Saturday, May 29, 2021

వైవస్వతుడి వృత్తాంతం, ప్రళయప్రకారం, నారాయణుడి మహిమ .... (ఆస్వాదన-22) : వనం జ్వాలా నరసింహారావు

 వైవస్వతుడి వృత్తాంతం, ప్రళయప్రకారం, నారాయణుడి మహిమ

(ఆస్వాదన-22)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (30-05-2021)

బ్రాహ్మణులతో, ధౌమ్యుడితో పాండవులు కామ్యకవనం చేరి అక్కడ యథోచిత కర్తవ్యాలు నెరవేరుస్తుండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి పాండవుల దగ్గరికి వారిని చూడడానికి వచ్చాడు. పాండవులను శ్రీకృష్ణుడు కుశల ప్రశ్నలు వేస్తున్న సమయంలోనే మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చాడు. పాండవుల యోగ క్షేమాలను విచారించాడు. కాసేపటికి నారదుడు కూడా వచ్చి, పాండవులకు పుణ్యకథలు చెప్పమని మార్కండేయుడికి సూచించి వెళ్లిపోయాడు. చెడ్డవారు ఎందుకు సౌఖ్యాలు అనుభవిస్తున్నారని, మంచివారికే ఎందుకు దుఃఖం ప్రాప్తిస్తుందని ధర్మరాజు మార్కండేయుడిని ప్రశ్నించాడు. జవాబుగా మార్కండేయుడు, పూర్వకాలంలోలాగా కాకుండా, కాలం గడుస్తున్న కొద్దీ, మనుష్యులలో కామం, క్రోధం లాంటి దుర్గుణాలు ప్రవేశించి వారి ప్రవర్తనలో మాయ చొరబడిందన్నాడు.

ఈ నేపధ్యంలో, మనుజులు తాము చేసిన పుణ్యపాపఫలం ఏవిధంగానైనా సరే అనుభవించక తప్పదని, శరీరం నశించినా కర్మఫలం ఎన్నటికీ నశించదని అన్నాడు. కొందరు భూలోకంలో సౌఖ్యం అనుభవిస్తారని, కొందరికి పరలోక సౌఖ్యం కలుగుతుందని, కొందరికి ఇహపరాలలో మేలు కలుగుతుందని, కొందరికి ఇహపర సౌఖ్యాలు రెండూ దక్కవని చెప్పాడు. ధర్మ మార్గాన్ని అనుసరించి, మంచి కర్మలను ఆచరించి, మెచ్చదగిన యజ్ఞాలను చేసే మంచివారు భూలోకంలో, పరలోకంలో సౌఖ్యాలను అనుభవిస్తారని అన్నాడు మార్కండేయుడు.

ఆ తరువాత మార్కండేయుడు ధర్మరాజుకు బ్రాహ్మణ ప్రభావం తెలియచేసే వృత్తాంతాన్ని ఒకటి చెప్పాడు. అందులో భాగంగా హైహయవంశానికి చెందిన రాజకుమారుడు ధుంధుమారుడి గురించి చెప్పాడు. అలాగే బ్రాహ్మణుల క్షత్రియుల స్వభావాలను వివరించే అత్రి అనే బ్రాహ్మణ శ్రేష్టుడి గురించి, అతడికి గౌతముడితో జరిగిన సంవాదం గురించి, వారిద్దరిలో అత్రి వాదన సరైందని సనత్కుమారుడు చెప్పడం గురించి వివరించాడు. అలా చెప్తూ సనత్కుమారుడు, బ్రాహ్మణుల తేజస్సు, క్షత్రియుల గొప్పదనం, ఒకదానిమీద మరొకటి ఆధారపడి వున్నాయన్నాడు. క్షాత్రబలం లేని బ్రాహ్మణ శక్తి, బ్రాహ్మణశక్తి లేని క్షాత్రం రాణించలేదని, క్షత్రియుడు బ్రాహ్మణులను పూజించడం వల్ల తేజస్సును ఆర్జించి, పాపాలను పోగొట్టుతాడని సనత్కుమారుడు అన్న మాటలను ధర్మరాజుకు చెప్పాడు మార్కండేయుడు. ఆ తరువాత సరస్వతీ గీత అనే ఇతిహాసాన్ని వినిపించాడు. అందులో అనేకమైన ధర్మ సూక్ష్మాలున్నాయి.

తదనంతరం ధర్మరాజుకు వైవస్వతుడి వృత్తాంతం చెప్పాడు మార్కండేయుడు. వైవస్వతుడు ఒకనాడు చెరువులో స్నానం చేస్తుంటే ఒక చేప తనను రక్షించమని కోరింది. తనను ఆ చెరువు నుండి వేరే చోటుకు తరలించమని అన్నది. వైవస్వతుడు ఆ చేపను ఒక నూతిలో వేశాడు. కొన్నాళ్లకు శరీరం పెరిగిన చేపకు ఆ నూతి సరిపోక తనను అక్కడి నుండి మార్చమన్నది. దాన్నొక పెద్ద బావిలోకి మార్చాడు వైవస్వతుడు. ఇంకా పెరిగిన ఆ చేపను గంగ మడుపులో, అక్కడి నుండి సముద్రంలో వదిలాడు. తనకు చేసిన ఉపకారానికి వైవస్వతుడికి మేలు చేస్తానన్నది చేప.

త్వరలో ప్రళయ కాలం సమీపిస్తున్నది కాబట్టి ఒక పెద్ద ఓడను నిర్మించమని, అందులో ధాన్యాలను సేకరించి వుంచాలని, వైవస్వతుడు సప్త మహర్షులతో పాటు ఆ ఓడ ఎక్కి సముద్రం చేరేటప్పుడు తనను స్మరించుకోవాలని చేప చెప్పింది. అప్పుడు తాను పెద్ద కొమ్ముకల చేప ఆకారంలో కనిపించి ఉపకారం చేస్తానని చెప్పింది. వైవస్వతుడు అలాగే చేశాడు. ప్రళయకాలంలో చేప ఓడను సముద్రం మధ్యలోకి ఈడ్చుకుని పోయింది. అదేసమయంలో సముద్ర జలాలు దిక్కులన్నీ ఆక్రమించి, జగాలన్నిటినీ ముంచేశాయి. ప్రపంచం అంతా ఒక సముద్రంలాగా మారిపోయింది.

అనేక వేల సంవత్సరాలు చేప సముద్రం మధ్యలో ఆ ఓడను లాగింది. వరద తగ్గు ముఖం పట్టిన తరువాత ఓడను హిమాలయ పర్వత శిఖరం దగ్గరికి చేర్చింది. పర్వత శిఖరాన ఓడను కట్టమని వైవస్వతుడికి, సప్తర్షులకు చెప్పింది చేప. వారు ఆలాగే చేశారు. తాను సమస్త విశ్వాన్ని సృష్టించి పాలిస్తున్న ఏకైకప్రభుడినని, మత్స్యరూపంలో వాళ్ళను కాపాడానని అన్నది ఆ చేప. వైవస్వత మనువు భవిష్యత్తులో చరాచర జగత్తును సృష్టిస్తాడని చెప్పి చేప మాయమైంది. అప్పుడు వైవస్వతుడు గొప్ప తపస్సు చేసి, దేవతలకు, రాక్షసులకు, మనుజులకు సంబంధించిన జగత్తులను సృష్టించాడు. ఆ తరువాత ధర్మరాజు కోరడంతో, మార్కండేయుడు ప్రళయప్రకారం వివరించాడు.    

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలనే నాలుగు యుగాలు కలిసి 12 వేల దివ్య సంవత్సరాలవుతాయి. దీన్నే ఒక మహాయుగం అంటారు. ఒక వేయి మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది. బ్రహ్మ దివసపు చివరి నూరు సంవత్సరాలు అనావృష్టి ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుడి వేడిమివల్ల ముల్లోకాలు అల్లల్లాడి పోతాయి. ఆ తరువాత మిక్కుటంగా కురిసే వాన వల్ల మహాగ్ని అంతా చెదిరి పోతుంది. ఏరులు, నదులు, సముద్రాలు నీటితో నిండి ప్రవహిస్తాయి. భూగోళమంతా నీటితో నిండి పోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం వీచిన పెనుగాలి మేఘాలను చెదరగొట్టి అణచి వేస్తుంది. బ్రహ్మదేవుడు భయంకరమైన వరద నీటిమధ్యన పద్మం మీద నిద్రిస్తాడు. ఇలాంటి కల్పాంతాలు ఎన్నో గడిచాయి.

ఆ సమయంలో ఒక మర్రిచెట్టు ఆకు పాన్పు మీద ఒక చిన్ని బాలకుడు ఒంటరిగా నిదురిస్తూ మార్కండేయుడికి కనిపించాడు. అతడెవరని ఆలోచించాడు ఆయన. ఆ బాలకుడిని చేరబోయాడు. తన దేహంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకొమ్మని మార్కండేయుడికి చెప్పాడు ఆ బాలకుడు. అప్పుడు బలవంతంగా నెట్టి వేయబడ్డట్లుగా మార్కండేయుడు బాలకుడు నోట్లోకి పోయి, కడుపులో ప్రవేశించాడు. సమస్త లోకాలను ఆ బాలుడి కడుపులో చూశాడు మార్కండేయుడు. అలా ఆ మహాత్ముడి కడుపులో నూరు సంవత్సరాలున్నాడు. ఆ బాలకుడి పాదాలను ధ్యానించాడు. తన నోటి నుండి బాలకుడు మార్కండేయుడిని బయటకు తెచ్చాడు. తన పొట్టలో విశ్రాంతి తీసుకున్నావా? అని అడిగాడు బాలకుడు. ఆయన పొట్టలో సకల చరాచర సృష్టిని చూశానని చెప్పాడు మార్కండేయుడు.

