వడ్రంగి పని, చద్ది అన్నం, నాటు వైద్యం
(గుర్తుకొస్తున్నాయి)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (04-01-2023)
మా
ఇంటి పక్కనే వడ్రంగి ఇల్లు వుండడంతో, చిన్నతనంలో,
స్నేహితులంతా కలిసి అక్కడకు వెళ్లే వాళ్లం. అక్కడ ‘కొలిమి’ లో ఇనుప
కడ్డీలను పెట్టి కాల్చడం, వాటిని సమ్మెట పోటుతో కొట్టడం,
కొలిమిలో నిప్పు ఆరిపోకుండా ఉపయోగించే ‘తిత్తులను’ వూదడానికి
ఎల్లప్పుడూ ఒక మనిషి వుండడం చూసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. అక్కడ వుండే ‘బాడిసె’
(గొడ్డలి లాంటి పరికరం) తో ఒక చెక్క తీసుకుని మేమూ చెక్కడం నేర్చుకోవడం బలే సరదాగా
వుండేది. జగన్నాధం వ్యవసాయ పనిముట్లయిన ‘అరకలు’, ‘నాగళ్లు’,
‘బురద నాగళ్లు’, ‘దంతెలు’, ‘బండి రోజాలు’ లాంటివి తయారు చేస్తుంటే ఆ నైపుణ్యం బలే ముచ్చటగా వుండేది.
ఆ పనితనానికి ఆశ్చర్యపోయే వాళ్లం. బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన
పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది
ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి ఇరుసు,
కాడి, చిర్రలు, బండి చక్రాల ఆకులు, సాయిశీలలు, తొట్టి, తయారు చేసే విధానం
కూడా చాలా కష్టమైంది. తొలకరి వర్షాలు పడుతుండగానే ఇలాంటి వ్యవసాయ పనిముట్లను బాగు
చేయించుకుని దున్నడానికి సిద్ధంగా వుండేవారు. బహుశా ఇప్పుడు బండి తయారు చేసేవారు
అరుదుగా వున్నారనవచ్చు. అన్నిటికీ ట్రాక్టర్లు, ట్రైలర్లు
వచ్చాయి.
ప్రయాణం
చేయడం సరదా కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు తరచూ పోయేవాళ్ళం. ఆ రోజుల్లో బండ్ల మీద
ప్రయాణాలు ఒక ప్రహసనంలా, కొంత ప్రమాదకరంగా కూడా వుండేది. ఇప్పటి లాగా సరైన రహదారి
వుండేదికాదు. వాగులు, వంకలు దాటి పోవాల్సి వచ్చేది. ఎడ్ల బండిలో వాటి
గుండా పోవడం కొంత ప్రమాదకరంగా వుండేది. అంతేకాకుండా, రహదారి
(బాట అనే వారు) పొడుగూతా ‘వరకటాలు’ (ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రదేశాలు)
వుండేవి. బండి ఆ మార్గాన పోతున్నప్పుడు ఒరిగి పోయి పడిపోయిన సందర్భాలు అనేకం. అలా
ఒకసారి నా కాలుకు ప్రమాదకరమైన గాయం కూడా అయింది. సుమారు నెల రోజులపాటు చికిత్స
చేయించుకోవాల్సి వచ్చింది. అలాగే కొన్ని గ్రామాలలో పొగరుబోతు ‘ఆబోతులు’ వుండేవి. అవి బండి వెంట పడి
తరుముకుంటూ వస్తుంటే, ఎద్దులు భయపడి బండిని బోల్తా పడవేసేవి.
అదోరకమైన ప్రమాదం.
జిల్లా
కేంద్రమైన ఖమ్మం పోవాలంటే ప్రయాణం ఇబ్బందికరంగా వున్నప్పటికీ మొత్తం మీద బలే
సరదాగా వుండేది. మా వూరికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన వున్న ముదిగొండకు బండి
కట్టుకుని వెళ్లి, బస్సు ఎక్కి ఖమ్మం చేరుకోవాలి. అక్కడ సాధారణంగా బస్సులను ఆపక పోయేవారు. ముదిగొండ దాకా
కట్టు కొచ్చిన బండిని ఖమ్మం వరకు పొడిగించే వాళ్లం. ప్రయాణం చాలా బడలికగా సాగేది.
ఈ బాధంతా ఎందుకని, ఒక్కోసారి సరాసరి ఖమ్మం వేరే మార్గం గుండా
బండి మీద వెళ్లే వాళ్లం. లేకపోతే, మరో దిక్కుగా ప్రయాణం చేసి,
చింతకాని కాని, పందిళ్లపల్లి కాని బండి మీద
చేరుకుని, రైలెక్కి ఖమ్మం వెల్లే వాళ్లం. ఖమ్మం సరాసరి
వెళ్లాలన్నా, చింతకాని వెళ్లాలన్నా మార్గమధ్యంలో వున్న
"మునేరు" దాటాలి. ఎండాకాలం పర్వాలేదు కాని, వర్షాకాలం
అది దాటడం కష్టం-ప్రమాదకరం. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఏటి దగ్గర
కూర్చుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పలహారమో, చద్ది అన్నమో (మామిడికాయ వూరకాయ కలుపుకుని) తింటుంటే బలే మజా వచ్చేది.
తిన్నంత తిని, కడుపు నిండా ఆ ఏటి నీళ్లే తాగే వాళ్లం. నేను
ఖమ్మం లో చదువుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి మా వూరు గుండా మొదట్లో మట్టి
రోడ్డు, తరువాత మెటల్ రోడ్డు, మరి కొంత
కాలానికి డాంబర్ రోడ్డు, డబుల్ రోడ్డు వేశారు. హైదరాబాద్ నుండి 3 గంటల్లో మా వూరు
చేరుకోవచ్చు.
ఏబై-అరవై
ఏళ్ల కింద గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" (వంట్లో బాగా లేక పోతే-జ్వరం లాంటిది
వస్తే) చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో
వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి
వారు, ఆయుర్వేదం వారు, పాము-తేలు
మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు, ఇలా అన్ని రకాల
వాళ్లు వుండేవారు. మా వూరిలో ఇద్దరుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి.
ఇద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు
ఎంజా, మలేరియా-చలి జ్వరం) ఏ.పీ.సీ టాబ్లెట్లు, ఒక సీసాలో ‘రంగు
నీళ్లు’ ఇచ్చేవారు. తగ్గితే తగ్గినట్లు, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో. వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే,
ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే
వాళ్లు. ఖమ్మంలో కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు. ఇప్పుడైతే
ఖమ్మంలో వందలాది మంది ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, అంతే సంఖ్యలో నర్సింగ్ హోంలు వున్నాయి. అప్పట్లో
ఇంకా డయాగ్నాస్టిక్ టెస్టులు, యాంటీబయాటిక్స్ ఉపయోగం పాపులర్
కాలేదు.
నా చిన్నతనంలో గ్రామాలలో ‘గత్తర’ (కలరా),
‘స్పోటకం-పాటకం’ (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి.
వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు
పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకా’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. వారు ఒకచోట
మకాం వేసి, గ్రామంలోని అందరినీ అక్కడకు రప్పించి ఇంజక్షన్లు,
టీకాలు ఇచ్చేవారు. టీకాలు వేసిన చోట పెద్ద పుండులాగా అయి, ఒక నెల రోజుల తరువాత పెద్ద మచ్చలాగా పడేది. నాకు, నా
చేతి భుజం మీద ఆ మచ్చ ఇంకా వుంది. ఇప్పుడైతే స్మాల్ పాక్స్ పూర్తిగా మాయమైంది.
ఆ
రోజులతో పోలిస్తే, తెలంగాణ గ్రామాలలో ఇప్పుడు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా, డబుల్
రోడ్ డాంబర్ రహదారి, ప్రభుత్వ బస్సులు, 108 అంబులెన్స్ సేవలు, పల్లె దవాఖానాలు, క్వాలిఫైడ్ డాక్టర్లు, నీటిపారుదల
ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యం, భగీరథ ద్వారా తాగునీరు, పెట్రోల్ బంక్, గ్రామాలలో స్కూటర్లు, కార్లు, లాండ్, మొబైల్ ఫోన్లు, మార్గ
మద్యంలో వున్న ఏరు మీద వంతెన, పలకా, బలపం
పట్టిన చేతుల్లో కంప్యూటర్లు, సెలూన్లు, ఇస్త్రీ షాపులు, వెజ్-నాన్ వెజ్ హోటళ్లు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో. ముఖ్యంగా గత ఎనిమిది సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది, అయినా ఇంకా, ఇంకా జరగాలని ప్రజలనుకోవడంసహజమే!
వడ్రంగి అంటే చెక్కతో పని చేసేవాడు. ఇనుముతో పని చేసే వారిని కమ్మరి అంటారు.
ReplyDelete