Saturday, May 1, 2021

సోమకుడి, శిబి చక్రవర్తి, అష్టావక్రుడి చరిత్ర .... ఆస్వాదన-18 : వనం జ్వాలా నరసింహారావు

 సోమకుడి, శిబి చక్రవర్తి, అష్టావక్రుడి చరిత్ర

ఆస్వాదన-18

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02- 05-2021)

తీర్థయాత్రలలో భాగంగా పాండవులు వివిధ ప్రదేశాలలో తిరుగుతూ మాంధాత యజ్ఞం చేసిన చోట వున్నప్పుడు, అక్కడి కురుక్షేత్రంలో యజ్ఞం చేసి నూరుగురు కొడుకులను కన్న సోమకుడనే రాజు కథను, చెప్పాడు రోమశుడు ధర్మరాజాదులకు. వాస్తవానికి సోమకుడు యజ్ఞం చేసి జంతుడు అనే పేరుకల కొడుకును కన్న తరువాత అతడి నూరుగురు భార్యలు అంతా ఆ కుమారుడిని ప్రేమగా చూసుకునేవారు. తనకు ఒక్కడే కొడుకు కాకుండా వందమంది కావాలని కోరికగా వుండేది రాజుకు. రాజ పురోహితులు అతడు తాము ఆదేశించిన యజ్ఞం చేయాలన్నారు. ఆ యజ్ఞంలో రాజు ఏకైక పుత్రుడిని యజ్ఞపశువు చేసి సంహరిస్తే నూరుగురు కొడుకులు పుడతారన్నారు. రాజు అలాగే చేయడంతో సోమకుడి భార్యలు గర్భవతులై జంతుడు మొదలైన నూరుగురు కొడుకులను కన్నారు.

యజ్ఞం చేయించిన ఋత్విజుడు మరణించిన తరువాత నరకలోకంలో అగ్నిలో వేగుతుండగా, ఆ తరువాత మరణించి స్వర్గలోకానికి పోతున్న సోమకుడు చూశాడు. తానిలా వుండడానికి కారణం రాజుతో యజ్ఞం చేయించడమే అన్నాడా ఋత్విజుడు. యమధర్మరాజుకు చెప్పి ఋత్విజుడిని తన వెంట స్వర్గానికి తీసుకెళ్లాడు సోమకుడు.

05-2021)ఈ కథ విన్న తరువాత పాండవులు యమునా తీర్థాన స్నానాలు చేశారు. ఆ తరువాత విష్ణు పథంతో సహా పలు తీర్థాలలో స్నానాలు చేస్తూ మానస సరోవరానికి వెళ్లారు. అక్కడి నుండి ఉశీనరపతి శిబి చక్రవర్తి యజ్ఞం చేసిన భృగుతుంగ పారావత శిఖరం దగ్గరికి వచ్చినప్పుడు శిబి చక్రవర్తి కథ చెప్పాడు రోమశుడు.

పూర్వకాలం శిబి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ మహానుభావుడి గుణగణాలను పరీక్షించడానికి ఇంద్రాగ్నులు డేగ రూపంలో, పావురం రూపంలో అక్కడికి వచ్చారు. డేగ (ఇంద్రుడు) వల్ల ప్రాణ భీతితో పావురం (అగ్ని) పరుగెత్తుకుని వచ్చి శిబి చక్రవర్తి శరణు కోరింది. డేగ పావురాన్ని వెంటాడుతూ వచ్చింది. తాను మిక్కిలి ఆకలితో వున్నానని తన ఆహారం విఘ్నం చేయడం శిబి చక్రవర్తికి న్యాయమేనా అని ప్రశ్నించింది శిబిని డేగ. పావురం ఆహారంగా తమకు దొరక్కపోతే తన ప్రాణాలు, తన సంతానం ప్రాణాలు, భార్య ప్రాణాలు నిలవవని, ఒక్క పావురాన్ని రక్షించి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకం కదా అని అన్నది డేగ. పావురాన్ని తనకు ఆహారంగా వదలాలి అన్నది. 

(ఇలా మహాభారతంలో అనేక సందర్భాలలో ధర్మం మీద చర్చలు కనిపిస్తాయి).

తనను ఆశ్రయించిన పావురాన్ని విడవడం ధర్మం కాదుకదా! అని అంటాడు శిబి మహారాజు. అడవిలో ఎన్నో జంతువులు వుండగా కేవలం ఈ పావురమే ఎందుకు కావాలి అని ప్రశ్నించాడు. ఆ పావురం తనకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం కాబట్టి, దాన్ని రక్షించాలని అనుకుంటే దాని బరువుతో సమానమైన తూకం కల శిబి శరీర మాంసం ఇవ్వమంటుంది డేగ. శిబి ఆ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు. తక్షణమే చిరు కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తరాజుతో తూకం వేయసాగాడు. కాని అతడి దేహంలోని మాంసం అంతా సమర్పించినా కూడా ఆ తులాభారంలో పావురానికి సరి తూగలేదు. చివరకు శిబి చక్రవర్తి తానే తరాజులోకి ఎక్కాడు. అప్పుడు అతడి ఆత్మార్పణపూర్వకమైన త్యాగానికి, గొప్ప గుణానికి ఇంద్రుడు, అగ్నిహోత్రుడు సంతోషించి నిజరూపాలలో ప్రత్యక్షమయ్యారు.

శిబి చక్రవర్తిని అభినందించి, కోరిన వరాలు ఇచ్చి వెళ్లిపోయారు ఇంద్రాగ్నులు.

ఆ తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావక్రుడి చరిత్ర చెప్పాడు. ఉద్దాలకుడి కుమారుడు శ్వేతకేతు, అష్టావక్రుడు మేనమామ, మేనల్లుళ్లు. వారిద్దరూ ఉగ్ర తపస్సు చేశారు. దీని పూర్వరంగంలో, ఏకపాదుడు అనే మహా విద్వాంసుడు, ముని, సుజాత అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. శిష్యులకు విద్య నేర్పుతుండేవాడు. ఇంతలో ఆయన భార్య గర్భవతి అయింది. ఒకనాడు గర్భస్థ శిశువు తండ్రితో ఆయన శిష్యులు మందబుద్ధితో వేదాలను తప్పుగా చదువుతున్నారని అన్నాడు. గర్భస్థ శిశువు మీద ఆగ్రహించిన తండ్రి ఏకపాదుడు కొడుకును అష్టావక్రుడివై పుట్టామని శపించాడు.

పురిటి సమయానికి అవసరాల నిమిత్తం ధన సంపాదన కోసం ఏకపాదుడు జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. అక్కడ వరుణ కుమారుడైన వందితో వాదించి, పరాజయాన్ని పొంది, నీటిలో మునిగి వున్నప్పుడు సుజాత ప్రసవించి అష్టావక్రుడిని కనింది. అదే సమయాన, ఉద్దాలకుడి భార్య శ్వేతకేతుడిని ప్రసవించింది. ఇలా మేనమామ, మేనల్లుళ్లు ఇద్దరూ సమవయస్కులై కలిసిమెలిసి పెరిగి ఉద్దాలకుడి సన్నిధిలో పన్నెండు సంవత్సరాలు వేదవిద్యాభ్యాసం చేశారు. ఒకనాడు తన తండ్రి ఎవరని తల్లి సుజాతను అడిగాడు అష్టావక్రుడు. అసలు విషయం తెలుసుకుని మేనమామను వెంటబెట్టుకుని అష్టావక్రుడు తన తండ్రి దగ్గరికి వెళ్లాడు. ఆ విధంగా శ్వేతకేతుడు, అష్టావక్రుడు జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్లారు.

తమను అడ్డగించిన ద్వారపాలకుడితో తాము వయసులో చిన్నవారిమని అవమానించ వద్దని, తాము జనక మహారాజుగారి సభలో వున్న వేదవాదులతో సిద్ధాంత రాద్ధాంతాలు చేసి చర్చించడానికి వచ్చాం అని అన్నారు. ద్వారపాలకుడు రాజుగారి అనుమతి పొంది అష్టావక్ర శ్వేతకేతులను లోపలి పంపించాడు. కొలువులో జనక మహారాజు అడిగిన చిక్కు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు అష్టావక్రుడు. అలాగే వరుణ సుతుడైన వందితో వాదించి అతడిని ఓడించి, తన తండ్రిని బంధ విముక్తిడిగా చేశాడు. జనక మాహారాజు సన్మానించాడు అతడిని. తండ్రి ఏకపాదుడిని వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు అష్టావక్రుడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment