Sunday, January 29, 2023

పాపపుణ్యాలు నరుడిని వదలవని, సృష్టి అంతా పంచభూతాత్మకమని చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-105 : వనం జ్వాలా నరసింహారావు

 పాపపుణ్యాలు నరుడిని వదలవని,

సృష్టి అంతా పంచభూతాత్మకమని చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-105

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (30-01-2023)

భీష్ముడు చెప్పిన అజగర వచనాలను విన్న ధర్మరాజు తన తదుపరి ప్రశ్నగా, ‘బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్ధిబలం అనే నాలుగింటిలో దేనివల్ల నరుడికి గొప్ప కీర్తి కలుగుతుంది అని తాతగారిని అడిగాడు. జీవితాన సర్వాంతర్యామి ప్రజ్ఞ అని, జీవనంలోని సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, సర్వజీవన వ్యాపారాలు ప్రజ్ఞాజనితాలే అని, కాబట్టి ప్రజ్ఞ కీర్తికరమని అనడం నిశ్చయమని, అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాశ్రయమని భీష్ముడు సమాధానం ఇచ్చాడు.

నరుడు యజ్ఞాలలాగా చేస్తుండే దానం, తపస్సు, పెద్దల సేవ అనే పనులన్నీ ఏవిధంగా మార్పు చెందుతాయని, వాటి పర్యవసానం ఆ నరుడికి ఎట్లా చెందుతుందని, వాటి ఫలితాన్ని అతడెలా అందుకొంటాడని, స్పష్టం చేయమని అడిగాడు భీష్ముడిని ధర్మరాజు.

జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు: ‘శుభం వెంట శుభం, అశుభం వెంట అశుభం ఎడం లేకుండా వచ్చి పడుతుంటాయి. అలాగే భయం మీద భయం వెన్నంటి మనిషిని కుంగదీస్తుంది. చేటుమీద చేటు, కీడుమీద కీడు, పరుగు పరుగున వచ్చి మనిషిని కమ్ముకుంటాయి. ఈ స్థితిలో నరుడు ఒక కీడునుండి మరొక కీడును ఎదుర్కొంటూ చెడు పనుల బారిన పడి చెడుగై మిగులుతాడు. నరుడిని ధర్మం మరొక ధర్మానికి నడిపించి అతడికి శుభపరంపర కలిగేట్లు చేస్తుంది. అదే అధర్మమైతే వ్యతిరేక దిశలో సాగి, ఫలితాలు కూడా వ్యతిరేకంగా వుంటాయి. నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడలాగా వెన్నంటి వుంటూ, అతడు చనిపోతే అవీ అతడిని అనుసరించి పరలోకాలకు వెళ్లుతాయి. అతడు జీవించి వుంటే అవీ అతడితో పాటే జీవిస్తూ అతడు చేసే ప్రతి పనిమీదా తమ ప్రాభవాన్ని చూపుతూ వుంటాయి. నరుడు బతికినా, చనిపోయినా అతడు చేసిన పాపపుణ్యాలు మాత్రం అతడిని వదలవు. తమ ప్రభావాన్ని చూపుతూనే వుంటాయి.

‘సృష్టిని ఎవరు ఏవిధంగా కలిగించారో తెలపమని అడిగాడు ధర్మరాజు. ఆయన ప్రశ్నకు సమాధానం భరద్వాజ ఋషికి భృగు మహర్షి వివరించిన విషయాలలో లభ్యమవుతుందని అంటూ ఆయన మాటలను చెప్పాడు భీష్ముడు. విష్ణువు నాశనం, అంతం లేనివాడని, అతడు మనస్సులో సృష్టిని నిర్మించాలనుకొని ముందుగా తనలోని వెయ్యో వంతులో అవ్యక్తుడు అనేవాడిని పుట్టించాడని, ఆ అవ్యక్తుడు జరామరణాలు లేనివాడని, సాటిలేనివాడని, అతడి వల్ల ప్రకృతితత్త్వం కలిగిందని, అతడు దివ్యకాంతితో నిండిన ఒక పద్మాన్ని కలిగించాడని, ఆ పద్మం నుండి బ్రహ్మ ఉద్భవించాడని భీష్ముడు అన్నాడు. ఆ బ్రహ్మ భూమి మొదలైన ఎల్ల భూతాలను తన శరీరంలాగా ధరించి వుంటాడని, అలా నారాయణుడి వల్ల లోకం పుట్టిందని చెప్పాడు. సృష్టి రహస్యం వివరాలను భృగు మహర్షి మాటలుగా ఇంకా చెప్పుకుంటూ పోయాడు భీష్ముడు. 

 

 ‘బ్రహ్మ శరీరానికి సృష్టిలోని పర్వతాలు ఎముకలు, భూమి కొవ్వు- మాంసం, సముద్రాలు నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్పు, నిప్పు వెలుతురు, నదులు నరాలు, సూర్యచంద్రులు కళ్లు, పైలోకం తల, పాతాళలోకం కాళ్ల అడుగులు, దిక్కులు చేతులు.....ఇలా అంతం లేని శరీరం కలవాడు నారాయణుడు. బ్రహ్మ విష్ణు మానస పుత్రుడు. ఆయనకు పీఠంగా పద్మం నిర్మించడం జరిగింది. పద్మం వాస్తవానికి భూమి అని అనాలి. దానికి ఆకాశమే శీర్షంగా కల మేరుపర్వతం అందమైన కర్ణిక, అక్కడి నుండి బ్రహ్మదేవుడు సకల చరాచర జంతు సమూహాన్ని సృజించే భారాన్ని వహిస్తున్నాడు. సృష్టిలో చేష్టలు, శబ్దాలు, స్రావాలు, వేడిమి, గట్టితనం ఏర్పడడానికి పంచ మహాభూతాలు ఆవిష్కరించడం జరిగింది. చేష్టలు వాయురూపాన, శబ్దాలు ఆకాశం ద్వారా, స్రావాలు నీటివల్ల, వేడిమి నిప్పునుండి, గట్టితనం భూమివల్ల కలిగాయి. కాబట్టి పంచ మహాభూతాల అవసరం ఆ విధంగా ఏర్పడింది’.

‘పంచ భూతాల కారణంగా సృష్టిలో కనిపించే రెండు విధాలైన పదార్థాలు-జంగమాలు (తిరుగాడేవి), స్థావారాలు (నిలిచి వుండేవి) ఏర్పడ్డాయి. సృష్టి సర్వస్వం ఆ జంగమ స్థావరాత్మకమే. స్థావరమైన చెట్టులో పంచభూతాల లక్షణాలు వ్యక్తమౌతాయి. ఉదాహరణకు పిడుగుపాటుకు చెట్టు వికృతిని పొందడం. కాబట్టి చెట్టును పంచభూతాత్మకమైనదిగా అంగీకరించాలి. సృష్టి అంతా పంచభూతాత్మకం. ఇతరమైనదేదీ లేదు. పదార్థాలు, వాటిని గ్రహించే ఇంద్రియాలు, వాటిని నియంత్రించే మనస్సు, వరుసగా అనుభవ క్రియకు సాధనాలు. అనుభోక్త లోపలి జీవుడు. అతడే అంతరాత్మ. అతడు పదార్థాలను, ఇంద్రియాలను, మనస్సును చూస్తూ పంచభూతాల స్వభావాలను అనుభవిస్తాడు. అనుభవించి తత్ఫలితంగా సుఖాన్నో, దుఃఖాన్నో పొందుతాడు. కాబట్టి అనుభోక్త అంతరాత్మ. అతడి కింద మనస్సు, దాని అధీనంలో ఇంద్రియాలు, ఇంద్రియాల దగ్గర పదార్థాలు, ఇదీ కిందినుండి చూస్తే క్రమం’.

‘బ్రహ్మదేవుడు మొదట బ్రాహ్మణులను సృజించాడు. తరువాత క్షత్రియ, వైశ్య, శూద్రులను పుట్టించాడు. ఈ నాలుగు వర్ణాల వారిలో ఏజాతి వారైనా తమ వృత్తులు వదలి అన్యుల వృత్తులు స్వీకరిస్తే వారికి ఆ వృత్తి ఏర్పడుతుంది. సత్యమే వేదం. సత్యమే తపస్సు. సత్యవ్రతాన్ని పాటిస్తే తపస్సు చేసినట్లే. సృష్టిలో ప్రజాసంతతిని సత్యమే సృష్టిస్తున్నది. లోకం నిలిచి వుండడానికి కారణం సత్యమే. ఈ విధంగా లోక సృష్టికి, లోకస్థితికి ఆధారమైన ఈ సత్యం అసత్యం వల్ల కప్పబడిపోతున్నది. సత్యమంటే ధర్మం, కాంతి, జ్ఞానం, స్వర్గం, సుఖం అని అర్థాలు. అసత్యమంటే పాపం, చీకటి, తెలివితక్కువతనం, నరకం, దుఃఖం అని గ్రహించాలి. లోకంలోని మంచి మొత్తం సత్యం కాగా, చెడంతా అసత్యమే. బాధలు రెండు రకాలు-ఒకటి శారీరక, రెండు మానసిక. నియమనిష్టలతో నియంత్రించ గలుగుతే ఇవి నరుడిని బాధించవు.

‘బ్రహ్మచారిగా, గృహస్థుడుగా, వానప్రస్థుడుగా, సన్న్యాసిగా మానవుడు ఆశ్రమ ధర్మాలను పాటించాలి. బ్రహ్మచర్యం నాలుగు ఆశ్రమాలలో మొదటిది. బ్రహ్మచారి గురుభక్తి కలిగి నిరంతరం వేదాభ్యాసం చేస్తూ వుండాలి. త్రికాలం హోమాలు చేయాలి. ఇదీ బ్రాహ్మణ ధర్మం. ముందుగా అతిథి సత్కారం చేసి, అ ఆతరువాత భోజన పానీయాదులను స్వీకరిస్తూ వుండడం గృహస్థుడి ధర్మం, వానప్రస్థ ఆశ్రమానికి ఆహారం, కందమూలాలు, కూరలు, పండ్లు మాత్రమే. అతడికి పడక నేలమీదే. సన్న్యాసాశ్రమంలో మనిషి అనాసక్త ప్రవృత్తితో బిచ్చమే జీవనంగా శాంతితో మెలగాలి. ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలను నియమంగా, ప్రయోజన కాంక్షతో కాకుండా ఆచరిస్తే తప్పకుండా ముక్తిపదం లభిస్తుంది’.

భృగు మహర్షి భరద్వాజ మునికి వివిరించిన ధర్మాలను భీష్ముడు ధర్మరాజుకు తెలియ చేసిన తరువాత తనకు ఆచార విధులను వినాలనే కోరిక వున్నదని అన్నాడు ధర్మరాజు. చెడు నడత సజ్జనులను, దుర్జనులను ఇద్దరినీ కష్టపెట్టుతుందని, కాబట్టి నడతను గురించి వినడం చాలా మంచిదని అంటూ అవేమిటో తెలియచేశాడు భీష్ముడు. ‘రాజమార్గంలో, సభలో, పశువుల మందలో మలమూత్ర విసర్జన చేయకూడదు. శుచిగా ఆచమనం చేసి నిలకడగా నీట మునగాలి. సంధ్యవేళలలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పూజించాలి. సూర్యుడు పొడిచేటప్పుడు, కుంకేటప్పుడు నిద్రపోకుండా వుండాలి. పాద్య అర్ఘ్యస్నానాదికాలు ముగిసిన తరువాత భుజించాలి. అన్నాన్ని నిందించకూడదు. తడి కాళ్లతో నిద్రపోకూడదు’ అని అంటూ వీటిని ఆచారాలాని అంటారని చెప్పాడు భీష్ముడు.

భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు. ‘ఉదయించే సూర్యుడిని చూడకూడదు. ఇతర స్త్రీ వివస్త్రగా వున్నప్పుడు చూడకూడదు. తన మలాన్ని తాను చూస్తే కీడు కలుగుతుంది. ఈ మూడూ చూడరానివి. ఇక తన పాపాన్ని తాను దాచిపెట్టడం చేయాల్సిన పని కాదు. సంభోగక్రియను గుప్తంగా వుంచడం, గురువును సేవించడం, బ్రాహ్మణులను కీర్తించడం చేస్తే నరుడి ఆయుస్సు పెరుగుతుంది. వీటి మూలాన నరుడు సంపత్కరమైన పైలోకాలకు చేరుకోగలడు’.

ఆచారం ధర్మానికి మూలమని, ఇది అనూచానంగా, పరంపరగా మానవ సమూహంలో ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంలాగా అందుతూ వుంటుందని, అయితే ఈ సుదీర్ఘ కాలవాహినిలో కొన్ని ఆచారాలు కాలం చెల్లి అసందర్భాలుగా, అసంగతాలుగా కూడా మారుతూ వుంటాయని, వివేకైన నరుడు కాలానుగుణమైన మార్పుతో ఆచారాన్ని స్వీకరించాలని, ఈ విషయాలన్నీ విశ్లేషిస్తూ రాశారు డాక్టర్ ఆకురాతి పున్నారావు గారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment