Sunday, January 1, 2023

ధనార్జన మెలకువలను, మృదుత్వ నడవడిని, ఆపద్ధర్మాన్ని వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-102 : వనం జ్వాలా నరసింహారావు

 ధనార్జన మెలకువలను, మృదుత్వ నడవడిని,

ఆపద్ధర్మాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-102

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-01-2023)

భీష్ముడి వాగామృతాన్ని చవిచూడడం వల్ల తన మనస్సుకు ఇంకా-ఇంకా ఆయన మాటలు, బోధనలు వినాలని వున్నదని, తన తనివి తీరిందాకా వినిపించమని ధర్మరాజు అనగానే భీష్ముడు చెప్పడం కొనసాగించాడు. రాజు తన దేశంలోనూ, శత్రు దేశంలోనూ, ధనం సంపాదించాలని, ఏలుబడికి, పుణ్యం, పురుషార్థాలకు మూలం ఆ ధనమే అని, ధనార్జన విషయంలో ఎంతో మెలకువగా వుండాలని, ఏదేమైనా రాజు తన శక్తికి మించిన ప్రయత్నాలు చేయరాదని, ఏ ఉపాయం చేతనైనా తన శాయశక్తులా డబ్బు సంపాదించడం రాజ ధర్మమని, డబ్బు లేనివాడిని కన్న సంతానం కూడా లక్ష్యపెట్టదని చెప్పాడు. న్యాయాన్ని పట్టించుకోని సైన్యం యుద్ధంలో గెలవదని అంటూ ఉదాహరణగా కాపవ్యోపాఖ్యానం తెలియచేశాడు. పసివారిని, మునులను, ఆడవారిని చంపకూడదని, మనపై యుద్ధానికి రానివారి జోలికి పోవడం మహా పాపమని, ఆడవారిని చెరపట్టడం కూడని పనని, ఆవులను, బ్రాహ్మణులను కష్టపెట్టకూడదని, పంట పొలాలను నాశనం చేస్తే పాపమని అన్నాడు భీష్ముడు.

ఆ తరువాత భీష్ముడు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే మూడు చేపల కథ చెప్తూ దాని సారాంశం కూడా తెలియచేశాడు. దూరదృష్టితో పనిని ముందుగానే తెలిసికొని, దానిని చక్కదిద్దుకుని చేయకపోతే మూర్ఖుడువలె ఇబ్బందులు పడతారని, సమయానికి తగ్గ విధంగా ఉపాయంతో ధైర్యంగా పని చేయనివాడు ఎప్పుడూ సందేహంతో కూడిన బతుకు బతుకుతాడని, రాబోయే పనిని ముందుగానే ఊహించి సమర్థంగా ఆ పనిని యుక్తిగా చేసుకునే నీతిమంతుడు సుఖంగా వుంటాడని అన్నాడు భీష్ముడు.

శత్రువుల చేతచిక్కి బలం కోల్పోయిన రాజు ఆ ఆపదనుండి ఏవిధంగా గట్టెక్కుతాడని ప్రశ్నించాడు ధర్మరాజు. ఆయన ప్రశ్నకు సమాధానం పిల్లి-ఎలుకల సంవాదం అనే ఒక పూర్వకథలో దొరుకుతుందని అంటూ, దాని సారాంశాన్ని చెప్పాడు. ఆశ్రయించిన వారిని కాదనకుండా కాపాడే స్వభావం కలవారికి ఆపదలు కలిగించడం కాని, కీడు తలపెట్టడం కాని మంచి పని కాదన్నాడు. సరైన తరుణంలో చేసిన ప్రయత్నమే సంపూర్ణంగా సఫలమవుతుందని, మంచి ఉపకారం చేసి మంచి మిత్రుడిని సంపాదించుకొని అతడి నడతవల్ల కలిగే సౌఖ్యాలు అనుభవించకుండా వేర్వేరుగా వుండడం నీతివేత్తల పద్ధతికాదని, ఫలానావాడు పగవాడని, లేదా స్నేహితుడని తెలుసుకొనే నేర్పు వుండాలని భీష్ముడు అన్నాడు.

బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినప్పటికీ ఆ అవసరం తీరగానే అతడితో స్నేహాన్ని వదలుకోవాలని, ఒకవేళ ఇంకా నమ్మితే ఆపదల పాలవక తప్పదని, నమ్మతగని వారిని అసలే నమ్మకూడదని, నమ్మతగిన వారినైనా అవసరమైనంత మేరకే నమ్మాలని, బలంగల శత్రువు వల్ల కలిగే ఆపదలను తొలగించుకొనడానికి అల్పుడైన శత్రువునైనా తనతో కలుపుకొని జీవించడానికి తగిన ఉపాయాన్ని వెతకాలని భీష్ముడు చెప్పాడు. ఇలా ఆయన చెప్పగానే ధర్మరాజు, ఎవరినీ నమ్మకపోతే మనస్సుకు ఊరట ఎలా కలుగుతుందని, నమ్మడం, నమ్మకపోవడం అనే రెంటిలో ఏది ముఖ్యంగా ఆచరణీయమో అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేక పోతున్నానని అన్నాడు. ఈ విషయానికి సంబంధించిన విషయాన్ని బ్రహ్మదత్తుడికి, పూజని అనే గోరువంకకు మధ్య సాగిన సంవాదం ఆధారంగా వివరించాడు భీష్ముడు.

ప్రజలెవరినీ రాజు గట్టిగా-గుడ్డిగా నమ్మకూడదని, అప్పుడే తనను, తన సంపత్తిని సంరక్షించుకొనగలడని చెప్పాడు భీష్ముడు. ఇంకా ఇలా అన్నాడు: ‘సమయాన్ని బట్టి శత్రువును భుజాల మీద ఎక్కించుకొని మొయ్యాలి. సమయం కనిపెట్టి రాతినేల మీద కుండను ఎత్తి బద్దలు కొట్టినట్లు నేర్పుగా శత్రువును నశింపచేయాలి. రాజు తాను తలపెట్టిన పని సానుకూలపడే దాకా ఎవ్వరూ తనను తెలిసికొనలేనివాడుగా వుండాలి. ప్రజల విషయంలో విన్నా వినని వాడిలాగా, చూసినా చూడనివాడి లాగా నడచుకోవాలి. రాజు తనకు ఇష్టంలేని పనిని చేస్తానని ఆశలు చూపిస్తూ కాలం గడపాలి. కాలాంతరంలో ఎదురయ్యే అడ్డంకులను సాకుగా చూపించి ఆ పనికి మొండి చెయ్యి చూపించాలి. మృదుత్వంతో మెత్తటివాడిని తుడిచివేయవచ్చు. మృదుత్వంతో శత్రువులను చంపవచ్చు. మృదుత్వంతో సాధించరానిదంటూ వుండదు. కాబట్టి మృదుత్వమే అన్నిటిని మించి వాడైనది.

కరువు కాటకాలలో తిండి దొరకనప్పుడు బ్రాహ్మణాది మూడు వర్గాలవారు ఏవిధంగా ప్రాణాలు రక్షించుకోవాలని భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. ఆయన సందేహాన్ని తీర్చే ఇతిహాసం విశ్వామిత్ర, చండాల సంవాదం అని అంటూ ఆ వివరాలను క్లుప్తంగా తన మాటల్లో చెప్పాడు. ప్రాణం పోకుండా రక్షించుకోవడానికి మరే ఉపాయం లేనప్పుడు, దొంగతనం చేసైనా ఊపిరి నిలుపుకోవడం ఆపద్ధర్మమే ఔతుందని, ఆ సమయంలో నీచుడి సొమ్మైనా పుచ్చుకోవడం తప్పుకాదని అన్నాడు.

శరణు అన్న వారిని ఆదుకోవాలని అనుకొనేవారికి ఎలాంటి ఫలితం కలుగుతుందని ధర్మరాజు ప్రశ్నించాడు భీష్ముడిని. సమాధానంగా శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన లుబ్దకపోతోపాఖ్యానం అనే కథలోని సారాంశాన్ని వివరించాడు భీష్ముడు. ఆదుకొనమంటూ ఆశ్రయించినవాడిని కనికరంతో ఆదరించి ఆదుకొనడంకన్నా మించిన పుణ్యం లేదన్నాడు. అలాగే, ఆదుకొనేవారికి ఆవును చంపిన పాపం కూడా పోతుందని, ఆదుకొననివాడు ఎన్నడూ వీడని పాపాన్ని అనుభవిస్తాడని చెప్పాడు.

తెలియకుండా చుట్టుకొన్న పాపాన్ని సజ్జనులు ఎలా పోగొట్టుకోవాలని ధర్మరాజు అడిగాడు భీష్ముడిని. పాపం చేసి పరితపించినా, ఇకమీద ఇలాంటి పాపాలకు ఒడిగట్టను అనుకున్నా, న్యాయంగా మెలగడం ఉత్తమం అని నిర్ణయించుకొన్నా, పుణ్యం పొందాలని అపేక్షపడి ఉపకారం చేసినా, పాప పంకిలం క్రమక్రమంగా తుడిచిపెట్టుకునిపోతుందని; చెయ్యాలని చేయని పాపాలు బుద్ధిపూర్వకంగా చేసిన పుణ్యాలవల్ల పోతాయని; ఈ సంగతి వేదం చెప్పిందని; బృహస్పతి ఇంద్రుడికి చెప్పినట్లు భీష్ముడు ధర్మరాజుకు తెలియచేశాడు. దీనికి సంబంధించినదే అయిన గృధ్రజంబుకోపాఖ్యానం, పవన శాల్మలీ తరు సంవాదం కూడా చెప్పాడు. స్వార్థపరుల పన్నాగాలను, మాయగాళ్ల మాటకారి తనాన్ని తెలిసికొని తెలివిగా వ్యవహరించాలని, మహా బలవంతుడితో బలహీనుడు తలపడి పగపెట్టుకుంటే తన వైభవాన్ని కోల్పోతాడని భీష్ముడు స్పష్టం చేశాడు.          

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

   

     

 

     

      

         

        

   

             

No comments:

Post a Comment