గర్వం, స్వాభిమానం సమంగా నటించే తార (జమున)
(నిర్మాత, దర్శకుడు తిలక్ మాటల్లో)
వనం జ్వాలా నరసింహారావు
సాక్షిదినపత్రిక (౨౯-01-2023)
తెలుగు చలన చిత్ర రంగంలో
ధృవతారామణిగా దశాబ్దాలపాటు ఒక వెలుగు వెలిగిన నటీమణి జమున మరణ వార్త విన్న తరువాత
ఆమె గురించి స్వర్గీయ కేబీ తిలక్ తన ఆత్మకథ నేను రాసిన సందర్భంగా ఆయన చెప్పిన
కొన్ని అంశాలు గుర్తుకొచ్చాయి. అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకునిగా తిలక్ చాలామందికి సుపరిచితుడే. పాతిక
సంవత్సరాల క్రితం ఆయన జీవిత చరిత్రను ఆయన మాటల్లోనే విని, రికార్డ్ చేసి, అక్షరీకరణ చేశాను. ఆ సమయంలో స్వర్గీయ జమున గురించి
ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
అనుపమ ఫిలిమ్స్ స్థాపించి, శరత్ బాబు నవల ఆధారంగా ఆరుద్ర రూపొందించిన స్క్రిప్ట్
తో, స్వీయ దర్శకత్వంలో, తన తొలి ప్రయత్నంగా ‘ముద్దుబిడ్డ’ సినిమా తీశారు
తిలక్. తిలక్ తో అప్పటికే ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీమతి
జి వరలక్ష్మి ప్రధాన భూమిక తనకే ఇవ్వాలన్ని ప్రతిపాదన చేసారు. కథానాయకుడు జగ్గయ్యతో పాటు ఆ సినిమాలో ప్రధాన భూమికకు ‘గర్వం’, ‘స్వాభిమానం’
సమపాళ్లలో నటించగల జమునను ఎంపికచేశారు తిలక్. ఆ పాత్ర కావాలని ఆశపడ్డ జి
వరలక్ష్మిని (రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్లలో నటించిన) జమున వదిన పాత్రకు
ఎంపికచేశారు. ప్రజానాట్య మండలికి చెందిన పలువురు కళాకారులు యీ సినమాలో
నటించారు.
జమున, జగ్గయ్యల
కాంబినేషన్ లో ఓ నాటక బృందం ఉండేదారోజుల్లో.
ఆపాటికే జమున పుట్టిల్లు సినిమాలో నటించారు. అయితే ఆమె సినీ కళాకారిణిగా
పేరు తెచ్చుకుని స్థిరపడిపోయేందుకు ముద్దు బిడ్డ సినిమానే కారణమని తిలక్ అభిప్రాయం.
సినిమాలోని జమున కారెక్టర్ మొదట్లో, ఓ బొమ్మతో ఆటపాలతో కాలం గడిపే ఆమాయక ‘రాధ’ పాత్ర. మొదటి షాట్లోనే జమున రాధ
పాత్రలో బొమ్మను పట్టుకుని “చిట్టి పొట్టి వరాల మూట-గుమ్మడి పండు గోగు పువ్వు” అనే
ఒక పాట పాడుతుంది.
అలా పాడుకుంటూ, బొమ్మతో ఆడుకుంటున్న రాధను (జమున) పలహారానికి పిలుస్తే
రాలేదని కినుక వహించిన అత్త సుభద్ర ఆమె చేతిలోని బొమ్మ లాక్కోవటంతో మూర్చపోతుంది.
మూర్చజబ్బు గల ఆమెను డాక్టర్ గా పనిచేసే జగ్గయ్యకు ఇచ్చి పెళ్లిచేస్తే మంచిదన్న
ఆలోచన కలగటమే తాపీగారు సూచించిన 'ముడి’. కథ అలా కొనసాగి జగ్గయ్య సోదరుడు నాగయ్య గారి బిడ్డనే ముద్దుబిడ్డ' గా జమున ఆమె తోటికోడలు పెంచుకుంటారు.
సినిమా
ఎనిమిది రీళ్ల షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగిందో అనుకోని సంఘటన, ఓ సన్నివేశంలో వదిన పాత్రలో నటిస్తున్న శ్రీమతి జి
వరలక్ష్మి తాను చెప్పాల్సిన ఓ డైలాగును మార్చమని కోరింది. అంగీకరించని తిలక్ ఆమెను
తీసేసి లక్ష్మీరాజ్యం గారిని వరలక్ష్మి స్థానంలో ఎంచుకున్నారు. షూటింగ్ తిరిగి
మొదటి నుండి ప్రారంభించారు. ముద్దుబిడ్డ సినిమా తోటికోడళ్లు జమున, లక్ష్మీరాజ్యం ఏదో విషయంలో సెట్లో కీచులాడుకున్నారు. కోపంతో
వున్న జమునకు సర్ది చెప్పటానికి సూర్యకాంతంగారిని పురమాయించారు తిలక్. రాయబారం
ఫలించింది. తోటికోడళ్లు సర్దుకుపోయారు. ముద్దుబిడ్డ సినిమాలోని కారెక్టర్లు మధు
(జగ్గయ్య), రాధ (జమున)ల వివాహం అయిన
తర్వాత ఏర్పాటు చేసిన రిసెప్షన్ సందర్భంగా చిత్రీకరించిన పాటలో పరోక్షంగా
ఆందం-అన్యోన్యం (జమున-జగ్గయ్య) గురించిన ప్రస్తావనతోపాటు, మూర్చ జబ్బున్న రాధ (జమున), డాక్టర్ మధుతో (జగ్గయ్య) ఎలా సంసారం చేయనున్నదో-చేయాలో కూడా
జానపద గీతంగా మలచారు శ్రీ ఆరుద్ర.
ముద్దుబిడ్డ
సినిమాలో ఇ వి సరోజ చేసిన డ్యాన్సు పూర్వరంగంలో, సినిమాలోని తోటి కోడళ్లు (జమున, లక్ష్మీరాజ్యం) తగవులాడుకుంటారు. జమున తన భర్త జగ్గయ్యతో తమ
స్వంత (కొత్త) ఇంటికి వెళ్తుంది. అయితే బావగారు (నాగయ్య), తోడికోడలు (లక్ష్మీరాజ్యం) రాకుండా గ్రహప్రవేశం జరుగటానికి
వీలు లేదంటుంది జమున. భర్త జగ్గయ్య వదినగారిని తీసుకొస్తారు ఒప్పించి. అయితే, ఆడబిడ్డ సూర్య కాంతం స్వార్థంతో తన కొడుకునే పిల్లల్లేని
జమున-జగ్గయ్యల కొడుకుచేయాలని ఆలోచించి, ‘ముద్దుబిడ్డ’ (నాగయ్య, లక్ష్మీరాజ్యం కొడుకు) తో ఎవరికి తెలియకుండా ఒట్టేయించుకుంటుంది. తాను తన
పెంపుడు తల్లి జమునకు కనిపిస్తే ఆమెకేదైనా అవుతుందని నమ్మకం కలిగిస్తుందా బిడ్డకు.
ఒక వేళ ఆవిషయం ఎవరినా చెప్తే తలపగిలిపోతుందని కూడా చెప్పింది.
సినిమా కథలో, మూర్చ జబ్బుతో బాధపడుతున్న జమున (తన దగ్గరి బొమ్మను అత్త
లాగేసుకున్న తర్వాత మూర్చపోవటంతో ప్రారంభమైన జబ్బు) కు తోడికోడలు లక్ష్మీరాజ్యం, బావగారు
నాగయ్య తమ బిడ్డను ఎత్తుకోవటానికి ఇస్తారు (జమున-జగ్గయ్యల పెళ్లి ఆయింతర్వాత).
బిడ్డ టచ్ తో మూర్చ జబ్బు పోతుంది. బొమ్మపోతే చంటిబిడ్డ దొరికినందుకు
మురిసిపోతుంది రాధ (జమున). లోగడ నాగయ్య, లక్ష్మీరాజ్యంలకు కలిగిన సంతానం పుట్టిన కొన్నేళ్లకు చనిపోతుంటారు. జమున
వచ్చింతర్వాత (మరదలుగా) ఆమె పెంపకంలో వున్న ఆ బిడ్డ బ్రతుకుతాడు. జమునను ‘యశోద’తో
లక్ష్మీరాజ్యంను ‘దేవకి’ తో పోలుస్తూ ‘ఎవరు కన్నారెవరు పెంచారు-నవనీత చోరుని గోపాల
బాలుని’ అనే పాట హిట్ ఆ రోజుల్లో.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు
వివాహాలకు మద్దతుగా వుండే థీమ్ తో, ఇష్టంలేని వివాహం రద్దయి కోరుకున్న వానితో
వివాహం జరిపించటం ఇతివృత్తంగా వుండే ఓ సామాజిక స్పృహతో తీసిన ఈడూ జోడూ సినిమాలో
జమున నటించింది. మహా బలిపురంలో ఔట్ డోర్ షూటింగ్ చేస్తున్న సందర్భంలో జపాన్ దేశం
నుండి అక్కడకు వచ్చింది ఓ పాంస్కృతిక కళాకారుల బృందం సమక్షంలో ఆరుద్ర రచించిన 'ఇదేమీలాహిరి
ఇదేవుగారడి’ అనే చక్కటి పాటను ఘంటసాల, సుశీల పాడగా
జగ్గయ్య, జమునలపై చిత్రీకరించారని చెప్పారు తిలక్. మరో
డ్యూయట్ పాట అదీ ఘంటసాల, సుశీల నేపధ్య
గానంలోనే చిత్రీకరించారు జగ్గయ్య జమునలపైన. అదీ ఆరుద్ర కలం నుండి వెలువడింది.
జమున తల్లి (మాలతి) మణిమాల తల్లి (సూర్య
కాంతం) తోటికోడళ్ళు. ఉమ్మడి కుటుంబం. జమున తండ్రి చనిపోతాడు. రెండు కుటుంబాలు ఒకే
ఇంట్లో వేర్వేరు భాగాల్లో వుంటుంటారు. జగ్గయ్య జమునను ప్రేమిస్తుంటే, జగ్గయ్యకు
తన కూతురు మణిమాలను ఇచ్చి వివాహం చేయాలని పథకం వేస్తుంటుంది సూర్యకాంతం. రమణారెడ్డి
సోదరి సూర్యకాంతంతో లాలూచీపడి జమునకు గుమ్మడితో వివాహం జరిపించేటందుకు రంగం తయారు
చేస్తాడు. జగ్గయ్య తల్లి హేమలతకు వ్రాసిన పుత్తరాలు చేతులు మారి జమునకు చేరడంతో, జగ్గయ్య
నుండి దూరం కావాలన్న భావన కలుగుతుంది. అటు జగ్గయ్య జమున ఉదాసీనత పట్ల బాధ పడుతుంటాడు.
గుమ్మడితో పెళ్లి తనకిష్టం లేదని చెప్తుంది జమున. సూర్యకాంతం బలవంతం జగ్గయ్యకు
దూరం కావాలన్న స్వయం నిర్ణయం, పెళ్లికి
అంగీకరింపచేస్తాయి జమునను. పెళ్లి పీటల మీద ‘మాంగల్యం తంతునాని' అని
బ్రాహ్మడు చదువుతుంటే, తప్ప త్రాగిన గుమ్మడి
మాంగల్యం కట్టులేకపోవటం, లైట్లు
ఆపుచేసి చీకట్లో సూర్యకాంతం జమున మెళ్లో తాళి కట్టటం నేపథ్యంలో జరుగుతాయి.
జగ్గయ్యకు శాంత (జమున) పెళ్లి విషయం
తెలియనీయరు. లక్ష్మీపతి కట్టించిన ఆసుపత్రిలో డాక్టరుగా చేరేటందుకు వస్తూ జమున
కొరకు చీర తెస్తాడు. ఆమెకు లక్ష్మీపతి (గుమ్మడి)తో పెళ్లయిందని సూర్యకాంతం ద్వారా
తెల్సుకుని ఆమె దగ్గరకెళ్లి దూషిస్తాడు నిందిస్తాడు. కోపంతో, స్మృతి
మర్చి మాట్లాడుతున్నావని చెంప పగల కొడ్తుంది జగ్గయ్యను జమున. ఫలితంగా పిచ్చోడయి
తిరుగుతుంటాడు. చివరకు అన్నివిషయాలు
బయటపడ్డాయి. జమన జగ్గయ్యలు ప్రేమికులని, పెళ్లి
చేసుకోలేకపోయారని తెలుసుకున్నగుమ్మడి, ఓ నిర్ణయానికి
వచ్చి, వారిద్దరికీ పెళ్లి చేయాలన్న
నిర్ణయానికొస్తాడు.
జమునను జగ్గయ్యతో వివాహం జరిపించేటందుకు
నిర్ణయించుకున్న తర్వాత ఆమె మెళ్లో తాళి తీయించే సీన్ వుంటుంది సినిమాలో. గుమ్మడి
జమునను బెదిరించి నేను కట్టని తాళి నీ మెళ్లో వుంటానికి వీల్లేదు అంటాడు. ఈ సీన్
చూపిన నాటి సెన్సార్ అధికారి శ్రీ జి పి శాస్త్రి గారు, తిలక్
ను తప్పుచేస్తున్నావని హెచ్చరిస్తాడు. అట్లా తీయకుండా, సెంటిమెంట్లను
దెబ్బతీయకుండా, ప్లాష్ బ్యాక్ లో విడాకులు ఇప్పించినట్లు
చూపించమంటాడు. ఎట్లాగో ఆ సీన్ ను మానేజ్ చేస్తాడు తిలక్. గుమ్మడి జమునలు చాలా
కాంపిటీటివ్ గా నటించారీ సినిమాలో.
ఇలా ఈ రెండు సినిమాలైన ‘ముద్దుబిడ్డ’, ‘ఈదూజోడూ’ లలో జమున
అద్భుతంగా నటించిన విషయం ఎంతో గొప్పగా చెప్పారు కేబీ తిలక్.
ఆ మహానటి ఆత్మకు శాంతి కలగాలి.
No comments:
Post a Comment