ఉద్యమాల గుమ్మంలో బీఆర్ఎస్ తొలి నగారా!
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (18-01-2023)
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఖమ్మం జిల్లా
సమీకృత కలక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు జనవరి 18 న ఖమ్మం పట్టణానికి రానున్నారు. అదే రోజున, దశాబ్దాల
తరబడి రాజకీయ చైతన్యానికి ప్రతీకగా పేరెన్నికగన్న ఖమ్మం పట్టణంలో భారత్ రాష్ట్ర
సమితి (బీఆర్‌ఎస్) భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో జిల్లాకు చెందిన వ్యక్తిగా గత
అరవై-డెబ్బై సంవత్సరాలలో, ప్రధానంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత వేగంగా సాధించిన అభివృద్ధితో
సహా, ఎన్నో-ఎన్నెన్నో రాజకీయ, రాజకీయేతర స్మృతులు మననం
చేసుకోవాలనిపించింది.
ఖమ్మం పట్టణం మధ్యలో ఉన్న స్తంబాద్రి లక్ష్మీ
(నృ)నరసింహస్వామి పేరు మీద స్థంబాద్రిగా వెలసింది ఖమ్మం. స్తంభాన్ని ఉర్దూలో ఖంబా
అంటారు. రంగారెడ్డి,
లఖ్నారెడ్డి, వేమారెడ్డి అనే ముగ్గురు సోదరులు
ఓరుగల్లు నుండి అపారమైన గుప్తనిధిని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి ఖమ్మం ఖిల్లాను,
లఖ్నవరం చెరువును నిర్మించారని అంటారు. పౌరాణిక గాధల ఆధారంగా,
కృతయుగంలో సాలగ్రామాద్రి అని, త్రేతాయుగంలో
నరహరిగిరి అని, ద్వాపరయుగంలో స్థంబశిఖరి అని, కలియుగంలో స్తంబాద్రి అని పిలిచేవారట. అందుకే ఖమ్మానికి ఆ పేరొచ్చింది.
మొదటి సాలార్జంగ్ ప్రధాని కాగానే 1865 లో
పరిపాలనా వ్యవస్థను పకడ్భందీగా ఏర్పాటు చేయడంలో భాగంగా,
ఖమ్మం ఆ రోజుల్లోనే జిల్లా కేంద్రంగా ఉండేది. ఇప్పటి వరంగల్ ఆనాడు ఖమ్మం జిల్లాలో
ఒక తాలూకాగా మాత్రమే వుండేది. 20వ శతాబ్ధం ఆరంభం నాటికి
ఖమ్మం జిల్లా మారి వరంగల్ జిల్లాగా ఏర్పడ్డది. వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా వున్న
ఖమ్మం, అక్టోబర్ 1, 1953 న తిరిగి కొత్త
జిల్లాగా ఏర్పాటైంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాల
పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాను రెండుగా విభజించి, ఖమ్మం,
భద్రాద్రి కొత్తగూడెంగా రెండు జిల్లాలను చేసింది ప్రభుత్వం. తెలంగాణ
సాంస్కృతిక పునరుజ్జీవనానికి, రాజకీయ చైతన్యానికి, ప్రగతికి,
విద్యా వ్యాప్తికి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ
రంగాలకు, వైజ్ఞానిక స్ఫూర్తికి ఖమ్మం పర్యాయపదం అంటే
అతిశయోక్తి కాదేమో!
చిర్రావూరి
లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల
రామనాధం, మంచికంటి రామకిషన్రావు, రావెళ్ళ సత్యనారాయణ, కెఎల్ నరసింహారావు, బోడేపూడి వెంకటేశ్వర రావు, నల్లమల గిరిప్రసాద్, టీబీ
విఠల్ రావు, పువ్వాడ నాగేశ్వర్ రావు, మహమ్మద్ రజబ్ అలీ, పర్సా సత్యనారాయణ వంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధాన యోధులను అందించిన జిల్లా
ఇది. మధిర ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి
సత్యనారాయణరావు ఖమ్మం జిల్లావాడే. బహుభాషావేత్త, సాంఘిక
సంస్కర్త, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ
వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుడు మాడపాటి హనుమంతరావు మధిర తాలూకా
ఎర్రుపాలెంలో జన్మించారు. మాడపాటి రామచంద్రరావు ఈ జిల్లావాడే. మాజీ ముఖ్యమంత్రి జలగం
వెంగళ్రావు, మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి ఖమ్మం
జిల్లావారే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటి దఫా మంత్రివర్గంలో పనిచేసిన
తుమ్మల నాగేశ్వరరావు, రెండవ దఫా మంత్రివర్గంలో పనిచేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం జిల్లా వారే. ఉభయ కన్యూనిస్ట్
పార్టీల రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని
సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికిన
మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్ రాధాకృష్ణ, అడ్వకేట్ సుబ్బారావులు ఖమ్మం జిల్లాలో స్థిరపడిన వారే.
తెలంగాణ సర్దార్ గా పేరొందిన సర్దార్ జమలాపురం కేశవరావు ఈ
జిల్లావాడే. ఆరడుగుల ఎత్తుతో మోకాళ్ల దాకా ఖద్దరు పంచెకట్టి బుజాన గొంగిడి
వేసుకుని ప్రజల స్వాతంత్రకాంక్షకు నిజాం పరిపాలన విధానానికి వ్యతిరేకంగా జనాన్ని
సమీకరించాడు. ఖమ్మంలో జన్మించిన హీరాలాల్ మోరియా పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి
వచ్చి ఖమ్మంలో స్థిరపడినారు. హీరాలాల్ క్విట్ ఇండియా ఉద్యమంలో, నిజాం వ్యతిరేక
ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఉర్ధూలో ప్రావీణ్యం సంపాధించి రామాయణాన్ని
ఉర్ధూలోకి అనువాదం చేసి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రశంసలందుకున్నాడు. మాతృభాష తెలుగు
కాకపోయినా తెలుగు భాషపై మమకారంతో రచనలు చేశారు. సహచర కవులైన దాశరథి, కవి
రాజమూర్తి, కొలిపాక మధుసూదనరావు లాంటివారితో కలిసి
స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేశారు. కమ్యూనిస్ట్ రైతాంగ ఉద్యమానికి సమాంతరంగా
సరిహద్దు పోరాట కాంపులను సమర్ధవంతంగా నడిపి, మొట్టమొదటి సారిగా జాతీయ జెండాను
జయంతి గ్రామంలో పోలీసు చర్యకు ఆరంభంగా దారి చూపిన మహానుభావుడు, సనాతన బ్రాహ్మణ
కుటుంబంలో జన్మించి ఆర్య సమాజ దీక్ష తీసుకున్న పండిత రుద్రదేవ్ ఖమ్మం జిల్లా
బీరవోలు గ్రామస్థుడు. రజాకార్ల దౌష్ట్యానికి బలైపోయిన ప్రముఖ పత్రికా సంపాదకుడు
షోయబుల్లా ఖాన్ ఈ జిల్లాకు చెందిన సుబ్లేడులో జన్మించాడు.
‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అన్న ఖమ్మం
జిల్లాకు చెందిన దాశరధి కృష్ణమాచారి జైలు శిక్ష అనుభవిస్తూ, ‘ముసలి
నక్కకు దక్కునే రాజ్యము’ అని బొగ్గుతో జైలు గోడల మీద కవిత్వం రాశాడు. ఆయన రాసిన
కవితా సంపుటులు అగ్నిధార, రుద్రవీణ అన్నవి సామాన్య
ప్రజానీకానికి నినాదాలు అయ్యాయి. తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ
సాయుధ పోరాట యోధుడు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచి,
తెలంగాణ గీతం రాసి ప్రఖ్యాతివహించిన రావెళ్ళ వెంకట రామారావు ఖమ్మం జిల్లా ముదిగొండ
మండలం గోకినేపల్లి వాసి. తెలుగు సినిమా ప్రంపంచానికి, తెలుగు
నాటక రంగానికి పాటలు రాసిన మొట్టమొదటి కవి చందాల కేశవదాసు ఖమ్మం జిల్లాకు చెందిన
జక్కేపల్లిలే జన్మించాడు.
1968 లో తెలంగాణ
ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో
అంకురార్పణ జరిగింది. ఐదు దశాబ్దాల క్రితం ఆరంభమైన అలనాటి
"ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం" బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట
వృక్షమైంది. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా
అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్"
అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర
ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. చివరకు కేసీఆర్
సారధ్యంలోని మలివిడత ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది.
తెలంగాణ ప్రజల
చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్ 2009వ సంవత్సరంలో ఆమరణ
నిరాహార దీక్ష చేపట్టిన కెసిఆర్ కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట
దగ్గర రంగధాంపల్లి లో ఏర్పాటు చేసిన దీక్షాస్థలి వద్దకు బయలుదేరిన తరువాత, ఆయన
వాహనాన్ని ముట్టడించిన ఉమ్మడి అంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు, నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లకుండా కేసీఆర్ ను అడ్డుకుని, ఆయన్ను
వాహనం నుండి దింపి, రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన కేసీఆర్
ను ఖమ్మం జైలుకు తరలించడం, ఖమ్మం జైలులోనే కెసిఆర్ తన
దీక్షను ప్రారంభించడం, దరిమిలా తెలంగాణ ఏర్పాటు ప్రకటన రావడం, మరో ఐదేళ్లకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం వర్తమాన చరిత్ర.
ఆవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఖమ్మానిది కీలక పాత్ర.
ఖమ్మం పోలీసు స్టేషన్ సమీపంలో ఇప్పుడున్న దుకాణాల సముదాయంలో
ఒకప్పుడు ‘ప్రభాత పుస్తక శాల’ వుండేది. జాతీయోద్యమంలో అంతర్భాగంగా, గ్రంధాలయోద్యమానికి
వూతంగా, ప్రచారానికి ఉపయోగపడేదీ పుస్తక శాల. అలానే కారంసెట్టి
చిన నరసయ్య అనే వ్యాపారికి ఒక పుస్తకాల షాప్ వుండేది. అక్కడ కూర్చుని అనేకమంది
ప్రముఖులు ఆయనిచ్చిన కాఫీని సేవిస్తూ కొనకుండా మాగజైన్లు, పుస్తకాలు
చదివేవారు. అలాగే ఖమ్మం ఖిల్లా. ఇది రాజు గారి సైన్యాల విడిదిగా, ఔట్ పోస్టులాగా వుండేది.
భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న పుట్టిన
నేలకొండపల్లి గ్రామం ఖమ్మం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం కోదాడ రహదారిపై
ఉంటుంది. సిఎం కేసీఆర్ మంజూరు చేసి విడుదల చేసిన రు. 3 కోట్లతో ఆద్యతన భవిష్యత్ లో
రామదాసు ధ్యాన మందిరం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపు
దిద్దుకోవడం చూడబోతున్నాం. ముదిగొండ మండలం, ముత్తారం
గ్రామంలో వామాంక స్థిత జానకీ సహిత శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని ఆరు
సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఆయన మంజూరు చేసిన నిధులతో
కళ్యాణ మంటపం, ధ్యాన మందిరం నిర్మించారు.
ఖమ్మంలో ఒకే ఒక హైస్కూల్ వుండేది మొదట్లో. అప్పట్లో
తెలంగాణలో సర్కారీ బడులే వుండేవి. ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా స్వర్గీయ
శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు ఇచ్చిన లక్ష రూపాయలు విరాళంతో 1956 లో ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్
కళాశాలను స్థాపించారు. దరిమిలా అది ప్రభుత్వ కళాశాల అయింది. 1965 ప్రాంతంలో మహిళా
డిగ్రీ కళాశాల మొదట్లో ప్రయివేట్ కాలేజీ గా ఏర్పాటైంది. ఇప్పుడు లెక్కలేనన్ని
ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీలు వున్నాయి. అలాగే ఒకరిద్దరు క్వాలిఫైడ్
డాక్టర్లు మాత్రమే వున్న ఖమ్మం పట్టణంలో, జిల్లాలో ఇప్పుడు
ప్రభుత్వ ప్రయివేట్ పరంగా అనేక రకాలైన వైద్య సౌకర్యాలున్నాయి. ప్రయివేట్ మెడికల్
కాలేజీలు కూడా వున్నాయి.
గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని
అభివృద్ధి జరిగింది. వీటిలో మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే: ఖమ్మం నగరంకు మణిహారం లకారం
ట్యాంక్ బండ్, తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటేన్; సకల సౌకర్యాలతో మోడల్ కాలనీల ఏర్పాటు; గేటేడ్
కమ్యూనిటీగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం; ధ్వంసలాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్
నిర్మాణం; జిల్లా ప్రభుత్వ అసుపత్రిలోమాతా శిశు కేంద్రం ఏర్పాటు; ఐటి హబ్, తెలంగాణ
స్కిల్ ఆండ్ నాలెడ్జ్ సెంటర్(టాస్క్); జిల్లా కేంద్రంలో అత్యాధునిక బస్టాండ్; నూతన
మెడికల్ కళాశాల; నూతన మున్సిపల్ కార్పోరేషన్ భవన నిర్మాణం; వెజ్ అండ్ నాన్ వెజ్
మార్కేట్; రైతు బజార్లు; సెంట్రల్- హైమాస్ట్ లైటింగ్; హిందు శ్మశాన వాటికలు; నూతన
షాదిఖానా నిర్మాణం; కమ్యూనిటి హాల్స్, గ్రీన్ బెల్ట్ స్థలాలలో
కోత్త పార్కులు; నగరాభివృద్ధిలో భాగంగా కార్పోరేషన్ పరిధిలో
మోడల్ రహదారులు; నూతన కలక్టరేట్ నిర్మాణం.
అలాగే: 107 పల్లె దవాఖానాలు, 7 బస్తీ దవాఖానాల మంజూరు; తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్;
ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్;
మథర్ మిల్క్ బ్యాంక్; ఖమ్మం, పాలేరు,
మధిర, వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేల క్యాంపు
కార్యాలయాలు; 15 గోదాములు; సీతారామ ఎత్తిపోతల పథకం; గోళ్ళపాడు ఛానల్ ద్వారా
మురుగు నీటి పారుదల ఆదునీకరణ; సుందరీకరణ పనులు; మానవ
వ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారం; ఐటి హబ్ సర్కిల్ నుండి,
జడ్ పి సర్కిల్ వరకు ఫుట్ పాత్; వైరా లో క్రీడా స్టేడియం; ఖమ్మం సర్దార్
పటేల్ స్టేడియంలో లాన్ టెన్నిస్ సింథటిక్ కోర్టులు లాంటి ఎన్నో, ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కొన్ని వివిధ
దశలలో పూర్తి కావస్తున్నాయి.
ఈ నేపధ్యంలో, ఉద్యమాల గుమ్మంగా, తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆరంభ వేదికగా, యావత్ తెలంగాణకు, దేశానికి కూడా
తెలిసిన ఖమ్మం నుంచే, టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా
రూపాంతరం చెందిన తరువాత, భారత్ రాష్ట్ర సమితి నిర్వహించే మొట్టమొదటి భారీ బహిరంగ
సభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడం, దేశ
గుణాత్మక మార్పునకు శ్రీకారం చుట్టి, జాతీయపార్టీ బీఆర్‌ఎస్
ఎజెండాను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు మెండుగా వుండడం, ఖమ్మం జిల్లాకే
గర్వకారణం. జాతీయ స్థాయిలో అధికారం చేపట్టడానికి తొలి అడుగు ఖమ్మం నుంచే కావడం
విశేషం. ఉద్యమాల గుమ్మం ఖమ్మం, బీఆర్ఎస్
జాతీయ రాజకీయాల ప్రస్తాన వేదిక కావడం, దీనికి పలువురు ముఖ్యమంత్రులతో సహా ఎందరో బీజేపీయేతర
ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కావడం ఖమ్మానికే గర్వకారణం. దేశ రాజకీయాల
దిశానిర్దేశం ఖమ్మం నుండే జరగనుండడం మరింత గర్వకారణం.
(జనవరి
18 న బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్న సందర్భంగా)
No comments:
Post a Comment