స్వర్గీయ డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డికి (నివాళి)
తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నేత
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (03-01-2023)
తొలితరం ప్రత్యేక
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఆద్యుడు, నాయకుడు డాక్టర్ ఎంశ్రీధర్ రెడ్డి మరణించారన్న దుర్వార్త హృదయాన్ని కలచివేసింది.
సుమారు ఏబై సంవత్సరాలకు పైగా మా పరిచయం, స్నేహం కొనసాగింది. ఆయన మరణానికి సంతాపం తెలియ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్, శ్రీధర్ రెడ్డి తొలితరం
తెలంగాణ ఉద్యమకారుడని, ఆయన రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నాయకుడని, పేర్కొంటూ, తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన
కృషిని స్మరించుకున్నారు. 1969 ఉద్యమంలో క్రియాశీలంగా, కీలక పాత్రను పోషించారని, నమ్మిన విలువల కోసం శ్రీధర్ రెడ్డి కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని సిఎం అన్నారు.
నేను హైదరాబాద్ న్యూసైన్స్ కళాశాలలో 1966 లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు, శ్రీధర్ రెడ్డి విద్యార్థి సంఘం నాయకుడు. అప్పుడే మొదటిసారిగా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో, ఉస్మానియా
విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, నాటి ఉపకులపతి
డిఎస్ రెడ్డి వ్యవహారంలో ఘర్షణలు జరిగాయి. ఒక గ్రూపుకు
మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, ప్రస్తుతం
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ
సభ్యుడు కె కేశవరావు మార్గదర్శకత్వం వహించగా, మరొక
గ్రూపుకు ఎంశ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి,
నారాయణ దాస్, కమ్యూనిస్టు
పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. కోర్టులో డి ఎస్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా
కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరిగిప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్. ఉద్యమం
వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు.
నేను నా డిగ్రీ
చదువు పూర్తి చేసి మా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, మధ్య-మధ్యన హైదరాబాద్ వెళ్లివస్తుండే రోజుల్లో తోలి తరం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం
ఊపందుకుంటున్నది. ఉద్యమం ఆసాంతం ఆసక్తిగా గమనించడంతో పాటు ఉద్యమస్ఫూర్తికి
చేతనైనంత తోడ్పాటు అందించిన రోజులు. ఆ రోజులు ఇప్పటికీ అలా...అలా..ఒక్కొక్కటే
గుర్తుకొస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, రకరకాల మార్గాలను ఎంచుకోవడంలో భాగంగా, దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ
ప్రాంత విద్యార్థుల చొరవతో, ఖమ్మం జిల్లాల్లో, ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలలో, "ప్రత్యేక తెలంగాణ
రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం" అలా ఆరంభం అయింది.
1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ
జరిగింది. అది చిలికి చిలికి
గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. హక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం నాటి ముఖ్యమంత్రి
స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించగా దానికి
ఆయన స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు
తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా భావించారు.
కొత్తగూడెం, ఖమ్మంలో
ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి
నాయకుడు శ్రీధర్ రెడ్డి (నా కంటే సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ
సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి
నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర
స్థాయి నాయకుడనాలి.
ఆయన నాయకత్వంలోని
విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా
వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం, మధ్యలో ఖమ్మంలో విద్యార్థి
వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి.
చెన్నారెడ్డి
నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం, జైలుకెళ్లడం
జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న
రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ
ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి
ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి "తెలంగాణ ప్రజా సమితి" (టీపీఎస్) పేరుతో
బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. మలిదశ ఉద్యమానికి నాంది పలికాయి.
1968 నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన "రక్షణల అమలు" ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పలువురు సహాయం చేశారు. సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ
సంఘం అధ్యక్షుడు జె. చొక్కారావు, నూకల
రామచంద్రారెడ్డి, జి. సంజీవరెడ్డి, (జలగం
వెంగల్రావు?) వున్నారు. క్రమేపీ టి. అంజయ్య, ఎం. ఎం. హాషిం, జి. వి. సుధాకర్ రావు, బి. రాజారాం, కె. ఆర్. ఆమోస్, ట్. సదా లక్ష్మి, ఎస్. బి. గిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో
చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. కొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉద్యమం క్రమేపీ హింసాత్మకంగా మారి మూడొందల మంది పైగా
ప్రాణాలను కోల్పోయారు.
వేలాదిమంది తెలంగాణ
ప్రజా సమితి నాయకులు, విద్యార్థి నాయకులు జైళ్లలో బంధించబడిన దరిమిలా, రెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. పరిస్థితిని అదుపులో తేవడానికి వ్యూహాత్మకంగా నాటి
ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్
చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా
సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజి, రామచంద్రారెడ్డి, చొక్కారావులతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారు. ప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. శ్రీధర్ రెడ్డి లాంటి అసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా
సమితి నాయకులను మాత్రం పిలవలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడం, దాన్ని డాక్టర్ చెన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, చొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది.
వి. బి. రాజు చొరవతో, ఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైంది. మదన్ మోహన్, వెంకట్రామరెడ్డి, ఎస్. బి.గిరి, మల్లిఖార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయి. అణచివేత విధానాన్ని, హింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు
జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు
స్వీకరించారు. అదే సందర్భంలో
విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి పోటీ ప్రజా సమితిని స్థాపించి తన వ్యతిరేకతను
వ్యక్త పరిచాడు. చెన్నారెడ్డి
అధ్యక్ష పదవిని చేపట్టగానే, తెలంగాణ ప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుంది. శ్రీధర్ రెడ్డి నాయకత్వంలోని పార్టీ పెద్దగా ప్రభావం
చూపలేకపోయినా మేధావులను ఆకర్షించింది.
1971 సాధారణ ఎన్నికల్లో టీపీఎస్ రాజకీయ పార్టీగా బరిలోకి దిగి అన్ని స్థానాలకు పోటీచేసి, 11స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు
తెలియచేశారు. చివరకు ఉద్యమం
విరమణ కావడం, చెన్నారెడ్డి
నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం గత చరిత్ర.
శ్రీధర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఒక పదవి చేపట్టినప్పటికీ, రాజకీయంగా పెద్దగా ఎదగలేక పోయారు. ఆయన ధ్యాసంతా
ఎప్పుడూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన మీదే వుండేది. అడపాదడపా సమావేశాలు
నిర్వహించి ఏంచేయాలని సన్నిహితులను అడిగేవాడు. చివరగా ఒక్క మాట. నాకు 1973 లో
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో లైబ్రరీ సైన్స్ సీటు విషయంలో, నాకు మెరిట్ వున్నా
రానటువంటి పరిస్థితుల్లో హెచ్ వో డి ని ఒప్పించి, ఒక విద్యార్ధి నాయకుడిగా శ్రీధర్ రెడ్డి తెలంగాణకు చెందిన
నాకు అన్యాయం జరగకుండా చూశారు. అదెప్పటికీ మరిచి పోలేను నేను.
తెలంగాణ రాష్ట్రం
ఏర్పాటైన తరువాత అమితంగా సంతోషించిన వారిలో శ్రీధర్ రెడ్డి ముందు వరుసలో వుంటారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
No comments:
Post a Comment