నారాయణుడు మార్కండేయుడికి తన ప్రభావాన్ని వివరంగా చెప్పాడు ఇలా: ‘వేల్పులు, ఋషులు కూడా నా మహిమను తెలుసుకోలేరు. నా ప్రభావాన్ని, మహిమను చెప్తా విను. జలాలకు పర్యాయ పదం నారములు. నాకు జలాలు స్థానం. అందువల్ల నాకు “నారాయణుడు” (నారములు స్థానంగా కలవాడు) అన్న సార్థక నామధేయం ఏర్పడింది. ఆ విధమైన నారాయణుడినైన నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, పాలించేవాడిని, జ్ఞానంతో కూడిన ఆనందం కలవాడిగా వుంటూ, ఈ లోకాలన్నిటినీ క్రమంగా సృష్టిస్తాను. నేనే ఏలుకుంటాను. తగిన సమయంలో నేనే లయం చేస్తాను. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, ఇతరులంతా నా అంశను పంచుకున్న నా ప్రతినిధులే. భూమి నా పాదాలు, అగ్నిహోత్రుడు నా ముఖం, సూర్య చంద్రులు నా నేత్రాలు, ఆకాశం నా శిరస్సు. ఇలా అద్భుతాకారం ధరించి నేను విలసిల్లుతాను’.

‘ప్రళయ కాలంలో సముద్రంలో మునిగిన సమస్త భూగోళాన్ని వరాహ రూపం ధరించి ఉద్ధరించింది నేనే. ఈ సమస్త భూమండలాన్నీ మనోజ్ఞమైన వేయిపడగల మీద  ఆదిశేషుడి రూపంలో ధరిస్తున్న వాడిని నేనే. బాడబమనే అగ్నినై సప్తసముద్రాల నీటిని నేనే తాగుతాను. వాటిని ప్రళయ కాలంలో విడిచి పెట్టుతాను. సృష్టి ఆరంభించే సమయంలో నా నోటి నుండి, భుజాల నుండి, తొడల నుండి, పాదాల నుండి నాలుగు వర్ణాలను సృష్టిస్తాను. అలాగే నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం నా ముఖాల నుండి ఉద్భవిస్తాయి. ఇవన్నీ చివరకు ప్రళయకాలంలో నన్నే చేరుతాయి. మహర్షులు ముక్తికొరకై నన్నే ఆరాధిస్తారు. సమస్తమైన నక్షత్రాలు, తారలు, ఆకాశం, వాయువులు, దిక్కులు అన్నీ నా ఆకృతులే. నేను నిత్య సంతోషినై పవళించి వుంటాను’.

‘ఈ జగత్తులో సుస్పష్టంగా వ్యక్తమై కనిపిస్తున్నది అంతా నేనే. ఈ జగత్తులో అవ్యక్తమై లేనిదిగా తట్టేది అంతా నేనే. లోకంలో ఎప్పుడు ధర్మానికి కీడు ఏర్పడుతుందో, ఎప్పుడు అధర్మం విజృంభిస్తుందో, ఎప్పుడు రాక్షసులు క్రూరులై అతిశయిస్తారో, ఎప్పుడు వేల్పులు హీన స్థితికి దిగజారుతారో, అప్పుడు మంచి కులానికి సంబంధించిన వారి ఇండ్లలో జన్మించి, దేవతలను, దేవేంద్రుడిని కాపాడి, యథాప్రకారం ధర్మ మార్గంలో నిలబెట్టుతాను. నాలుగు యుగాలలో నేను ఆరాధించతగిన ధర్మాన్ని నెలకొల్పుతాను. ప్రళయ కాలంలో యముడి రూపం ధరించి సృష్టిని అంతటినీ నేనే సంహరిస్తాను. ముల్లోకాలను సృష్టించే బ్రహ్మదేవుడు కూడా నాలో సగం అంశం మాత్రమే’.

‘నారాయణుడు అనే నేను వేయి మహాయుగాల వరకు బాలరూపం ధరించి, వటపత్రశాయినై, ప్రపంచాన్ని అంతా ఆవరించిన ఒకే ఒక సముద్రం మీద యోగనిద్రలో మునిగి వుంటాను. ఇక మున్ముందు నా బొడ్డు తామరలో నిద్రిస్తున్న బ్రహ్మదేవుడు మేల్కొని, జగత్తులను సృష్టిస్తాడు’.

సాక్షాత్తు నారాయణుడు చెప్పిన వాటికి తాను ప్రత్యక్ష సాక్షినని మార్కండేయుడు చెప్పాడు ధర్మరాజుకు. ఆ బాలదేవుడే శ్రీకృష్ణుడని అన్నాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

                         

No comments:

Post a Comment