Sunday, January 8, 2023

పాపాలన్నిటికీ మూలం పేరాశని, ఇంద్రియనిగ్రహం ఉత్తమ ధర్మమని చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-103 : వనం జ్వాలా నరసింహారావు

పాపాలన్నిటికీ మూలం పేరాశని, ఇంద్రియనిగ్రహం ఉత్తమ ధర్మమని చెప్పిన భీష్ముడు

 ఆస్వాదన-103

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-01-2023)

తన సందేహాలను సంతృప్తికరంగా, సందర్భోచిత కథల ఉదాహరణలతో తీరుస్తున్న భీష్ముడిని ఇంకా-ఇంకా అడగాలన్న కోరికతో మరో సందేహం వెలిబుచ్చాడు ధర్మరాజు. పాపానికి మూలం ఏదని, ఆ పాపం వుండే స్థానం ఏదో తెలియచెప్పమని కోరాడు. పాపాలన్నిటికీ మూలకారణం పేరాశ అంటూ భీష్ముడు ఇంకా వివరించాడు ఇలా. ‘పేరాశ కోరికల పట్ల నిలకడలేనితనాన్ని, కోపాన్ని, పగను, హింసాభావాన్ని, మరొకరి ఆస్తి, మరొకరి పెళ్లాం పట్ల కోరికను, దీనత్వాన్ని, సిగ్గు, ఓర్పు, నిజాలపట్ల ఏవగింపునీ పుట్టిస్తుంది. కాబట్టి లోభులను విడిచి పెట్టాలి’ అని అన్నాడు భీష్ముడు. విపత్తులకు, చెడు నడతకు అజ్ఞానమే ఆధారం అని అంటారని, ఆ అజ్ఞానం తీరుతెన్నులను తెలియచేయమని అడిగాడు ధర్మరాజు. కోపం, దుఃఖం, ప్రేమ, పగ, అహంకారం, గర్వం, తొందరపాటు, మందకొడితనం మొదలైన వాటి సంపర్కమే అజ్ఞానమని పండితుల అభిప్రాయమని, పేరాశపడడం, తెలివి లేకపోవడం అనేవి రెండూ సమాన ప్రయోజనం చేకూరుస్తాయని, లోభం వల్ల అజ్ఞానం పుట్టుతుందని, కాబట్టి లోభం వదలుకుంటే భోగాలు కలుగుతాయని భీష్ముడు చెప్పాడు.

తనకు సరైన జవాబు దొరికినందుకు సంతోషించిన ధర్మరాజు మరో ప్రశ్న వేశాడు. ధర్మాన్ని, న్యాయాన్ని అనేక విధాలుగా వింటుంటాం అని, వాటిలో ఉత్తమ ధర్మం ఎదో తనకు విశదమయ్యేట్లు చెప్పమని భీష్ముడిని కోరాడు. శాస్త్రజ్ఞానానికి అనుగుణంగా ధర్మాన్ని గురించి పండితులు రకరకాలుగా చెప్పినప్పటికీ, అన్ని ధర్మాలలోకి ఉత్తమమైన ధర్మం ‘దమం’ (ఇంద్రియ నిగ్రహం) అని, అది ముక్తిదాయకమని, గొప్ప పుణ్యమని, ధర్మాలలో నిగ్గని, దమానికి జ్ఞానం తోడైతే అందుకోలేని ఉన్నత దశలు వుండవని జవాబిచ్చాడు భీష్ముడు. ఇంకా ఇలా అన్నాడు భీష్ముడు: ‘ఆశ్రమాలు నాలుగింటిలో ఇంద్రియనిగ్రహాన్ని మించిన మంచి ధర్మం లేదు. ఇంద్రియనిగ్రహం కలవాడు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయిస్తాడు’.

ఆ తరువాత ధర్మరాజు తపస్సు తీరును వివరించమని భీష్ముడిని అడిగాడు. ధర్మాలన్నిటికీ తపస్సు మూలమని, ఆహార నియమమే తపస్సని, అదే మహా ధర్మమని, ఆ తపస్సంపన్నుడి ఇష్టప్రకారం సమస్త చరాచరవస్తు సముదాయము నడచుకొంటుందని, తపస్సు వల్ల పంచమహాపాతకాలు పటాపంచలవుతాయని, సత్యం, శుచి మొదలైనవి అలవడుతాయని, సమస్త కార్యసిద్ధులూ అందుబాటులోకి వస్తాయని భీష్ముడు వివరించాడు.

దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు మొదలైనవారంతా మెచ్చుకునే సత్యం స్వరూపాన్ని, దానిని అవలంభించే తీరును చెప్పమని ధర్మరాజు కోరాడు. జవాబుగా భీష్ముడు, అన్ని ప్రాణులపట్ల సమత, ఇంద్రియనిగ్రహం, ఓర్పు, పగలేకపోవడం, సిగ్గు, ధైర్యం, ఈర్ష్యలేకపోవడం, ప్రాణులకు మేలు చేయడం, హింసకు పాల్పడకపోవడం, యాగం చేయడం, దానం, ఓర్మి, నిజాయితీ మొదలైనవి సత్యం స్వరూపాలన్నాడు. సత్యం అన్ని ధర్మాలకు పాదులాంటిదని, యోగ మోక్షాలు అనే పుణ్యస్థానాలు సత్యం వల్లే ఒనగూడుతాయని, అబద్ధాన్ని మించిన కీడు మరొకటి లేదని, ఒక్క సత్యం చెప్పడం వల్ల వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం కలుగుతుందని చెప్పాడు. అబద్ధం ఆడడం పాపం అయినప్పటికీ, ఆడవారి విషయంలోనూ, వివాహాలప్పుడూ, పరిహాసాలప్పుడూ, చావు కలిగినప్పుడూ, సర్వస్వం కోల్పోతున్నప్పుడూ అబద్ధం చెప్పడం పాపం కాదన్నాడు భీష్ముడు.

కామక్రోధాది అరిషడ్వర్గాలు దేనివల్ల పుట్టుతాయో, గిట్టుతాయో చెప్పమని అడిగాడు ధర్మరాజు. కామం మనోభావం వల్ల పుట్టుతుందని, దాని రూపం ఇలాంటిది అని తెలుసుకోగలిగితే ఆ కోరిక పోతుందని, ఇతరులు చేసిన తప్పు వల్ల కోపం వస్తుందని, తరగని ఒర్పువల్ల అది తగ్గిపోతుందని, ప్రాణికోటి శాశ్వతం కాదనే తెలివిలేకపోవడం వల్ల లోభం పుట్టుతుందని, ఆ తెలివి పొందితే అది పోతుందని చెప్పాడు భీష్ముడు. అలాగే, అవివేకం వల్ల మోహం కలుగుతుందని, అధర్మం జోలికి పోకుంటే అది నశిస్తుందని, కులం, చదువు, సంపదల వల్ల గర్వం ఏర్పడుతుందని, వాటి పెంపుదలను తలపోస్తే అదే దూరమవుతుందని, సాత్త్వికగుణం కొరవడడం వల్ల పగ పుట్టుతుందని, మంచివారిని సేవించడం వల్ల అది తొలగుతుందని అన్నాడు. కామం మొదలైన ఆరు అరిషడ్వర్గాల వల్ల మనుష్యులకు అన్ని రకాల చెరుపులు కలుగుతుంటాయని, మనిషిలో ధైర్యం కొరవడితే ఆ ఆరు కూడా తోడేళ్ల మాదిరిగా కలబడుతాయని, ధైర్యవంతుల దరిదాపుల్లోకి కూడా రావని చెప్పాడు భీష్ముడు.

ఆ మర్నాడు ధర్మరాజు వచ్చీరావడంతోనే భీష్ముడిని సేవించి ఒక ప్రశ్న వేశాడు. రాజుకు కావాల్సినవారు, అక్కరలేనివారు ఎలాంటి వారై వుంటారో చెప్పమని అడిగాడు తాత భీష్ముడిని. జవాబుగా భీష్ముడు, ఓర్పు కలవారు, ధర్మశాస్త్రాలు తెలిసినవారు, సత్యవంతులు, చపలబుద్ధి లేనివారు, పొగరు, పేరాశ, కోపం లేనివారు, చక్కటి నడవడి కలవారు, మాటకారితనం వున్నవారు, పనులలో శ్రద్ధ కనపరిచేవారు సేవకులైతే తమ యజమానికి సకల సంపదలు సమకూరుస్తారన్నాడు. క్రూరులు, పేరాశపరులు, మూర్ఖులు, చాడీలు చెప్పేవారు, మందగొడి వారు, చేసిన మేలు మర్చిపోయేవారు, తెలివిమాలినవారు, అబద్ధాలు చెప్పేవారు, నిందపడేవారు, పిరికివారు, తెగింపులేనివారు, నీతిమాలినవారు, మిమితిమీరిన చెడు అలవాట్లున్నవారు సేవకులైతే రాజుకు ఆపద ముంచుకొస్తుందని చెప్పాడు. ఆయన చెప్పినదానికి సమర్థనగా నాడీజంఘడి వృత్తాంతాన్ని, కాశ్యప-గౌతమోపాఖ్యానాన్ని ఉదహరించాడు. చేసిన మేలు మరచిపోయినవాడికి పాప విముక్తి వుండదని, స్నేహితుడికి కీడు తలపెట్టడం చేసిన మేలు మరచిపోవడం కన్నా మించిన మహాపాపమని, అలాంటి వారిని వదలుకోవాలని, మేలుపొందాలనుకున్నవారు మంచి కులంలో పుట్టినవారితో, సుగుణాలు కలవాడితో, స్నేహం కోరుకునేవాడితో పొత్తు పెట్టుకోవాలని అన్నాడు భీష్ముడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment