Wednesday, January 18, 2023

ఉద్యమాల గుమ్మంలో ఆనాడు .... అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-2 (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 ఉద్యమాల గుమ్మంలో ఆనాడు

అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-2

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (18-01-2023) 

ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి (ఇప్పటి ముదిగొండ మండలం) లోని మా గ్రామం వనంవారి కృష్ణాపురం చుట్టుపక్కల వున్న చాలా గ్రామాల్లో కమ్యూనిస్టు (మార్క్సిస్ట్), కాంగ్రెస్ పార్టీల నాయకుల, కార్యకర్తల మధ్య; అలాగే  కాంగ్రెస్ పార్టీలోని రెండు (జలగం-శీలం) వర్గాల మధ్య, జరిగిన హింసాకాండలో ఎంతోమంది చనిపోయారురాజకీయ హత్యలెన్నో జరిగాయిఖమ్మం జిల్లాకు ‘కమ్యూనిస్టుల కంచుకోట’, ‘ఉద్యమాల గుమ్మం’ అన్న పేరు నా చిన్నతనంనుండి వినేవాడినిఒకప్పుడు మా ప్రాంతంలో బలమైన ఉద్యమ నేపధ్యంలో నిర్మించబడిన కమ్యూనిస్ట్ పార్టీచీలిక అనంతరం బలహీన పడింది. కాకపోతే ఇప్పటికీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఓటు బాంక్, కాడర్ కొంతమేరకు పదిలంగానే వుందని చెప్పవచ్చు. 

డబ్బై దశకంలో పాలేరు సమితి, ఖమ్మం పంచాయితీ సమితిగా మారడం, మా చుట్టు పక్కల గ్రామాలన్నీ అందులోకి రావడం జరిగింది. సమితి సభ్యులలో గణనీయమైన సంఖ్య కలిగి వున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) బలమైన ప్రతి పక్షంగా వ్యవహరిస్తుండేది. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా వెంగళ్ రావు వర్గానికి చెందిన వ్యక్తి వుండేవాడు. ఖమ్మం సమితికి ఆయన శిష్యుడు సామినేని ఉపేంద్రయ్య అధ్యక్షుడు. గ్రామాలలో ముఠా తగాదాలను ప్రోత్సహించేవాడని అప్పట్లో ఆయనకు పేరుంది. ఖానా పురం, ముదిగొండ, వల్లభి గ్రామాలలో కక్షలు ప్రబలిపోవడానికి ఆయనే కారణం అంటారు.

కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలు, ఖమ్మం సమితి అధ్యక్షుడు జలగం మనిషి ఉపేంద్రయ్యపై, సిద్దారెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దారి తీశాయి. నాడు సిపిఎం పార్టీ పక్షాన ఖమ్మం ఎమ్మెల్యేగా వున్న రజబ్ అలీ సహాయంతో, సమితిలోని ఆ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని, తన పదవిని నిలబెట్టుకున్నాడు ఉపేంద్రయ్య. దరిమిలా రాజకీయంగా బలపడడానికి, గ్రామాలలోని భూస్వాములను చేరదీసి, కమ్యూనిస్టు నాయకుల, కార్యకర్తలపై దాడులు ప్రారంభించాడు ఉపేంద్రయ్య. కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరులైన కొందరు గ్రామ సర్పంచ్ లను, ఇతరులను కాంట్రాక్టుల ప్రలోభం చూపించి తనవైపు తిప్పుకుని, వారిసహాయంతో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా వున్న గ్రామాలైన గంధసిరి,  బాణా పురం, పమ్మి లాంటి గ్రామాల మీద దాడులు చేయించాడు. ప్రధానంగా బాణాపురంలో గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలోని కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేయసాగాడు ఉపేంద్రయ్య. భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించేందుకు, కమ్యూనిస్ట్ ల బలమైన గ్రామాలలో పోలీసు క్యాంపులు వెలిశాయి.

భూస్వాముల అండతో, పోలీసుల దాడులు పెరిగిపోయాయి. గుండాల దాడులు, కవ్వింపు చర్యలు, అప్పటి పోలీసులు బనాయించే దొంగ కేసులు నిత్య కృత్యమయ్యాయి. నాటి హోం మంత్రి జలగం వెంగళ్ రావు, బాణా పురం గ్రామానికి స్వయంగా వచ్చి, భూస్వాములతో సమావేశమై, వారికి అండగా వుంటానని హామీ ఇచ్చి వెళ్లాడు! ఇది జరిగిన కొన్నాళ్లకు, పమ్మి గ్రామంలో కమ్యూనిస్ట్ వ్యవసాయ కూలి సంఘ కార్యకర్త పెరుమాళ్ల చంద్రయ్యను పట్ట పగలే బండ రాళ్లతో కొట్టి చంపారు. ఆ వూళ్లో పోలీసు క్యాంపు కూడా వుండేదప్పుడు. కాకపోతే, క్యాంపులోని అలనాటి పోలీసులు గుండాలకే మద్దతిచ్చేవారు. మరి కొన్నాళ్లకు, మందా నారాయణ అనే మరో వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు అదే పమ్మి గ్రామంలో.

పమ్మి హత్యాకాండ, పోలీసు కాల్పులు, హంతకులకు సహాయ పడుతున్న అప్పటి పోలీసు వ్యవహార శైలి, ఇవన్నీ, బాణాపురం భూస్వాములలో ఉత్సాహాన్ని నింపింది. ఒక పథకం ప్రకారం, గండ్లూరి కిషన్ రావు కుడి భుజంలా పని చేస్తున్న ముక్కా చిన నర్సయ్యను 1970 వ సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో హత్య చేశారు. కోర్టు కేసుమీద ఖమ్మం వెళ్తున్న చిన నర్సయ్యను, వెళ్లే దారిలో, భూస్వాముల గుండాలు కాపు కాచి, గండ్ర గొడ్డళ్లు, బరిశెలతో ఆయనపై దాడి చేశారు.

ఇంతలో పంచాయితీ ఎన్నికలొచ్చాయి. ఏమైనా సరే, సాధ్యమై నన్ని గ్రామ పంచాయితీలను గెలిచి, సమితిని, జిల్లా పరిషత్, ఖమ్మం సమితి అధ్యక్ష పదవులను దక్కించుకోవాలని జలగం వర్గం, ఆయన అనుయాయుడు ఉపేంద్రయ్య పథకం రూపొందించారు. ముఖ్యంగా బాణా పురం గ్రామ పంచాయితీని గెలవాలని పంతం పూనారు. కమలాపురం, గంధ సిరి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) లకు దక్కాయి. ఎన్నికలు జరిగిన గ్రామాలలో చాలా భాగం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు, లేదా, సిద్దా రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్గం అభ్యర్థులు గెలిచారు. ఉపేంద్రయ్య వర్గానికి అతి తక్కువ సీట్లొచ్చాయి. బాణాపురం ఒక్క వార్డు మినహా అన్నీ సిపిఎం పార్టీ గెలుచుకుంది. గండ్లూరి కిషన్ రావు మళ్లీ సర్పంచ్ అయ్యాడు. ఎన్నికల సమయంలో భూస్వాములు చేయని అరాచకం లేదు. ఐనా, ఓటమి తప్పలేదు.

ఇక మాగ్రామానికి సంబంధించినంతవరకు, 1966 మార్చ్-ఏప్రిల్ నేలలో డిగ్రీ పరీక్షలు రాసిన తరువాత నా మకాం హైదరాబాద్ నుంచి మా గ్రామం వనంవారి కృష్ణా పురంకు మార్చాను. గ్రామానికి పోవడంతో, రాజకీయాలంటే ఆసక్తి కలగడం మొదలైంది. మా గ్రామ సర్పంచ్‌గా మొదటి నుంచీ పర్చూరి వీరభద్రయ్య అనే గొప్ప సహనశీలి వుండేవారు. ఆయన భావాలలో కమ్యూనిస్ట్ అయినప్పటికీ, గ్రామ సర్పంచ్‌గా కావడం మటుకు కాంగ్రెస్ వారి ఆశీస్సులతోనే! మా వూరు ప్రజల్లో చాలా భాగం కమ్యూనిస్ట్ అభిమానులైనప్పటికీ, గ్రామ పెత్తందార్ల దాష్టీకం కింద భయంతో, గ్రామ రాజకీయాలలో తలదూర్చడానికి భయపడేవారు. అలాంటి వాళ్లను కూడగట్టి ఒక గొడుగు కిందకు చేర్చే బాధ్యత తీసుకోవాలని భావించాను. చాలావరకు సఫలీకృతం అయ్యాను.

కమలాపురం సర్పంచ్, బాబాయి నర్సింగరావు, బాణాపురం సర్పంచ్ (మామయ్యా వరుసకు) గండ్లూరి కిషన్ రావు (ఇద్దరూ కమ్యూనిస్టు-మార్క్సిస్టులే), వల్లాపురంలో వుండే పెదనాన్న వనం శ్రీ రాంరావు (సిద్దారెడ్డి కాంగ్రెస్ వర్గం) గారు, గోకినేపల్లి వాస్తవ్యుడు, ప్రముఖ జిల్లా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకుడు రావెళ్ల సత్యం గారి ప్రోత్సాహం మాకు లభించింది. ఎన్నేళ్లగానో మా వూరిని కమ్యూనిస్ట్ పార్టీ పరం చేయాలని అనుకుంటుండే వాళ్లకు ఇదో మంచి అవకాశంగా దొరికింది. గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ అభిమానులు అంతా చేయి కలిపారు. ఎన్నికలు రావడం, పార్టీ రహితంగా (పరోక్ష మద్దతుతో) జరిగిన ఎన్నికలలో ఒక్క వార్డు మినహా అన్నీ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) మద్దతిచ్చిన అభ్యర్థులే గెలవడం, జరిగింది. నేను పోటీ చేయాలంటే నాకింకా ఓటింగ్ వయసు రాలేదప్పటికి. అప్పటి రాజకీయాలే వేరు!

No comments:

Post a Comment