Sunday, May 16, 2021

శ్రీరాముడి శైశవ వర్ణన- రాజకుమారుల గుణ వర్ణన ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-56 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడి శైశవ వర్ణన- రాజకుమారుల గుణ వర్ణన

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-56

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-05-2021)

మొసలికి చిక్కిన గజరాజు రక్షించమని వేడుకున్నప్పుడు, ఏనుగును రక్షించగల సమర్థుడు తాను తప్ప మరెవ్వరూ లేనందున, కాపాడేందుకు పరుగెత్తిన వేలుపు, నేడు కావ్‌కావ్ మని ఏడుస్తున్నాడు రాజకుమారుడై పుట్టిన చిన్ని శ్రీరాముడు. ఆయనను-తమ్ములను అంతఃపుర స్త్రీలు, ఉవ్విళ్ళూరే కోరికలతో, ఉయ్యాలల్లో వుంచి, పంచమ ధ్వనితో - కంకణాల ధ్వనినే చప్పుళ్ళుగా చేసి - రాగం తప్పకుండా, విలాసం వల్ల కలిగిన వికాసంతో ప్రకాశిస్తూ లాలి పాటలు పాడారు. " నాయనా నిద్రపో - రఘునందనా నిద్రపో - తండ్రీ నిద్రపో - బంగారు కొండా ఆటలు చాలించి నిద్రపో - తండ్రీ! నిద్రపోకపోతే దేహం అలసిపోతుంది" అని అంటూ, ఏనాడూ కళ్ళు మూయని దేవాదిదేవుడిని సంబోధిస్తూ ఆ ముద్దుగుమ్మలు పాటలు పాడారు. ఎల్లవేళలా నీళ్లలోనే నివసించే దేవుడికి ఆ స్త్రీలు స్నానం చేయిస్తుంటే, ఏమీ తెలియనివాడిలాగే, వారి ఉత్సాహానికి - తనకై వారు పడే శ్రమకూ - వారి అజ్ఞానానికీ నవ్వుకున్నాడు రాముడు. స్నానం చేయించిన తర్వాత, కౌసల్య, తన చేతిలో నీళ్ళు తీసుకొని, "శ్రీరామా నారాయణా  - ఈ బాలుడిని రక్షించు" అంటూ రక్షగా చుట్టూ తిప్పింది.

దుష్టులైన వారు, ఎప్పుడు శ్రీరాముడు వస్తాడో - ఎప్పుడు మనల్ని చంపుతాడోనని తమ ప్రాణాలను భయంతో పిడికిట్లో పెట్టుకొని వున్నారని అభినయిస్తున్నట్లుగా, కొన్ని రోజులు, శ్రీరాముడు తనబాలక్రీడలతో తల్లి మోహాన్ని తీర్చేందుకు, పిడికిలి విడువకుండా వేళ్ళు ముడుచుకొనే వుండేవాడు. బాలురను చూడడానికి వచ్చిన పురస్త్రీలు, శ్రీరాముడిని తమ చేతులతో ఎత్తుకుంటే, బాలుడు కందిపోతాడేమోనని-ఆయన దేహం మురికిపడుతుందేమోనని, పొత్తిగుడ్డలతొనే ఎత్తుకొని - తమ స్తనాలకు హత్తుకొని-చిటికెలు వేసి-ఈలలు వేసి-నవ్వించి, తిరిగి తల్లిచేతికిచ్చేవారు. సమస్త భూమండలాధిపతైన చక్రవర్తి వినోదంకొరకై చెండాడినట్లే, ప్రపంచ సృష్ఠి - స్థితి - లయ లాంటి వ్యాపారాలు పెట్టుకొన్నదేవాదిదేవుడు, శత్రువులను వధించే కార్యక్రమంలో ఆసక్తి వున్నవాడైనప్పటికీ, తనను ఆడిస్తున్న స్త్రీలను, తన ఆట - పాటలతో ఆడించాడు.

శ్రీరామచంద్రమూర్తి తనతమ్ములతో ఆడుకొనేటప్పుడు, అతడు ఆడి-ఆడి అలసిపోయాడని, పాలు తాగేందుకు రమ్మనీ, కౌసల్య ఎత్తుకోపోగా, తల్లిచంకెక్కి, తమ్ములకు పాలిమ్మని సైగచేసేవాడు. ఆవయస్సులోనే ఆయనకంత భాతృవాత్సల్యం. నిదురించేటప్పుడు, తన ఉయ్యాల పక్కనే తమ్ముడు లక్ష్మణుడి ఉయ్యాల లేకపోతే సంతోషంగా ఆడుకొనేవాడు కాదు - నిదురపోడు. ఏమైనా సరే - తల్లి పాలుకూడా తాగడు. అన్నప్రాశనం కాకముందే, పాలు తాగే వయస్సులోనే, రోజుకొక్కమారైనా, తమ్ములను చూసేందుకు సవతి తల్లుల ఇళ్ళకు తీసుకెళ్ళమని సైగలు చేసేవాడు. ఎత్తుకొనిపోయేవరకూ విడువడు. మంచిపరిమళంగల సంపెంగ నూనెతో తలంటి పోసి - పన్నేటిలో స్నానం చేయించి - దశాంగంతో ధూపం వేసి - వెంట్రుకల తడి ఆరకముందే గట్టిగా జడ వేస్తే బిసకపట్తుందికాబట్టి బింపిణీ జడ వేసి - వొంటినిండా బంగారు సొమ్ములు పెట్టి - ముఖంమీద కస్తూరి చుక్క పెట్టి - కళ్ళకు కాటుక పెట్టి - సంతోషంతో ముద్దుపెట్టి, తమ్ములతో ఆడుకునేందుకు శ్రీరామచంద్రమూర్తిని పంపేది కౌసల్య. తనకాలి గజ్జెలు - బంగారు అందెలు గల్లుగల్లుమని ధ్వనిస్తుండగా, వక్షస్థ్సలమందుండే హారాలు వెనక్కూ-ముందుకూ - పక్కలకూ ఉయ్యాలలాగా వూగుతుంటే, చెవుల పోగులు తళుక్కు-తళుక్కుమని మెరుస్తుంటే, చేతులమీద ధరించిన కంకణాలు జిలిబిలి ధ్వనులు చేస్తుంటే, పిల్లతనం నటించేందుకు తై-తై అని ఎగురుకుంటూ, గంతులు పెట్తూ, మెల్ల-మెల్లగా పోరా నాయనా అని తల్లి హెచ్చరిస్తున్నా, పట్టుకోవచ్చినవారికి చిక్కకుండా, తమ్ముళ్లతో ఆడుకునేందుకు ప్రతిరోజూ వెళ్ళేవాడు శ్రీరామచంద్రుడు. 

ఈ విధంగా రాజకుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ, విద్యలలో ఆసక్తిగలిగి, సమస్త విద్యలను శ్రేష్ఠులైన గురువుల దగ్గర నేర్చుకున్నారు. నలుగురిలో శ్రీరాముడు ప్రజల పొగడ్తకు యోగ్యుడై, తండ్రికి-సేనకు ధ్వజంలాగా, భూత కోటులకు బ్రహ్మదేవుడిలాగా, అందరికీ మిక్కిలి ప్రియుడయ్యాడు. దశరథుడి నలుగురు కొడుకులూ నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారే. అందరూ శూరులని పేరుతెచ్చుకున్నవారే. అందరూ ప్రజల క్షేమం కోరేవారే. అందరూ జ్ఞానవంతులే-దయావంతులే-సత్య వాక్య దురంధరులే-సత్త్వగుణం ప్రధానంగా వున్నవారే-సాధువులందు రత్నాలలాంటివారే-గొప్పమనస్సుకలవారే-అరవైనాలుగు విద్యలలో ప్రవీణులైనవారే. శ్రీరామచంద్రుడు మంచినడవడనే సంపదతో మనోహరుడు-సత్యమై వంచనలేని విక్రమంతో గొప్పవాడు-సత్యంతోనే పరులను ఆక్రమించే కార్యక్రమంలో గొప్పవాడు-ఎప్పటికీ ఒకే విధమైన సద్గుణం కలవాడేకాని, సమయానికితగ్గట్లు రకరకాలుగా ప్రవర్తించనటువంటివాడు-శత్రువులనీ, మిత్రులనీ, గొప్పవారనీ, తక్కువవారనీ తారతమ్యాలు చూపకుండా సర్వసముడై సమస్త జీవకోటులను నిర్మల పూర్ణ చంద్రుడిలాగా ఇష్టపడేవాడు-సాధు చిహ్నాలే పూల హారాలుగా కలవాడు-వర్షించడానికి సిద్ధంగానున్న కారుమేఘంలాంటివాడు-దేహ సౌందర్యంతో మన్మధుడినే ధిక్కరించగల ప్రకాశవంతుడుగా పేరొందాడు. ఏనుగు పైనుండికాని, గుర్రం పైకెక్కిగాని, రథస్థుడైకాని, ఎటువంటి వాహనం లేకుండా కాళ్లపై నిలబడి కాని, వింటితోకాని, కత్తితో కాని, మరేదైనా అస్త్రం ధరించి కాని, యుద్ధంచేయడానికి - శత్రువులను సంహరించడానికి, మానమే ధనంగా కల రామచంద్రమూర్తి నేర్చుకున్నాడు.

చిన్నతనంనుండే, తనకంటే పెద్దవాడు-గుణాలలో శ్రేష్ఠుడు-ప్రజలను రంజింపచేసేవాడైన శ్రీరాముడితో స్నేహం-భక్తి మాత్రమే తనకు ఐశ్వర్యమని భావించి, లక్ష్మణుడు ఆయనకు బహిప్రాణమై -స్వశరీరానికంటే ఎక్కువగా వుండేవాడు. సకల కార్యాలలో సర్వదా తన సౌఖ్యం ఉపేక్షించైనా హితమే చేసేవాడు. తన ప్రాణంకంటే, రాముడి సుఖమే శ్రేష్ఠమని, స్వంత ప్రాణ రక్షణ విషయంలో లక్ష్యంచేయకుండా, రాముడికి హితమైన పనులే చేసేవాడు. స్వయంగా వండి - మంచి పరిశుద్ధంగా, రుచిగా వున్న అన్నాన్ని తెచ్చి, వెన్నతో సహా తినిపిస్తానని కౌసల్య రాముడిని బుజ్జగించినప్పటికీ, లక్ష్మణుడు తనపక్కనలేకపోతే-ఆయన ముందు భుజించకపోతే, అన్నాన్ని వేలేసైనా ముట్టడు శ్రీరాముడు. ముందుగా లక్ష్మణుడు నిద్రపోకపోతే తానూ నిదురించడు. ప్రాణాధారాలైన నిద్రాహారాల పై ప్రీతికంటే, శ్రీరాముడికి లక్ష్మణుడిపైనే అతిశయ స్నేహముండేది. శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడు సేవించడం కేవలం ఇంట్లో వున్నప్పుడు మాత్రమే కాదు. ఇతరుల సహాయం కోరకుండా, గొప్ప పరాక్రమం - అసహాయ శూరత్వంతో గుర్ర మెక్కి అడవికి వేటకై శ్రీరాముడు వెళుతుంటే, నీడలాగా లక్ష్మణుడు, శరశరాసనపాణిగా తోడుంటాడు. భక్తి రసావేశంతో అన్నను విడిచి ఒక్క క్షణమైనా ఏమరకుండా, వెంటనే వుంటాడు. రాముడంతటి గొప్పవాడికి, పరాపేక్షలేనివాడికి, తన సహాయమెందుకని అనుకొనేవాడుకాదు లక్ష్మణుడు. సేవచేయించేది స్నేహభావం కాని, సామర్థ్య జ్ఞానం కాదు. శక్తివంచన లేకుండా చేయడమే ప్రధానం. లక్షణుడు ఎలా శ్రీరాముడి పై  ప్రీతితో - విశ్వాసంతో వుంటాడో, ఎట్లా ఆయన సేవ చేస్తాడో, అదేవిధంగా, ఆయన తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి పట్ల ప్రవర్తించేవాడు. తన ప్రాణంకంటే కూడా భరతుడి ప్రాణాలే శత్రుఘ్నుడికి ప్రియమైనవి. భరతుడు కూడా అలాగే శత్రుఘ్నుడి విషయంలో వుండేవాడు.

రాజనీతి చక్కగా తెలిసినవారు - సరైన సమయంలో ఉపనయనం చేయబడినవారు - హేయ గుణాలు లేనివారు - సమస్త విద్యలు నేర్చినవారు - చెడు కార్యాలు చేయడమంటే సిగ్గుపడేవారు - కీర్తివల్ల లోకమంతా అందరికీ తెలిసినవారు - శూరులు - తమ తేజస్సుతో సూర్యుడిని జయించినవారు - శాస్త్రాది విద్యల్లో పండితులు -మన్మధుడి లాంటి సౌందర్యం కలవారు - పితృశుశ్రూషాపరులైన తన నలుగురు కుమారులకు వివాహం చేయాలనుకున్న దశరథుడు, బాగా ఆలోచించి, తన గురువులను - బంధువులను - తన హితమందు ఆసక్తి గల వారిని - మంత్రులను చూచి, కొడుకులకు తగిన రాచకన్నెలు ఏ రాజ్యంలో వున్నారో చెప్పమని అడుగుతాడు.

 

No comments:

Post a Comment