"ముత్తారం రామాలయం"
వనం జ్వాలా నరసింహారావు
మా పూర్వీకులైన కృష్ణరాయల గారి కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం – ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే "భక్తి సంజీవని" అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.
ప్రాచీన కాలం నాటి మా ముక్తి వరం-ముత్తవరం రామాలయాన్ని గురించి మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు-కథలుగా చెప్పుకుంటారు. ముత్తారం రెవెన్యూ గ్రామానికి మరో రెండు శివారు వూళ్లున్నాయి. ఒకదాని పేరు "కోదండరామపురం". చాలా చిన్న వూరనాలి. ఆవూళ్లో కేవలం వెలమ కులస్తులే వుండేవారు. అన్నీ కలిసి పదిహేను కుటుంబాలు కూడా వుండవు. అందరూ వెలమ దొరలే. సాగర్ కాలువ నీటితో ముంపుకు గురైన ఈ గ్రామాన్ని ఇటీవలే కొంచెం దూరంలో పునర్నించారు. మరో శివారు గ్రామం నేను పుట్టి పెరిగిన వనం వారి కృష్ణా పురం. మా పూర్వీకుల్లో ప్రసిద్ధిచెందిన వనం కృష్ణ రాయలు గారు దాన్ని నిర్మించినందున దానికాపేరొచ్చింది. ఆయన అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా హాజరయ్యే వాడట. కాలంగడుస్తున్నాకొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివరకో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇక ముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాలనుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొనిరమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణ రాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.
కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణ రాయలుగారు. కొంచం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తన ముందు రథం-దాని వెనుక ఈయన గుర్రం వూరిపొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే-కృష్ణ రాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడుదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్ని వైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు. ఆ రాత్రి కృష్ణ రాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ-పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణా పురాన్నీ నిర్మించారు. కృష్ణ రాయలుగారు నిజమైన భక్తుడై నందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడనడానికి అదొక నిదర్శనం.
భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకే ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు-నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గత ఐదారు ఏళ్లలో మరీ శిథిలమై గర్భగుడిలోకి వర్షపు నీరుకూడా వచ్చే స్థితి కలగడంతో గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నించేదుకు నడుంకట్టారు. అయితే అన్ని గ్రామాల్లో లాగానే, మా వూళ్లోనూ రాజకీయాలున్నాయి- వర్గాలున్నాయి-ఈర్షాసూయలున్నాయి. మా ఇంటి పేరున్న ఈతరం రామ భక్తుడు, వరసకు బాబాయి, వనం గోపాలరావు ఆలయ పునరుద్ధరణకు అంకితమైన వారిలో ముఖ్యుడు. నేనే మో హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా నివసిస్తుండడంతో, ప్రతినెలా మా వూరికి పోయి వస్తున్నప్పటికీ, గుడి కట్టించే విషయంలో చూపించాల్సిన శ్రద్ధ చూప లేకపోయాను. అయితే ఆలయ నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగక పోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవపూర్వకంగా జరిగింది ముత్తారం దేవాలయం విషయంలో. మా పూర్వీకులు కట్టించిన ప్రాచీన దేవాలయ పునర్నిర్మాణానికి, పరోక్షంగా నాలో జొరబడి, నా వంతు సేవ చేసే అవకాశమిచ్చాడు భగవంతుడు.
మా నాన్న వనం శ్రీనివాసరావు గారు పదేళ్ల క్రితం చనిపోవడానికి మూడు రోజుల ముందర మా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సందర్భం వచ్చిన ప్రతి చోట అవి ప్రస్తావించాల్సిన అంశాలు.
నాన్నగారిని గురించి నాకు తెలిసినంతవరకు: బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, బాల్యంలో నా వరకు నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ-కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామ పెద్దలతోనూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పొరుగూర్లో వున్న పెదనాన్నగారితో ఆయన మెలిగిన విధానం-తర తరాల వైరం మరిచిపోయేందుకు అందించిన స్నేహ హస్తం-స్నేహ ధర్మం తప్పిన ఆయనపై నాన్న గారి తిరుగుబాటు-సాధించిన తిరుగులేని విజయం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని-నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మపేట-ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్నగారు చెప్తే తెలుసుకున్నాను-కొన్ని స్వయంగా చూసాను. నా చిన్నతనంలో నాన్నగారు గుర్రం స్వారీ చేస్తూ, తెల్లటి కమీజు ధరించి-ధోవతి కట్టి బయటకు వెళ్లడం-వెళ్తున్నప్పుడు గ్రామ వీధుల్లో అరుగులమీద కూచున్న వారందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం కూడా బాగా జ్ఞాపకం వుంది. ఆయన కమీజుకు పెట్టుకున్న బంగారపు గుండీలు కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత కాలంలో సైకిల్ పై వెళ్లేవారు కొన్నాళ్లు.
మా నాన్న చెప్పిన ముఖ్యమైన అంశల్లో రామాలయ ప్రస్తావన కూడా వుంది.
ప్రతిఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే దేవాలయంలో ఒక శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (ఉత్సవ) ప్రతిష్టించాలనీ నాపై ఒక భాద్యతపెట్టారు నాన్నగారు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన అప్పగించిన పని చాలాకాలం వరకు నెరవేర్చ లేకపోయాను. ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణం. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఉద్యోగ విరమణ చేయడానికి కొన్నాళ్లక్రితం ఒక మిత్రుడి ప్రోద్బలంతో వాసు దాసుగారి సుందర కాండ మందరాన్ని "మందర మకరందం" గా లఘు కృతిలో రాసిన కొద్ది రోజులకే శ్రీరాముడి దయ నాపైన అపారంగా కలిగింది. జీవితంలో ఊహించని విధంగా, పదవీవిరమణ చేసిన ఏ ఉద్యోగికీ లభించని రీతిలో నాకు మంచి వేతనంతో 108-అత్యవసర సహాయ సేవల సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆదాయం పెరిగి, అప్పులు తీరడం మొదలయింది. పిల్లలంతా ఎదిగి, ఉద్యోగాల్లో కుదుటబడి నెనెంతంటే అంత ఇచ్చేందుకు తయారయ్యే రోజులొచ్చాయి. సరిగ్గా అప్పుడే నాన్నగారు చనిపోయే ముందు అప్ప చెప్పిన భాద్యతను నెరవేరుద్దామన్న ఆలోచనొచ్చింది. అయితే ఆ ఆలోచనా క్రమంలో- ఆలోచన కార్యరూపం దాలుస్తున్న సందర్భంలో దేవాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరుగనున్నదని ముందు నేనూహించలేదు.
2006 సంవత్సరం చివర్లో ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. మావూళ్లో మా పూర్వీకులనుండి సంక్రమించి, నాకింకా మిగిలిన ఆరెకరాలు వరి పొలాన్ని నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ కౌలు చేస్తుంటాడు ప్రతిసంవత్సరం. అతని సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారు చేయించి, 2007 లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. ముత్తారం దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహాపండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. యువకుడు. ఆ చుట్టుపక్కల ఏ దేవాలయంలోనూ కళ్యాణోత్సవాలు చేయించగలవాడు కానీ, ప్రతిష్టలు చేయించగలవాడు కానీ, ఆగమశాస్త్రం తెలిసినవాడు కానీ లేరు. అందరు భుక్తికొరకు అర్చకత్వం చేస్తున్నవారే. వాసుకు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన అధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగవైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది. మా కుటుంబం ఆ మూడు రోజులూ అక్కడే వున్నాం. వూరిపెద్దలు-చిన్నలు, విభేదాలు మాని ఏదో సమయంలో కార్యక్రమం చూడడానికి వచ్చారు. నాటి జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్, దేవాదాయ-ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు కూడా వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కొంత చర్చ జరిగింది.
మా గ్రామ సర్పంచ్ ముండ్ర అప్పారావు, మా బాబాయి వనం గోపాలరావు, దేవాలయ అర్చకుడు శ్రీనివాసరావు, ఇప్పటికీ ఇంకా వూళ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న మా తమ్ముడు అప్పాజీ (శ్రీరామచంద్రమూర్తి), గ్రామంలోనే ఇటీవల వరకు వ్యవసాయం చేయించి ఆర్థిక ఇబ్బందులవల్ల హైదరాబాద్ చేరుకున్న మరో తమ్ముడు నరహరి కలిసి చేసిన ఆలోచనతో గ్రామస్తులలో పలుకుబడి కలిగిన వారందరూ దేవాలయానికి వచ్చారు. జీర్ణావస్థలో వున్న దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించాలని అంతాకలసి ఆలోచన చేశాం. ప్రభుత్వం దగ్గర నుండి కొంత సహాయం పొందుదామనీ, విరాళాల రూపంలో కొంత వసూలు చేద్దామనీ నిర్ణయించాం. మా గ్రామంలో పుట్టి-పెరిగి, ఇంజనీరయ్యి, సంపాదనపరుడైన పరుచూరి ప్రసాద్ దేవాలయ పునరుద్ధరణకు పెద్దమొత్తంలో సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు. అయితే ఎలా-ఎవరికి నిర్మాణ పనిని అప్పగించాలనే విషయంలో సందిగ్ధత వుండడంతో వాయిదాపడుతూ వస్తున్నది. మరో వారంరోజుల తర్వాత మళ్లీ గుడిలో కలుద్దామనుకుని నిర్ణయించాం అప్పటికి.
ఆ రోజున సమావేశానికి వచ్చిన వారందరికీ, కృష్ణుడొచ్చిన వేళా విశేషంవల్ల రాముడికి కూడా కొత్త ఆలయం తప్పక వస్తుందన్న నమ్మకం కుదిరింది. నాకూ ఆనందం వేసింది. నా వంతు విరాళంగా లక్షా నూటపదహారు రూపాయలు ప్రకటించాను. మరుక్షణమే ఒకరి తర్వాత ఇంకొకరు తాహతుకు మించి విరాళాలు ప్రకటించారు. కొంద రైతే దేవాలయంలోని కొన్ని నిర్మాణాలకు పూర్తి ఖర్చు తామే భరిస్తా మంటూ ముందుకొచ్చారు. తర్వాత జరిగిన సమావేశానికి పర్చూరు ప్రసాద్ హాజరై, దేవాలయానికి సంబంధించిన మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయమంతా భరిస్తానని మాటిచ్చాడు. 2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. దేవాలయం పూర్తికావడానికి సర్పంచ్ అప్పారావు చేసిన కృషి నిజంగా అభినందించాలి. ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగవైభోగంగా, అశేష జనవాహిని మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఘనత అర్చకుడు వాసుగారి ది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఉత్తర ద్వారం నిర్మాణం కూడా జరిగింది. పవళింపు సేవకు అద్దాల మేడ నిర్మాణం కూడా జరిగింది. సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో చుట్టుపక్కల ఏ గ్రామంలో లేనంత గొప్ప దేవాలయం-రామాలయం మా ముత్తారంలో నిర్మించబడింది.
భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు హాజరవుతుంటాం.
బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.
No comments:
Post a Comment