Monday, May 3, 2021

శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథా సంగ్రహం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథా సంగ్రహం

వనం జ్వాలా నరసింహారావు

(పోలవరపు శ్రీహరిరావు వచన రచన ఆధారంగా)

శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటే గొప్పది. ఎత్తైన మేడలతోను, ఉద్యానవనాలతోను, తీర్చిదిద్దిన వీధులతోను, శిల్పకళతో ముచ్చటగా వుండే ఇళ్లద్వారాలతోను, పద్మినీ జాతి స్త్రీలతోను, స్వచ్చమైన కొలనులతోను, ఋతువులకు తగ్గ ఫలాలను ఇచ్చే వృక్షాలతోను, నానారకాల పక్షులతోను, సాయంకాలాలు గంపల్లో పూలు తెచ్చి అమ్మే పల్లెటూరి పడుచులతోను, ఇంకా అనేక వింతలతోను అలరారుతుంది శ్రీవిలుబుత్తూరు నగరం.

విలుబుత్తూరు నగర గృహస్థులు అతిథి, అభ్యాగతులకు మర్యాదలు చేయడంలో సాటిలేనివారు. ఆతిథ్యం స్వీకరించిన అతిథులు వెళ్లిపోతామంటే బంధువులు దూరమవుతున్నట్లు విచారించేవారు. అలాంటివారిలో అద్వైత సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించే పరమ భాగవతోత్తముడు విష్ణుచిత్తుడు ఒకడు. అద్వైత వాదంతో ఉత్తమ జీవితం గడుపుతూ భగవద్భక్తులకు సకల పరిచర్యలు, మర్యాదలు జరుపుతూ, దేవుడి చేతులకు, చరణాలకు తులసీదళాల మాలలు అలంకరిస్తూ విష్ణుచిత్తుడు గృహస్థుడిగా సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడు. అతడి ఇంటిలో అర్థరాత్రి దాటేదాకా పురాణ పారాయణం, దైవ సంకీర్తనం వినిపించేది.

ఇదిలా వుండగా, దక్షిణ భారతదేశంలో మధురాపురం అనే ప్రసిద్ధమైన మహానగరం సకల సౌభాగ్యాలతో నిండి వుండేది. ఆ నగరంలో పూలు, పూలమాలలు అమ్మే కన్యల చమత్కారాలు వర్ణించలేని ఆనందాన్ని ఇస్తాయి. ప్రణయభావాలు రేకెత్తించే చమత్కార సంభాషణలతో యువకులను వివశులను చేసి తమ పూల దండలను విరివిగా అమ్ముకుంటారు. శీలం చెడకుండా ప్రవర్తించే గడుసువారు ఆ యువతులు. కాకపోతే చూసేవారిలో కోరికలు ఊరిస్తూ వుంటారు. మధురానగరంలో వేశ్యలు మరీ అప్సరసలు. రతీమన్మథ శాస్త్రాలలో పారంగతులు వారు. ఆ నగరంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులు. యజ్ఞాయాగాలు చేసేవారు. ఆ నగర బ్రాహ్మణులు చేయి చాచి దానం పట్టరు. ఆ నగరంలోని రాకుమారులకు మంత్రకవచం తప్ప యుద్ధకవచం అక్కరలేదు. భుజబలాన్ని చూసి కాకుండా బుద్ధిబలాన్ని చూసి గౌరవిస్తారు. ఆ పట్టణంలోని వెనుకబడిన వర్గాల వారు పొలాలు దున్ని ధాన్యరాశులు పండించుకుంటారు.

ఆ నగరాన్ని మత్స్యధ్వజుడు అనే చంద్రవంశపు రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు రాజనీతి విశారదుడు. పాండ్యవంశ వారసుడు. సామ, దాన, భేద, దండోపాయాలతో పాటు షడ్గుణాలలో చక్రవర్తి. ఆయన కీర్తి దేవలోకందాకా వ్యాపించింది. గ్రీష్మఋతువు ప్రవేశించగానే ప్రకృతి పరవశంతో పాటు, ఆ నగరంలో కొండమీద వున్న దేవుడికి తెప్ప తిరునాళ్ల ఉత్సవం వచ్చింది. తిరునాళ్లను చూడడానికి వచ్చిన పరదేశ బ్రాహ్మణుడు ఒకడు మధురానగరి వైభవాలను చూస్తూ ఆనందించ సాగాడు. రాజపురోహితుల ఇంటి ఆతిథ్యం స్వీకరించాడు. ఆ తరువాత భక్తుల కోరిక మీద సూక్తులు పాడడం మొదలెట్టాడు. అందులోని ఒక సూక్తి, అదే సమయంలో రాజు మత్స్యధ్వజుడు వేశ్య భోగిని ఇంటికి పోతుండగా, ఆయన హృదయానికి సూటిగా తగిలింది. తన ప్రవర్తనకు విచారించాడు.

తాను ఇంతకాలం ఇంద్రియ సుఖాలే ముఖ్యమనుకున్నాని, ఇక ముందు పరలోక సుఖాలకోరకు కృషి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు రాజు మత్స్యధ్వజుడు. ఒక తలారి ద్వారా తన వేలికున్న ముద్రికను ఆ పరదేశి బ్రాహ్మణుడికి పంపాడు. తాను అంతఃపురంలోకి పోయాడు. మర్నాటి సభలో హాజరైన వేదవేదాంత తత్త్వవేత్తలను, పండితులను, గురువులను శాశ్వతంగా, సులభంగా మోక్షాన్నిచ్చే దేవుడు ఎవరని ప్రశ్నించాడు. సభలోని వారు ఒకరు శివుడని, మరొకరు శ్రీహరి అని, ఒకరు పార్వతి అని, ఇంకొకరు అగ్ని అని రకరకాలుగా వాదించారు. రాజును ఎవరూ నమ్మించలేకపోయారు.

మదురానగరంలో ఇలా చర్చ జరుగుతున్నప్పుడు శ్రీవిలుబుత్తూరులోని విష్ణుచిత్తుడు తన నిత్యాచారం ప్రకారం తులసి మాలలు కట్టి దేవాలయంలోని మన్ననారు స్వామికి సమర్పించడానికి పోయాడు. అతడిని వెంటనే మధురానగరం పొమ్మని స్వామి అంటూ, అక్కడి పాండ్యరాజు కొలువులో జరుగుతున్న శుష్కవాదాలను ఓడించి, తన మహిమను చాటి, అందరినీ గెలిచి బహుమతి తీసుకొమ్మని చెప్పాడు. దేవుడు మాట్లాడగానే ఆశ్చర్య పోయాడు విష్ణుచిత్తుడు. పాండ్యరాజు సభలో అతడు గెలిచేట్లు చేసే బాధ్యత తనదని, ఆయన నిమిత్తమాత్రుడే అని చెప్పాడు. విష్ణుచిత్తుడు వెళ్లిపోయాడు.

మధురానగరం పోయిన విష్ణుచిత్తుడు రాజసభలో ప్రవేశించగానే ఆయనకు అంతా గౌరవాభినందనలు చేశారు. రాజుగారు ఆయన్ను ఒక బంగారు పీఠం మీద కూచోబెట్టాడు. సభలోని వారందరి వాదనల్లోని తప్పులను ఎత్తి చూపాడు విష్ణుచిత్తుడు. అందరి వాదాలనూ ఓడించాడు. చివరకు, విశిష్టాద్వైతవాదం పరకారం యాత్ర దేవుళ్లు అంతా విష్ణుదేవుడి అంశలేనని నిరూపించసాగాడు. అందువల్ల అంశమాత్రులైన ఇతరులను పూజించడం కన్నా మోక్షకాముకులు పరిపూర్ణుడైన నారాయణుడిని కొలవడం ఉత్తమం అని తేల్చాడు. ఈ సందర్భంగా ఖాండికధ్వజుడు, కేశిధ్వజుడు అనే అన్నదమ్ముల కథ చెప్పాడు.


నిమివంశంలో ధర్మద్వజుడు, కృతధ్వజుడు అనే ఇద్దరు అన్నదమ్ములకు ఖాండికధ్వజుడు, కేశిధ్వజుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వీరిలో ఖాండికధ్వజుడు కార్యశూరుడు కాగా, కేశిధ్వజుడు విజ్ఞాని. పెరిగి పెద్దైన తరువాత వారిలో ఒకరంటే ఇంకొకరికి అసూయ పెరిగింది. రాజ్యకాంక్ష పెరిగి యుద్ధానికి తలపడ్డారు. చివరకు ఖాండికధ్వజుడి సైన్యాన్ని ఓడించి కేశిధ్వజుడు విజయం సాధించాడు. ఖాండిక్యుడు తన పరివారంతో సహా అరణ్యాలకు పోయి అక్కడ వుండసాగాడు. కేశిధ్వజుడు గెలిచినప్పటికీ సోదరుడి రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా తాను మృత్యువును, పునర్జన్మను జయించాలని యోగ నిష్టతో యజ్ఞాయాగాలు చేస్తూ వ్రతదీక్షలో మునిగిపోయాడు.

యజ్ఞంలో బలిపశువుగా రాజు పెంచుకున్న ఆవు ప్రమాదవశాన పులినోట చిక్కి కొనవూపిరితో వుండడంతో తన యజ్ఞం ఆగిపోతుందేమోనాన్న భయం పట్టుకుంది రాజుకు. ఏంచేయాలని యజ్ఞం చేయిస్తున్న మునులను అడిగాడు. ఆ ధర్మసూక్ష్మం అరణ్యాలలో వున్న ఖాండిక్యుడికి మాత్రమే తెలుసునని అనగానే అతడి దగ్గరికి సపరివారంగా బయల్దేరాడు కేశిధ్వజుడు. అలా వస్తున్న అతడిని, సైన్యాన్ని చూసి, మొదట్లో ఖాండిక్యుడికి, తనమీద యుద్ధానికి వస్తున్నాడేమోనని సోదరుడి మీద అనుమానం వేసింది.  కాని అతడొచ్చిన పని చెప్పిన తరువాత మంత్రులను సంప్రదించి, తన నిర్ణయంగా సోదరుడికి సహాయం చేయడానికే నిశ్చయించుకున్నాడు. యాగానికి ఉద్దేశించిన ఆవు చనిపోతే చేయాల్సిన ప్రాయశ్చిత్తాన్ని ఖాండిక్యుడు తన సోదరుడికి చెప్పాడు. ఆ తరువాత కేశిధ్వజుడు తన వ్రతం పూర్తి చేసుకున్నాడు.

ఆ తరువాత గురుదక్షిణ ఇవ్వాలని అనుకున్నాడు కేశిధ్వజుడు. మళ్లీ అడవికి వెళ్ళాడు. ఖాండిక్యుడిని కలిసి గురవైన అతడికి ఏమి ఇవ్వమంటారో సెలవివ్వమని అడిగాడు. ఆధ్యాత్మిక చింతన కలవాడైన కేశిధ్వజుడిని తనకు మోక్షాన్ని ఇచ్చే విద్యను గురుదక్షిణగా బోధించమని చెప్పాడు. తన రాజ్యం కోరకుండా విద్యను కోరినందుకు సోదరుడిని అభినందిస్తూ, కేశిధ్వజుడు ఆ విద్యను నేర్పాడు. తత్త్వబోధ చేశాడు. ఆ తరువాత సోదరుడి కోరిక మేరకు కేశిధ్వజుడు యోగవిద్యను గురించి కూడా వివరించాడు. చెప్పాల్సినదంతా చెప్పిన తరువాత తన రాజ్యాన్ని కూడా తీసుకోమ్మన్నాడు. ఖాండిక్యుడు రాజ్యాన్ని స్వీకరించి, తన కొడుక్కు పట్టాభిషేకం చేసి, ప్రజలందరినీ సక్రమంగా పాలించమని చెప్పి, అడవులకు పోయి, అక్కడే భక్తి యోగాభ్యాసం చేసి, విష్ణుమూర్తిని మనసులో దర్శించి, విష్ణువులో కలిసిపోయాడు.

ఈ కథను పాండ్యరాజైన మత్స్యధ్వజుడికి చెప్పిన విష్ణుచిత్తుడు, ఆయన్ను కూడా విష్ణుమూర్తిని జపించి తరించమని అన్నాడు. రాజుగారి చెవిలో అద్వైతమాట మంత్రాన్ని రెండు అక్షరాలలో చెప్పి విష్ణుభక్తుడిగా మార్చి వేశాడు. మత్స్యధ్వజుడు ఆయనకు అనేక బహుమతులు అందచేశాడు. ఓటమిపాలైన పండితులు కూడా ఆయన్ను పొగిడారు, ప్రశంసించారు. రాజాజ్ఞాప్రకారం విష్ణుచిత్తుడిని ఉరేగింపుగా సాగనంపమని చెప్పగా వారు అలాగే చేయడంతో స్వదేశానికి పోసాగాడు.

విష్ణుచిత్తుడి భక్తియుక్తులకు మెచ్చిన విష్ణువు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. విష్ణుచిత్తుడు తనకు సాక్షాత్కారమైన శ్రీహరిని పరిపరి విధాలుగా స్తుతించాడు. శ్రీహరి అతడిని ఆశీర్వదించి స్వర్గానికి పోయాడు. విశ్వకర్మను పిలిచి విష్ణుచిత్తుడి ఇంటిని సుందర సౌధంగా చేయమని ఆదేశించగా అతడు అలాగే చేశాడు. పురప్రవేశం చేసిన విష్ణుచిత్తుడికి పురప్రముఖులు బ్రహ్మరథం పట్టారు. ఊరేగింపు జరపసాగారు. విష్ణుచిత్తుడు ముందుగా మన్ననారు దేవాలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించి, తన ఇంటికి పోయాడు. ఆ మహాసౌదాన్ని చూసి శ్రీమన్నారాయణుడి కృపవల్ల తనకు సిరిసంపదలు లభించాయని భావించాడు.

ఈ నేపధ్యంలో ఒకనాడు మన్ననారు దేవాలయంలోని విష్ణుమూర్తి విష్ణుచిత్తుడిని ప్రశంసిస్తూ, ఆయనలాంటి మరో వ్యక్తైన యామునాచార్యుడి ప్రసక్తి తెచ్చాడు లక్ష్మీదేవి దగ్గర. అతడి వివరాలు చెప్పమని కోరింది లక్ష్మీదేవి. సమాధానంగా శ్రీహరి ఇలా చెప్పాడు. మధురానగరంలో నాదముని అనే భక్తుడికి మనుమడుగా పుట్టిన యామునాచార్యుడు పరమ భక్తుడు. అప్పట్లో పాండ్యరాజ్యాన్ని పాలిస్తున్న రాజు శైవమత పక్షపాతి. శ్రీహరి విగ్రహాలను పూజించరాదని కట్టడి చేశాడు. దేవాలయాలను పాడు చేశాడు. పాండ్యరాజు భార్య మాత్రం విష్ణు భక్తురాలు. విష్ణు వ్రతాలు చేసేది. విష్ణు భక్తులను కాపాడాలనే ఆలోచన, రాజు వారిని గౌరవించేలా చేయాలన్న భావన శ్రీహరికి కలిగింది. హరిభక్తిని చాటడానికి యామునాచార్యుడిని నియమించాలనుకున్నాడు. రాజు కొలువులో విష్ణు తత్త్వమే పరమ తత్త్వమని వాదించడానికి యామునాచార్యుడు రాణి సహాయం కోరాడు. ఆమె రాజును ఒప్పించింది.

మర్నాడు యామునాచార్యుడు సభలో ప్రవేశిస్తూ అక్కడే మొలచిన రావిచెట్టుకు నమస్కారం చేసి తాను చేయబోయే వాదనకు ఆ చెట్టే సాక్షి అని అన్నాడు. యామునాచార్యుడు ఆ సభలో వున్న అందరి వాదాలను ఒక్కొక్కటిగా సహేతుకంగా ఖండించి విష్ణుమూర్తే పరమాత్మ అని, విశిష్టాద్వైతమే గొప్ప మతం అని నిరూపించాడు. అదే సమయంలో సింహద్వార సమీపంలో ఉన్న రావిచెట్టు అదే విధంగా పలికింది. రాజుగారు యామునాచార్యుడిని మెచ్చుకున్నారు. ఆయనకు సాష్టాంగనమస్కారం చేసి, పూజించి, హరిభక్తి మంత్రోపదేశం పొందాడు. యామునాచార్యుడికి తన చెల్లెలినిచ్చి వివాహం కూడా చేశాడు. అర్థరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. భక్తితో శ్రీహరిని సేవించసాగాడు. రాజ్యాధికారం చేపట్టిన యామునాచార్యుడు దండయాత్రలు చేసి దిగ్విజయుడై రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత జరిగిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా యజ్ఞయాగాదులు చేశాడు.

యామునాచార్యుడు ఆధ్యాత్మిక విశేషాలు మరచిపోయి రాజ్యభోగలాలసుడై మోక్షానికి దూరం అవుతున్నాడని శ్రీరామమిశ్రుడు అనే అతడు భావించాడు. అతడిని సంస్కరించాలనుకున్నాడు. ఒకనాడు రాజును కలిసి, ఆయన పూర్వులు సంపాదించిన నిధి నిక్షేపాలు, హిందూ మహాసముద్ర జలాల మధ్య దాచబడి వున్నాయని వాటిని చూపించదానికి వచ్చానని చెప్పి రాజును సపరివారంగా, సకుటుంబ సమేతంగా తనతో తీసుకు పోయాడు. అంతా శ్రీరంగం చేరి, కావేరీ చంద్ర పుష్కరణి స్నానం చేసి, శ్రీరంగనాథుడి దర్శనం చేసుకుని పూజించారు. అదే నిక్షేపం అని చెప్పాడు శ్రీరామమిశ్రుడు. రంగనాథుడి పాదపద్మాలు చూపించాడు. వెంటనే యామునాచార్యుడికి పూర్వాశ్రమ జ్ఞానం కలిగింది. వెంటనే కొడుక్కు రాజ్యం అప్పగించి, రాజనీతి బోధించి, సన్న్యాసాశ్రమం స్వీకరించాడు. విష్ణుభక్తితో జీవితాన్ని గడిపాడు.

ఇదే తన భక్తుల ప్రభావం అని చెప్పాడు శ్రీహరి లక్ష్మీదేవికి.

ఇదిలా వుండగా, విష్ణుచిత్తుడి జీవితంలో కొత్త ప్రకరణం ప్రారంభం అయింది. ఒకనాడు అలవాటు ప్రకారం తులసీదళాలు కోస్తుంటే, తులసి చెట్ల గుబురు మధ్య ఒక ఆడ శిశువు మెరిసిపోతూ కనిపించింది. బిడ్డలు లేని తనకు విష్ణుమూర్తే బిడ్డను ఇచ్చాడని అనుకుంటూ ఆ శిశువును ఎత్తుకుని ముద్దాడుతూ ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చాడు. అల్లారుముద్దుగా పెరిగిన ఆమె యౌవనవతి అయింది. ఆమె విష్ణుచిత్తుడికి దొరికిననాడే మురాళిక, ఏకావళి, హరిణి, మనోజ్ఞ, స్రగ్విణి అనే నాగకన్యలు కూడా పుట్టి ఆమెతో పాటే పెరిగారు. స్నేహితులయ్యారు. విష్ణుచిత్తుడి కూతురు విష్ణువు మీద, ఆయన అవతారమైన శ్రీకృష్ణుడి మీద ప్రేమభావాన్ని పెంచుకోసాగింది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్నది.

ఆముక్తమాల్యద అనే పేరుకల ఆ కన్య అనునిత్యం ఒక వింతపని చేస్తూ వుండేది. తండ్రి దేవుడి కొరకు కట్టిన పూలమాలలను తాను అలంకరించుకొని  విష్ణువును తలచుకునేది. నీళ్లలో తన అందాన్ని చూసుకునేది. విరహం పొందేది. తండ్రికి తెలియకుండా ఆ మాలలను బుట్టలో వేసేది. తన తండ్రి తన విషయం తెలియక మరెవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తే, మరో జన్మలోనైనా శ్రీకృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానని అనేది స్నేహితురాళ్లతో. ఆమె భర్త ఎక్కడో లేడని, శ్రీరంగంలో ఉన్నాడని, తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని, రంగనాథుడిని పూజించమని సలహా ఇచ్చారు చెలికత్తెలు. ఆనాటి నుండి ఆ కన్య విష్ణువునే ప్రియుడిగా తలచుకుంటూ ప్రేమగీతాలు పాడసాగింది. సూర్యోదయానికి ముందే లేచి పూలమాలలు పట్టుకుని దేవాలయానికి వెళ్లేది. ఇంటికి వచ్చి ఎప్పుడూ ప్రియుడి గురించి ద్రావిడ భాషలో పాటలు రాసి పాడుకుంటూ వుండేది. అలా, అలా ఆముక్తమాల్యదలో విరహతాపం ఎక్కువైంది.    

కూతురు ముఖం రోజురోజుకూ వాడిపోవడం చూసిన విష్ణుచిత్తుడి మనస్సు తరుక్కుపోయింది. వెంటనే దేవాలయానికి వెళ్లి దేవుడి విగ్రహానికి తన బాధను చెప్పుకున్నాడు. మన్ననారు ఆ భక్తుడి అమాయకతకు చిరునవ్వు లొలికిస్తూ మాలదాసరి కథ చెప్పాడు. అతడెలా తన కులవృత్తి చేసుకుంటూనే తనను కీర్తించినదీ, తన విగ్రహాన్ని అలంకరించేదీ, తన సేవకు పాటలు పాడేదీ,                                తన కైంకర్య ప్రసాదాన్ని దూరం నుండే ఎలా కళ్లకద్దుకుని తీసుకునేదీ వివరించాడు శ్రీహరి. ఒకనాడు చీకటిలో దేవాలయానికి వస్తుండగా ఎలా కుంభజానుడు అనే రాక్షసుడు చేతికి చిక్కినదీ, అతడితో ఎలా పోరాడినదీ, ఓటమి పాలైనదీ, తనను ఆహారంగా తీసుకుంటానని బెదిరించగా రాక్షసుడిని ఒప్పించి  వైకుంఠదేవాలయానికి వెళ్లి వచ్చినదీ, అక్కడ వ్రతం పూర్తి చేసుకున్నదీ చెప్పాడు శ్రీహరి విష్ణుచిత్తుడికి.

దాసరి చీకట్లో అడవి దాటడానికి రాక్షసుడు సహాయం చేశాడు. దాసరి గుడికి వెళ్లి భక్తిశ్రద్ధలతో సంకీర్తనచేసి తిరిగివచ్చి తనను ఆహారంగా తీసుకొమ్మని రాక్షసుడి ఎదుట నిలిచాడు. ఆ బ్రహ్మరాక్షసుడు దాసరి సత్యసంధతకు ఆశ్చర్యపోయాడు. వెంటనే దాసరి చుట్టూ ప్రదక్షిణ చేసి సాష్టాంగనమస్కారం చేశాడు. తనకు శాప విముక్తిని కలిగించమని వేడుకున్నాడు. తాను పూర్వ జన్మలో సోమశర్మ అనే బ్రాహ్మణుడినని శాపవశాన ఇలా అయ్యానని చెప్పాడు. దాసరి ఆయన చేసుకున్న పుణ్యాన్ని ధారపోస్తే తనకు శాప విముక్తి కలుగుతుందన్నాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా చివరకు అంగీకరించాడు మాలదాసరి. పుణ్యం, ఫలం అనేవి తనకు తెలియవని, అవి భగవంతుడికే తెలుసని, కాబట్టి భగవంతుడే అతడిని రక్షిస్తాడని రాక్షసుడికి చెప్పాడు. అంతటితో రాక్షసుడు సోమశర్మగా మారిపోయాడు.  అతడు ముక్తిపొంది చివరకు తనలో చేరిపోయాడని శ్రీహరి చెప్పాడు విష్ణుచిత్తుడికి.

తాను చెప్పిన కథ తెలిసిన భూదేవి తనలో చేరాలనే కోరికతో, లక్ష్మితో సమానమవ్వాలనే కోరికతో విష్ణుచిత్తుడికి కూతురై తననే ప్రేమించి విరహతాపం పొందుతున్నదని చెప్పిన మన్ననారు స్వామి, అతడి కూతురును శ్రీరంగం తీసుకెళ్లి స్వామికి అర్పించమని సూచించాడు. విష్ణుచిత్తుడు శ్రీరంగానికి కూతురుతో సహా పోయాడు. శ్రీరంగనాథుడికి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాడు. దేవుడిని కీర్తించాడు. శ్రీరంగనాథుడు ఆముక్తమాల్యద మీద తన మనసు ఆపుకోలేక, ఒక మాయా కన్యను సృష్టించి, విష్ణుచిత్తుడి ఇంట్లో వదిలేసి, అక్క వున్న ఆముక్తమాల్యదను తన ఆత్మలోకి తీసుకున్నాడు.

ఇంటికి వెళ్లిన విష్ణుచిత్తుడికి తన కూతురు కనిపించింది. మరికాసేపటికి శ్రీరంగనాథుడి పక్షాన పిల్లను ఇవ్వమని అడగడానికి బ్రహ్మ, శివుడు, పార్వతి, ఇంద్రుడు పెళ్లిపెద్దలుగా వచ్చారు. తన జీవితం ధన్యమైందని అన్నాడు విష్ణుచిత్తుడు. తమ ఇంటి ఆచారం ప్రకారం శ్రీరంగనాథుడు పెళ్లికొడుకై సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా తన ఇంటికే వచ్చి పెళ్లి చేసుకుని, భార్యను తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దేవతలు దానికి సమ్మతించారు. లగ్నం నిశ్చయించారు.

శ్రీవిలుబుత్తూరులో విష్ణుచిత్తుడు కూతురు పెళ్లికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశాడు. శ్రీమహావిష్ణువు పెళ్లికొడుకై గరుత్మంతుడి మీద ఊరేగుతూ వచ్చాడు. దేవతలంతా వచ్చారు. శాస్త్రోక్తంగా కన్యాదానం జరిగింది. విష్ణుమూర్తి ఆముక్తమాల్యద మెడలో మంగళసూత్రం కట్టాడు. అంతకు ముందు జీలకర్ర-బెల్లం పెట్టించారు. సప్తపది జరిపించారు. అరుంధతీ దర్శనం చేయించారు.  విష్ణుమూర్తి గోదాదేవిని భార్యగా తీసుకుని వైకుంఠానికి తరలి వెళ్లాడు. 

1 comment:

  1. అముక్తమాల్యద శ్రీరంగనాథుడి గురించి వేదన పొందింది అని తెలుసు కానీ ఇంత వివరముగా కథ తెలియదు.ఎంత చక్కగా వివరించారండీ, ధన్యవాదాలు.ఇంతకీ ఈ గ్రంధము వచనమా, కవిత్వమా?

    ReplyDelete