Sunday, May 16, 2021

శ్రీరామ పట్టాభిషేకం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామ పట్టాభిషేకం

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (16-05-2021) మధ్యాహ్నం ప్రసారం  

అగ్ని పరీక్ష అనంతరం అగ్నిహోత్రుడు, దేవతలు, బ్రహ్మ చెప్పిన దాన్ని అంగీకరిస్తూ సీతాదేవి నిర్దోషి అని తనకు తెలుసన్న రాముడు ఆమెను సంతోషంగా స్వీకరించాడు. రామచంద్రమూర్తి ఇలా తమ మీద గౌరవంతో శుభకరమైన మాటలు చెప్పగా దేవతలలో వున్న శివుడు ఇలా అన్నాడు. “రామచంద్రమూర్తీ! నీ అవతార ప్రయోజనాలలో సాదు పరిత్రాణం, దుష్ట వినాశనం అనే రెండు పనుల్లో చాలా భాగం నెరవేర్చావు. ఇక మూడోది ధర్మసంస్థాపన చేయడం. దానికొరకై నువ్వు అయోధ్యకు పోవాలి. సంతానం పొంది అసమాన కీర్తికల ఇక్ష్వాకుల కులాన్ని నిలుపు. అశ్వమేధయాగం చేయి. ఈ కార్యాలన్నీ నెరవేర్చి వైకుంఠ౦ పో”.

         ఇంద్రుడి కోరిక ప్రకారం, రాముడు, మృతులైన వానరులందరినీ బతికించమని అడిగాడు.  రాముడు కోరినట్లే ఇంద్రుడు చేశాడు. చనిపోయిన వానరులంతా బతికారు. గాయాలైన వారు బాగుపడ్డారు. వారికి సమృద్ధిగా ఆహారం లభించింది. ఆ తరువాత రామచంద్రమూర్తి ఆజ్ఞ తీసుకుని దేవతలు స్వర్గానికి పోయారు. దేవతలు వెళ్లగానే రామలక్ష్మణులు వానరసేనను మధ్యన గడిపారు కొంతసేపు.

         మర్నాడు ఉదయాన్నే విభీషణుడు రామచంద్రమూర్తిని చూసి, తన వద్ద వున్న పుష్పక విమానం  కోరిన విధంగా పోగలదనీ, ఒక్క పగటిలో వారిని అయోధ్యకు చేరుస్తుందనీ, తమ్ముడితో, భార్యతో దీంట్లో ప్రయాణం చేయమనీ అన్నాడు. విభీషణుడు అలా చెప్పినందుకు శ్రీరాముడు సంతోషించి వెంటనే పుష్పక విమానం తెప్పించమన్నాడు.  అలా రామచంద్రమూర్తి చెప్పగానే విభీషణుడు పుష్పక విమానాన్ని తెప్పించాడు. వానరులందరికీ విభీషణుడితో బహుమానాలు ఇప్పించాడు రాముడు.

         ఆ తరువాత శ్రీరాముడు ఆనందంగా పుష్పక విమానం ఎక్కాడు. తన పక్క ఎడమ తొడమీద సీతాదేవిని కూచోబెట్టుకున్నాడు. లక్ష్మణుడు విల్లు ధరించి పక్కనే నిలబడ్డాడు. వానర రాక్షస మిత్రులందరినీ తగురీతి ఆదరించాడు. తాను అయోధ్యకు పోతున్నాననీ తనకు సెలవివ్వమనీ అడిగాడు వారందరినీ. శ్రీరాముడు ఇలా అనగానే సుగ్రీవుడు, విభీషణుడు, ఇద్దరూ, వానరులతో కూడి తాము రామ పట్టాభిషేకం చూడడానికి అయోధ్యకు వస్తామనీ, ఆ తరువాత తమ ఇండ్లకు పోతామనీ, తమకు అనుమతి ఇవ్వమనీ కోరారు. శ్రీరాముడు తక్షణమే అంగీకరించాడు. సుగ్రీవ, విభీషణాదులను, కపులందరినీ విమానం ఎక్కమని చెప్పాడు. వారంతా ఎక్కగానే చూసేవారికి బ్రహ్మ రథంలాగా కనిపించే ఆ విమానం పైకి ఎగిరింది. మంత్రపూతమైన ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా ఇరుకు లేకుండా సుఖంగా వుంది.

         విమానం ఆకాశమార్గాన రివ్వున పోతుంటే అటు-ఇటు చూస్తూ అలాగే చూస్తున్న సీతతో రామచంద్రమూర్తి పూర్వ పరిచిత ప్రదేశాలను సవివరంగా చెప్తూ, చూపించాడు. శ్రీరాముడు ఇలా ప్రదేశాలను వర్ణించుకు పోతుంటే కిష్కింధ గురించి చెప్పగానే సీతాదేవి రాముడితో, “రామచంద్రా! నాదొక విజ్ఞాపన. తారాదేవి మొదలైన సుగ్రీవుడి భార్యలను, ఇతర వానర స్త్రీలను తీసుకుని సంతోషంగా అయోధ్యకు పోవాలని నా కోరిక” అన్నది. ఆమె ఇలా అనగానే సంతోషించిన రాముడు విమానం నిలపమన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం సుగ్రీవుడు అంతఃపురానికి పోయి వారందరినీ తీసుకువచ్చాడు. అప్పుడు రామచంద్రమూర్తి సీతతో ఇంతకు ముందు చెప్పినట్లు తాను తిరిగిన ప్రదేశాలను గురించి మళ్లీ వివరించసాగాడు. వివరిస్తూ, “మా తండ్రి వున్న అయోధ్యానగారాన్ని మరలా క్షేమంగా చూడగలిగాం” అన్నాడు. రామచంద్రమూర్తి అయోధ్య వచ్చింది అనగానే వానరులు, విభీషణుడు లేచి నిలబడి, మళ్లీ కూర్చుని, అయోధ్యా నగరాన్ని చూశారు.     

         పద్నాలుగు సంవత్సరాల వనవాస దీక్ష పూర్తైన కారణాన, చైత్ర శుద్ధ పంచమినాడు శ్రీరామభద్ర ప్రభువు భరద్వాజాశ్రమం దగ్గర విమానం దిగి, ఆ మునీశ్వరుడిని చూసి, నమస్కారం చేసి, అయోధ్యవాసుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు. ముని కోరిక ప్రకారం వరం ఇలా కోరాడు. “దయామయా! అన్ని కాలాల్లో అన్ని రకాల తియ్యటి పండ్లు అయోధ్య పోయే మార్గంలో చెట్లకు వుండాలి”. దానికి మునీశ్వరుడు అంగీకరించి అలాగే వుంటాయన్నాడు. ఆ వరబలంతో అయోధ్యకు పోయే అన్ని మార్గాలలో పూలులేని చెట్లు పూలతో, పండ్లు లేని చెట్లు తియ్యటి పండ్లతో, పసరులేనివి పసరుతో, మోద్దులన్నీ పచ్చటి ఆకులతో సారవంతం అయ్యాయి. వానరులు అధిక సంతోషంతో ఆ ఫలాలను భుజించారు. ఆ తరువాత రాముడు హనుమంతుడిని పిలిచి, అయోధ్యానగరంలో అందరి క్షేమ సమాచారం, శృంగిబేరపురంలోను స్నేహితుడు గుహుడి క్షేమ సమాచారం తెల్సుకుని, అయోధ్యకు పోయి భరతుడిని సమీపించి తన క్షేమ సమాచారం చెప్పి భరతుడిని గురించి కనుక్కోమని అన్నాడు.

         రాముడి ఆజ్ఞానుసారం భరతుడున్న చోటుకు పోయి, ఆయన్ను చూసి హనుమంతుడు వినయంగా నమస్కారం చేసి ఇలా అన్నాడు.          “భరతా! ఏ రామచంద్రమూర్తైతే దండకలో నారచీరెలు, కృష్ణాజినం ధరించి వున్నాడని నువ్వు విచారపడుతున్నావో ఆ రామచంద్రమూర్తి నీ క్షేమ సమాచారం కనుక్కుని రమ్మన్నాడు. భరతా! నీకు సంతోషకరమైన మాట చెప్తా విను. నువ్వీ భయంకర దుఃఖం వదిలిపెట్టు. నీమీద ప్రేమకల నీ అన్నను నువ్వీ క్షణంలోనే చూడవచ్చు. రావణుడిని చంపి, సీతాసమేతంగా లక్ష్మణుడితో, వానర మిత్ర సేనా సమూహంతో కలిసి సంతోషంగా వస్తున్నాడు”. ఈ మాటలు వింటూనే అమితమైన సంతోషంతో భరతుడు కాసేపు మూర్ఛపోయి, తేరుకుని, హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “ఎన్నో సంవత్సరాల క్రితం రామచంద్రమూర్తి అడవులకు పోయాడు. మళ్లీ ఇన్ని రోజులకు ఆయన వార్త విన్నాను. అయ్యా! రాముడికి, వానరులకు ఏ కారణాన, ఏవిధంగా స్నేహం కుదిరిందో ఆ విషయమంతా సవివరంగా తెలియచేయి” అని భరతుడు హనుమంతుడిని అడిగాడు. జవాబుగా హనుమంతుడు ఆ విషయాలన్నీ వివరంగా చెప్పాడు.

         ఉదయాన్నే రాజపత్నులు, మంత్రులు, బ్రాహ్మణులు, రాచవారంతా సైన్యంతో సహా వరుసలు-వరుసలుగా శ్రీరాముడిని చూడడానికి బయల్దేరారు. వారితో పాటే సుమంత్రుడు, అర్థసాధకుడు, జయంత, విజయులు, అశోక, సిద్ధార్థుడనేవారు బంగారు భూషణాలతో అలంకరించిన ఏనుగులతో బయల్దేరారు. రాజు అంతరంగికులు ఏనుగుల మీద, గుర్రాలు కట్టిన రథాలమీద బయల్దేరి పోయారు. వీరులంతా గుర్రాలనెక్కి భటులతో బయల్దేరారు. దశరథుడి భార్యలు కౌసల్యను, సుమిత్రను ముందుంచుకుని వారితో కలిసి వాహనాలమీద పోయారు. కైక కూడా అందరితో కలిసి బయల్దేరింది. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు. “అదిగో అక్కడ కనబడుతున్నవాడే రామచంద్రమూర్తి. సీతతోను, తమ్ముడు లక్ష్మణుడితోను వున్నాడు. ఎడమ పక్క సీత, కుడిపక్క లక్ష్మణుడు వున్నారు. అదిగో అతడే సుగ్రీవుడు. అదిగో విభీషణుడు”.

“అతడే రాముడు” అని హనుమంతుడు చెప్పగానే స్త్రీబాలవృద్ధులు అంతా ఆకాశం వైపు వేలు చూపిస్తూ “వాడే రాముడు! వాడే రాముడు! అదిగో రాముడు! రాముడదిగో!” అని ధ్వనించారు. అంతదాకా వాహనాల మీద వున్నవారంతా కిందికి దిగి ఆకాశం వైపు, రాముడి వైపు చూశారు. పద్నాలుగు సంవత్సరాలు దాటగానే తప్పక తిరిగి వస్తానని మాట ఇచ్చిన రామచంద్రమూర్తిని చూసి భరతుడు దూరం నుండే నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి అజ్ఞానుసారం భరతుడు దానిమీదికి ఎక్కి రామచంద్రమూర్తిని సమీపించి నమస్కారం చేశాడు.

         ఆ తరువాత శ్రీరామచంద్రుడు తల్లి దగ్గరికి పోయాడు. పాదాలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. సుమిత్రకు, కైకకు, పురోహితుడు వశిష్టుడికి మొక్కాడు. పురజనులంతా చేతులు జోడించి రామచంద్రమూర్తికి మొక్కుతూ స్వాగతం పల్కారు. వారందరినీ ప్రేమగా చూశాడు రామచంద్రమూర్తి. కుశల ప్రశ్నల తరువాత భరతుడు తనకు రామచంద్రమూర్తి ఇచ్చిన బంగారు పాదుకలను తీసుకొచ్చి అన్న పాదాలకు తొడిగి, చేతులు జోడించి, “రాజేంద్రా! ఈ రాజ్యమంతా నీది. నువ్వు లేని కారణాన ఇంతదాకా కావలి కాసి వుండి, ఇప్పుడు నీది నీకు అప్పగిస్తున్నాను. నీకు నీ రాజ్యమంతా ఇస్తున్నాను. నువ్వు నాకెలాగైతే రాజ్యాన్ని ఇచ్చావో అదే విధంగా అప్పచెప్తున్నాను. ఇక నేను ఈ బరువు మోయలేను. ఈ రాజ్యాన్ని గొప్పదైన ప్రయత్నం చేస్తేనే కాని రక్షించలేం. ఇది నువ్వే ఆలోచించుఅని అన్నాడు.

         ఆ తరువాత శత్రుఘ్నుడి ఆజ్ఞానుసారం నేర్పరులైన క్షురకులను పిలిచి శ్రీరామ లక్ష్మణ భరతులకు మీసాలు కత్తిరించి, గడ్డాలు, క్షౌరం చేశారు. శ్రీరాముడు వెలగల వస్త్రాలను ధరించి అలంకరించుకున్నాడు. ఆయన అలా త్రిలోకాభిరాముడై వుండగా రామలక్ష్మణులకు శత్రుఘ్నుడు మంచి ఆభరణాలు తొడిగాడు. అప్పుడు దశరథుడి భార్యలు మనోహరంగా స్వయంగా వారే సీతాదేవిని అలంకరించారు. కౌసల్య వానర స్త్రీలందరికీ సొమ్ములు, చీరెలు ఇచ్చి అలంకరించుకోమన్నది. ఆ తరువాత అంతా అయోధ్యకు బయల్దేరి పోయారు.

         అయోధ్యకు చేరిన తరువాత వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. ఇలా వారిద్దరినీ కూర్చోబెట్టిన తరువాత, వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొదలైన ఎనిమిదిమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న  జలాలతో వారిని అభిషేకించారు. ఆ తరువాత ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవతల సమక్షంలో, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు. బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో ప్రకాశిస్తూ, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు.

         అన్నకు శత్రుఘ్నుడు ప్రశస్తమైన శ్వేతఛ్చత్రం భక్తితో పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు వీచాడు. మరొక చామరాన్ని విభీషణుడు పట్టుకున్నాడు. ఇంద్రుడి పక్షాన వాయుదేవుడు తళతళ ప్రకాశించే బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన ముత్యాల సరాన్ని అర్పించాడు. రామచంద్రమూర్తి విరివిగా బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతిగా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైడూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూడినదైన, మనోహరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూడిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రామచంద్రమూర్తి.

         సీతాదేవి తన మెడలో వున్న ఒక అందమైన హారాన్ని సంతోషంగా చేతిలో తీసుకుని ఎవరికీ ఇస్తే బాగుంటుంది అన్న విధంగా భర్తవైపు చూసింది. సమాధానంగా ఆయన “ఓ అలివేణీ! ఎవరు తన గుణాలతో నిన్ను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటివాడికి దీన్ని ఇవ్వు” అని అన్నాడు. సీతాదేవి భర్త అలా చెప్పగానే ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అది ధరించి హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బహుమానాలు రాముడిచ్చాడు. అలా వానరనాథులందరికీ ఇచ్చాడు. ఈ ప్రకారం విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బహుమానాలు, గౌరవాలు తృప్తితీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. విభీషణుడు రామాజ్ఞ తీసుకుని లంకకు పోయాడు. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలు మనోవేదనలు లేకుండా వున్నారు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఏనోట విన్నా రామశబ్దమే! ఏకథ విన్నా రాముడి కథే! ప్రపంచం అంతా రామమయం అయింది. రామచంద్రమహారాజు పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు. నూరు అశ్వమేధ యాగాలు చేసి, తమ్ములతో, చుట్టాలతో, ఆప్తులతో, మిత్రులతో కలిసి అనేక విధాలైన యజ్ఞాలు చేశాడు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా) 

 

No comments:

Post a Comment