Saturday, May 8, 2021

రావణుడు సంస్కారానికి అర్హుడన్న శ్రీరాముడు : వనం జ్వాలానరసింహారావు

 రావణుడు సంస్కారానికి అర్హుడన్న శ్రీరాముడు

వనం జ్వాలానరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (08-05-2021) ప్రసారం  

రామ-రావణ యుద్ధంలో, ముల్లోకాలను భయపెట్టిన రావణుడు శ్రీరామచంద్రమూర్తి చేతిలో చావగా లోకాలన్నీ సంతోషించాయి. దేవతలు దుందుభులు మోగించారు. వారి వాక్యాలు స్తోత్రాలయ్యాయి. దేవతలు, చారణులు సంతోషించారు. సమస్త జనవిరోధైన రావణుడు దేవలోకానికి ప్రయాణమై పోవడంతో దేవతలు శాంతచిత్తులై సంతోషించారు. దిక్కులు తేటగా అయ్యాయి. ఆకాశం నిర్మలమై ప్రకాశించింది. భూమి వణకడం ఆపుచేసింది. మందమారుతం సువాసనతో వీచింది. సూర్యుడు భయం లేకుండా ప్రకాశించాడు. నిర్భయంగా జనులు వీథులవెంట తిరిగారు. యాగాల పొగలు ఆకాశాన్ని తాకాయి. లోకులంతా దిగులు మాని నిద్రించారు.

ఇలా రావణాసురుడు చావగా విభీషణుడు రావణుడి కళేబరాన్ని చూసి దీనుడై ఏడ్చాడు. ఏడుస్తూ ఇలా అన్నాడు. “ఎన్నో యుద్ధాలను జయించి, వీరుడని కీర్తి సంపాదించి, శాస్త్రాలెన్నో పఠించి, పండితులతో పొగడ్తలందుకుని, స్థిరంగా సౌఖ్యం ఇచ్చే పానుపు మీద పడుకునాల్సిన వాడివి అన్నా! ఇవ్వాళ ఇలా నేలమీద పడాల్సిన వాడివయ్యావు కదా! ఇలా జరుగుతుందని నీకు ఎన్ని సార్లు చెప్పినా కామాతిశయంతో నా మాటలు వినలేదుకదా? కుంభకర్ణుడైనా, ఇంద్రజిత్తయినా, ప్రహస్తుడైనా, నరాంతకుడైనా, అతికాయుడైనా బలంకలవారిమని ప్రవర్తించారే కాని ధర్మం శ్రేయస్కరమని, అధర్మం హానికరం అన్న నీతిని పాటించలేదు కదా? నువ్వు కూడా ఆలోచించ లేదు. దాని ఫలమే ఇప్పుడు ఇలా ప్రాప్తించింది కదా? నేనెంతగానో వద్దని వారించాను. నేను చెప్పినదంతా వ్యర్థమైపోయింది. కాలాన్ని ఎవరు తప్పించగలరు?

         ఏడుస్తున్న విభీషణుడిని ఓదారుస్తూ శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “అయ్యా! విభీషణా! ఎందుకు ఏడుస్తున్నావు? బలహీనుడై యుద్ధం చేయలేక అవమానపడి చావలేదితడు. ఓడిపోతానని ఏమాత్రం సందేహం లేకుండా, చస్తానేమోనన్న భయం లేకుండా, అపరిమితమైన ధైర్యంతో చేతనైనంతదాకా యుద్ధం చేసి చనిపోయాడు. యుద్ధంలో క్షాత్ర ధర్మంతో వీరమరణం పొందినవారికోసం ఏడవడం న్యాయమా? ముల్లోకాలనూ బాధించాడు. దేవతలను జయించాడు. యుద్ధంలో అసమాన బలంతో పోరాడి వీరులు పోయే స్వర్గానికి పోయాడు. ఇలాంటివాడి కోసం ఏడవడం తగునా? క్షత్రియ ధర్మం ఇదీ అని నిశ్చయించుకుని, వాస్తవం అర్థం చేసుకుని, తరువాత జరగాల్సిన పనికై త్వరపడు”.

         “ విభీషణా! పగ అనేది జీవితకాలంలోనే కాని చచ్చినవాడి మీద పగ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేసినా అతడేమి చేయగలడు? ఆ విధంగా ప్రతీకారం ఏమీ చేయలేనివాడి విషయంలో మనం ఏదీ చేయకూడదు. వాడిమీద పగ వాడి మరణంతోనే ముగిసింది. వాడు నేను పుట్టుకతో శత్రువులం కాదు. ఒక విషయంలో విరోధం వచ్చింది. ఆ కార్యం చక్కబడింది. మన కార్యాలు చక్కనైనయ్యాయి. కాబట్టి ఇక వాడి మేలుకొరకై చేయాల్సిన సంస్కారాలు చేయి. వీడు నీకు ఎలాంటివాడో నాకూ అలాగే. నీకెలా తోడబుట్టినవాడు అన్న ప్రేమకలదో నాకూ అలాగే వుంది. నీకు వాడు తోడబుట్టినవాడైనప్పుడు, నువ్వు నాకు తోడబుట్టినవారిలో ఒకడివైనప్పుడు వీడు మాత్రం అలా కాడా? కాబట్టి వీడికి కర్మలు చేసే విషయంలో నేను అన్యధా భావిస్తానని అనుకోవద్దు” అన్నాడు.

         ఇలా శ్రీరాముడు విభీషణుడితో అంటున్న సమయంలోనే రావణుడి భార్యలు, రాక్షస స్త్రీలు అంతఃపురం వదిలి ఏడ్చుకుంటూ వచ్చారక్కడికి. “హా రాజనందనా! హా జీవితేశ్వరా! హా ప్రాణ నాయకా! హా మదీశ! హా నాథా! హా పతీ!” అనుకుంటూ ఏడ్చారు. ఒక మనిషి చేతిలో చచ్చావా? అని ఏడ్చారు. సీతను రాముడికి ఇచ్చి వుంటే ఇంత జరిగేది కాదుకదా? అని ఏడ్చారు. “నీ ఒక్కడి మూర్ఖత్వం వల్ల నువ్వు, మేము, వూరివారంతా చెడిపోయాం కదా? నీ మృతికి కామం కారణం కాదు. అంతా దైవ వశం. దైవం తప్పుగా చూస్తే ఏదైనా జరుగవచ్చు. నీ నాశనానికి దైవమే కారణం. విధి సంకల్పం తప్పించడం ఎవరి తరం కాదు” అని ఏడ్చారు.

         రావణుడి పెద్ద భార్య మందోదరి యుద్ధభూమికి చేరుకొని దుఃఖం ఆపుకోలేక ఏడ్చింది. మందోదరి వీరపత్నికదా! వీరపత్ని అంటే భర్త గెలిచినప్పుడు ఎంత సంతోషపడాలో, వీరమరణం పొందినప్పుడు కూడా తన వీరపత్నీత్వానికి హానిరాలేదు కదా అని సంతోషించాల్సి వుండగా పామరురాలిలాగా ఇలా ఏడవవచ్చా? మందోదరి రావణుడి మరణానికి ఏడవలేదు. రావణుడు తనకంటే అధములని భావించే మనుష్యుల చేతిలో చచ్చి, తన వీరపత్నీత్వానికి హాని కలిగించాడు కదా! ఇదెంత లజ్జావహం? ఎవరైనా వచ్చి నీ భర్త మనుష్యుడి చేతిలో చచ్చాడే, ఇది నిజమా? అంటే తానేమి చెప్పాలి అని ఏడ్చింది.

“ముల్లోకాలను గెలిచావు కదా! ఎక్కడెక్కడ లక్ష్మి, సంపద వుంటే అదంతా గెల్చావు కదా! ఎంతో పేరు గడించావు కదా! చివరకు ఒక మనిషి చేతిలో చచ్చావు కదా! నిన్నొక మనుష్యుడు చంపాడంటే నమ్మలేక పోతున్నాను. మనిషి మనుష్యులను తినేవాడిని చంపడంలో ఏం న్యాయం వుందో చెప్పు. ఇది విపరీతం, అవమానకరం కదా! సకల శస్త్రాస్త్రాలను పరిపూర్ణంగా తెలిసన యుద్ధకోవిదుడివైన నిన్ను యుద్ధంలో రాముడు చంపడమా? నమ్మలేకపోతున్నాను ప్రాణనాథా!” అని విలపించింది మందోదరి.

         “ప్రాణేశ్వరా! నువ్వు సీతాదేవిని ఏమని అనుకున్నావు? ఆమె వల్లే కదా, వసుధకు వసుధ అన్న పేరు వచ్చింది. శ్రీ, శ్రీ అయింది. అలాంటి స్త్రీరత్నమైన పతివ్రత సీత. ఆమె ఏ అవయవంలోనూ ఒక్కటంటే ఒక్క దోషం కనపడదు. దోషాలు లేకపోవడమే కాదు. సమస్త శుభచిహ్నాలు వున్నాయి. అలాంటి దాన్ని నువ్వు భక్తితో ఆశ్రయించి వుంటే ఎంతో బాగుపడేవాడివి. ఆ మార్గాన్ని వదిలి మహారణ్యంలో, ఏమూలనో, ఎవరూలేని చోట ఆమె వున్నప్పుడు మోసగించి ఆమె ఏడుస్తూ వుంటే మారీచుడిని పంపించి అపహరించావు. ఇది నిన్ను నువ్వు నాశనం చేసుకునే కార్యక్రమం కాదా? అపహరించడం తప్ప ఆమెవల్ల నువ్వు అనుభవించిన సుఖం ఏమైనా వుందా? సుఖానికి బదులు ఆమె పాతివ్రత్యంలో కాలిపోయావు. వాస్తవానికి నువ్వామెను తాకిననాడే భస్మం కానందుకు నిన్ను చూసి దేవతలు భయపడ్డారు. నువ్వు చేసిన పని పాపకార్యం అయితే అప్పుడే పాపఫలం ఎందుకు అనుభవించలేదు అని అడగవచ్చు నువ్వు. దానికి కారణం వుంది. విత్తనం వేయగానే ఫలం నోటికి రాదు. కాలపక్వం కావాలి. పాపం చేసినవాడికి ఆ పాపఫలం కాలపక్వమైనప్పుడే అనుభవంలోకి వస్తుంది. అప్పుడిక ఏం చేసినా పోదు”.

         “నువ్వు శూరుడివై లోకాన్నంతా నీ భుజబలంతో గెలిచావు. కాబట్టే నువ్వు శూరుడివనుకున్నావు. కాని నువ్వు  నిజానికి శూరుడివి కాదు. నిజమైన శూరుడివే అయితే పిరికివాడిలాగా ఆడదాన్ని దొంగిలించి తెచ్చే నీచకార్యానికి పూనుకుంటావా? మగవారికి భయపడే కదా నువ్విలా చేశావు? జింక నెపంతో రామచంద్రమూర్తిని ఆశ్రమానికి దూరంగా పోయేట్లు చేసి సీతను ఎత్తుకువచ్చావు. ఇది పిరికితనానికి నిదర్శనం కాదా? నిర్భాగ్యదశ పక్వమై నీకిలాంటి దుర్భుద్ధి కలిగింది. నువ్వేప్పుడైతే సీతను తెచ్చావో అప్పుడే సత్యవాదైన నామరది విభీషణుడు రాక్షసులు అంతా నాశనమవుతారని హెచ్చరించాడు. విభీషణుడి ప్రయత్నాలు ఫలించలేదు. మాట వినని నీలాగే రాక్షసులంతా నాశనం అయ్యారు. చేసిన దానికి ఫలం అనుభవించడానికి నీ గతికి నువ్వు పోయావు. కాబట్టి నీకొరకు నేను దుఃఖపడడం లేదు. నాగతి ఏమిటని నేను నాకై దుఃఖిస్తున్నాను”.

         చనిపోయిన అన్న రావణాసురుడికి దహన సంస్కారాలు జరిపించమని రామచంద్రమూర్తి తనకు చెప్పడంతో, విభీషణుడు ధర్మం ఏంటని ఆలోచన చేశాడు. రాముడు చెప్పినట్లే చేయడం ధర్మమని తీర్మానించుకుని ఇలా జవాబు చెప్పాడు రాముడికి.

“ధర్మ ప్రవర్తన వదిలినవాడు, దయలేని చోరుడు, అసత్యవాది, పాపపు మనస్సుకలవాడు, పర స్త్రీలను బాధించినవాడు రావణుడు వరసకు నాకు అన్నే కాని నడవడిలో నాకు గొప్ప శత్రువు. అహిత కార్యాలలో ప్రీతికలవాడు. ప్రపంచానికి ఉపద్రవం కలిగించినవాడు. ఇలాంటి వీడికా నేనిప్పుడు శాస్త్రప్రకారం సంస్కారాలు చేయాలి? నేనాపని చేయలేను. అన్నకదా అంటావేమో? అన్న అని చెప్పి లౌకిక గౌరవాలు చూపుతాను కాని పారలౌకిక కర్మలకు వీడు అర్హుడు కాదు. నేను ఇప్పుడు వీడికి ఉత్తర క్రియలు చేయకపోతే నన్నెవరైతే శాస్త్రనియమం తప్పాడని తిట్టుతారో వారే వీడి నడవడి తెలుసుకున్న తరువాత విభీషణుడు సరైన పనే చేశాడనీ, పతితులకు శాస్త్రీయ సంస్కారాలు అవసరం లేదని నేను చేసిన పనిని మెచ్చుకుంటారు”.

ఈ మాటలకు రాముడు విభీషణుడితో ఇలా అన్నాడు. “విభీషణా! రావణుడు సంస్కారార్హుడు కాడు, పతితుడు అనడానికి నువ్వు చెప్పిన కారణాలు నేను తప్పనను. అవి నాకు తెలియకా కాదు. అతడు అధర్మానికి భయపడడని, అసత్యవాదని, నీతిమాలినవాడని నాకు తెలుసు. తెలిసి కూడా వాడికి సంస్కారం చేయమని చెప్పాను. ఎందుకంటే, పతితుడికి పరలోక క్రియలు లేవనడం లోక సామాన్య విధంగా చస్తే నిజమే కాని, ధర్మయుద్ధంలో న్యాయరీతిన చనిపోయిన వీరుడి విషయంలో కాదు. వాడు బలశాలి, శూరుడు, తేజస్వి, ఇంద్రాదులకైనా వెనుదీయని వాడు. అలాంటి లోక రావణుడు, పర్వతం లాంటి ధైర్యశాలి, సామాన్యుడా? యుద్ధంలో చనిపోయాడు. వీరస్వర్గం వాడికి లభించాలి. నువ్వు వాడికి సంస్కారం చేయకపోతే ప్రేతత్వం పోదు. ప్రేతత్వం పోకపోతే స్వర్గప్రాప్తి లేదు. వాడు కష్టపడి సంపాదించిన స్వర్గ సుఖాన్ని సంస్కరించని నువ్వు దాన్ని విఘ్నపరచడమే కాకుండా ప్రేతత్వ బాధ కలిగించిన వాడివవుతావు. అది నీకు శ్రేయస్కరం కాదు. చనిపోయినవాడిని ప్రేమ కలవాడు కదా సంస్కరించాల్సింది? వాడు నీకు విరోధి కదా అంటావేమో? ఎంత పాపాత్ముడైనా వీరమరణం పొందినవారికి వీరస్వర్గం వుంటుంది. కాబట్టి వాడు సంస్కారానికి అర్హుడు. రావణుడు లాంటి పాపికి, విరోదికి, సంస్కారాలు చేసినాడన్న కీర్తి నీకు కలుగుతుంది కాని అపకీర్తి రాదు”.     

         శ్రీరాముడు చెప్పిన మాటలకు స్పందించి విభీషణుడు సంస్కారానికి కావాల్సిన సరకులన్నీ తెప్పించాడు. శాస్త్రోక్తంగా రావణుడికి దహన సంస్కారాలు జరిపించాడు. స్నానం చేసి తడిబట్టలతో నువ్వులు, నీళ్ళతో తర్పణాలు విడిచాడు. ఆ తరువాత నమస్కారం చేసి, ఆడవారున్న చోటుకు పోయి వారికి సమాధానం చెప్పి, వారందరినీ నగరంలోకి పంపించి, నిర్మలమైన మనస్సుతో సవినయంగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు విభీషణుడు.

            యుద్ధాన్ని చూడడానికి వచ్చిన దేవదానవులు రామరావణ యుద్ధాన్ని కథలుకథలుగా చెప్పుకుంటూ, సంతోషంగా వారి-వారి స్థానాలకు మరలిపోయారు. ఆ తరువాత రామచంద్రమూర్తి తన రథాన్ని నడిపిన సారథి మాతలిని చూసి, ఆయనకు తన మీద వున్న ప్రేమను పొగిడి, అతడు తన రథాన్ని తీసుకుని ఇంద్రుడి దగ్గరికి పొమ్మని అనుమతి ఇవ్వగా, మాతలి అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడిని కౌగలించుకుని అక్కడి నుండి లక్ష్మణుడు తోడురాగా, సమస్త వానరసేన సేవించగా, సేనలున్న ప్రదేశానికి పోయి లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు.

         “లక్ష్మణా! దగ్గరికిరా. విభీషణుడుని లంకలో అభిషేకం చేయాలని కోరుతున్నాను. ఇది నా మనస్సులో వున్న కోరిక. దీన్ని నువ్వు నెరవేర్చి రావాలి” అని శ్రీరాముడు చెప్పగానే లక్ష్మణుడు త్వరగా నగరంలోకి పోయి, బంగారు పాత్రలను తెచ్చి, వాటిని తీసుకుని సముద్రతీరానికి పోయి సముద్ర జలాలను తెమ్మని సైనికులను పంపాడు. వారలా జలాలను తీసుకుని రాగానే అందులో ఒకదాన్ని తాను తీసుకుని, రాజయోగ్యమైన ఉత్తమ సింహాసనాన విభీషణుడిని కూర్చోబెట్టి, రాక్షసులంతా చూస్తుండగా వారి మధ్యన మంత్రయుక్తంగా అతడిని అభిషిక్తుడిని చేశాడు. విభీషణుడు సంతోషించి రామచంద్రమూర్తి ఇచ్చిన రాజ్యాన్ని గ్రహించాడు. శ్రేష్టులైన రాక్షసులు ఆయన్ను ఆశీర్వదించారు. వారిచ్చిన అక్షతలను, పుష్పాలను, పేలాలను ఇతర శుభకరమైన వస్తువులను తీసుకుని రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అవి ఆయనకు సమర్పించాడు. శ్రీరాముడు చాలా సంతోషించాడు.

అ ఆతరువాత సమీపంలో వున్న హనుమంతుడిని పిలిచి, లంకకు పోయి అక్కడ రావణుడి ఇంట్లో వున్న సీతాదేవికి యుద్ధంలో తాను గెలిచిన వృత్తాంతాన్ని, రావణుడిని జయించిన విషయాన్ని చెప్పమన్నాడు. ఆమె ఏమని ప్రత్యుత్తరం ఇస్తుందో తెలుసుకుని రమ్మంటాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment