వల్లభి…భన్సాలీ…శాంతి
అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-4
(గుర్తుకొస్తున్నాయి)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (31-01-2023)
కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీల వర్గ పోరులో, ముఠా తగాదాలలో ఇరు
పక్షాల నుండి అనేకమంది హత్యకు గురైన నేపధ్యంలో, నాటి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు ముదిగొండ మండలం (అప్పట్లో
ఖమ్మం సమితి) లోని వల్లభి గ్రామం దళితులు బలయ్యారు. నీలం
సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళరావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల
వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం
సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి"
గ్రామం ఒక “భూ పోరాటానికి" వేదికైంది. దళితుల
భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికి, దళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసింది. దళితులను
భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో, అగ్రవర్ణాలకు చెందిన
కొందరు, పరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను
కూడగట్టుకుని, దళిత వాడపై దాడి చేయడంతో, పిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన
పరిస్థితి కలిగింది. అలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ
నాశనం చేశారు. వారి పశువులను తరిమి వేశారు. గృహోపకరణాలను పాడు చేశారు. మొత్తం మీద దళితులను
గ్రామం నుంచి బహిష్కరించారు.
దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాంరావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో
ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులకు ఇబ్బందులు
తొలగ లేదు. దేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని
ప్రచురించాయి. టైమ్, న్యూస్
వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, బ్రిడ్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన
సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయి. ఇక స్థానిక
రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి. ఢిల్లీలోని
కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసింది. బ్రహ్మానంద రెడ్డి తన
మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవరాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం
కనిపించలేదు. గ్రామంలో రిజర్వుడు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా మకాం వేశారు. అయినా మార్పు
కానరాలేదు.
సమస్యకు పరిష్కారం “గాంధేయ మార్గం” తప్ప మరోటి కాదని గ్రామ పెద్ద
అయితరాజు రాంరావు భావించారు. స్నేహితుల సహాయంతో ఆచార్య
భన్సాలిని ఆశ్రయించాడు. సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ
ఆధ్యాత్మిక వారసుడు, శాంతి, గ్రామ
స్వరాజ్యం, హరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్
ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావే, అనుంగు శిష్యుడు, ఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలి, పోరాటం
కన్నా శాంతే మేలని, తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క
చేయకుండా, సరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడా, వల్లభి గ్రామానికి వచ్చారు.
గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శాంతి యత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక
రామాలయంలో దీక్షకు దిగారు. ఆయనకు అంతకు ముందు ఆ గ్రామం
గురించి ఏ మాత్రం తెలియదు. ఆయనకు తెలియ చేయబడిందల్లా, ఆ గ్రామంలో, అగ్రవర్ణాల భూస్వాములకు, దళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలో, దళితులు
గ్రామ బహిష్కరణకు గురయ్యారని, వారు గ్రామంలోకి
రావడానికి తాను పూనుకోవాలని మాత్రమే. అంతే, వెనుకా-ముందు చూడ కుండా, హుటాహుటిన
బయల్దేరి, ఏ ఆర్భాటం చేయకుండా, నిరాహార దీక్షకు దిగారు. ఆయన డిమాండు
నెరవేరింది. ఆ దీక్షకు, ఒక
నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.
దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. చిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన
దీక్ష విరమించేది లేదని శపధం చేశారు. మొదట్లో
పట్టించుకోక పోయినా, ఒకట్రెండు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్ ఖండూభాయ్
దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి
అంగీకరించాల్సిందెవరో కాదు, కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం
వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నాయకులే!!! జిల్లా మంత్రుల
సమక్షంలో గవర్నర్, ముఖ్యమంత్రి కలిసి భన్సాలి
దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో
కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.
రాష్ట్రంలో, ఆ మాటకొస్తే, బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి (ఏకైక?) రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ (బ్లిట్జ్, టైం, న్యూస్ వీక్ లాంటి
మాగజైన్లు) వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన
కాంగ్రెస్ వర్గానికి మద్దతిచ్చారు. వల్లభిలో అయితే
పరిస్థితి మారింది కాని, ఆ ప్రాంత రాజకీయాలు మాత్రం
హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో
పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకొని క్రమేపీ పరిస్థితులు
మెరుగయ్యాయి.
ఆ నాడు దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద అయితరాజు రాంరావు కుమారుడు,
నాలుగు సంవత్సరాల క్రితం తన 76 వ ఏట మరణించిన స్వర్గీయ డాక్టర్ ఎపి రంగారావు,
హైదరాబాద్ నగరంలో వైద్య విద్యను అభ్యసించి, పైచదువులకు, ఉద్యోగానికి
ఇంగ్లాండ్ వెళ్లి, తిరిగొచ్చి, అందరిలా పట్టణాలలో కాకుండా, మారుమూల గిరిజన ప్రాంతమైన భద్రాచలం ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసి, అనేక సంస్కరణలు చేపట్టారు. పదవీ
విరమణ చేసిన తరువాత విశ్వ విఖ్యాతి గాంచిన 108 అంబులెన్స్ ,
104 ఆరోగ్య సేవల రూపశిల్పిగా ప్రసిద్ధికెక్కాడు. కాళోజీ పేరుమీద గొప్ప టెలీ
మెడిసిన్ కేంద్రాన్ని వల్లభి గ్రామంలో ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యదానం చేశాడు. పాతిక
సంవత్సరాల క్రితం శ్రీలంకలో చోటుచేసుకున్న అంతర్యుద్ధం సందర్భంగా భారత ప్రభుత్వ
రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక ప్రతినిధిగా భారత శాంతి దళాలతో కలిసి పనిచేసిన ఘనత
ఆయనది.