Saturday, April 20, 2019

రామానుజదాస స్వామి సుందరకాండ ప్రవచనాలు : వనం జ్వాలా నరసింహారావు


రామానుజదాస స్వామి సుందరకాండ ప్రవచనాలు
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (21-04-2019)
శ్రీరామాయణం క్షీరధార. అందులో సుందరకాండ పంచదార. అందులోనూ శ్రీవాసుదాసస్వామి వారి "మందరం" మందార మకరంద మాధుర్యం. "కవికులగురువు-కాళిదాసు" అన్నట్లు:

"వృత్తమ్ రామస్య వాల్మీకీః, కృతి తౌ కిన్నెర స్వరౌ!
కింతత్? యేన మనోహర్తుమ్ అలంస్యాతాం నశ్రుణ్వతామ్’!"

(చరిత్ర మారాముడిది. రచన సాక్షాత్తూ వాల్మీకులవారిది. గానం చేసేవారు కిన్నెర గాత్రులైన కుశ-లవులు. ఇంతటి మహనీయమైన రామాయణంలో శ్రోతలను పరవశింప చేయని అంశమేముంటుంది?)

అలాగే ప్రతి అక్షరమూ మంత్రమయమైన శ్రీ సుందరకాండ  ఇహపర శ్రేయస్సాధనంగా మన పెద్దలంతా సంభావించారు. మనం ఇదంతా వాస్తవమేనని విశ్వసిస్తున్నాం. ఆయాశుభాలను హాయిగా అనుభవిస్తున్నాం. శ్రీ వాసుదాసస్వామివారి మందరం" (ఆంధ్ర వాల్మీకి రామాయణం) తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకుంది.

శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం. చక్కదనానికి సంకేతం. మనస్సును మురిపించేదే నిజమైన సౌందర్యం. శాబ్దిక పారమ్యాన్ని నింపుకున్న రామాయణం లోని ప్రతి అక్షరమూ మధురాతి మధురమేకాదు…..మహా మంత్రాక్షరాలతో నిక్షిప్తమైన అక్షయ నిధానం. శ్రవణ స్మరణాదుల మాత్రం చేత అంతఃకరణ శుద్ధి, ఆశయ సిద్ధి, సద్భుద్ధి లభిస్తాయట! వింటేనే చాలు సర్వతో భద్రమన్నారు. అలాంటి వాల్మీకి భగవానుని అనుగ్రహ ప్రసాదమైన రామాయణంలో సారభూతమైనదీ, సర్వారిష్ట నివారకమైనదీ, సర్వాభీష్ట ఫల ప్రదానమైనదీ శ్రీ సుందరకాండ.

సముద్రతరణం - లంకాగమనం - సీతాన్వేషణం - శ్రీరామ నివేదనం - ఇవన్నీ కలిస్తే సుందరకాండ! జరిగిన ఇతివృత్తం యావత్తూ దినద్వయం లోపే. శబ్దాను ప్రాసలతోనూ, అంత్య ప్రాసలతోనూ మార్దంగిక వైభవంగా సాగుతాయి శ్లోకలతలు.

వావిలికొలను సుబ్బారావు దాసు అని (వాసుదాసు) ఒక మహా....మహానుభావులు మన తెలుగు గడ్దపై అవతరించి, వాల్మీకి రామాయణాన్ని మందరం పేరుతో యధావిధేయంగా, ఛందోబద్ధంగా మూల మంత్రాలనూ, మంత్రాక్షరాలనూ సైతం రమ్యత, పారమ్యతలకు విఘాతం కలుగని రీతిలో తెలుగు లోనికి అనువదించి ఆంధ్ర వాల్మీకి అన్న గౌరవాన్ని సంపాదించుకున్నారు. వ్యాస భాగవతాన్ని మరిపించిన పోతన్న భాగవతం వలె, వాల్మీకాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణం మరిపించి తెలుగువారిని మురిపించింది.

వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే. కవికులగురువు కాళిదాసు అన్నట్లు."చరిత్ర మా రాముడిది. రచన సాక్షాత్తు వాల్మీకులవారిది. గానం చేసినవారు కిన్నెర గాత్రులైన కుశ లవులు. ఇంతటి మహనీయమైన రామాయణ కావ్యంలో, శ్రోతలను పరవశింప చేయని అంశం అనేదేదీ లేదు”.


         భగవద్గీత, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి మౌలిక తత్వాలు ధర్మ-జ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని-అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది.

వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి.

ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది-ఆదరించింది.

వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని మిత్రులంటారాయనతో. మూల గ్రంథం రాయడంకంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన మొదట్లో. బాగా ఆలోచించిన తర్వాత, (శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం) "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం.

వాసుదాసుగారు, తాను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.

భగవద్గీత, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీరామాయణాలు భారతీయ సంస్కృతీరూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి మౌలిక తత్వాలు ధర్మజ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్య వ్యంగార్థాలతో "శ్రీమద్రామాయణం" ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని-అర్ధ ప్రతిపాదిత మహామంత్రపూతం. గాయత్రీ బీజ సంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణం శుధ్ధి అవుతుందట!.

తేట తేట తేనెలోని తీయందనాన్ని, చల్లని వెన్నెలలోని సుఖ శీతల మధురిమల్ని కలబోసి వాల్మీకి కోకిల ఆలపించిన ఆనంద మయ కావ్యగానమే సుందరకాండ. శబ్ద-అర్ధ-భావ-రస సౌందర్యాలను పరస్పరాశ్రయంగా సురుచిర భద్రంగా నింపుకొన్న రసమయ పేటి ఇది. ఇది ఒక అమృత భాండం. జీవ-జీవన సౌందర్య కాండం. బాధల మధ్య బోధలనూ, వ్యక్తుల మధ్య సాధనా సిధ్ధులనూ సిధ్ధపరచి, అందించిన మంత్రమయ అక్షయ అక్షర భాండం సుందరకాండం. సుందరకాండలో సుందరం కానిదేమిటట? అంటే..ఏమీ లేనే లేదు..అని పెద్దలి తేల్చేశారు.

ఇందులో హనుమ మహాయోగి. మహాజ్ఞాని. "విశిష్ట వశిష్ఠుడు". మహాచార్యుడు. అంతటి వాడు లంకకు వెళ్లేటప్పుడు శ్రీరామచంద్రుడి భద్ర ముద్రికను (ఉంగరాన్ని), తిరిగి వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణిని చక్కగా ధరించి సముద్రాన్ని సునాయాసంగా దాటి వచ్చాడు. ఈ భవ సాగరాన్ని దాటడానికి విష్ణు చిహ్నాలైన శంఖ-చక్ర ధారణం అలాగే తోడ్పడుతుంటాయి. శ్రీసుందరకాండలో సౌందర్యమనేది రాశీభూతమైంది. మంత్ర పూతమైన రస సౌందర్యం-భగవత్ సౌందర్యమైన శ్రీరామ సౌందర్యం-ఆచార్య సౌందర్యమైన శ్రీహనుమ సౌందర్యం-అశోక, మధు వనాల ఉద్యాన వన సౌందర్యం-మహా విశిష్టమైన లంకా నగర సౌందర్యం-లంకలో కామినీ భోగినీ జన సౌందర్యం-రావణుడి వీర సౌందర్యం-హనుమ సాధనా సౌందర్యం-ఆదికవి వాల్మీకి మహనీయ రమణీయ మాధుర్యమైన కవితా శిల్పసౌందర్యం......వీటన్నింటినీ కలబోసిన మహాసౌందర్యం, శ్రీ "సుందర" సౌందర్యం.

"శ్రాద్ధేశు దేవ కార్యేశు పఠేత్ సుందరకాండమ్’" - పితృ కార్యా లలోనూ, దేవ కార్యాలలోనూ సుందరకాండ అవశ్య పఠనీయ మన్నారు. సుందరకాండ మహామంత్రమనీ, దీనికి ఆంజనేయ స్వామి మంత్రాధి దేవతనీ, సర్వారిష్ట నివారణ దీని ఫలమనీ ఆర్షవాక్యం. ధర్మార్ధ కామాలూ, సత్వ రజోస్తమోగుణాలూ-అనే మూడింటి వల్ల కలిగే ఫలాన్ని పొందాలన్నా, సాంసారిక, మానసిక కష్టాలనుండి దాటాలన్నా, శుభాన్నిచ్చే సుందరకాండను పఠించాలంటారు. ఇది ఇలా వుంచితే అద్భుతమైన దివ్య గాయత్రీ మంత్ర నర్తనం ఆద్యంతాలూ దర్శనమిస్తూందీకాండలో. అందువల్లనేమో "యేనరా కీర్త యిశ్యన్తి నా? స్తి తేశామ్ పరాభవ " అన్నారు రామాయణాన్ని. సర్వత్ర ""కార, ""కారాలు ఆది మధ్యాంతాలూ మనకు ధ్వనిస్తుంటాయి. దేహ-గేహ-గ్రహాది బాధల నుండి సద్యః  రక్షణ కల్పించే మహామంత్ర రాజ విరాజితం కనుకనే శ్రీసుందరకాండ అన్ని సంప్రదాయాల వారికి విశేషంగా ఆదరణీయమైంది.

కాలం గడిచిపోతున్నది. వాసుదారుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

అందుకే ఈ చిరు ప్రయత్నం...సుందరకాండ ప్రవచనా కార్యక్రమం.

{దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆద్వర్యంలో, కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు, వాసుదాస స్వామి నెలకొల్పిన అంగలకుదురు శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం నిర్వాహకులు, ప్రస్తుత పీఠాదిపతి, శ్రీమాన్ రామానుజదాస స్వామి వారి వాసుదాస విరచిత సుందరకాండ ప్రవచనాలు, ఏప్రిల్ నెల 22 సోమవారం నుండి ఏప్రిల్ నెల 24 బుధవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 5-30  గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగును. తప్పక విచ్చేయగలరు}.

No comments:

Post a Comment