గర్భం ధరించిన శ్రీకౌసల్యాదేవి-శ్రీరాముడి జననం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-55
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (03-05-2021)
పుత్రకామేష్టి యజ్ఞం పర సమాప్తం
కాగానే, దేవతలందరూ,
వారివారి హవిర్భాగాలు తీసుకొనిపోయిన తర్వాత, దశరథుడు దీక్ష విడిచి,
ప్రియ భార్యలతో అయోధ్య చేరి, యజ్ఞంకొరకై వచ్చిన రాజులందరికీ - వారి పరివారంతో సహా, వస్త్రాభరణాలు - కానుకలు ఇచ్చి, సంతోషపర్చాడు. అందరినీ
సంతోషంతో పంపిన తర్వాత,
తన కొడుకులను ఎప్పుడు చూస్తానోనని ఉవ్విళ్ళూరుతూ, కోరికలు ఆకాశాన్నంటుతుండగా దశరథుడు తనలోతానే ఉబ్బి పోయాడు. కౌసల్యా దేవి గర్భం
పెరుగుతోంది. గర్భం రాక ముందు కౌసల్య పొట్ట పల్చగా - మర్రి ఆకులాగా వుండేది.
ఇప్పుడేమో గర్భంలో "వటపత్రశాయి" విష్ణువున్నందున, బలిసిన మర్రి ఆకులాగా వుంది. పాలసముద్రంలో పడుకొని, లోకాలనెల్ల రక్షించే పరమాత్ముడికి పాలిచ్చే భాగ్యం - అదృష్టం తమకు కలిగిందన్న
భావనతో, సంతోషంతో,
కౌసల్యా దేవి స్తనాలు వుబ్బాయి. అపరిమేయుడు (ఏ బంధం
లేనివాడు) భక్తబాంధవుడైనందున, భక్తులై శరణుజొచ్చిన
దేవతల బాధలను తొలగించి,
రక్షించేందుకు, ఒక స్త్రీ - కౌసల్యా దేవి
గర్భమనే చెరసాలలో బందీగా వున్నాడు.
యజ్ఞం అయిన ఆరు ఋతువుల తర్వాత, పన్నెండో నెలలో,
చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో,
అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి
వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య, గురు,
శని,
శుక్ర) వాటి-వాటి ఉచ్ఛ స్థలాల్లో(సూర్యుడికి మేషరాశి -
గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి
ఉచ్ఛస్తానాలు) వుండగా,
కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క
అర్థాంశమూర్తి - శుభ లక్షణాలు కలవాడైన రఘువంశ వర్ధనుడిని, సర్వ లోకాలు నమస్కారం చేసేవాడిని, రాముడిని కనింది.
శ్రీరామావతారానికి ముఖ్యకారణం దశరథుడి యజ్ఞంకంటే, కౌసల్య తప ప్రభావమేనని అనవచ్చు. ఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్లే భగవంతుడు
నవమి నాడు జన్మించాడు. దేవతలకు ప్రభువైన ఇంద్రుడివల్ల అతిది ఎలా ప్రకాశించాడో, అపరిమిత తేజస్సుగల తన కుమారుడి (రాముడు) వల్ల కౌసల్య తేజోవతి అయింది.
(లోకంలో సాధారణంగా బిడ్డలదేహకాంతి -
ఇతర దేహ సంబంధ చిహ్నాలు తల్లివలన వస్తాయంటారు. రాముడి విషయంలో అలాకాదు. పుట్టిన
కుమారుడివలన కౌసల్యకు కీర్తి వచ్చింది. కౌసల్య కొడుకైనందున రాముడు ప్రసిద్ధుడు
కాలేదు. అంటే: మాతృ ప్రయుక్త ప్రకృతి సంబంధం కుమారుడిలో లేదనీ - ఆయన ప్రకృతి
విలక్షణుడనీ అర్థమవుతోంది. "కౌసల్యా సుప్రజారామ"-ఎవరివలన కౌసల్య మంచి
బిడ్డను కన్నదన్న పేరు తెచ్చుకుందోనని కదా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని
సంబోధించాడు!).
ప్రత్యక్షవిష్ణువైన శ్రీరాముడిలో
నాలుగో అంశతో,
కైకేయికి, నేత్రానందకరుడు - సమస్త
శుభగుణాకరుడు - సత్యవంతుడు - మిక్కిలి బలవంతుడైన భరతుడు, విష్ణువులో ఒకభాగమై సుమిత్రా దేవి గర్భంలో ఇద్దరు వీరులు -లోకోత్కృష్ట
ప్రేమాదిగుణాలకు స్థానభూతులైన లక్ష్మణుడు - శత్రుఘ్నుడు అనే కవలపిల్లలు పుట్టారు.
భరతుడు పుష్యనక్షత్రంలో - మీనరాశిలోనూ, ఆశ్లేషానక్షత్రంలో -
కర్కాటకలగ్నంలో,
మధ్యాహ్నం లక్ష్మణ - శత్రుఘ్నులు జన్మించారు. (శ్రీరాముడు
జన్మించిన మరుసటి రోజున భరతుడు పుట్టాడు. చైత్ర మాసంలో కర్కాటక లగ్నం మిట్టమధ్యాహ్నం
వస్తుంది. అంటే: భగవదవతారం పగటిపూట అయిందని అర్థం. లక్ష్మణశత్రుఘ్నులు దశమి తిథిన
- ఆశ్లేషా నక్షత్రంలో జన్మించడం విశేషం. పంచ గ్రహాలు ఉచ్ఛస్థితిలో వుండడం
గురుచంద్రయోగాన్ని తెలుపుతుంది). లోకరక్షణార్థమై భగవంతుడు అవతరించడంతో ఆకాశంలో
గంధర్వులు పాడారు - అప్సరసలు ఆడారు - దేవతలు గుంపులుగా కూడారు. మిక్కిలి సంతోషంతో
దేవతలు - స్త్రీలు రావణుడివలన భయం పోయినట్లు భావించారు. పూల వానలు కురిసాయి. దేవ
దుందుభులు మ్రోగాయి. అయోధ్యా నగరంలో విశేషంగా ఉత్సవాలు జరిగాయి. భూ ప్రజలలో సంతోషం
అతిశయించింది. దశరథుడు పుత్రోత్సవాన్ని చాటింపగానే, అయోధ్యా నగరంలో,
ఆశ్చర్యం కలిగేలా, ప్రతివారు తమ ఇంటిలోనే
తొలిచూలు కొడుకు పుట్టినట్లు ఉత్సవం చేసుకోసాగారు. రాజు ఇవ్వబోయే దానాలు
స్వీకరించేందుకు దేశ దేశాలనుండి వచ్చిన బ్రాహ్మణులతో రాచబాటలు నిండిపోయాయి.
రసాభినయనం చేసే నటులతో - భావాన్నభినయించే నర్తకులతో - సంకులమైన గాయకుల పాటలతో -
వందుల స్త్రోత్ర వాక్యాలతో ప్రస్ఫుటమై - అతిశయించిన సంతోషం కలిగి, అందరి హృదయాలు ఉప్పొంగుతూ అయోధ్య విరాజిల్లింది.
పన్నెండో రోజుతో పురుడు పోవడంతో, పదమూడో రోజున కొడుకులకు నామకరణ ఉత్సవం జరిపారు. ఒక్క హేయ గుణం కూడా
లేనివాడైనందున - లోకుల మనస్సులు ఇతనిలో రమించుచున్నందున - యోగుల హృదయాలలో ఇతను
రమించినందున - తనగుణరూపాలతో వశీకృతులైనవారు తనయందు అనురాగం కలవారైనందున - తనకు
వశులైనవారి విషయంలో రంజిల్లేవాడైనందున - సంసార బాధ తొలగినవారు ఆయనలో రమింతురు కనుక, పెద్దకొడుకుకు రాముడు అని పేరుపెట్టారు. శ్రీరామ కైంకర్యమే తనకు గుర్తుగా -
సంపదగా తలంచేవాడైన సుమిత్రా దేవి పెద్దకొడుకుకు లక్ష్మణుడు అని పేరుపెట్టారు.
రాజ్యాన్ని భరించాల్సిన భారం తనపైలేకున్నప్పటికీ, భరించవలసి వచ్చింది కనుక, తనను రక్షించే భారం
శ్రీరాముడిదేనన్న నిశ్చయబుద్ధిగలవాడై - కేవలం రామపరతంత్రుడై వుండేవాడైనందున కైకేయి
కుమారుడికి భరతుడు అని పేరుపెట్టారు. భరతుడి కారణాన్నే శ్రీరాముడు అడవులకు పోయాడని
- తండ్రి మరణానికి మూలకారణం భరతుడేనని అనుకోకుండా, నిత్య శత్రువులైన కామ క్రోధాలకు వశ పడకుండా, వాటిని జయించిన సవతితల్లి కొడుకు భరతుడు భాగవతుడైనందున, భగవత్ సేవకన్న భాగవతసేవయే సుకరమని - నిశ్చిత ఫలమని ఎంచినవాడైనందున, సుమిత్ర రెండో కొడుకుకు
శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. ఇలా వారివారి గొప్పదనం తెలిసిన వాడైన వశిష్ఠుడు
పేర్లు పెట్టాడు. నామకరణ మహోత్సవ సమయంలో నగరవాసులకు, పల్లెవాసులకు,
దండిగా భోజనం పెట్టి - బ్రాహ్మణులకు మణులను, మాణ్యాలు,
దక్షిణలు ఇచ్చి సత్కరించాడు దశరథుడు.
No comments:
Post a Comment