Sunday, January 22, 2023

సర్వోత్తమ ధర్మమేదో వివరించి, ఆత్మాధీనమైన జీవితం ఆనందమన్న భీష్ముడు ..... ఆస్వాదన-104 : వనం జ్వాలా నరసింహారావు

 సర్వోత్తమ ధర్మమేదో వివరించి, ఆత్మాధీనమైన జీవితం ఆనందమన్న భీష్ముడు

ఆస్వాదన-104

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (23-01-2023)

రాజైన తనకు, ఇంతవరకు, భీష్మ పితామహుడు రాజోచిత ధర్మాలను స్పష్టంగా వినిపించాడని, ఇక ముందు ముందు సకల భూజనులకు మేలు కలిగించే సర్వోత్తమ ధర్మాన్ని తెలుసుకోవాలని తాను అనుకుంటున్నానని, దానిని తనకు తెలియచెప్పమని భీష్ముడిని కోరాడు ధర్మరాజు. ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి వుంటుందని, దానిలో ఎంత వైవిధ్యమున్నా, మరెంత విస్తృతి వున్నా, మొత్తం మీద సర్వమూ ఆచరణ యోగ్యమేనని, దానిలో ఒక్కటి కూడా ఫలితం సాధించలేనిది లేదని, ధర్మతత్త్వం తెలిసినవారు మాత్రం తమకు ముక్తిని ప్రసాదించగలదే శ్రేష్ఠ ధర్మమని పలుకుతారని, ఇష్టానిష్టాలను హృదయంలో కలుగకుండా చూడగలగడమే మోక్షప్రదమైన ధర్మమని అన్నాడు భీష్ముడు. ఉదాహరణగా ‘సేనజిత్-విప్రసంవాదం అనే ఒక పూర్వ కథ సారాన్ని, దానికి అనుబంధమైన పింగళావృత్తాంతాన్ని చెప్పాడు.

‘మానవుడికి లోకంలో సుఖదుఃఖాలు క్రమంగా కలుగుతాయి. అంతే కాని వాటిలో ఏ ఒక్కటీ మనిషిని తాకదు. కాబట్టి సుఖదుఃఖాలు పొందినప్పుడు సంతోషాన్ని కాని, సంతాపాన్ని కాని పొందకుండా వుండాలి. పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలు మిగిలి వుంటే అవి తప్పక ఈ జన్మలో మనిషిని చేరుతాయి. ఈ కర్మ ఫలాల అనుభవం విషయంలో పామరుడైనా, పండితుడైనా ఒక్కటే. గొప్ప ధీరత్వంతో వాటిని స్వీకరించడమే నివారణ మార్గం. మనిషి ఓటమి పాలుకావడానికి కోరికే కారణం. మనిషి వినాశనానికీ ఆశ ఒక్కటే హేతువు. కాబట్టి ఆశను వదలుకొని ఇంద్రియాలను జయించి వినాశానికి దూరంగా సుఖంగా జీవించాలి. సౌఖ్యప్రదాయి నిరాశ ఒక్కటే’ అని అన్నాడు భీష్ముడు.

జీవరాశులు నశించిపోయే కాలం దాపురించిందని, ఇలాంటి పరిస్తితులల్లో ప్రజలు ఏంచేయాలని ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా ‘తండ్రీ-కొడుకుల సంవాదం అనే పూర్వ కథలోని వృత్తాంతాన్ని బోధించాడు భీష్ముడు. చతురాశ్రమాలను నిర్వహించి ప్రశాంతంగా జీవిస్తూ మోక్షాన్ని పొందవచ్చని కొందరంటారు కాని అది నిజంకాదని, మానవుడు పుట్టిన మరుక్షణం నుండే మృత్యువు వెంటాడుతుందని, మానవుడిని మృత్యువు మింగేస్తుందని అన్నాడు భీష్ముడు. కాబట్టి మానవుడు కాలానికి అధీనుడే కాని అతడికి కాలం అధీనం కాదని, కాలం ముందు ప్రాణులన్నీ సమానులేనని, సత్యమే అమృతం అని, మొహమే మృత్యువని, ఈ జ్ఞానంతో సంసార బంధాలను తెంచుకోవాలని, అప్పుడు సుఖదుఃఖాలు రెండూ సమానం అవుతాయని, శాంతి చేకూరుతుందని అని చెప్తూ భీష్ముడు, ధర్మరాజును ఏకాంతంలో నిశ్చల మనస్కుడై ఆత్మాన్వేషణం చేసుకొమ్మని, సత్య ప్రవర్తనలోనూ, ధర్మ నిర్వహణలోను నేర్పరి కమ్మని అన్నాడు.

లోకంలో ధనమే సుఖశాంతులకు మూలమనే గట్టి అభిప్రాయం ప్రాచీనకాలం నుండి వున్నదని, ఆ అభిప్రాయంలోని సత్యాసత్యాలను తెలియచెప్పమని భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. శాంతి కాముకుడైన శమ్యాక్యుడు అనే ఒక బ్రాహ్మణుడు తన దగ్గరికి వచ్చి ప్రసంగవశాన పలికిన పలుకుల్లో ధర్మరాజు సందేహానికి సంబంధించిన మాటలు కొన్ని దొరుకుతాయని అంటూ, ఆ సారాంశం తెలియపర్చాడు భీష్ముడు. కలిమి-లేమి అనే రెంటిని త్రాసులో పెట్టి తూస్తే, ముల్లు లేమివైపుకే మొగ్గుతుందని, అంటే, లేమి కలిమికన్నా ఉత్తమమనే అర్థం వస్తుందని చెప్పాడు. ధనవంతుడు నిత్యం భయభ్రాంతులకు లోనవుతాడని, సుఖశాంతులకు దూరమై జీవనం సాగిస్తాడని, నిర్ధనుడు ఎక్కడైనా, ఎప్పుడైనా స్వేచ్చగా వుండగలడని, కొంచెం కూడా భయపడడని, దేవతలైనా నిర్ధనుడిని మెచ్చుకోవాల్సిందే అని, డబ్బు నుండి ముక్తి పొందడం నేర్పరితనమని, ఆత్మాధీనమైన జీవితం ఆనందదాయకం అని, భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు.

ఇది విన్న ధర్మరాజు తాతకు మరొక ప్రశ్న వేశాడు. డబ్బుమీద పేరాశకు లోనైనవాడు ఎప్పుడు ఏవిధంగా సుఖపడతాడని అడిగాడు. ధనార్జనలో విసిగివేసారి దాని నుండి ఎడబాటును పొందినపుడే వాడికిక సుఖం లభిస్తుందని స్పష్టం చేస్తూ దానికి సంబంధించిన ‘మంకి’ అనే బ్రాహ్మణుడి కథ ఉదహరించాడు. సుఖప్రాప్తికి ధనం మూలం కావచ్చునని, అయితే ఆ ధనం కోరినంతనే సిధ్ధించదని, దానికై ప్రయత్నం చేయాలని, ప్రయత్నించినా సిద్ధిస్తుందన్న నమ్మకం లేదని, ఒకవేళ సిద్ధించినప్పటికీ దాంతోపాటే ఎన్నో కష్టాలు కూడా దాని వెనుకనే వుంటాయని, అసలే సిద్ధించలేదంటే ఆ ఓటమి చావుతో సమానమని, కాబట్టి అన్నివిధాలా దుఃఖాలను కలిగించే సొమ్ముకై సంకల్పం అనవసరమని భీష్ముడు చెప్పాడు.

నరుడు ఏమి చేస్తే అతడి శోకం నశిస్తుందని, ఏమార్గాన అతడు మోక్షాన్ని పొందగలడని ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు అజగర చరిత్ర అనే ఇతిహాసాన్ని వివరించాడు. రాక్షసరాజైన ప్రహ్లాదుడు అజగరుడు అనే బ్రాహ్మణుడి దగ్గరికి పోయి తనకు శాంతి పద్ధతిని ఉపదేశించమని అడగ్గా, ఆ అజగరుడు ఇచ్చిన సమాధానంలో ధర్మరాజు సందేహానికి నివృత్తి వుందని అన్నాడు భీష్ముడు. ‘సృష్టిలో ప్రాణిజాలం పుట్టుక నిష్కారణంగా జరుగుతుంది, అవి సమృద్ధితో వుండడం కానీ, లేక నశించి పోవడం కానీ, నరుడుకి మోదాన్నో, ఖేదాన్నో కలిగించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రాణులు శాశ్వతమైనవి కావు. నశింపు వాటి సహజ లక్షణం అని అజగరుడు ప్రహ్లాదుడితో అన్న మాటలను చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు. ‘కలిమిలేములను సమానంగా చూస్తూ జీవనం కొనసాగించడమే అజగరవ్రతం ఔతుందని, నిత్య తృప్తి, శుభ్రత, ఓరిమి, సమభావం వుండడం అజగర వ్రతమని, వ్రతమంటే జీవనం అని, ఈ జీవన విధానం అన్యులకు ఆచరణ యోగ్యం కాజాలదని అజగరుడి మాటలుగా భీష్ముడు చెప్పాడు ధర్మరాజుకు.

అజగరుడి నడతను ఆచరించగల నరుడికి పాపం, భీతి, కోపం, శోకం లాంటి మానసిక క్షోభలు నిర్వేదాన్ని కలిగించలేవని, వాటిని అతడు జయించగలడని, ఆ పైన ముక్తి అతడికి లభిస్తుందని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment