Sunday, May 2, 2021

బ్రహ్మాస్త్రంతో రావణుడిని చంపిన శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

 బ్రహ్మాస్త్రంతో రావణుడిని చంపిన శ్రీరాముడు

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (02-05-2021) ప్రసారం  

లంకలో రావణుడికి, ఆయన మంత్రులు, లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు మరణించిన వార్తను చెప్పారు. కొడుకు మరణ వార్త వినగానే రావణుడు స్మృతి తప్పి పడిపోయి, మరల తెలివి తెచ్చుకున్నాడు. పుత్రశోకంతో మనస్సు కలత చెంది, ఏడుస్తూ ఇలా అన్నాడు.

“ఔరా! కాలగతిని ఎవరైనా ఎరుగుదురా? ఎవరికైనా ఇదే మార్గం కదా. నీలాంటివాడు ఏమార్గంలో పోవాలనో ఆ మార్గంలోనే నువ్వు పోయావు. కాబట్టి నీకొరకు నేను దుఃఖపడను కాని, నావాడని చెప్పుకోవడానికి వీలుకాని నా దుస్థితికి, నా దీనదశకు ఏడుస్తున్నాను. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ప్రాణాలతో వుండగా, వారిని చంపకుండా, నాకు సుఖం కలిగించకుండా,  నన్నీవిధంగా తీవ్ర దుఃఖంలో పడవేసి నువ్వు మాత్రం ఊర్ధ్వలోకాలకు పోవడం న్యాయమా?  

         ఇలా ఏడుస్తూ రావణుడు  కోపంతో మండిపోతుంటే ఎండాకాలంలోని సూర్యుడిలాగా మండిపడ్డాడు. కోపాగ్నితో ఆయన ఎర్రటి కళ్ళు మరింత ఎర్రగా అయ్యాయి. వాడి శరీరం రుద్ర రూపం దాల్చింది. యముడి చూపుల్లాగా వున్న అతడి చూపులకు భయపడి రాక్షసులు గుంపులు కట్టి పరుగెత్తారు. అలా పోతున్న రాక్షసులను ఉద్దేశించి రావణుడు, పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా రాక్షసులను ఉద్దేశించి మాట్లాడాడు. బ్రహ్మ ఇచ్చిన విల్లు, బాణాలు ధరించి యుద్ధభూమిలో తాను నిలబడితే ఇంద్రుడైనా తనను గెల్వగలడా? ఇక రామలక్ష్మణులు నాకొక లెక్కా? సూర్యుడితో సమానమైన బాణసమూహాలను వేసి రామలక్ష్మణులను నరికి వేస్తాను అని అన్నాడు.  

ఇలా అంటూనే, రావణుడు తన మంత్రులతో, భార్యలతో అశోకవనం దిక్కుగా సీతను చంపడానికి పరుగెత్తాడు.  ఇది గమనించిన సుపార్శ్వుడు అనే మంత్రి రావణుడి దగ్గరికి పోయి కొన్ని మంచిమాటలు ఇలా చెప్పాడు. “నీకోపాన్ని రామచంద్రుడి మీద చూపి ఆయన్ను గెలిస్తే లోకం నిన్ను శూరుడివని మెచ్చుకుంటుంది కాని, ఏ అపార్ధం చేయని, నీ మీదకు యుద్ధానికి రాని, నీకు ఏకీడు చేయని ఆడదాన్ని చంపితే నిన్ను పౌరుషశాలి అని ఎవరంటారు? సేనతో పోయి రాముడితో యుద్ధం చేసి ఆయన్ను చంపు. నువ్వే శూరుడివై, ధీరుడివై, సాయుధిడివై పోయి యుద్ధం చేసి జయించు. నీ కోరిక నెరవేరుతుంది. సీత నీకు స్వాధీనపడుతుంది” అని అంటాడు.

ఇలా సుపార్శ్వుడు చెప్పడంతో చెడ్డ మనస్సు కలవాడైనప్పటికీ రావణుడు ధర్మంతో కూడిన మంత్రి మాటలు మన్నించి ఇంటికి పోయి మంత్రులతో కూడి సభ తీర్చి, సమాలోచన చేశాడు. చతురంగ సైన్యంతో వాళ్లను యుద్ధానికి పోయి వానరులతో యుద్ధం చేయకుండా కేవలం రాముడిని మాత్రం చుట్టుకుని శరవర్షాలతో ముంచి చంపండని చెప్పాడు. రావణుడు ఇలా చెప్పగానే మూల సైన్యమంతా ఆయన మాటలకు అంగీకరించి వెళ్లి వానరులతో యుద్ధం చేశారు. ఇలా వానర-రాక్షస యుద్ధం జరుగుతుంటే, రామచంద్రమూర్తి శత్రుసమూహంలో ప్రవేశించి, జోరుమని బాణవర్షం కురిపించాడు. రాక్షస సైన్యం పీనుగులతో యుద్ధభూమి నిండిపోయింది. రామచంద్రమూర్తి గంధర్వాస్త్రం ప్రయోగించి శత్రువులమీద వేయగా వారు దిగ్భ్రమ చెందారు. ఒకరినొకరు వారే చంపుకున్నారు. కామరూపులైన రాక్షసులను, రామచంద్రమూర్తి ఎవరి సహాయం లేకుండా, గంటన్నర సమయంలో నేలపాలు చేశాడు. చావగా మిగిలినవారు లంకకు పారిపోయారు.

రావణుడు పంపించిన మూల సైన్యమంతా రామబాణాలకు చావగా రాక్షస స్త్రీలు భోరున ఏడవడం జరిగింది. శ్రీరాముడి ఎదుట పడ్డవారిని ఎవరూ కాపాడలేరనీ, ఇక రావణుడు బతకడం జరగదనీ నిర్ణయించుకున్నారు. “ఈ రావణుడు బ్రహ్మను దేవ, పన్నగ, గరుడ, రాక్షసాదులతో  చావులేకుండా వరాలు కోరి మనుష్యులు తననేమీ చేయలేరని వారి చేతుల్లో చావు లేకుండా వరాలు కోరలేదు. దాని ఫలమే ఇప్పుడు వాడి చావుకు దారితీస్తున్నది. ఇదొక్క రావణాసురుడితో ఆగదు. సర్వ రాక్షసులు నాశనం కావాల్సినవారే. సీత. రావణుడి వంశనాశనం చేయడానికి వచ్చింది” అని చెప్పుకుంటూ రాక్షస స్త్రీలు ఒకరినొకరు పట్టుకుని దుఃఖపడుతూ, గొంతెత్తి బిగ్గరగా ఏడ్చారు.

         రాక్షస స్త్రీల ఏడుపు రావణుడి చెవినపడ్డది. నిట్టూర్పులు విడుస్తూ యుద్ధానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పాడు రావణుడు. వాడు యుద్ధానికి బయల్దేరి పోతుంటే అంతటా అపశకునాలు కనిపించాయి. ఆ అపశకునాల మధ్య, మృత్యువు ప్రేరణతో, జయిస్తానన్న అజ్ఞానంతో, రావణుడు సైన్యంతో యుద్ధానికి కదిలాడు తన సేనతో. వారి రథాల ధ్వనులు, వారి అరుపులు విని వానరులు ఇనుమడించిన ఉత్సాహంతో రాక్షసులను ఎదిరించారు. ఇరువురికీ భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు రావణుడు యుద్ధం మధ్యలోకి పోయి తన విల్లును సంధించి, కపిసేనను నాశనం చేశాడు.

         రావణాసురుడు తన రథాన్ని రామచంద్రుడి వైపు తోలమన్నాడు. వాడు అలా పోవడం చూసిన సుగ్రీవుడు పరాక్రమించి రాక్షసుల మీద యుద్ధం చేశాడు. ఆయన దెబ్బకు రాక్షసుల గుంపు బలం చెడి నేలకూలింది. అప్పుడు విరూపాక్షుడు సుగ్రీవుడి మీద బాణాలను వేశాడు. సుగ్రీవుడు రాక్షసుడిని పిడికిటితో గట్టిగా కొట్టగా ఆ దెబ్బకు విరూపాక్షుడు నెత్తురు కక్కుకుంటూ చావుకేక వేసి కిందపడ్డాడు. ఈ విధంగా విరూపాక్షుడు చావగా రాక్షసులు దుఃఖపడ్డారు. ఆ తరువాత సుగ్రీవుడు తనతో యుద్ధానికి దిగిన మహోదరుడి తల నరికాడు. సుగ్రీవుడి చేతిలో మహోదరుడు చావడంతో మహాపార్శ్వుడు అంగదుడితో యుద్ధానికి దిగాడు. అంగదుడు వజ్రంలాంటి గట్టి పిడికిలి పట్టి రాక్షసుడి హృదయం మీద గుద్దాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడు ప్రాణాలుపోయి నేలమీద పడ్డాడు. యుద్ధానికి వచ్చిన నలుగురు ముఖ్య యోధుల్లో రావణుడు తప్ప మిగిలిన ముగ్గురూ చావడం చూసి వానరులు సింహనాదాలు చేయగా ఆ ధ్వనికి లంకా నగరం గడగడ వణికింది.

ఆ ధ్వనికి రావణుడు కలతచెంది వానరులమీదికి యుద్ధానికి పోయాడు. రాముడిని సమీపించిన రావణుడితో మొదలు లక్ష్మణుడు యుద్ధం చేశాడు కాసేపు. లక్ష్మణుడి బాణాలు ఖండించి రావణుడు ఆయన్ను దాటుకుని రాముడిమీద వాడి బాణాలు వేగంగా వేయడంతో శ్రీరాముడు వాటిని అణిచి వందలకొద్దీ బాణాలను రావణుడి మీద వేశాడు. ఆ ప్రకారం ఇరువురూ అసమానమైన, అద్భుతమైన బాణసమూహాలను ఒకరిపై మరొకరు ప్రయోగించారు. సర్వాస్త్రాలు తెలిసన రామచంద్రమూర్తి రాక్షసుడి నొసలు చీల్చేట్లు ఐదు బాణాలను వేయగా, రావణుడు వాటిని కొట్టి ఆసురాస్త్రాన్ని వేశాడు. దానికి విరుగుడుగా రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది రావణుడి అస్త్రాన్ని నాశనం చేసింది. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడారు. రాముడితో సమానంగా యుద్ధం చేస్తున్న రావణుడిని చూసి సహించలేక లక్ష్మణుడు యుద్ధంలోకి దిగాడు.

         మండోదరి వివాహ సమయంలో మయుడు తన శక్తితో కల్పించి, రావణుడికి ఇచ్చిన “శక్తి” ని రావణుడు రాముడి తమ్ముడు లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ బాణం లక్ష్మణుడి వక్షంలో నాటుకుంది. వెంటనే లక్ష్మణుడు మూర్ఛపోయి నేలకూలాడు. లక్ష్మణుడి రొమ్ములో నాటుకున్న రావణ శక్తిని అవలీలగా బయటకు లాగి తునకలు చేశాడు రాముడు. సుగ్రీవాంజనేయులను చూసి లక్ష్మణుడిని హెచ్చరికగా చూసుకొమ్మని అంటాడు. తాను రావణుడిని సంహరిస్తానని చెప్తాడు. ఇక రాముడో, రావణుడో తేలిపోవాలి అని అంటాడు. ఇలా అంటూ శ్రీరాముడు వాడి బాణాలను రావణుడి దేహంలో గుచ్చుకునేట్లు వేశాడు. నిప్పులు కక్కే బాణాలను రావణుడి మీద వేయగా, వాడు ధైర్యం చెడి ఇక అక్కడ వుంటే చావడం ఖాయమని లంకలోకి పారిపోయాడు.

ఆ తరువాత తమ్ముడు లక్ష్మణుడి పరిస్థితి చూసి శ్రీరాముడు కన్నీరు కార్చాడు. కన్నీరు కారుస్తున్న రామచంద్రమూర్తిని ఓదారుస్తూ సుశేణుడు, ఆయనతో లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడు చనిపోలేదని ఇలా చెప్పాడు. ఇలా చెప్పి, హనుమంతుడితో,  వేగంగా దక్షిణ కూటం పోయి, లక్ష్మణుడి దేహంలో నాటుకున్న ములుకులు వూడతీయడానికి విశల్య కరణిని, లక్ష్మణుడిని జీవింప చేయడానికి అక్కడే వున్న సవర్ణకరణిని, సంధాన కరణిని తీసుకునిరా” అని చెప్పాడు. వెంటనే హనుమంతుడు అక్కడికి పోయి, ఓషధులున్న స్థలాన్ని తెలుసుకోలేక, వెతకడానికి ఏమాత్రం ఆలశ్యం చేయకుండా, కొండనే పీక్కుని పోదామని నిర్ణయించుకుని, దాన్ని పెళ్లగించి, ఎత్తుకుని, ఆకాశానికి ఎగిరి, వానరుల మధ్యకొచ్చాడు. హనుమంతుడు రాగానే సుశేణుడు ఆ మందుల తీగెను కొండనుంచి బయటికి తీశాడు. సుశేణుడు తాను తీసిన ఔషధులను లక్ష్మణుడికి వాసన చూపించాడు. వెంటనే అతడు సంతోషంగా మూర్ఛనుండి తేరుకున్నాడు.

         ఇంతలో లంకకు పారిపోయిన రావణుడు ఒక రథాన్ని సిద్ధం చేసుకుని, యుద్ధానికి వచ్చి, శ్రీరాముడిని బాణాలతో కొట్టసాగాడు. శ్రీరాముడు కూడా వాడికి తన బాణాలతో సమాధానం చెప్పాడు. వారిరువురి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడి ఆజ్ఞానుసారం మాతలి రథాన్ని తీసుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కాడు. “దేవా! నీ గెలుపు కోరి ఇంద్రుడు ఈ రథాన్ని పంపాడు. దీనిమీద ఎక్కు. రథంతో పాటు రావణుడిని చంపడానికి ఐంద్రధనస్సును, అగ్నితో సమానమైన కాంతికల కవచాన్ని, సూర్యకాంతికల బాణ సమూహాన్ని, మెరుపులాంటి ఈ శక్తిని పంపాడు. తీసుకో. నేను నీకు సారథిగా వుండగా ఈ రావణుడిని చంపు” అని అన్నాడు. ఆ రథం ఎక్కి యుద్ధానికి సిద్దమైన రాముడు, తన అన్ని అస్త్రాలనూ మనస్సులో తలచుకున్నాడు రామచంద్రుడు. ఆ అస్త్రాలను ఒకటి వెంట మరొకటి రావణుడి మీద ప్రయోగించగా వాటి దెబ్బకు వాడు బలహీనుడై భయపడి తల్లడిల్లి పోయాడు. చేతిలో విల్లు పట్టుకోలేక పోయాడు రావణుడు. చావడానికి సిద్ధంగా వున్న రావణుడి దుస్థితి చూసిన సారథి ఇక వాడక్కడే వుంటే చావు ఖాయమని రథాన్ని దూరంగా తీసుకుపోయాడు.

రావణుడి రథాన్ని సారథి దూరంగా తీసుకుపోయినప్పుడు, ఆ తరువాత కార్యం ఏమిటా అని రామచంద్రమూర్తి ఆలోచన చేస్తున్నప్పుడు, అగస్త్యుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశిస్తాడు. అది చదువుతే విజయం చేకూరుతుందని చెప్పాడు.

         యుద్ధభూమికి దూరంగా రథాన్ని తోలుకుపోయిన సారథిని చూసి రావణుడు (మరణం సమీపిస్తుండగా) కళ్లెర్రచేసి, కోపంగా దూషించాడు. రావణుడు మేలు కోరి అలా చేసిన సారథిని పరుషంగా మాట్లాడడంతో సారథి హితమైన మాటలతో జవాబిచ్చాడు. ఆయన మేలు, క్షేమం కోరి అలా చేసానన్నాడు. సారథి మాటలకు సంతృప్తి చెందిన రావణుడు రథాన్ని శ్రీరాముడికి అభిముఖంగా పోనిమ్మని అంటాడు. సారథి రావణుడి ఆజ్ఞానుసారం రథాన్ని శ్రీరాముడి వైపుకు తీసుకుపోయాడు.     

         ఇంద్రుడు తనకు పంపిన విల్లు తీసుకుని, కోపంతో, సూర్యకాంతితో సమానమైన కాంతికల వాడి బాణాలను రావణాసురుడి మీద వేశాడు రామచంద్రమూర్తి. రామరావణులు ఒకరినొకరు చంపాలనే కోరికతో యుద్ధం చేస్తుంటే దేవతలు ఆకాశాన గుంపులుగా వీక్షించారు. రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమని నిర్మల మనస్సుతో వారంతా ఆశ్చర్య పడ్డారు.

         తీవ్రమైన కోపంతో భయంకరాకారుడై రామచంద్రమూర్తి బాణాన్ని సంధించి రావణుడి శిరస్సు నరికాడు. రావణుడి తల కిందపడ్డది కాని వెంటనే మరొక తల మొలిచింది. అలా తల నరకగానే మరొక తల మొలిచింది కాని వాడు చనిపోయే విధం రాముడికి కనబడలేదు. ఇదేమి చిత్రమని రాముడు ఆలోచన చేయసాగాడు. అప్పుడు మాతలి శ్రీరాముడితో వాడిమీద బ్రహ్మాస్త్రం వేయమెనీ, వాడు ఏ గడియలో చస్తాడో అని దేవతలు చెప్పారో ఆ కాలం ఇప్పుడు సమీపించిందనీ చెప్పాడు.

         మాతలి ఇలా చెప్పగానే ఇంద్రుడికి బ్రహ్మదేవుడికి, ఆయన అగస్త్యుడికి, ఆయన తనకు ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి వింట సంధించాడు. అమితమైన వేగంతో రాముడు బ్రహ్మాస్త్రాన్ని బ్రాహ్మణహంతకుడైన రావణుడిమీద వేశాడు. అది పోయి రావణుడి రొమ్ముమీద పడింది. పడగానే ఆ గొప్ప అస్త్రం రావణాసురుడి రొమ్ము చీల్చి, ఆ నెత్తురులో స్నానం చేసి, వాడి దేహం నుండి ప్రాణాలను వెడలగొట్టి, పనంతా అయిపోయిన తరువాత భూమిలో దూరి వెలుపలికి వచ్చి, వినయంగా రాముడి అమ్ముల పొదిలో ప్రవేశించింది. రావణుడు చావగానే ఆయన దేహం ప్రాణాన్ని వదిలినట్లే, విల్లు, బాణాలు కూడా రావణుడిని వదిలి నేలమీద పడ్డాయి. రావణుడి దేహం అలా శక్తిపోయి నేలమీద పడిపోయింది. తమ ప్రభువు చావడం చూసి చావకుండా మిగిలిన రాక్షసులు రామజయంతో సంతోషించే వానరులు తరుముతుంటే లంకలోకి పారిపోయారు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment