ప్రగతి సుమాలు, సంక్షేమ ఫలాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-06-2021)
తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు నీళ్లు, నిధులు, నియామకాల నినాదమే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నాడే తెలంగాణ ప్రజలకు
అన్నిరంగాల్లో న్యాయం జరుగుతుందని ఉద్యమ నేతగా ఉన్నపుడే చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు. అనంతరం,
స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ
బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2021 జూన్ వరకు ఏడేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షోభ సమయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆపకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను
చూస్తే, ఈ విషయం మనకు కండ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. వీరంతా రోజువారీ
పనులు చేసుకుని కడుపు నింపుకొనే వారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి
వసతి లేక వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైపోవడంతో రైతులు కూడా పేదరికం అనుభవించాల్సిన
దుస్థితి ఉండేది. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర
పరిస్థితులను పేదలు అనుభవించేవారు. ఇక్కడ రోజూ ఆకలి చావులే. తెలంగాణ ఏర్పడే నాటికి
ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, పూర్తి జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిఏటా రూ.40 వేల కోట్లతో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో పేదలకు జీవన
భద్రత ఏర్పడింది. వారు పస్తులుండాల్సిన పరిస్థితి తప్పింది. అతి తక్కువ సమయంలోనే
దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది.
ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నాటి తెలంగాణ
ప్రాంతానికి,
అన్ని రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధించి, అన్ని రాష్ట్రాలకూ దిక్సూచిగా మారిన నేటి తెలంగాణకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
అప్పుడు కరెంటు కోతలు,
కాలిపోయే మోటార్లు, కరంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక, బావుల దగ్గరే రైతులు
నిద్రించే దుస్థితి ఉండేది. నేడు 24 గంటలూ రైతుల వ్యవసాయ
పంపుసెట్లకు ఉచితంగా నాణ్యమైన కరెంటు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఆనాడు ప్రాజెక్టులన్నీ సర్వేలకే పరిమితమై, భూములన్నీ నీరందక బీడులుగా మారి
పడావు పడితే, నేడు ప్రాజెక్టులు దాదాపు పూర్తవుతూ మారుమూల టేల్ ఎండ్ చివరి భూములకూ
నీరందిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యమైతే, నేడు తెలంగాణలో అవి మచ్చుకైనా కానరావడం లేదు.
అప్పడు వ్యవసాయం దండుగ అని ఆనాటి పాలకులు అంటే నేడు పండుగగా మార్చి చూపారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్
రావు. రైతులు నాడు లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు పండించగలిగితే, నేడు కోటికి పైగా ఎకరాల్లో రెండు పంటలూ పండిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పేద పిల్లలకు
నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారితే, స్వరాష్ట్రంలో పైసా ఖర్చు
లేకుండా పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి గురుకుల విద్యను అందుకోగలుగుతున్నారు.
అప్పుడు విద్యార్థులు దొడ్డుబియ్యంతో వండిన పురుగుల అన్నం తినలేక రోగాల బారిన
పడితే, ఇప్పడు సన్నబియ్యపు అన్నం తిని ఉల్లాసంగా చదువుకుంటున్నారు.
ఆనాటి పరిస్థితుల్లో ఆడపిల్ల పుడితే చాలు, ఆమె నెత్తిమీద-గుండెమీద కుంపటి
అనుకుంటే,
ఈనాటి పరిస్థితుల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింట్లో ఆడపిల్ల పెళ్లి ఓ పండుగలా జరుగుతున్నది. అప్పడు రహదారులు నరకానికి నకళ్లుగా మారి, గ్రామాలకు బస్సులు వెళ్లలేని పరిస్థితులుంటే, ఇప్పడు రోడ్లన్నీ ఎక్కడికక్కడ
అద్దంలా రూపుదిద్దుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్షేత్రస్థాయి ఉద్యోగులు తక్కువ
వేతనాలతో బతుకీడ్చాల్సి వస్తే, స్వరాష్ట్రంలో గౌరవప్రద
వేతనాలతో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. అప్పుడు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పైసా పైసాకు దేబిరించాల్సి వస్తే, ఇప్పుడు అవి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ప్రభుత్వ నిధులందుకుంటూ, అభివృద్ధి పథంలో ముందున్నాయి.
పరిపాలనా సంస్కరణలు లేక ఉమ్మడి పాలనలో జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిరావడం
దూరభారం అయితే,
ఇపుడు పెరిగిన జిల్లాలతో పరిపాలనా విభాగాలన్నీ ప్రజలకు
చేరువయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు
తెలంగాణను కల్లోల ప్రాంతంగా మారిస్తే, స్వరాష్ట్రంలో తెలంగాణ
శాంతిభద్రతలకు కేరాఫ్ అడ్రస్ గా, ఇతర రాష్ట్రాలకు
మార్గదర్శకంగా నిలిచింది. అప్పడు అడవుల
నరికివేతతో ఎడారి వాతావరణం కనిపిస్తే, ఇప్పడు తెలంగాణ నేలంతా
పచ్చదనం అలుముకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వందల పరిశ్రమలు
మూతపడితే,
ఇప్పడు ప్రభుత్వ అనుకూల విధానాలతో వేలాది పరిశ్రమలు
తరలివస్తున్నాయి. అప్పడు నిత్య కర్ఫ్యూలతో మన రాజధాని ఆగమయితే, ఇప్పడు తెలంగాణలో
శాంతియుత సహజీవనం సాగుతున్నది.
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అంశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నది. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో
ఉంది. విద్యుత్ సరఫరా విషయంలో కూడా అంతే. తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధిక
వృద్ధి రేటు సాధించింది. విద్యుత్ వినియోగం కూడా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ
సగటుకన్నా అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. మిషన్ భగీరథ
పథకం ద్వారా 100 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీరందిస్తూ మంచినీటి సరఫరాలో తెలంగాణ నంబర్ వన్
స్థానంలో నిలిచింది. గ్రామీణాభివృద్ధిలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. అన్ని
గ్రామాల్లో నర్సరీలు,
డంపు యార్డులు, శ్మశాన వాటికలు ఏర్పాటు
చేయడం జరిగింది. అలాగే,
అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు కూడా సమకూర్చడం జరిగింది.
ఇక ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
అత్యుత్తమ సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతి ఆయోగ్
ప్రకటించింది. ప్రపంచంలోనే నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ నంబర్ -1 అని జెఎల్ఎల్ ప్రకటించింది. ఐటి ఎగుమతుల వృద్ధిరేటులోనంబర్ వన్ స్థానంలో
నిలిచింది. 17 శాతం వృద్ధిరేటుతో 1 లక్షా 10 వేలకు పైగా విలువైన ఎగుమతులు జరిగాయి. సుస్థిరాభివృద్ధి సాధిస్తున్న మొదటి
మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని నీతి ఆయోగ్ ప్రకటించింది. సిసి కెమెరాల
వినియోగం,
నేరాల నియంత్రణలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నది.
దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో దాదాపు రెండొంతులు అంటే, తెలంగాణలో 6 లక్షల కెమెరాలున్నాయి. తద్వారా నేరాల నియంతిస్తున్నారు.
నీటి పారుదల రంగంలో తెలంగాణ అగ్రస్థానంలోనే ఉన్నది. అతి భారీ బహుళ దశల
ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరంను కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి, ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చిన్ననీటి
వనరులు, చెరువుల పునరుద్ధరణకు,
అభివృద్ధికి అత్యధిక కృషి చేసిన రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ ప్రకటించింది.
ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు
ఆదర్శంగా నిలుస్తున్నది. రైతుకు పంట పెట్టుబడి అందించేందుకు రెండు పంటలకూ కలిపి
ఒక్కో ఎకరానికి 10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భారీ స్థాయిలో భూ
రికార్డుల ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలిచ్చింది. ఆడపిల్ల పెళ్ళికి
ఒక్కొక్కరికి రూ. లక్షా 116 చొప్పున ఎక్కువ సాయం అందిస్తున్న
ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలిచింది.
