Saturday, May 15, 2021

సీతాదేవి నిర్దోషురాలని శ్రీరాముడికి చెప్పి ఆయన్ను నుతించిన దేవతలు, బ్రహ్మదేవుడు : వనం జ్వాలా నరసింహారావు

 సీతాదేవి నిర్దోషురాలని శ్రీరాముడికి చెప్పి

ఆయన్ను నుతించిన దేవతలు, బ్రహ్మదేవుడు

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (15-05-2021) మధ్యాహ్నం ప్రసారం  

         తన భార్య సీతాదేవి తన కళ్లెదుటే పదిమంది చూస్తుండగా అగ్ని ప్రవేశం చేస్తుంటే అది సహించడం మహాక్రూరమైన కార్యమైనప్పటికీ, ధర్మాన్ని ఆచరించడంలో ఏమాత్రం వెనుకాడని శ్రీరామచంద్రమూర్తి, ఒక నిర్దోషురాలిని, అందునా తనమీద అమితమైన ప్రేమకల దాన్ని, ఇంతగా బాధ పెట్టాల్సి వచ్చెకదా అని పరితపిస్తూ తనలో తానే కుమిలిపోయాడు. సీతాదేవి అలా అగ్ని ప్రవేశం చేసిన తరువాత కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, ముక్కంటి శివుడు, బ్రహ్మ, ఇతర దేవతలంతా విమానాలమీద ఆకాశం వరకు వచ్చి, వాటిని అక్కడే నిలిపి, తమ దీర్ఘమైన చేతులు జోడించి, ఎదురుగా భూమ్మీద నిలబడి వున్న రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నారు.

         “మహాత్మా! సమస్త లోకాలను సృష్టించడానికి సమర్థుడివి. జ్ఞానుల సమూహాలలో శ్రేష్టుడివి. ఇలాంటి నువ్వు సీతాదేవి అగ్నిజ్వాలల్లో ప్రవేశిస్తుంటే చూసి చలించకుండా వుండతగునా? ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? రామచంద్ర ప్రభూ! నువ్వు సమస్తదేవతలకు నాథుడివి. ఋతుధాముడు అని నీకు పేరు. అన్ని లోకాలను స్వయం సృష్టించి ఆ తరువాత సద్వారకంగా సృజిస్తావు. నీకు నువ్వే ప్రభువివి. నిన్ను నియమించేవాడు లేడు. మహాదేవుడన్న పేరుకల ఎనిమిదవ రుద్రుడివి నువ్వే. ఐదవ వసువువి నువ్వే. నీకు అశ్వినీదేవతలు కర్ణాలు. సూర్యచంద్రులు నేత్రాలు. జగాలన్నీ ప్రళయకాలంలో సమసిపోయినా నువ్వు మాత్రం మిగిలే వుంటావు. సృష్టికి పూర్వం నుండి వున్నవాడివి నువ్వే. ఇలాంటి నువ్వు సామాన్య మనుషిలాగా సీతాదేవిని వదలవచ్చా? కమలాక్షా! నువ్వామెమీద కరుణచూపు”.

         ఈ విధంగా దేవతలంతా, లోకపాలకులంతా వినయంతో విన్నవించుకోగా రామచంద్రమూర్తి ఆ దేవతానాయకులతో ఇలా అన్నాడు. “దేవతలారా! నన్ను నేను మనుష్యుడినని, రాముడంటే దశరథ కుమారుడనని అనుకుంటున్నాను. నేనెవ్వరిని? ఎవరివాడిని? ఎందుకు పుట్టాను? తెలపండి”. జవాబుగా బ్రహ్మదేవుడు “రామా! సత్యవిక్రమా! యథార్థం చెప్తా విను” అంటాడు. అని ఈ దండకం చదువుతాడు.

         “శ్రీరామరామా! మహాభావ! నారాయణా! దేవ! లక్ష్మీ సనాథా! యనాథాధినాథా! విభూ! శంఖచక్రాయుధా! నీవ మున్నొంటిశృంగంబు భూదారమై భూమి కాధారమైనిల్చు పెన్నేల్వవుం, జనన రానున్న యాసూడులం గీడులంగూర్చి వేధించి సాధించి బాధించు బల్ప్రోడవున్, నీవ బ్రహ్మంబు, సత్యంబు నీ, వక్షరంబెల్ల కాద్యుండు మధ్యాంతసంస్థుండును న్నీవ, లోకాలికిన్ సిద్ధధర్మంబు కర్మంబు మర్మంబునున్ నీవ, నీవే చతుర్బాహువున్ స్వామియున్ శార్జ్న్విన్ శ౦ఖివిన్ ఖడ్గివిం గృష్ణుడున్ విష్ణుడున్ బుద్ధియున్ సిద్ధియున్ సత్త్వముం దత్త్వమున్ శాంతియుo దాంతియుం బూరుషాఖ్యుండవు బూరుషోత్క్రుష్టరూపంబును న్నీవ, నీవే హృషీ కేశ విఖ్యాతమూర్తీ! యజయ్యుండవున్ సర్వసేనానివిన్ గ్రామణీరత్నమున్ స్రష్ట వుం ద్రష్టవున్ నీవ, నీ యంద డిందున్ సమస్తం బుపేంద్రా! హరీ! మధ్వరీ! యింద్రకర్మా! మహేంద్రా! నరేంద్రా! మునీంద్రాది వంద్యా! పరా! పద్మనాభా! విరోద్యంతకారీ! శరణ్యుండవున్ నీవ, నిన్నే సుమీ సర్వరక్షైక సామర్ధ్యదక్షుండవున్ లోకచక్షు౦డవం చెల్లా దివ్యర్షు లుత్కర్ష భావించి సేవించి స్తోత్రంబు గావింత్రు శాఖాసహ స్రాత్మకామ్నాయరూపా! మహర్షిప్రవేకా! యనేకోరుజిహ్వా! జగత్పాలికీ వాద్యుడౌ కర్తవున్ ధర్తవున్ హర్తవున్ నీవ, నీవే స్వయంభర్తవున్, సిద్ధసాధ్యాశ్రయుం డీవ, నీవే సుమీ సృష్టికిన్ముందు భాసిల్లు రూపంబు, యజ్ఞంబును న్నీవ, నీవే వషట్కార మోంకారమున్నీవ, నీవే సముత్కృష్టయోగై కగమ్యుండవున్, భక్తరమ్యుండవున్ నీవ, నీ పుట్టువుం బుట్టునున్ గిట్టునున్ వెండి నీవిట్టివాడటంచు నెవ్వాడెరుంగన్, రమాధీశ! గోజాతభూనిర్జరాక్రాంతభూతావలీ శైలదిగ్జాలకాంతారదేశంబులన్ నిండి రాణింతు వో దేవదేవేశ! నీవే కదా వేయిపాదంబులన్ వేయిశీర్షంబులన్ వేయినేత్రంబులం  బూని భూతంబులన్ గోత్రసంఘాతసంస్ఫీతమౌ భూతదాత్రిన్ వహింపన్ సహింపంగ దక్షుండ, వీ క్షోణి కల్పాంతవేళన్ మహాహీంద్రతల్పుండవై దేవ! గంధర్వ దైతేయ సంఘంబులం దాల్చి ప్రత్యక్షమై యందు, వోరామ! నీ చిత్తమే నేను, నీ జిహ్వయే వాని, రోమాళి దేవాళి, యోగీశహృద్ధామ! శ్రీ ధామ కన్ రెప్పలన్ మూయగా రేయి, విప్పం బగల్, నీదు విశ్వాసముల్ వేదముల్ రామ! నీకాని దావంతయున్ లేదు, సర్వంబులోకంబు నీకున్ శరీరంబు స్థైర్యంబు భూగోళ, మగ్నుల్ ప్రకోపంబు, శ్రీవత్సచిహ్నా! ప్రసాదంబు సోముండు, నీవేకదా మున్ను వైరోచనిం జేరి దానంబునుం గోరి పాదత్రయీన్యాసరూపంబునన్ సర్వలోకంబులున్ నిండి దండించి తా దైత్యు, దైత్యారికిం బట్టముం గట్టి రక్షించితో దివ్యమూర్తీ! లసత్కీర్తి! శ్రీలక్ష్మియే సీత, విష్ణుండవే నీవు, కృష్ణుండునున్ నీవ, నీవే ప్రజానాథవాచ్యుండ వా పంక్తికంఠున్ వధింపంగ నై మానుషీదేహమున జొచ్చి రక్షోధిపుం ద్రుంచి మా కార్యముం దీర్చి లోకంబులం దేర్చి తీ వింక హృష్ణుండవై ధాత్రి బాలించి యాపై దివిం జేరుమా, యో రమానాథ! నీవీర్యసారం బమోఘంబు, నీ ఘోరశౌర్యం బమోఘంబు, నీ దర్శనంబే అమోఘంబు, నీ స్తోత్రమున్ మోఘ మే వేళ నేవారికింగాదు, నిన్ భక్తిచే గొల్చి చిత్తంబునం దాల్చు నీ భక్తులౌ వారి కె లోపముల్ లేవు, నిన్నుం బురాణునిన్ సదాపూరుషోత్తంసు నిశ్చంచలం బైన సద్భక్తి సేవించు భక్తుల్ జగద్రక్షకా! యైహికాత్యంత సౌఖ్యంబు లెల్లప్పుడుం గందు రీశా నమస్తే నమస్తే నమః”.

         (ఈ దండకం ద్వారా రాముడిని సేవించే భక్తులకు ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని బ్రహ్మ వాక్కుగా చెప్పడం జరిగింది. ఈ స్తోత్రాన్ని ప్రతిదినం పఠిస్తే జన్మాంతర ప్రాప్తిని కాని, కామక్రోధాల వల్ల కాని, బాహ్య శత్రువుల వల్ల కాని తిరస్కారం కలగదని చెప్పడం జరిగింది. ఇది పాపహరమ, పురాణ, ఇతిహాస వేదం సంబంధమైనది. కాబట్టి దీనిలో ఎంతో మహాత్మ్యం వుంది).

         ఇలా బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని స్తుతిస్తుంటే అగ్నిహోత్రుడు మనిషి రూపంలో బిడ్డను ఎత్తుకొస్తున్నట్లు సీతాదేవిని ఒడిలో వుంచుకుని చితిలోని కట్టెలను చిమ్ముకుంటూ వచ్చాడు. అగ్నిలో ప్రవేశించినప్పుడు ఎలా వుందో ఇప్పుడూ ఆమె అలాగే వుంది. ఆమెను రాముడికి అప్పగిస్తూ, “ఈమె నీ సీత. ఈమెలో ఏపాపం ఏమాత్రం లేదు. మనోవాక్కుల వల్ల కాని, సంకల్పం వల్ల కాని, అనురాగంతో ఇతరులను చూసికాని ఈమె నిన్నెప్పుడూ అతిక్రమించలేదు. నిన్ను వదిలి మనుష్యులెవరూ లేని ప్రదేశంలో ఒంటరిగా వున్న సమయంలో ఈ సాధ్విని పాపాత్ముడైన రావణుడు బలవంతంగా తెచ్చాడు. తెచ్చి తన ఇంట్లో వుంచాడు. అలా చేసినప్పటికీ నిన్నే ధ్యానిస్తూ, నిన్నే భజిస్తూ ఇతర విషయాలమీద మనసు పోనివ్వలేదు. రావణుడు ఎంత బలవంత పెట్టినా మనసు నీమీదే లగ్నం చేసింది. ఏ పాపం ఎరుగని ఈ సాధ్వీమణిని నువ్వు స్వీకరించు” అన్నాడు. అగ్నిహోత్రుడి మాటలకు శ్రీరాముడు సీతను చేరదీసి రాముడు సుఖపడ్డాడు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment