Monday, January 23, 2023

బీటలువారిన ఎర్రకోటలు! (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

బీటలువారిన ఎర్రకోటలు!

ముఖ్యమంత్రులను శాసించే స్థాయి అలనాటి జడ్పీ చైర్మన్లది

అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-3

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (24-01-2023)

అరవై-డెబ్బై దశకంలో అమల్లో వున్న మూడంచెల పంచాయితీ వ్యవస్థలో భాగంగా, గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగి, వార్డు సభ్యులను ఎన్నుకునేవారు. వారంతా కలిసి సర్పంచ్ ను ఎన్నుకునేవారు. సర్పంచ్ లంతా కలిసి ఆరుగురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అంతా కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. సమితి అధ్యక్షులంతా కలిసి కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అంతాకలిసి జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. జడ్ పి చైర్మన్ ది చాలా పవర్ ఫుల్ హోదా. కాబినెట్ మంత్రులుగా వుంటూ కొందరు రాజీనామా చేసి, జిల్లా పరిషత్  అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జడ్ పి చైర్మన్లకు, ఎంత పలుకుబడి, ప్రాబల్యం వుండేదంటే, ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో వారిది కింగ్ మేకర్ల పాత్ర. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని మార్చగలిగే స్థితిలో వుండేవారు అప్పుడప్పుడూ. అదే జరిగింది అప్పట్లో ఖమ్మం జిల్లా పరిషత్తులో, సమితిలో.

అన్ని గ్రామాలతో పాటు ఎన్నికలు జరగకుండా, వల్లాపురం-అమ్మపేట ఉమ్మడి గ్రామ పంచాయితీ ఎన్నిక కోర్టు స్టే వల్ల వాయిదా పడి తరువాత జరిగింది. ఆపాటికి చేరి సగం సగం గ్రామాలు సీపీఎం, శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గం, సీపీఐ, జలగం కాంగ్రెస్ (ఉపేంద్రయ్య) వర్గం గెలుచుకున్నాయి. సమితి దక్కించుకోవడానికి, ఇరువర్గాలకూ ఇంకొక పంచాయితీ అవసరం, వల్లాపురం ఎన్నిక కీలకమై పోయింది. ఖమ్మం సమితి ఎవరు గెలుస్తే, వారి పక్షమే జిల్లాపరిషత్ గెలుచుకునే పరిస్థితి నెలకొంది. వల్లాపురం ఎన్నిక సందర్భంగా  జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, అతిరథ-మహారథులు, అందరూ గ్రామానికి చేరుకున్నారు. మా పెదనాన్న వనం శ్రీరాంరావు గారి నాయకత్వంలో ఆ గ్రామ పంచాయితీకి, ఆయన అన్నగారి కుమారుడు సిద్ధారెడ్డి వర్గానికి చెందిన వనం వరదా రావు ఎన్నికయ్యాడు. అప్పటికింకా సమితి ఎన్నిక ఐదారు రోజులే వుంది. వల్లాపురం ఎన్నిక కావడంతోనే జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో "క్యాంపులు" పెట్టే చర్యలు చేపట్టారు. అప్పట్లో (ఇప్పుడు కూడా ఉన్నదే) క్యాంపుల సంస్కృతి వుండేది.

         నిర్ధారించిన తేదీ నాడు జరిగిన ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికలో తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. ఇరు పక్షాలకు, ఎవరి లెక్క ప్రకారం వారికి, ఒకే ఒక్క ఓటు మెజారిటీ. మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణను, ఇరు వర్గాల వారు తమ ఓటు కింద వేసుకున్నారు. చాగంటి నారాయణ కూడా తెలివిగా వ్యవహరించడం మొదలెట్టాడు. మొదటి కో-ఆప్టెడ్ సభ్యుడిగా శీలం-సీపీఎం అభ్యర్థి గెలిచాడు. రెండవ అభ్యర్థిగా గోకినేపల్లి గ్రామానికి చెందిన, ప్రముఖ సీపీఎం నాయకుడు రావెళ్ల సత్యం, శీలం-సీపీఎం పక్షాన పోటీలో వున్నాడు. చాగంటి అతడికి ఓటు వేయకపోవడంతో ఓడి పోయాడు. గెలిచినట్లయితే అతడే సమితి అధ్యక్ష అభ్యర్థి. తెలివిగా ఆయనను ఓడించారు ప్రత్యర్థులు. ఆ సమయంలో చాగంటికి సీరియస్ వార్నింగ్ పోయింది. ఆ తరువాత నలుగురు కో-ఆప్టెడ్ సభ్యులుగా శీలం-సీపీఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. వారిలో కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ అభ్యర్థి రాయల వీరయ్య ఒకరు. రాయల వీరయ్య సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. బాణాపురం గ్రామ సర్పంచ్ కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ అభ్యర్థి గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆ సారి జిల్లాపరిషత్ శీలం వర్గానికే దక్కింది.

ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది! ఇదిలా వుండగా, మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు పోలీసుల అండతో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, జలగం గ్రూప్ కాంగ్రెస్ వారు కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీపై ధ్వజ మెత్తారు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రారెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును (శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేసి గెలవబోతున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రారెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రారెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య కాంగ్రెస్ ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకుడు గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు. దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట"ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల ప్రాతినిధ్యంలో లేదు!!! 

No comments:

Post a Comment