Saturday, May 15, 2021

హనుమద్దర్శనం చేసుకుని సౌగంధికా కమలాలను తెచ్చిన భీముడు .... ఆస్వాదన-20 :వనం జ్వాలా నరసింహారావు

 హనుమద్దర్శనం చేసుకుని సౌగంధికా కమలాలను తెచ్చిన భీముడు

ఆస్వాదన-20

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (16-05-2021)

తీర్థయాత్రలలో భాగంగా పాండవులకు రోమశుడు కాలపర్వతం గురించి, ఏడుపాయల గంగానది గురించి, మందరగిరి గురించి చెప్పి, అక్కడికి ఆరువందల ఆమడల దూరంలో కైలాసపర్వతం వున్నదని, అక్కడ కుబేరుడు వుంటాడని అన్నాడు. అక్కడికి పోవడానికి నడవడం కష్టమైతే ద్రౌపదిని, నకులసహదేవులను తన వీపుమీద ఎక్కించుకుని వస్తానని అంటాడు భీముడు. ఆ ప్రయాణంలో భాగంగా గంధమాదన పర్వతానికి కూడా పోతామని, అక్కడ ఇంద్రలోకం నుండి వచ్చి అర్జునుడు కలుస్తాడని చెప్పాడు రోమశుడు. మార్గ మధ్యలో ఆటవికుల రాజైన సుబాహుడి దగ్గర రథాలను వదిలి కాలినడకన గంధమాదన పర్వతం వున్న దిక్కుకు పయనించారు ధర్మరాజాదులు.

పాండవులు గంధమాదన పర్వతాన్ని చేరుకోగానే పెనుగాలి వీచింది. పాండవుల బృందం మూడు భాగాలుగా విడిపోయింది. కాసేపు వర్షం కురిసి వెలిసింది. అప్పుడు మళ్లీ అంతా కలిసి ప్రయాణం కొనసాగించారు. నడక ఇబ్బందిని అర్థం చేసుకున్న భీమసేనుడు, అన్న ధర్మరాజు అనుమతి తీసుకుని, తన కుమారుడు ఘటోత్కచుడిని తలచుకున్నాడు. తండ్రి ఆదేశం కోసం ఎదురుచూశాడు తన రాక్షసబలంతో వచ్చిన ఘటోత్కచుడు. భీముడి కోరిక ప్రకారం ధర్మరాజాదులందరినీ ఎత్తుకుని తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు ఘటోత్కచుడు. అలా అందరూ ఆకాశమార్గాన ప్రయాణం చేసి, గంగా ఒడ్డున వున్న బధరీవనంలో, పూర్వం 05-నరనారాయణులు 16-తపస్సు చేసిన ఆశ్రమం దగ్గర కిందకు దిగారు. గంగానదిలో స్నానం చేశారు అంతా. ఆ ప్రదేశంలో ఆరుదినాలు నివసించారు. 

ఒకనాడు భీముడు, ద్రౌపదీదేవి అక్కడ వినోదంగా సంచరిస్తున్న సమయంలో, నూరురేకులున్న సౌగంధిక కమలం వారిదగ్గరకొచ్చి పడింది. అలాంటి చక్కటి పూలు మరికొన్ని కావాలని, సమీపాన వుంటే తెమ్మని భీమసేనుడిని కోరింది ద్రౌపది. అంగీకరించిన భీముడు, తామర పువ్వు తెచ్చిన గాలికి అభిముఖుడై వెళ్లాడు. అలా గంధమాదన పర్వత మధ్యభాగంలో విహరిస్తూ వెళ్లాడు భీముడు. మధ్యలో కనిపించిన ఒక సరస్సులో స్నానం చేసి, పక్కనే వున్న ఒక అరటి తోటలో ప్రవేశించి, అందులో శంఖం పూరించాడు. ఆ శంఖధ్వనికి అక్కడే వున్న ఒక పర్వత గుహలో నిద్రిస్తున్న హనుమంతుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అది తన సోదరుడు భీముడి శంఖధ్వనిగా గుర్తుపట్టాడు. భీముడు ముందుకు పోలేకుండా, కాలిబాటకు అడ్డంగా, తన తోకను విస్తరించి పక్కన వేసి నిద్రపోయాడు. భీముడు హనుమను సమీపించాడు.

భీముడు వచ్చిన ధ్వనికి నిద్ర వీడిన హనుమంతుడు భీముడిని నిర్లక్ష్యంగా చూసి, తనకు నిద్రా భంగం ఎందుకు కలిగించావని అడిగాడు. అసలీ అడవికి ఎందుకు వచ్చావని ప్రశ్నించి మరలిపోమ్మని సలహా ఇచ్చాడు భీముడికి. తన పేరు భీముడని, తానొక పనిమీద వెళ్తున్నానని, తనకు దారి ఇమ్మని, లేకపోతే అవలీలగా కొండ దూకి పోతానని అన్నాడు. తాను ముసలివాడినని, లేవలేనని, తన తోకను కొద్దిగా పక్కకు తీసి పొమ్మని భీముడితో అన్నాడు హనుమంతుడు. భీముడు తోకను తన ఎడమచేతితో నిర్లక్ష్యంగా నెట్టబోయాడు. శక్యం కాలేదు. ఆ తరువాత తన బలాన్నంతా ఉపయోగించి కదల్చబోయాడు. కుదరలేదు. అప్పుడు సిగ్గుపడి భీముడు అతడికి నమస్కరించి, ఆయనెవరని అడిగాడు. తాను హనుమంతుడినని వెల్లడించాడు. వెంటనే మళ్లీ హనుమంతుడికి నమస్కరించిన భీముడు, ఆయన్ను చూడడం వల్ల తన జన్మ ధన్యమయిందని అన్నాడు. భీముడి కోరిక మేరకు హనుమంతుడు అతడికి చతుర్యుగాచార వర్తనాల గురించి వివరంగా చెప్పాడు.

ఆ తరువాత భీముడు మరీమరీ ప్రార్థించగా హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచి, సముద్రాన్ని లంఘించిన నాటి ఆయన నిజ స్వరూపాన్ని చూపించాడు. కాసేపైన పిదప ఉపసంహరించాడు. సౌగంధికాలు అనే నూరు రేకుల బంగారు పూలు లభించే కొలను దగ్గరికి పోయి అవి తేవడానికి కేవలం శౌర్యం ప్రదర్శించడం కాకుండా బుద్ధి బలం చూపమని సలహా ఇచ్చాడు భీముడికి హనుమంతుడు. రాబోయే భారత యుద్ధంలో తనను స్మరించమని, తాను మహావీరుడైన అర్జునుడి రథం మీద వుండే జెండాపై వుండి, యుద్ధంలో పాండవుల బలాన్ని, వారి శౌర్యాలను తిలకిస్తానని చెప్పాడు ఆంజనేయుడు. బంగారు తామర పూలు దొరికే కొలనుకు దారి చూపాడు. 

భీముడి కుబేరుడి తోటలో సౌగంధిక కమలాలు వున్న సరోవరాన్ని చూశాడు. భీముడిని గమనించిన ఆ సరోవరాన్ని సంరక్షిస్తున్న పదివేల మంది రాక్షసులు అతడిని మందలించారు. అది కుబేరుడి తోట అని అక్కడికి ఎవరూ రాకూడదని చెప్పారు. తన వివరాలను చెప్పిన భీముడు తాను కొలనులోని సౌగంధిక కమలాలను తప్పక తీసుకుపోతానన్నాడు. తమ దొర కుబేరుడికి ఒక్క మాట చెప్పి తీసుకుపొమ్మని చెప్పారు వాళ్లు. సరోవరం అందరిదనీ ఆయన అనుమతి అవసరం లేదనీ అన్నాడు భీముడు. అంటూనే కొలనులోకి దిగి సౌగంధిక కమలాలను కోయసాగాడు. యక్షరాక్షసులకు, భీముడుకి యుద్ధం జరిగింది.

భీముడి సంగతి కుబేరుడికి పిర్యాదు చేశారు కాపలాదార్లు. విషయం అర్థం చేసుకున్న కుబేరుడు ప్రతిక్రియ చేయడం మానాడు. అలా భీముడు రాక్షస వీరులను గెలిచి తనకు కావలసినన్ని సౌగంధికా కమలాలను తీసుకున్నాడు. ఇంతలో అక్కడ ధర్మరాజుకు అపశకునాలు గోచరించగా అంతా కలిసి భీముడున్న చోటుకు వచ్చారు. కథ సుఖాంతం అయింది. భీముడు ద్రౌపదీదేవికి ఆమె కోరినన్ని సౌగంధికా కమలాలను బహుకరించాడు. అంతా కలిసి వెనక్కు పోయారు.                   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment