(జ్వాలా మ్యూజింగ్స్ 13, 14 భాగాలు "అమెరికా ఎన్నికల్లోను అదే తంతు", "అమెరికా ఆరోగ్య సంస్కరణల చట్టం-భారతీయుడి అభిప్రాయం" అన్న శీర్షికలతో డిసెంబర్ 27, 2009 న ఈ బ్లాగ్ లో పెట్టాను)
హ్యూస్టన్ కు వచ్చిన తొలి రోజులు
వనం జ్వాలా నరసింహా రావు
నవంబర్ 9, 2009 న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు రావడానికి-తిరిగి శాన్ ఫ్రాన్ సిస్కోకు వెళ్లడానికి, మా ఇంటర్ నేషనల్ ఎయిర్ టికెట్ లోనే ఏర్పాటుచేశాడు ఆదిత్య. శాన్ ఫ్రాన్ సిస్కోకు, హ్యూస్టన్ కు సరాసరి వెళ్లే విమానమైతే సుమారు నాలుగున్నర గంటల ప్రయాణం. మధ్యలో విమానం మారాల్సొస్తే మరో గంటన్నర గడపాలి. మొదటి సారి మా ప్రయాణం సరాసరి వెళ్లే విమానంలోనే. అక్కడకు-ఇక్కడకు టైమ్ కూడా తేడానే. హ్యూస్టన్లో రెండు గంటలు ముందుంటుంది. మేం ఈ తేడాలు పాటించకుండా మా ఏర్పాటు మేం చేసుకున్నాం. మా గడియారాల్లో ఇండియా టైమ్ ను మార్చకుండా, ఏ ప్రదేశంలో వున్నా, అక్కడి పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా, అదే టైమ్ ను చూసుకుండే వాళ్ళం. ఉదాహరణకు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు (అక్టోబర్ వరకు) ఉదయం ఏడు గంటలవుతే, హైదరాబాద్ లో సాయంత్రం ఏడున్నర గంటలయ్యేది. మా దృష్టిలో శాన్ ఫ్రాన్ సిస్కోలో అప్పుడు ఉదయం ఏడున్నర గంటలయినట్లుగా భావించేవాళ్లం. అలానే హ్యూస్టన్లో అప్పుడు (మేం వచ్చేసరికల్లా) ఉదయం ఏడు గంటలవుతే, ఇండియాలో సాయంత్రం ఆరున్నర గంటలయ్యేది. మా వరకు మాకు, హ్యూస్టన్లో ఉదయం ఆరున్నర గంటల కింద లెక్కే. ఇండియాలో ఉదయాన్ని సాయంత్రం లాగా, సాయంత్రాన్ని ఉదయం టైమ్ లాగా చూసుకున్నాం కనుకనే జెట్ లాగుల లాంటివి మమ్మల్ని భాదించలేదు. గడియారంలో టైమ్ కూడా మార్చలేదు. తిన్నా-తాగినా-నిద్ర పోయినా-పొద్దున లేచినా, అవే టైమ్స్ పాటించాం.
హ్యూస్టన్ విమానాశ్రయంలో దిగి, సామానులు తీసుకొని, బయటకొస్తుంటే, కిన్నెర-కిషన్-యష్విన్-మేథలు కనిపించారు. సాయంత్రం ఐదవుతుందప్పుడు. కిన్నెర వాళ్లు అప్పట్లో షుగర్ లాండ్ లోని "బ్రాడ్ స్టోన్ అపార్ట్ మెంట్స్" లో వుంటున్నారు. సిన్సినాటి నుంచి వెళ్లి, న్యూయార్క్ రాజధాని ఆల్బనీలో కొన్నాళ్లుండి, సుమారు ఏడాది క్రితం హ్యూస్టన్ కు మారి, షుగర్ లాండ్ లో వుంటున్నారు. మా అల్లుడు కిషన్ బ్రిటీష్ పెట్రోలియం సంస్థలో పర్యావరణానికి సంబంధించిన నిపుణుడిగా పనిచేస్తున్నాడు. కిన్నెర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండేది ఆల్బనీలో. పిల్లలిద్దరు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి మధ్యలో కొన్నాళ్లు ఉద్యోగం మానేసింది. ప్రస్తుతం హ్యూస్టన్లో ఇంకా ఏ ఉద్యోగంలోను చేరలేదు. కిన్నెర వాళ్లుంటున్న షుగర్ లాండ్ ప్రాంతంలో, పక్క-పక్కనే వున్న, "న్యూ టెరిటరీ", "టెల్ ఫెయిర్" ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో చాలా మంది భారతీయులే. అందులోను ఎక్కువమంది తెలుగు వారే. కిన్నెర ఆడపడుచు మానస కుటుంబం పదేళ్లకు పైగా ఇక్కడే వుంటున్నారు. మానస-భర్త శ్రీనివాస రావు, ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ల సొంత ఇల్లు "న్యూ టెరిటరీ" లో వుంది. విమానాశ్రయం నుంచి కిన్నెర వాళ్లుండే అపార్ట్ మెంట్స్ కు వచ్చే దారిలో, బాబా గుడుకి పోయి, పక్కనే వున్న ఇండియా స్టోర్స్ లో ఏదో కొన్నాం. టెల్ ఫెయిర్ లో వాళ్లు కొనుక్కున్న కొత్త ఇల్లు కూడా చూపించారు దారిలో.
షుగర్ లాండ్ సిటీ ఒక విధంగా హ్యూస్టన్లో భాగమే. ఎనభై వేలకు పైగా జనాభా వున్న ఈ నగరం టెక్సాస్ రాష్ట్రంలో-ఫోర్ట్ బెండ్ కౌంటీలో వుంది. హ్యూస్టన్-షుగర్ లాండ్-బే టౌన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇదొక ముఖ్యమైన ప్రాంతం. టెక్సాస్ రాష్ట్రంలో అతి తొందరగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఇదొకటని అంటుంటారు. 1800 సంవత్సరం వరకూ ఈ ప్రాంతమంతా చెరకు సాగుచేసేవారట. 1959 లో కార్పొరేషన్ హోదా లభించిన షుగర్ లాండ్ ను, ఫోర్ట్ బెండ్ కౌంటీలో అతిపెద్ద సిటీగా-కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేర్కొంటారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి-మార్కెటింగ్ సంస్థగా గుర్తింపు పొందిన "ఇంపీరియల్ షుగర్" కేంద్ర కార్యాలయం షుగర్ లాండ్ లోనే వుంది. ఫోర్ట్ బెండ్ కౌంటీ లో, మాస్టర్ ప్రణాళిక ఆధారంగా నిర్మాణాలు జరిగిన ప్రదేశాల్లో షుగర్ లాండ్ ను మించింది లేదు. ఫస్ట్ కౌంటీ, షుగర్ క్రీక్, రివర్ స్టోన్, న్యూ టెరిటరీ, టెల్ ఫెయిర్, గ్రేట్ వుడ్ లాంటి ఎన్నో మాస్టర్ ప్రణాళికల కమ్యూనిటీ కాలనీలతో అలరారే అందమైన అమెరికన్ "ఛండీగఢ్" నగరం షుగర్ లాండ్. నగర మునిసిపల్ కార్యాలయం "సిటీ కౌన్సిల్" హాలుండే ప్రదేశం చక్కటి విహార స్థలంలాగా వుంటుంది. చుట్టుపక్కల ఎన్నో భారతీయ-ఆంధ్రుల రెస్టారెంట్లుంటాయి. అసలా మాటకొస్తే, హ్యూస్టన్ పరిసరాల్లో ఎక్కడ తిరుగుతున్నా, భారతదేశంలోని ఏ హైదరాబాద్ లోనో తిరుగుతున్నట్లు వుంటుంది. వాతావరణం కూడా దాదాపు అలానే వుంటుంది. అలానే గుళ్లు-గోపురాలు, పెళ్లిళ్లు-పేరంటాలు, సాయంకాల సమావేశాలు, వీకెండ్ పార్టీలు, విందులు-వినోదాలు, అన్నీ అచ్చు హైదరాబాద్ లో మాదిరి అనుభూతే కలిగింది. మా అమ్మాయి కిన్నెర ఆల్బనీలోని ఇల్లు అమ్మి, ఇక్కడ నూతనంగా అభివృద్ధి చెందుతున్న "టెల్ ఫెయిర్" కమ్యూనిటీ కాలనీలో ఇల్లు కొనుక్కున్నారు. మేం వచ్చేసరికి అదింకా పూర్తిగా తయారవలేదు. మేం ఇక్కడ వుండగానే అందులోకి మారారు.
కిన్నెర వాళ్లుండే అపార్ట్ మెంట్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. లోనికి రావాలంటే, గేట్ తెరుచుకోవాలి. దానికో పాస్ వర్డ్ వుంటుంది. అయితే అదొక బహిరంగ చిదంబర రహస్యం. ఏ మాత్రం తెలివితేటలున్నా లోపలికి రాజాలా రావచ్చు. పోవడానికి ఇబ్బంది అసలే వుండదు. శాంతా క్లారాలో ఆదిత్య వుంటున్న అపార్ట్ మెంట్స్ లో కూడా అంతే. కిన్నెర చిన్నతనంలో హైదరాబాద్ లో ఎలా స్నేహితుల బృందాన్ని పెంచుకుందో, సరిగ్గా అదే తరహాలో ఇక్కడకూడా చేస్తున్నది. పక్క-పక్క ఫ్లాట్లలో వుంటున్న పేరి శర్మ-భార్య జానకి-పిల్లలు స్నేహ, అమూల్య; ఉత్తర భారతీయులు అంబుజ్-భార్య రూ పాళి-పిల్లలు అనికా, అర్ష్; దగ్గర లో వుంటున్న శివ-పల్లవి-పిల్లలు ప్రణవ్, అనూహ్య; కొంచెం దూరంలో వుంటున్న రామకృష్ణ-భార్య సునంద-పిల్లలు భావన, సంజనా; దగ్గర లోని న్యూ టెరిటరీ లో వుంటున్న కిషన్ చెల్లెలు మానస-భర్త శ్రీనివాస్-పిల్లలు హర్ష్, భవ్య లతో సహా దాని ఇతర స్నేహితులు సుమన, అపర్ణ, గీత, సోనాలీ.. ... ... ఇలా ఎందరితోనో పరిచయాలు చేసుకొని, అంతటితో ఆగకుండా స్నేహంగా మెలుగుతుంటుంది. ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుంటూ, అహర్నిశలు అండ-దండగా వుంటుంటారు. నిజంగా ఇక్కడ వీళ్లని చూసి, కలివిడిగా వుండే విధానం నేర్చుకోవాలనిపిస్తుంది. మేం వచ్చిన మర్నాడే పల్లవి వాళ్లు తమ కొత్త ఇంటిలో గృహప్రవేశమయ్యారు. తెల్లవారు ఝామున జరిగిందా ప్రోగ్రాం. గృహ ప్రవేశానికి తప్పకుండా కావాల్సిన "పాలు" మర్చిపోయింది ఆమె. కిన్నెరకు తెల్లవారుతుండగా, అది అప్పుడే బయలుదేరి అక్కడకు పొయ్యే సమయంలో పల్లవి దానికి ఫోన్ చేసింది. (హైదరాబాద్ లో శ్రీనివాస రావు భార్య దుర్గ-నిర్మలా దేవికి ఆపత్ సమయంలో వచ్చినట్లే దీనికి ఇక్కడ ఇలాంటి ఫోన్లు వస్తుంటాయి). ఏ మాత్రం విసుక్కోకుండా ఇది పాలు పట్టుకొని పోయింది. పల్లవి వాళ్లూ అలానే వుంటారు. ఆ మాటకొస్తే వీళ్ల బృందంలోని అందరూ అలానే.
కిన్నెర-కిషన్ నన్ను, మా శ్రీమతిని వాళ్లందరికీ పరిచయం చేశారు. మా తోనూ వీళ్లందరు అలానే స్నేహంగా మెలిగారు. మేం వచ్చిన నాడే పరిచయమైన శర్మ గారు, అంబుజ్ కలిసి, ఆ మర్నాడే వాళ్లింట్లో (ఇద్దరు పైనా-కిందా ఫ్లాట్లలో వుండేవారు. తర్వాత అంబుజ్ కిన్నెర కొత్త ఇంటికి సమీపంలోనే కొనుక్కున్న సొంత ఇంటికి మారాడు) మంచి పార్టీ ఏర్పాటు చేశారు. వాళ్లకంత త్వరగా నా అలవాటు ఎలా తెలిసిందో మరి. నాకంటే వయసులో చిన్నవారైనప్పటికీ, కలిసి-మెలిసి సమానంగా ఎంజాయ్ చేశారందరు. జానకి గారు-రూ పాళి విందు భోజనం పెట్టారు. ఇక ఇలాంటివి హ్యూస్టన్లో వున్నన్నాళ్లు "నిత్య దిన చర్య" కాకపోయినా "వారాంతపు ఆట విడుపులు" అయ్యాయి.
అమెరికాలో వున్న వారందరికీ-కనీసం మా లాగా అప్పుడప్పుడూ వెళ్తున్నవారందరికి, ఎదురయ్యే వాటిల్లో పెరుగు-తోడు గురించిన అనుభవం ఒకటి. కాక పోతే, మా భండారు శ్రీనివాసరావు తన మాస్కో అనుభవాల్లో రాసినట్లు, సోవియట్ యూనియన్-మాస్కో అంత ఘోరం కాదే మో అమెరికాలో. ఇక్కడ "యోగర్ట్" లని పాకేజ్ పెరుగు వివిధ పరిణామాలలో, వివిధ రుచుల్లో దొరికినా, దాని రుచి మన తోడేసిన పెరుగుకు (కనీసం మనలాంటి వారికైనా) సమానం కాదు. పైగా ఆ యోగర్టులలో ఎక్కువ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. మేం ఇక్కడ శాన్ ఫ్రాన్ సిస్కోలో అడుగు పెట్టగానే మా కోడలిని ఎంక్వైరీ చేసిన మొదటి విషయం పెరుగు-తోడు గురించే. అయితే మేం ఇండియా నుంచి తేకపోవడానికి కారణం ఇక్కడ (మాస్కో లా కాకుండా) తప్పక దొరుకుతుందన్న నమ్మకం. అయితే మా కోడలుకు అమెరికా జీవితం కొత్త-ఇంకా అలవాటు కాలేదు కాబట్టి వాళ్లింకా "యోగర్ట్" లే కొంటున్నారు. వాస్తవానికి ఆ పెరుగు రుచిగా, తియ్యగా, హైజినిక్ గా కూడా వుంటుంది. అయినా మన రుచి ప్రిఫరబుల్ కదా. రెండు-మూడు రోజుల తర్వాత మూడొందల మైళ్ల దూరంలో వున్న లాస్ ఏంజల్స్ కు వెళ్లాం దగ్గర లోని డిస్నీ లాండ్ చూడడానికి. ఆ వూళ్లో వుంటున్న మా శ్రీమతి అక్క కోడలు శిల్ప వాడే పెరుగు "తోడు పెరుగు". అంతే - ఎగిరి గంతేసి ఆ తోడు తెచ్చుకున్నాం. ఇప్పటికీ మా కోడలు అదే తోడు తో పెరుగు తయారు చేసుకుంటుంది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత ఆ ఇబ్బందే లేదు. ఇదంతా పాడి-పశువులతో వర్ధిల్లే మన చిన్నతనం నాటి ఒక తెలుగు గ్రామం లాగా వుంటుంది. వీళ్లున్న ప్రాంతం పేరే: "షుగర్ లాండ్"- ఒకప్పుడు చెరకు తోటలు విస్తారంగా వుండేవట. ఇప్పటికీ అమెరికాలోని అతి పెద్ద చెరకు ఉత్పత్తి-వాణిజ్య కేంద్రం ఇక్కడే వుంది. ఇక్కడ దొరకని భారతీయ వస్తువు-తెలుగు సామాను ఏదీ లేదు. అందుకే అంటారేమో" "ఏ దేశమేగినా ఎందు కాలిడినా..... పొగడరా నీ పెరుగు తియ్యదనాన్ని" అని.
Thanks for mentioning us uncle. We have thoroughly enjoyed your company too.
ReplyDeleteThank you. God bless you all
ReplyDelete