ఇంద్రజిత్తు మరణంతో రావణుడి ఓటమి ఖాయమా?
వనం జ్వాలానరసింహారావు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం
(01-05-2021) ప్రసారం
మకరాక్షుడి మరణ
వార్త విన్న రావణుడు ఇంద్రజిత్తును చూసి వానరులకు ఎదురుగా నిలబడి యుద్ధం చేయకుండా, మాయ ప్రయోగించి వాళ్లను చంపమని చెప్తాడు.
రావణుడి మాటలకు స్పందించిన ఇంద్రజిత్తు,
అదృశ్యంకాగల రథం ఎక్కి లంకను యుద్ధానికి పోతాడు. వానరసేన మధ్య వున్న
రామలక్ష్మణులను గుర్తించాడు. గుర్తించి,
విల్లు ఎక్కుపెట్టి, బాణసమూహాన్ని జడివానలా కురిపించి
వారిమీద వేయగా వారు కూడా బాణాలను వేశారు. అయితే, రామలక్ష్మణుల బాణాలేవీ ఆకాశాన్ని తాకాయి కాని ఇంద్రజిత్తుకు
తగల్లేదు. ఇంద్రజిత్తు బాణాలు రామలక్ష్మణుల దేహాలను తాకి బాధపెట్టాయి. వంచనతో
యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తు వ్యవహారానికి కోపించి లక్ష్మణుడు “అన్నా! నువ్వు
అంగీకరిస్తే బ్రహ్మాస్త్రం ప్రయోగించి ప్రపంచంలో రాక్షసులనేవారు లేకుండా చేస్తాను”
అని అన్నతో అన్నాడు. దానికి రాముడు అంగీకరించలేదు.
యుద్ధం
చేస్తూ, ఇంద్రజిత్తు హనుమంతుడున్న పశ్చిమ ద్వారానికి
వచ్చాడు. ఆ తరువాత మాయా సీతను తన శక్తితో కల్పించి, ఏడుస్తున్న ఆరూపాన్ని తన రథం మీద వుంచుకుని, వానరులకు ఎదురుగా (మాయా) సీతను చంపడానికి
పూనుకున్నాడు. హనుమంతుడు రథం మీదున్న మాయా సీతను చూసి ఆమె నిజమైన సీతే అని
సంకటపడ్డాడు. ఇంద్రజిత్తు ఏకీడు చేయకముందే (మాయా) సీతను రక్షించాలనుకున్నాడు
హనుమంతుడు. తన మీదికి వస్తున్న హనుమంతుడిని చూసి ఇంద్రజిత్తు తన ఖడ్గం దూసి, పైకెత్తి,
(మాయా) సీతాదేవి తల వెంట్రుకలు పట్టుకుని,
ఆమె “రామా! రామా!” అని అరుస్తుంటే తన కత్తితో నరికాడు. హనుమంతుడు వానర సేనల మధ్యన
వున్న శ్రీరాముడిని సమీపించి మిక్కిలి దుఃఖంతో పాపాత్ముడు ఇంద్రజిత్తు సీతను
చంపాడని చెప్పాడు. ఇలా హనుమంతుడు చెప్పగానే రామచంద్రమూర్తి నేలకొరిగాడు.
ఇది
గమనించిన రాముడి తమ్ముడు లక్ష్మణుడు ప్రేమతో అన్న శ్రీరాముడికి ఓదార్పు మాటలు
చెప్తుండగా, అక్కడికి విభీషణుడు వచ్చి, దుఃఖిస్తున్న లక్ష్మణుడిని, ఇతర వానరులను చూసి, విషయం తెలుసకుని ఇలా న్నాడు. “పుణ్యాత్ముడా!
సముద్రం ఇంకిపోయిందని ఎవరైనా చెప్తే,
అది ఎంత నిజమో, హనుమంతుడు చెప్పింది కూడా అంత నిజమే!
నమ్మతగినది కాదు. ఎందుకంటే, సీతావిషయంలో రావణుడి చిత్తవృత్తి నాకు
తెలుసు. ఆమెను వాడు చంపడు కాక చంపడు. ఏవిధంగానైనా బాధించడు. నామాట నమ్ము. ఆమెకు
భయంలేదు. రామచంద్రా! సీతాదేవిని వదిలిపెట్టు,
లంకలో నీస్వాధీనంలో వుంచుకోవద్దని నేనెంతగానో నచ్చచెప్పాను. నా హితసూక్తి వాడు
వినలేదు. సామదాన భేదం వల్లకాని, మాయాదండం వల్ల కాని, సీతాదేవి సమీపానికి పోవడం కూడా ఎవ్వరికీ
సాధ్యపడదు. కాబట్టి ఇంద్రజిత్తు సీతాదేవిని లాక్కొని తెచ్చి సంహరించడం అనేది
అవాస్తవం”.
విభీషణుడు
ఇంకా ఇలా అన్నాడు. “ఇంద్రజిత్తు ఇలా చేయడానికి కారణం ఏమిటని నువ్వు అడగవచ్చు. ఇప్పటిదాకా
లంకలో వున్న యోధులంతా యుద్ధం చేస్తుంటే వాడు తన ఇష్టం వచ్చినట్లు హోమాలు చేసి
వస్తున్నాడు. ఇప్పుడు లంకలో వాడు తప్ప ఇతరులెవరూ ఇక్కడికి వచ్చి మనతో యుద్ధం
చేసేవారు లేరు. వూరికే హోమం చేస్తుంటే వానరులు లంకలోకి ప్రవేశించి దాన్ని ధ్వంసం
చేసి యజ్ఞానికి విఘ్నం కలిగిస్తారు. ఎవరు అతడు చేస్తున్న యజ్ఞాన్ని విఘ్నం
చేస్తాడో అతడి చేతిలో ఇంద్రజిత్తు చస్తాడని బ్రహ్మవరం వుంది. యజ్ఞం పరిపూర్ణంగా
సమాప్తమైతే వాడిని దేవతలైనా జయించలేరు. వాడు మిమ్మల్నందరినీ మోసం చేశాడు. ఆలశ్యం
చేయకుండా మా వెంట లక్ష్మణుడిని పంపు. పగతీరగా లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపుతాడు.
అక్కడిపోయి ముందుగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు యజ్ఞాన్ని బాణాలతో చెడగొట్టాలి. ఆ
తరువాత వాడిని వధించాలి. యజ్ఞం పూర్తవుతే వాడు అదృశ్యుడై యుద్ధం చేస్తాడు”.
“లక్ష్మణుడు
అతడిని ఎలా చంపగలడని అడుగుతావేమో? ఇంద్రజిత్తు ఘోరమైన తపస్సు చేసి
బ్రహ్మవల్ల బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని,
ఆకాశ సంచారం చేయగల గుర్రాలను, రథాన్ని వరంగా పొందాడు. ఆ కారణాన వాడు
యజ్ఞం పూర్తిచేయాలని తలచి దానిమీదే మనసు నిలిపి వున్నాడు. సేన తనను చుట్టుకుని
వుండగా వాడు కనపడకుండా నికుంభిలకు పోయాడు. ఆ యజ్ఞం వాడు పూర్తి చేస్తే మనమంతా
చచ్చిపోయినట్లే. బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చేటప్పుడు ఈ యజ్ఞాన్ని ఎవరు విఘ్నపరుస్తారో
వాడి చేతిలో ఇంద్రజిత్తు చావున్నదని చెప్పాడు. కాబట్టి లక్ష్మణుడు పోయి యజ్ఞాన్ని
విఘ్నం చేసినట్లయితే అతడి చేతిలో ఇంద్రజిత్తు తప్పక చస్తాడు. కాబట్టి అతడు
పోవడానికి అనుమతి ఇవ్వు. వాడు చస్తే రావణుడు చచ్చినట్లే. రామా! ఇంద్రజిత్తు చేసే
మాయలు, వాడి బలం,
వాడి వేగం నాకు తెలియంది కాదు”. వెంటనే రాముడు లక్ష్మణుడిని విభీషణుడు చెప్పిన
ప్రదేశానికి పొమ్మన్నాడు. ఆ మాటలకు లక్ష్మణుడు,
విభీషణుడు తమ-తమ ఆయుధాలను తీసుకుని పోవడానికి సిద్ధపడ్డారు. లక్ష్మణుడు కవచం
తొడుక్కుని, అన్న పాదాలకు నమస్కారం చేసి, ఇంద్రజిత్తు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి
విభీషణుడితో కలిసి పోయాడు.
ఆ
తరువాత విభీషణుడు సూచన మేరకు లక్ష్మణుడు పిడుగుల్లాంటి బాణాలను తన బలం కొద్దీ
రాక్షసుల మీద వేశాడు. వానరుల దాడికి,
లక్ష్మణుడి బాణాలకు భయపడకుండా రాక్షస సేనలు వానరసేనను తాకగా వారికి, వీరికి ఘోరమైన యుద్ధం జరిగింది. వానరుల ముందు
నిలబడలేక రాక్షసులు చెదరిపోగా కోపంతో ఇంద్రజిత్తు హోమం చేయడం ఆపుచేసి బయటకు
వచ్చాడు. వస్తూనే యుద్ధం చేయసాగాడు. ఈ లోపల, అక్కడికి
వచ్చిన హనుమంతుడు,
రాక్షసులను కాల్చడం మొదలెట్టాడు.
హనుమంతుడిని రాక్షస మూకలన్నీ కలిసికట్టుగా ఎదుర్కున్నాయి. వారందరినీ పీనుగుపెంటలు
చేశాడు హనుమంతుడు. ఆ దిక్కుగా రథాన్ని వేగంగా పోనిమ్మనీ, లేకపోతే హనుమంతుడు రాక్షస సేననంతా నాశనం
చేస్తాడని ఇంద్రజిత్తు అన్నాడు.
హనుమంతుడి
పైకి బాణాలు వేసేందుకు విల్లెక్కుపెట్టుతున్న ఇంద్రజిత్తును చూపించి విభీషణుడు
లక్ష్మణుడితో వాడే ఇంద్రజిత్తు అని చెప్పాడు. త్వరగా పోయి వాడిని బాణాలతో
పడగొట్టమని పురమాయించాడు.
ఆ
విధంగా ఇంద్రజిత్తును చూపించిన విభీషణుడు, ఆ
తరువాత వాడు యజ్ఞం విడిచి వచ్చినందుకు సంతోషపడుతూ, లక్ష్మణుడిని పిలిచి సమీపంలోనే వున్న వనంలోకి తీసుకుపోయి, అక్కడ ఇంద్రజిత్తు యజ్ఞం చేసిన విధానమంతా
వివరించాడు. “లక్ష్మణా! భయంకరమైన మర్రి చెట్టు ఇదే! ఇక్కడ ఇంద్రజిత్తు భూతాలకు
బలులిచ్చి, హోమం పూర్తి చేసి, యుద్ధానికి వస్తాడు. రాగానే ఎవరికీ కనపడకుండా
యుద్ధం చేస్తాడు. శత్రువులను చంపుతాడు. అందుకే మళ్లీ ఇక్కడికి ఇంద్రజిత్తు రాకుండా
రథంతో, సారథితో సహా చంపు” అని చెప్పాడు విభీషణుడు.
అలాగే చేస్తానని లక్ష్మణుడు తన విల్లు తీశాడు. ఇంతలో మర్రిదగ్గరున్న లక్ష్మణుడి
దగ్గరికి ఇంద్రజిత్తు వచ్చాడు. అతడిని చూడగానే కోపంతో లక్ష్మణుడు ఇలా అన్నాడు.
“నిన్ను వెతుక్కుంటూ వచ్చాను వంచకుడా! యుద్ధ బిక్ష పెట్టు. నీ మాయలిక సాగవు”.
ఇలా
లక్ష్మణుడు చెప్పడంతో కోపించిన ఇంద్రజిత్తు, హనుమంతుడి
వీపుమీద వున్న లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు. “నా బాణాలు నిన్నేమి చేయబోతున్నాయో
చూడు. నీ సేనను అవి కాలుస్తాయి. ఇప్పుడే మీరంతా యమపురికి పోతారు. ఎవరైనా నా బాణ
వర్షాన్ని సహించగలరా? లక్ష్మణా! గతంలో నా బాణాల దెబ్బకు
తెలివితప్పి కొనవూపిరితో పడిపోయిన సంగతి మరిచావా? తెలివిమాలినవాడివై మళ్లీ ఇక్కడికి వచ్చావు”. జవాబుగా లక్ష్మణుడు, “చేతగాని ప్రతిజ్ఞలు ఎందుకు పలుకుతావు? పనికిరాని మాటలు ఎందుకు అంటావు? మాయా యుద్ధం చేయలేవు కదా ఇక? ఏదీ నీ బాహాటమైన శక్తి చూపించు ఒక్కసారి. నా
భుజబలంతో నిన్ను యుద్ధంలో ఓడిస్తాను”.
లక్ష్మణుడి
మాటలకు జవాబుగా ఇంద్రజిత్తు అతడిమీద బాణాలను వేసి యుద్ధాన్ని ప్రారంభించాడు.
ఒకరినొకరు ఎదుర్కున్నారు తీవ్రంగా. ఇద్దరూ సమానంగా యుద్ధం చేశారు. ఇరువురి మధ్య ఘోర యుద్ధం జరిగింది. తీవ్రమైన
లక్ష్మణుడి బాణాలకు ఇంద్రజిత్తు కవచం,
తునాతునకలై రథం మీద పడింది. ప్రతిగా భయంకరమైన బాణాలను వేసి ఇంద్రజిత్తు లక్ష్మణుడి
కవచాన్ని కూడా ఖండించాడు. ఇద్దరిలో ఎవరూ వెనుకడుగు వేయలేదు. యుద్ధం
జరుగుతున్నంతసేపూ విభీషణుడు లక్ష్మణుడి
పక్కనే వున్నాడు. శ్రద్ధగా లక్ష్మణుడికి సలహాలిచ్చాడు. ఎల్లప్పుడూ లక్ష్మణుడిని
కనిపెట్టుకునే వున్నాడు.
ఇంద్రజిత్తు, లక్ష్మణుడు యుద్ధం చేస్తుంటే వారి బాణ సమూహాల
మధ్య ఇద్దరూ దాదాపు కనబడలేదు. వారేకాదు....అక్కడున్న ఏ పదార్థమూ కనబడలేదు. భూమ్మీద
గాఢ అంధకారం కమ్ముకుని కారు చీకటి కూడా వ్యాపించింది.
ఇలా ఇరువురి
మధ్య ఘోర యుద్ధం కొనసాగుతుండగానే, లక్ష్మణుడు శూరుడైన ఇంద్రజిత్తు సారథి
శిరస్సును నేల కూల్చాడు. సారథి లేకపోయినా వాడి గుర్రాలు చక్కగా తిరగడం చూసిన
శరభుడు, గంధమాదనుడు, రభసప్రమాధుడు అనే వానర వీరులు ఇంద్రజిత్తు నాలుగు గుర్రాలను చంపారు.
రథాన్ని విరగ్గొట్టారు. గుర్రాలు, సారథి చావగా ఇంద్రజిత్తు నేలమీద
నిలబడి లక్ష్మణుడిని ఎదిరించాడు కాని లక్ష్మణుడి బాణపరంపరలకు తట్టుకోలేక పోయాడు.
