Wednesday, January 18, 2023

తొలిదశ ఉద్యమ గుమ్మం ఖమ్మం : వనం జ్వాలా నరసింహారావు

 తొలిదశ ఉద్యమ గుమ్మం ఖమ్మం

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ (18-01-2023)

భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత, ఖమ్మం పట్టణంలో జరుగుతున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లా కేంద్ర బిందువుగా  తొలిదశ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా,  ఏవో కొన్ని రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి కలిగించి, తెలంగాణ నినాదాన్ని, ఎప్పటికప్పుడు పాలక పక్షాలు విజయవంతంగా పక్కదారి పట్టించగలిగాయి. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ అంటూ ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది ప్రభుత్వం.

దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో ఎదురు తిరగాలన్న కాంక్ష బలీయం కావడం, అది  క్రమేపీ బలీయమైన ఉద్యమరూపంగా రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, ఐదున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో, ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. ఆటుపోటులను ఎదుర్కొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోయి, కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తన అస్తిత్వాన్ని కాపాడుకొని, అభివృద్ధిపథంలో దూసుకుపోతూ, దేశానికే తెలంగాణ రాష్ట్రం మోడల్ ఒక ఆదర్శమైంది.

 1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో, ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన విషయంలో జరిపిన న్యాయమైన హక్కులకొరకు పోరాటంతో తొలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, ఖమ్మం కళాశాలలో చదువుకుంటున్న రవీంద్రనాథ్ అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ పట్టణంలోని గాంధిచౌక్ లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి దారితీసింది. హక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించగా, ఆయన స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించారు.

కొత్తగూడెం, ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు ఎం శ్రీధర్ రెడ్డి రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమై, ‘విద్యార్థి కార్యాచరణ కమిటీ’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వారంతా డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి.

చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం, మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం, జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

1968 (నవంబర్-డిసెంబర్ నెలల్లో అనుకుంటా) లో జరిగిన "రక్షణల అమలు" ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జె. చొక్కా రావు, రాష్ట్ర పంచాయితీ మండలి అధ్యక్షుడు జలగం వెంగళరావు, నూకల రామచంద్రారెడ్డి, జి. సంజీవరెడ్డి వున్నారు. వారి అనుయాయులు కొందరు అలనాటి ఉద్యమంలో పాల్గొన్నారు కూడా. క్రమేపీ టి. అంజయ్య, ఎం. ఎం. హాషిం, జి. వి. సుధాకర్ రావు, బి. రాజారాం, కె. ఆర్. ఆమోస్, ట్. సదా లక్ష్మి, ఎస్. బి. గిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. కొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో ఉద్యమం క్రమేపీ మిలిటెంటుగా మార సాగింది. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు.

పునాదులు కదిలిన ప్రభుత్వం పోలీసుకు సహాయపడేందుకు, సైన్యాన్ని పిలిపించింది. ఎందరో విద్యార్థులను, తెలంగాణ ప్రజా సమితి నాయకులను, అమాయకులను జైళ్లలో నిర్బంధించారు. రెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. పరిస్థితిని అదుపులో తేవడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్ చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజి, రామచంద్రారెడ్డి, చొక్కా రావు లతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారు. ప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. అసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా సమితి నాయకులను పిలవలేదు. మదన్ మోహన్ జైల్లో వున్నారప్పుడు. ఢిల్లీ సమావేశంలో ఏ అంగీకారం కుదరలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడం, దాన్ని  డాక్టర్ చెన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, చొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది. 

వి. బి. రాజు చొరవతో, ఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైంది. మదన్ మోహన్, వెంకట్రామరెడ్డి, ఎస్. బి. గిరి, మల్లిఖార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయి. అణచివేత విధానాన్ని, హింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టగానే, ప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుంది. కొన్ని వనరులు కూడా చేకూర సాగాయి. ఉద్యమం కూడా తీవ్రమైంది. సాయుధ పోలీసుల రక్షణ లేకుండా ముఖ్యమంత్రి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలానికి ఎన్. జీ. వోల సంఘం నాయకుడు ఆమోస్‍ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సత్యాగ్రహాలు చేసి కొన్ని వందల-వేల మంది అరెస్ట్ అయ్యారు. లాఠీ చార్జీలు నిత్యకృత్యమయ్యాయి. పరిస్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది. రాజధాని హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించబడింది. ఢిల్లీలో వున్న ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కా రావును వెంట పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధి, హుటాహుటిన ఒకనాడు హైదరాబాద్ వచ్చింది. నగరంలో రాత్రికి రాత్రే పర్యటించి తెల్లవారు ఝామున ఢిల్లీ వెళ్లి పోయారు.  

కొద్ది దినాల తరువాత, ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. దాంతో పాటే మరో విడత చర్చలకు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ప్రభృతులను ప్రభుత్వం ఆహ్వానించింది. చర్చలవలన ఏ ఫలితం చేకూరలేదు. ఉద్యమం నిలుపు చేయాలని మొరార్జీ దేశాయ్, వై. బి. చవాన్ ప్రభుత్వ పక్షాన కోరడం, అది అసంభవమని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ లు స్పష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన నాయకులకు ఘన స్వాగతం లభించింది.

డాక్టర్ జి. ఎస్. మెల్కోటే, సంగం లక్ష్మీబాయి తమ రాజీనామా లేఖలను ప్రజా సమితి అధ్యక్షుడికి అందచేశారు. అదే రోజు రాత్రి నారాయణ గుడాలోని స్నేహితుడు డాక్టర్ సుదర్శన రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించసాగారు పోలీసులు. చెన్నారెడ్డితో పాటే, ఏడెనిమిది మంది శాసన సభ సభ్యులను, సుమారు పాతిక మంది ఇతర ప్రముఖులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజునుంచి వందల సంఖ్యలో విద్యార్థి నాయకులను ప్రజా సమితి కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. చెన్నారెడ్డి స్థానంలో మదన్ మోహన్ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన తరువాత టి సదాలక్ష్మి ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు, ఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలోనే, బి. వి. గురుమూర్తి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి కొందరి మంత్రుల రాజీనామాను ఆపు చేసేందుకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన రాజీనామాను అధిష్టానానికి సమర్పించారు. ఆ రాజీనామాను తమ విజయంగా భావించిన లక్షలాది మంది తెలంగాణ వాదులు రోడ్ల పైకొచ్చి పండుగ చేసుకున్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపుకున్నారు. పరిస్థితి పోలీసుల అదుపు తప్పే స్థాయికి చేరుకుంది మరో మారు. ముఖ్యమంత్రి తరహాలోనే కొందరు తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అయితే చేశాడు కాని, పదవిలో కొనసాగడానికి కాసు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చి, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పేరుతో కాసుకు మద్దతు కూడగట్టారు కామరాజ్ నాడార్, నిజలింగప్పలు. బ్రహ్మానంద రెడ్డి కొనసాగాడు. ఆయన మంత్రివర్గంలో జె. వి. నరసింగ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఆ తరువాత జరిగిన శాసన సభ సమావేశాలలో, గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ ప్రసంగం, అర్థాంతరంగా ముగిసింది. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు జరుగుతుండగా, కొందరు విద్యార్థులు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి, మంత్రులపై కోడి గుడ్లు, టొమాటోలు విసిరారు. మరో సంఘటనలో ఒక యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌పైన బాంబు విసిరాడు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న నాయకుల విడుదలకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నారు. చివరకు డిటెన్యూలందరినీ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దరిమిలా ఉద్యమ ఉదృతి అనేక కారణాల వల్ల తగ్గింది.

1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం ఒక అడుగు వెనక్కు వేసింది. ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం నీరుకారి పోయింది.

ఆ నేపధ్యంలో 2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి, 13 సంవత్సరాల శాంతియుత పోరాటం ద్వారా జూన్ 2, 2014 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జయప్రదంగా సాధించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ నమూనా దేశానికి ఆదర్శం అవుతున్న నేపధ్యంలో డిసెంబర్ 9, 2022 న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి గా మారింది. జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి, రాజకీయాలలో గుణాత్మక మార్పుకు, ఖమ్మం వేదికగా భారీ బహిరంగ జరుగుతున్నది. ఆద్యతన భవిష్యత్తులో కేంద్రంలో అధికార చేపట్టడానికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ దగ్గరవుతున్నది. ఖమ్మం జిల్లా వాసిగా వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిని అయినందుకు ఒకింత గర్వంగా అనుభూతి.  

(ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రసమితి, భారత్ రాష్ట్ర సమితిగా మారి దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడానికి ఖమ్మంలో జరుగుతున్న భారీ బహిరంగసభ నేపధ్యంలో )

No comments:

Post a Comment