Saturday, May 22, 2021

దివ్యాస్త్రాలతో అర్జునుడి రాక, అజగరోపాఖ్యానం .... ఆస్వాదన-21 : వనం జ్వాలా నరసింహారావు

 దివ్యాస్త్రాలతో అర్జునుడి రాక, అజగరోపాఖ్యానం

ఆస్వాదన-21

వనం జ్వాలా నరసింహారావు

 సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (23-05-2021)

పాండవులు, నరనారాయణులు తపస్సుచేసిన బదరికావనంలో కొన్నాళ్లున్నారు. అర్జునుడు వెళ్లి ఐదేండ్లు అయిందనీ, దివ్యాస్త్రాలను సంపాదించి త్వరలో వస్తాడని ధర్మరాజు తమ్ములతో అంటూ, బ్రాహ్మణులతో కలిసి తీర్థయాత్రలు కొనసాగించారు. గంధమాదనంలోని పుణ్య క్షేత్రాలను దర్శించి కొద్దిరోజులకు వృషపర్వుడు అనే రాజర్షి ఆశ్రమానికి చేరారు. అక్కడ ఆయన ఆతిథ్యంలో ఏడురోజులున్నారు. అక్కడి నుండి మాల్యవంతం అనే కొండ దగ్గరకు చేరారు. అక్కడ అరణ్యంలో విహరించారు.

అలా విహరిస్తున్న పాండవుల ముందర శ్వేతకి అనే నది నుండి గాలివల్ల విసిరివేయబడ్డ అయిదు రంగుల పూలు పడ్డాయి. అలాంటివి కావాలని ద్రౌపది భీమసేనుడిని కోరింది. భీమసేనుడు వెన్వెంటనే బయల్దేరి పోయి అవిదొరికే కుబేరుడి నివాస భవనాన్ని చూశాడు. శంఖనాదం చేశాడు. అది విన్న యక్షరాక్షస భటులు భీముడితో యుద్ధానికి దిగారు. భీముడి చేతిలో కుబేరుడి ప్రియమిత్రుడు మణిమంతుడిని సంహరించబడ్డాడు. భీముడి ధాటికి మిగిలినవారంతా పారిపోసాగారు. ఈలోపు ధర్మరాజు నకులసహదేవులతో సహా కుబేరుడి భవనానికి చేరువగా వచ్చాడు. ఇంతలో చావగా మిగిలిన రాక్షసులు అలకాపుర అధిపతైన కుబేరుడికి భీముడి పరాక్రమాన్ని గురించి చెప్పారు. అప్పుడు కుబేరుడు భీముడిని మనసులోనే అభినందిస్తూ, సపరివారంగా వచ్చి పాండవులను చూశాడు.

కుబేరుడి చూడగానే పాండవులు నమస్కరించారు. తన ప్రియమిత్రుడు మణిమంతుడు అగస్త్యముని శాపవశాన మరణించాడని, అలా జరగడం ఒక విధంగా తనకు ఉపకారమే అని అన్నాడు కుబేరుడు. ఇలా అంటూనే భీమసేనుడు కేవలం తెగువ మాత్రమే ప్రదర్శించే ధైర్యశాలి అయితే సరిపోదని బోధించమని ధర్మరాజుకు కుబేరుడు సలహా ఇచ్చాడు. ఒక పదిహేను రోజులు అక్కడే ఆశ్రమంలో వుండమని, తాను అన్ని సౌకర్యాలు సమకూరుస్తానని చెప్పాడు కుబేరుడు. అర్జునుడు దివ్యాస్త్రాలను పొందాడని, ఇప్పుడు అతడు దేవేంద్రుడి దగ్గర ఉన్నాడని, అతడు అన్నదమ్ములను కలవడానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడని, పాండవుల కోరికలు సఫలమవుతాయని చెప్పి పాండవులను అభినందించి మాయమయ్యాడు కుబేరుడు. పాండవులు ఒక నెలరోజులపాటు అక్కడి ఆశ్రమంలో నివసించారు. ఇంతలో ఒకనాడు అర్జునుడు మాతలి నడుపుతున్న దివ్యకాంచన రథాన్ని అధిరోహించి స్వర్గలోకం నుండి వచ్చాడు అన్నదమ్ముల దగ్గరకు.

అర్జునుడు రాగానే రోమశుడికి, ధౌమ్యుడికి, ధర్మరాజుకి, భీముడికి పాదనమస్కారాలు చేసి నకులసహదేవులను కౌగలించుకున్నాడు. మాతలి దివ్యరథాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. ఆ రాత్రి అర్జునుడు అన్నదమ్ములకు పూర్వకథలను చెప్పాడు. మర్నాడు అంతా కలిసి వున్నప్పుడు దేవేంద్రుడు పాండవులను చూడడానికి అక్కడికి వచ్చాడు. ఏవిధంగా అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించింది చెప్పాడు పాండవులకు ఇంద్రుడు. అతడు మహాతేజస్వి అని, అతడిని యుద్ధంలో జయించడం ఎవరికీ శక్యం కాదని అన్నాడు. ఆ తరువాత పాండవుల దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంద్రుడు అమరావతికి వెళ్లిపోయాడు.

ఆ తరువాత అర్జునుడు ధర్మరాజు అడగ్గా, తాను హిమాలయ పర్వాతలకు వెళ్ళిన సంగతి, అక్కడ దేవేంద్రుడు ముసలి బ్రాహ్మణుడి వేషంలో కనిపించిన సంగతి, ఈశ్వరుడి గురించి తపస్సు చేసిన సంగతి, ఆయన కిరాత రూపంలో వచ్చిన సంగతి, ఇద్దరి మధ్యా యుద్ధం జరిగిన సంగతి, తనకు ఆయన పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన సంగతి, ఇంద్రుడు దివ్యాస్త్రాలను ఇచ్చిన సంగతి, అమరావతికి వెళ్ళిన సంగతి, దేవతలు తనకు దేవదత్తం అనే శంఖాన్ని ఇచ్చిన సంగతి, నివాతకవచులతో జరిగిన భీకరమైన యుద్ధం సంగతి, వారిమీద యుద్ధంలో శోషణాస్త్రాన్ని, వజ్రాస్త్రాన్ని ప్రయోగించిన సంగతి, చివరకు వారిని సంహరించిన సంగతి, హిరణ్యపురంలోని పులోమ కొడుకులు, కాలక కొడుకులు, కాలకేయులు అనబడే అరవై వేలమంది రాక్షసులను గెల్చిన సంగతి, దేవేంద్రుడు తనను అభినందించిన సంగతి, ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చిన సంగతి అంతా వివరంగా చెప్పాడు.

తన తమ్ముడి శౌర్య పరాక్రమాలు విన్న ధర్మరాజు తనకు అప్పుడే సమస్త భూమండలం సంక్రమించినట్లు భావించాడు. దేవతలు బహుకరించిన అస్త్రాలను, అవి ఉపయోగించే తీరుతెన్నులను తమకు చూపమని ధర్మరాజు ఆర్జునుడిని కోరాడు. అర్జునుడు వాటిని విడివిడిగా ప్రదర్శించి చూపాడు. అలా అర్జునుడు దివ్యాస్త్రాల ప్రయోగాలను అన్నగారైన ధర్మరాజుకు చూపుతున్నప్పుడు భూమి దద్దరిల్లింది. సముద్రాలు ఘూర్ణిల్లాయి. సూర్యకాంతి మాసిపోయింది. వాయువు స్థంబించిపోయింది. శివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు ఆకాశంలో నిలుచున్నారు. అప్పుడు దేవతల పనుపున నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఎదురుగా లక్ష్యం లేకుండా దివ్యాస్త్రాలను ప్రయోగిస్తే అవి ముల్లోకాలను దహించి వేస్తాయని చెప్పి ఆర్జునుడిని అస్త్ర ప్రదర్శన నుండి విరమింప చేసి వెళ్ళాడు నారదుడు.

పాండవులు అలా ఆ ఆశ్రమంలో పది నెలలు వున్నారు. దేవర్షి రోమశుడు ధర్మరాజుకు ధర్మ ప్రబోధం చేసి స్వర్గలోకానికి చేరాడు. పాండవులు యథాప్రకారం ఘటోత్కచుడి సేనలతో తిరుగు పయనం చేసి, వృషపర్వుడి ఆశ్రమాన్ని సందర్శించి, బదరికాశ్రమంలో ఒక రాత్రి గడిపి, సుబాహుపురానికి వచ్చారు. అక్కడ ఘటోత్కచుడికి, అతడి సేనకు వీడ్కోలు పలికారు. హిమాలయ పర్వతాల చుట్టుపక్కల గడిపారు ఒక సంవత్సరం పాటు.

ఇలా వుండగా ఒకనాడు భీముడు ఒంటరిగా హిమాలయ పర్వత శిఖరాల దగ్గర అటు-ఇటు తిరుగుతూ ఒక కొండ చిలువను చూశాడు. ఆ అజగరం ఆహారం కోసం వేచి చూస్తున్నది. భీముడిని చూడగానే పట్టుకుని బంధించింది. దాని బలం ముందు తన బలం వ్యర్థం కావడంతో, అదేదో ఆద్భుతమైన ఆకృతి కావచ్చని భావించి ఆ పాముతో సంభాషించాడు భీముడు. తాను భీముడినని, గొప్ప శూరుడినని, మితిలేని బాహుబలం కలవాడినని, తనలాంటి వాడిని బంధించే శక్తి ఆ పాముకు ఎలా కలిగిందని ప్రశ్నించాడు. తనకది దివ్యవరం వల్ల కలిగిందని, శాప ప్రభావం వల్ల సర్పాన్ని అయ్యానని అన్నదా పాము.

ఇంతలో ధర్మరాజు తమ్ముడిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. కొండచిలువ బంధించిన భీముడిని చూశాడు. తమ్ముడిని వదిలిపెట్టమని, తనపేరు యుధిష్టిరుడని, దానికెంత మాంసం కావాల్నో అది సమకూర్చుతానని అన్నాడు ధర్మరాజు కొండచిలువతో. తాను నహుషుడు అనే రాజునని, దేవేంద్రుడితో సమానమైన వాడినని, ఐశ్వర్య మదంతో బ్రాహ్మణులను అవమానించానని, మహానుభావుడైన అగస్త్యుడు కోపించి తనను భయంకరమైన పామువు కమ్మని శపించాడని అన్నదా పాము. అగస్త్యుడి దయవల్ల తనకు పూర్వ జన్మ పరిజ్ఞానం వున్నదని, తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎవ్వరు చెప్తారో అప్పుడు తనకు శాప విముక్తి కలుగుతుందని అన్నది కొండచిలువ. తన ప్రశ్నలకు జవాబు చెప్పి తమ్ముడిని విడిపించుకొని పొమ్మన్నది. ప్రశ్నలు అడగమని అన్నాడు ధర్మరాజు.

ప్రశ్న: ఏ గుణాలున్నవాడు బ్రాహ్మణుడు? అతడికి తెలియాల్సిన పరమార్థం ఏమిటి?

జవాబు: సత్యం, సహనం, ఇంద్రియ నిగ్రహం, శుచిత్వం, కరుణ, తపస్సు, త్యాగం, సత్స్వభావం ఎవరిలో కనిపిస్తే అతడే బ్రాహ్మణుడు. సుఖం, దుఃఖం ఏర్పడినప్పుడు తాను మొహం పొందకుండా సమబుద్ధితో వుండగలగడం బ్రాహ్మణుడు ఆర్జించతగ్గ గొప్ప చదువు.

ప్రశ్న: ధర్మరాజు చెప్పిన సద్గుణాలు శూద్ర కులంలో పుట్టినవాడిలో కనిపిస్తే అతడు బ్రాహ్మణుడని చెప్పవచ్చా?

జవాబు: కులాలను నిర్ణయించడానికి వేర్వేరు ప్రవర్తనలను, గుణాలను స్వాయంభవ మనువు నిర్ణయించాడు. మంచి గుణాలు శూద్రకులంలో జన్మించిన వారిలో వుంటే అతడు మంచి శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అలాంటి సద్గుణాలు బ్రాహ్మణుడిలో లేకపోతే అలాంటి వాడు శూద్రుడు అని చెప్పక తప్పదు. సత్ప్రవర్తన లేనివాడు ఎన్నటికీ లేనివాడే. 

ప్రశ్న:  ఇతరులకు అపకారాలు చేసి, అసత్యాలు చెప్పినప్పటికీ హింస చేయకపోతే పుణ్యలోకాన్నిఆర్జిస్తాడు అని పెద్దలంటారు. ఇదెలా సాధ్యం? అహింస అంత గొప్పదా?

జవాబు:  దానం, పరోపకారం, సత్యం, అహింస అనేవి సమానమైన గొప్ప ధర్మాలే. వాటిల్లో అహింస మిక్కిలి గొప్పది. అహింస పరమ ధర్మంగా చెప్పడం జరిగింది.

ధర్మరాజు జవాబులకు నహుషుడికి శాప విమోచన కలిగి భీముడిని వదిలాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment