యవక్రీతుడి వృత్తాంతం : విద్య గురుముఖతః నేర్చుకుంటేనే శోభ
ఆస్వాదన-19
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (09-05-2021)
అష్టావక్రుడి కథ
చెప్పిన రోమశుడు ధర్మరాజుతో తీర్థయాత్రలు కొనసాగిస్తూ, ఆయా పుణ్య క్షేత్రాలను గురించి చెప్పుకుంటూ
పోయాడు. సమంగ, మైనాకకుక్షి, కనఖల పర్వతం, ఋషిదైవతం,
గంగానది, ఉష్ణగంగ, రైభ్యాశ్రమం మొదలైన వాటిని గురించి
వివరించాడు. భరద్వాజాశ్రమం దగ్గరికి వచ్చినప్పుడు, భరద్వాజ మహర్షి కొడుకు
యవక్రీతుడు గర్వంతో అసువులు కోల్పోయిన సంగతి వివరించాడు ధర్మరాజుకు.
పూర్వకాలంలో స్నేహితులైన రైభ్యుడు, భరద్వాజుడు యోగీశ్వరులై అరణ్యంలో తపస్సు
చేస్తుండేవారు. రైభ్యుడి కొడుకులు అర్థావసుడు, పరావసుడు వేదశాస్త్రాలను అధ్యయనం
చేసి గొప్ప పాండిత్యాన్ని ఆర్జించారు. విద్వాంసులు వారిని పూజించడం చూసి భరద్వాజుడి
కొడుకైన యవక్రీతుడికి మాత్సర్యం ఏర్పడింది. గురుముఖతః కష్టపడి నేర్చుకోకుండా, తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించాలని
భావించాడు. అలా అతడు తీవ్రమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ప్రత్యక్షమై యవక్రీతుడి
కోరిక ఏమిటని అడిగాడు. ఏ గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండానే సర్వ వేదాలు, సకల శాస్త్రాలు తనకు అవగతం కావాలన్నాడు. ఇది
విద్యను సంపాదించడానికి తగిన పధ్ధతి కాదని చెప్పి ఇంద్రుడు వెళ్లిపోయాడు.
యవక్రీతుడు
ఎప్పటిలాగానే తపస్సు కొనసాగించాడు. అప్పుడు ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో
పిడికిళ్ళతో ఇసుకను పోస్తూ గంగా ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ కనిపించాడు
యవక్రీతుడికి. అతడిని పరిహసిస్తూ, ఎందుకీ అసాధ్యమైన పని చేస్తున్నావని
ప్రశ్నించాడు బ్రాహ్మణుడిని యవక్రీతుడు. తాను యవక్రీతుడి లాగానే అసాధ్యమైన లక్ష్యం
విషయంలో కృషి చేస్తున్నానని అంటూ తన నిజ స్వరూపాన్ని చూపాడు. తాను ఎట్టిపరిస్థితిలోనూ
తన లక్ష్యం నేరవేరేవరకూ తపస్సు ఆపనని చెప్పగా,
యవక్రీతుడికి అతడు కోరిన వరం ఇచ్చాడు ఇంద్రుడు. భరద్వాజుడికి ఈ విషయం తెలిసి
కొడుకు గర్వాన్ని సహించలేక యవక్రీతుడికి కొన్ని గాథలు చెప్పి, గర్వం చెడ్డదని, గర్వం వీడినవాడే మంచి మనుష్యుడని అన్నాడు. అహంకారాన్ని వదిలి, కోపం లేకుండా, శాంత స్వభావం కలిగి,
రైభ్యుడి కొడుకుల మీద అసూయ లేకుండా వుండమని భరద్వాజుడు యవక్రీతుడికి చెప్పాడు.
సరేనన్నాడు కాని, ఋషుల సభలలో తన పాండిత్యాన్ని
ప్రదర్శించసాగాడు.
ఒకనాడు
యవక్రీతుడు రైభ్యుడి ఆశ్రమానికి వెళ్లి,
అక్కడ పూలతోటలో ఆయన కోడలు, పరావసుడి భార్యైన కృష్ణను అనురాగంగా
చూశాడు. ఆమెకు తన మనస్సులోని కోరికను చెప్పాడు. ఆమె తన మామగారికి ఆ విషయం
చెప్పింది. రైభ్యుడికి పట్టరాని కోపం వచ్చింది. తన కోడలి కంటే సౌందర్యం, లావణ్యం కల ఒక సుందరాంగిని సృష్టించాడు. అలాగే
ఒక రాక్షసుడిని కూడా సృష్టించాడు. ఇద్దరినీ పోయి యవక్రీతుడిని సంహరించమని
ఆదేశించాడు రైభ్యుడు.
యువతి ముందుగా
వెళ్లి, విలాసంగా యవక్రీతుడి చేతిలోని కమండలాన్ని సంగ్రహించింది. వెంటనే
యవక్రీతుడు అపవిత్రుడయ్యాడు. అతడి తపశ్శక్తి నశించి పోయింది. తక్షణమే రాక్షసుడు
యవక్రీతుడిని ఎదుర్కొన్నాడు. అతడు భయపడి పారిపోయి నదుల్లో, సరస్సులలో ప్రవేశించాడు కాని అవి ఎండిపోయాయి. చివరకు
తండ్రి అగ్నిశాలలోకి పోయి అక్కడ దాక్కున్నాడు. రాక్షసుడు అక్కడి కూడా వచ్చి
యవక్రీతుడిని చంపాడు. అడవి నుండి ఆశ్రమానికి వచ్చి విషయం తెలుసుకున్న భరద్వాజుడు
దుఃఖించాడు. కొడుకు శరీరానికి అగ్ని సంస్కారం చేసి భరద్వాజుడు అదే అగ్నిలో పడి
దేహాన్ని త్యాగం చేశాడు.
ఇదిలావుండగా
బృహద్ద్యుమ్నుడు అనే రాజు చేస్తున్న సత్రయాగానికి రైభ్యుడి కొడుకులు అర్థావసు,
పరావసులు ఋత్విజులు. ఒకనాడు రైభ్యుడి కొడుకు పరావసుడు వేకువ చీకటిలో తన ఆశ్రమానికి
వస్తున్నాడు. ఎదురుగా రైభ్యుడు వస్తున్నాడు. ఒంటరిగా వస్తున్న రైభ్యుడిని
క్రూరమృగంగా భావించిన పరావసుడు, తనను కాపాడుకోవాలని, అతడిని సంహరించాడు. పరావసుడు
దుఃఖపడి తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించి,
పితృహత్యను అన్నగారికి చెప్పి, సత్రయాగాన్ని తాను ఒక్కడినే నిర్వహిస్తానని,
బ్రహ్మహత్యను పోగొట్టే వ్రతాన్ని అతడిని చేయమని అన్నాడు. అర్థావసుడు అంగీకరించి
అలాగే చేయసాగాడు. పూర్తి చేశాడు కొంతకాలానికి.
ఆ తరువాత
సత్రయాగం దగ్గరికి వచ్చాడు అర్థావసుడు. అతడు బ్రహ్మ హత్యాపాతకాన్ని హరించే వ్రతాలు
చేశాడని, యజ్ఞశాలలో రావడానికి అనర్హుడని పరావసుడు రాజు
బృహద్ద్యుమ్నుడికి చెప్పాడు. అప్పుడు వాస్తవాన్ని బయటపెట్టాడు అర్థావసుడు. అతడి
నిజాయితీకి మెచ్చి వేల్పులు అతడిని అభినందించారు. అర్థావసుడు కోరుకున్న వరాలు
ఇస్తామని చెప్పారు దేవతలు. తన తండ్రి రైభ్యుడు,
ఆయన స్నేహితుడు భరద్వాజుడు, యవక్రీతుడు యథాపూర్వంగా బతికి
వుండాలని, పరావసుడి దోషం పోవాలని అర్థావసుడు
ప్రార్థించాడు. దేవతల దయ వల్ల ముగ్గురూ బతికారు.
తాను వివిధ
శాస్త్రాలను, వేదాలను ఎరిగిన వాడినైనప్పటికీ, తనకంటే
రైభ్యుడికి ఎక్కువ శక్తి ఎలా వచ్చిందని, అతడి చేతిలో తానెలా సంహరించబడ్డానని
దేవతలను అడిగాడు యవక్రీతుడు. జవాబుగా దేవతలు,
గురువుగారికి పరిచర్య చేస్తూ అభ్యసించిన చదువులు శోభిస్తాయి కాని వేరేవిధంగా
ఆర్జించిన విద్యలు శోభించవు అన్నారు. యవక్రీతుడు గురుముఖతః కాకుండా వేరే విధంగా
విద్యలను ఆర్జించడం వల్ల అవి శక్తి విహీనాలయ్యాయని, గురువు దగ్గర నేర్చుకున్నందువల్ల రైభ్యుడికి మహిమ ఏర్పడింది అని
అన్నారు దేవతలు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment