలో ఉద్యమం తీవ్రతరమైంది. అణచివేత కార్యక్రమం కూడా ఉదృతమైంది. ఈ నేపధ్యంలో పోలీసు స్టేషన్లో వున్న రాధాకృష్ణమూర్తి పట్ల సానుభూతి కలిగింది సబ్ ఇన్‍స్పెక్టర్ ధర్మరాజుకు. హాస్టల్ రూములో కాకుండా బయట గది తీసుకుని వుంటున్న రాధాకృష్ణమూర్తి రూమ్మేట్ బాల పరమేశ్వరరావుకు కబురు చేశాడు ధర్మరాజు. తాము గదిని సోదా చేయడానికి వస్తున్నట్లు, గదిలో విప్లవ సాహిత్యం కనిపించకుండా చేయమంటూ సంకేతం పంపాడు. సీ ఐ వచ్చి సోదా చేస్తే ఏమీ దొరకనందున రాధాకృష్ణమూర్తిని డిటెన్యూగా పంపకుండా, పోలీసు కేసు పెట్టి జైలుకు పంపారు. అలా రాధాకృష్ణమూర్తికి మొదటి జైలు అనుభవం కలిగింది.

ప్రభుత్వం అనుమతి లేకుండా ఏది ప్రచురించినా అది నేరం కింద పరిగణించాలని 1918 లో చేసిన చట్టం కింద, రాధాకృష్ణమూర్తి మీద కేసు పెట్టింది ప్రభుత్వం. ఆ విషయం కళాశాలలో అందరికీ తెలిసింది. మరునాడు, మెడికల్ కాలేజీ అనాటమీ ప్రొఫెసర్ మాథ్యూ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్జీ పండాలెలు జైలుకు వచ్చారు. వారొస్తారని రాధాకృష్ణమూర్తి ఊహించలేదు. ఆయన అనాటమీ, ఫిజియాలజీలలో విశ్వవిద్యాలయం ప్రధమ రాంకు సంపాదించడంతో అలాంటి విద్యార్థికి సహాయ పడాలని వచ్చారు వారిద్దరూ. జైలు సూపరింటెండెంట్ దగ్గర కూర్చొని, రాధాకృష్ణమూర్తిని పిలిపించారు. తానే పొరపాటు చేయలేదని, ప్రభుత్వం అవలంబిస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తూ, పోస్టర్లు అతికించడం నేరం కాదని స్పష్టం చేశారాయన. ఆ పనిని రాత్రి వేళ ఎందుకు చేయాల్సి వచ్చిందని అమాయకంగా ప్రశ్నించాడు ప్రిన్సిపాల్. అంతే అమాయకంగా జవాబిస్తూ, "పగలు కాలేజీకి పోవాలి కదా సర్ మరి" అన్నారు వై ఆర్ కె. వారిద్దరూ తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, కుర్రవాడి భవిష్యత్ పాడు కాకుండా చూడమని కోరారు. ఫీజు లేకుండా ఏ కేసును చేపట్టని ఒక సోషలిస్ట్ అడ్వకేట్, వై.ఆర్.కె కేసును వాదించారు కోర్టులో. పది రోజుల తర్వాత బెయిల్‍పై విడుదల చేసింది ప్రభుత్వం. ఆయన మొదటి జైలు జీవితంలో, అప్పటికే జైలులో డిటెన్యూలుగా వున్న జూట్ మిల్లు కార్మికులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఒక్క ఇరుకు సెల్ లో, వారందరూ నాపరాళ్లపై కంబళి పరచుకుని నిద్రిస్తుంటే ఆయన బాధ పడేవారు. తనకూ అంతే. డిటెన్యూల వంట (చిప్పకూడు తినకుండా)తనకూ లభించిందట. ఒకటి-రెండు కోర్టు వాయిదాలయిన తర్వాత, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసన్, జిల్లా కలెక్టర్ దగ్గరకు రాధాకృష్ణమూర్తిని తీసుకెళ్లారు. కలెక్టర్ వై ఆర్ కే ను కోప్పడి, కేసు పరిష్కరించమని పబ్లిక్ ప్రాసిక్యూటర్‍కు ఆదేశాలిచ్చారు. ఆయన, డిఫెన్స్ లాయర్ మాట్లాడుకున్నారు. క్షమాపణ కోరమంటే, ఒప్పుకోని రాధాకృష్ణమూర్తికి రాజీ ఫార్ములా సూచించారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కాదని, హింసా కార్యక్రమంలో తనకు నమ్మకం లేదని కాగితం మీద రాసివ్వమన్నారు. ఈ రెండు అప్పటికి నిజమే కాబట్టి, అలానే చేసి, ప్రభుత్వం కేసు వాపసు తీసుకోవడంతో, విడుదలయ్యారు. అలా పది రోజుల పాటు ప్రధమ జైలు జీవితం వైజాగ్ సెంట్రల్ జైల్లో గడిపారు రాధాకృష్ణమూర్తి.


ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలుండేవారు. సమావేశాలు జరుగుతుండేవి. మెడికల్ కాలేజీ నుండి వై.ఆర్.కె, వారి మిత్రులు ఇద్దరు-ముగ్గురు కలిసి వెళుతూ వుండేవారు. అప్పుడు యూనివర్సిటీ లా కాలేజీలో వుండే పి.. చౌదరి, అమరేశ్వరి తరువాత హైకోర్టు న్యాయమూర్తులయ్యారు. ప్రముఖ అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బా రావు కూడా ఆ బాచ్‍లో వుండేవారు. అప్పుడు రామకృష్ణారావు సైన్స్ విభాగం నుండి వచ్చేవారు. ఆయన తరువాత కాలంలో పెద్ద సైంటిస్టుగా మంచి పదవిలోకి వెళ్ళారు. 1945 ప్రాంతంలో, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రముఖ మేధావి, రచయిత కట్టమంచి రామలింగారెడ్డిగారుండేవారు. వారిని, రిజిస్ట్రార్‍గా వుండే గోపాలస్వామి నాయుడు గారిని, హాస్టల్ డేకు, ముఖ్య అతిధిగా ఆహ్వానించేవారని చెప్పారు డాక్టర్‍గారు.

యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ఆంధ్ర అభ్యుదయ మహాసభలు నిర్వహించేవారు. పండిత గోష్టులతో పాటు, మంచి-మంచి సాంస్కృతిక కార్యక్రమాలు వుండేవి. ఒక రాత్రి మహా వైణిక విద్వాంసులు ద్వారం వెంకటేశ్వర స్వామి నాయుడు గారి కార్యక్రమం ఎన్నటికీ మరిచిపోలేని ఘటనగా గుర్తుచేసుకున్నారు డాక్టర్ గారు. ఆయన, శాస్త్రీయ సంగీత ఝరితో పాటు, చివరగా విద్యార్థుల కోసం వయోలిన్ మీద "మొక్కజొన్న తోటలో" అద్భుతంగా వాయిస్తుంటే, వేలాది శ్రోతలు నిలబడి కరతాళ ధ్వనులు చేశారట.

"ప్రపంచంలో మనుషులు వస్తారు - పోతారు. కొందరు ఏమీ మిగల్చరు. కొందరు రకరకాల దుర్మార్గాల ఆనవాళ్లు మిగుల్చు తారు. మరికొందరు, ప్రజలకు అంకితమై, మహత్తర పోరాటాలు, త్యాగాలు చేస్తారు. అనేకుల జీవిత చరిత్రలు చదివిన తరువాత, నాకు అనిపించింది ఏమిటంటే: ఆత్మకథ అన్నది కేవలం ఆ వ్యక్తి జీవిత ఘటనల, అనుభవాల చిట్టా కాదు. దానిని చదివి, ఒకోసారి ఇతరులు తమ జీవితాలను ఆ విధంగా మలుచుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ పుస్తకం అటువంటిదని నేను అనుకోవడం లేదు. యువకుడుగా వున్నప్పుడు నేనూ అందరివలెనే అనేక పొరపాట్లు చేశాను. పద్దవాడినయ్యాక నా సహచరులు, నాకు గొప్పతనం అంట కట్టారు" - నెల్సన్ మండేలా తన ఆత్మకథ " కన్వర్‍జేషన్స్ విత్ మై సెల్ఫ్" లో.

2 comments:

  1. “వైణిక” విద్వాంసుడు అంటే వీణ విద్వాంసుడు. ద్వారం వారు వయొలిన్ విద్వాంసులు.

    ReplyDelete
  2. // “ఒక రాత్రి మహా వైణిక విద్వాంసులు ద్వారం వెంకటేశ్వర స్వామి నాయుడు గారి కార్యక్రమం ” //
    —————————-

    వయొలిన్ విద్వాంసులు ద్వారం వారి పేరు ... ద్వారం వెంకటస్వామి నాయుడు. పైన మీరు వ్రాసిన “వెంకటేశ్వర” స్వామి నాయుడు కాదు. ప్రముఖుల పేర్లయినా సరిగా వ్రాస్తే బాగుంటుంది.

    ReplyDelete