ఇతర వర్గాల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ ముందున్నది. జర్నలిస్టులకు రూ. 60 కోట్లు,
న్యాయవాదులకు రూ. 100 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ – ప్రతీ ఏటా 100 కోట్లు
అందజేస్తున్నది. రాష్ట్రలో అత్యధికంగా 959 రెసిడెన్షియల్
స్కూళ్ల ద్వారా విద్యాబోధన అందుతున్నది. డబుల్ బెడ్రూం ఇండ్ల ద్వారా పేదలకు గూడు
కల్పిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడంలో
ముందున్నది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా
ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున సాయం అందిస్తున్నది.
కులవృత్తులకు చేయూతలో భాగంగా గొల్ల కుర్మలకు 77 లక్షల గొర్రెల పంపిణీ చేసింది. చేపలు, రొయ్యలను రాష్ట్రంలోని
నీటివనరుల్లో పెంచి బెస్త,
ముదిరాజ్, గంగపుత్రులకు జీవనోపాధి
కల్పిస్తున్నది. చేనేత కార్మికులకు ఎక్కువ సాయం అందిస్తూనే నూలు, రంగులు,
రసాయనాలపై 50 శాతం సబ్సిడీ
ఇస్తున్నది. ప్రమాదానికి గురైన సందర్భంలో
గీత,
మత్స్యకారుల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల సాయం అందిస్తున్నది. ప్రకృతి వైపరీత్యాల మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు సాయం,
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.6 లక్షల సాయం అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అత్యంత వెనుకబడిన (ఎంబిసి)ల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించింది తెలంగాణ
ప్రభుత్వం. ఎస్సీ,
ఎస్టీలకు ఎక్కువ కరెంటు సబ్సిడీలు అందజేస్తున్నది. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నది. సెలూన్లు, లాండ్రీలకు కూడా దీన్ని విస్తరించింది. మైక్రో ఇరిగేషన్ కు 80 నుంచి వంద శాతం వరకు
సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. గర్భిణీలకు కేసీఆర్ కిట్స్ ద్వారా రూ.15వేల వరకు సాయం అందిస్తున్నది. అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ కంటి వెలుగులో 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు చేయడమేగాక, అవసరమైన వారికి
కండ్లద్దాలు,
మరొకొందరికి ఆపరేషన్లు కూడా చేయించి, అన్ని రాష్ట్రాల ప్రశంసలందుకున్నది తెలంగాణ.
సింగరేణి బొగ్గుగని కార్మికులకు లాభాల్లో 28 శాతం వాటా ఇస్తూ, ఆర్టీసీ కార్మికులకు,
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ వేతనాలున్న హోంగార్డుల
వేతనాలు పెంచి,
ప్రతి ఏటా రూ.1 వెయ్యి చొప్పున
పెంచుతున్నది. దీంతో ఇపుడు రూ. 23 వేల వరకు వేతనం
అందుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ పరిపాలనా
సంస్కరణలు చేపట్టిన తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు,
మున్సిపాలిటీలు, గ్రామాలు ఏర్పాటై ప్రజలకు
ప్రభుత్వ పాలన అందుబాటులోకి వచ్చింది.
అదేవిధంగా చిన్న ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచిన ప్రభుత్వం, వారి కుటుంబాలను ఆదుకున్నది. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు,
మున్సిపల్ కార్మికులు, వి.ఆర్.ఏ.లు, వి.ఏ.ఓ. లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్
ఉద్యోగులు,
ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఆశావర్కర్లు తదితరుల వేతనాలను దేశమంతటా పరిశీలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా
ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక అత్యధిక నియోజకవర్గ అభివద్ధి నిధులు కేటాయిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.3 కోట్ల నిధుల చొప్పున అందుతున్నాయి.
ఇలా ఏడేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి
సారిస్తూ,
నిధుల లోటులేకుండా పనులు జరిపిస్తూనే, వాటిపై ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో
అతిశయోక్తి లేదు.