మాయలు చేయడంలో నేర్పరైన ఇంద్రజిత్తు లంకకు పోయి వేరే రథంతో సారథితో సహా
వచ్చాడు. వచ్చి, లక్ష్మణుడిని, విభీషణుడిని, వానరుల గుంపును తన బాణవర్షంతో యుద్ధం
చేశాడు. వాడి యుద్ధ నైపుణ్యం లక్ష్మణుడిని, విభీషణుడిని
ఆశ్చర్యానికి గురి చేసింది. చివరకు లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపాడు
తన బాణాలతో. సారథి లేకపోయినా గుర్రాలు రథాన్ని నడిపించాయి. ఇంతలో విభీషణుడు తన
గదతో ఇంద్రజిత్తు గుర్రాలను కొట్టి చంపాడు. దివ్యాస్త్రాలతో పోరాడుతున్న రాక్షస
రాజకుమారుల యుద్ధాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు.
తాను
వేసిన అన్ని అస్త్రాలనూ ఇంద్రజిత్తు ధైర్యంగా ఎదుర్కోవడంతో లక్ష్మణుడు వాడిలా మామూలుగా
చావడు అని నిర్ణయించుకున్నాడు. తాను ఒకవేళ బ్రహ్మాస్త్రం వేసినా వాడు కూడా
బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడని భావించాడు. ఇలా ఆలోచించి, లక్ష్మణుడు, ఇంద్రాస్త్రాన్ని సంధించి ఇంద్రజిత్తు మీద వేయగా అది
సూర్యకాంతితో శిరస్త్రాణంతో, కుండలాలతో కూడిన ఇంద్రజిత్తు తలను ఖండించింది.
అది చూసిన విభీషణుడు, వానరులు, దేవతలు సంతోషించారు. తమ ప్రభువు మరణం చూసిన రాక్షసులు, వానరులు తమను తరుముకొస్తుంటే ఆయుధాలను నేలపడేసి, లంకవైపు పరుగెత్తారు. జాంబవంతుడు, హనుమంతుడు,
విభీషణుడు, ఇంద్రజిత్తుని చంపిన లక్ష్మణుడిని పొగిడారు.
ఆయన్ను స్తోత్రం చేశారు. దేవతలంతా సంతోషించారు.
ఇంద్రజిత్తును
చంపిన లక్ష్మణుడు సంతోషంతో ఆ వార్త చెప్పడానికి విభీషణుడిని, హనుమంతుడిని వెంట పెట్టుకుని రామచంద్రమూర్తి
దగ్గరికి పోయి ఆ విషయం చెప్పాడు. రామచంద్రమూర్తి ఆ వార్త విని చాలా సంతోషించాడు.
“లక్ష్మణా! యుద్ధంలో రావణుడికి కుడిచేయి ఇంద్రజిత్తు. కుడిచేయి పోయినవాడిని
యుద్ధంలో జయించడం కష్టమా? రావణాసురుడికి అన్నిరకాల సహాయపడుతున్న
ఇంద్రజిత్తును నువ్వు చంపావు. దాంతో నేను నిజంగా జయించినవాడినయ్యాను. వాడున్నంత
వరకు నాకు జయం సందేహంగా వుండేది. కొడుకు చావు వార్త విన్న రావణుడు తన మిగిలిన
సేనతో సహా యుద్ధానికి వస్తాడు. నాకు యుద్ధ బిక్ష ఇస్తాడు. నాచేతుల్లో చస్తాడు.
సాధుశీలా! నాకు యుద్ధంలో రక్షకుడిగా వుండి ఇంద్రజిత్తును చంపడం వల్లే కదా నాకు సీత
లభిస్తున్నది? రాజ్యం కూడా లభిస్తున్నది. నువ్వా పని
చేయకపోతే నాకా రెండు లేనట్లే కదా?” అని అన్నాడు.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment