Tuesday, January 5, 2010

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందో ప్రయోగాలు -2

ఆంధ్ర వాల్మీకి- కవి సార్వభౌమ

శ్రీ వావిలి కొలను సుబ్బారావు- వాసుదాస స్వామి

రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం

"ఆంధ్ర వాల్మీకం"లో నారదుడు వాల్మీకికి చెప్పిన సంక్షిప్త రామాయణం -- వనం జ్వాలా నరసింహా రావు

ఏ వంశంలోనైతే-ఏ ఇంటిలోనైతే, నిత్యం భగవంతుడు ఆరాధించబడుతున్నాడో, అట్టి ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, ’రామా రామా రామా’, అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరుగలాయన జన్మించాడు. అతివీర్యవంతుడాయన. అసమానమైన-వివిధమైన-విచిత్రమైన శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయంలేని ఆనందంగలవాడు. ఇంద్రియాలను-సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు.


శ్రీరాముడికి శంఖంలాగా మూడు రేఖలున్న కంఠముండి, విశాలమైన వక్షస్థలముండి, గొప్పదైన విల్లు ధరిస్తాడు. ఆశ్రిత పాపాలనే శత్రు సమూహాలకు ప్రళయకాల యముడిలాంటి వాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి చేతులు మోకాళ్లకు తగిలేంత పొడుగ్గా వుంటాయి. అందమైన వక్షం, అసమాన సౌందర్యమున్న నొసలు, చూసేవారిని మైమరిపించే నడక గలవాడు. అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహ కాంతి, భయంకరమైన శత్రువులకు సహించలేని ప్రతాపం, మనోహరమై-బలిసిన మంచి వక్షం వున్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్లు, ఎదుటివారు మెచ్చుకునే వేషం, శ్లాఘ్యమైన శుభ చిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచిగుణాల మనోహరుడాయన.


ఇలా ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహంతో పాటు, ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలను కూడా కలిగున్నవాడు శ్రీరాముడు. శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు-క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు-చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు-సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు-దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు-సర్వ విషయాలు తెలిసినవాడు-బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు-మిక్కిలి పరిశుద్ధుడు-ఋజుస్వభావం గలవాడు-ఆశ్రిత రక్షకుడు-ఆత్మతత్వం ఎరిగినవాడు-ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు-విష్ణువుతో సమానుడు-శ్రీమంతుడు-లోకాలను పాలించ సమర్థుడు-ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు-ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు-ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు-స్వధర్మ పరిపాలకుడు-స్వజనరక్షకుడు-వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు-కోదండ దీక్షాపరుడు-సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి-జ్ఞాపకశక్తిగలవాడు-విశేషప్రతిభగలవాడు-సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు-సాధువు-గంభీర ప్రకృతిగలవాడు-అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు-నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు-అందరిమీద సమానంగా వారి, వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు-గొప్పగుణాలున్నవాడు-ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా దర్శనమిచ్చేవాడు-సమస్తభూతకోటికి పూజ్యుడు-అన్నింటా గుణ శ్రేష్ఠుడు. ఆయనే శ్రీరామచంద్రుడు. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడు.


గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు.


ఇటువంటి సుగుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తిని, జ్యేష్ఠ కుమారుడిని, మహాపరాక్రమశాలిని, సామగుణసంపదగలవాడిని, తనకు-ప్రజలకు ప్రియుడైన వాడిని, భూజనుల క్షేమం కోరి ప్రవర్తించేవాడిని దశరథ మహారాజు తన మంత్రుల అభీష్టం నెరవేర్చేందుకు, యువరాజును చేయాలని మనస్సులో అనుకుని, పట్టాభిషేకానికి కావలసిన ప్రయత్నం చేయసాగాడు. దశరథుడి భార్య కైకేయి ఆ ప్రయత్నాలకు అడ్డుపడింది. పూర్వం తనకిచ్చిన రెండు వరాలను నెరవేర్చమని కోరింది భర్తను. మొదటిది శ్రీరామచంద్రమూర్తిని అరణ్యాలకు పంపడం, రెండోది తన కొడుకైన భరతుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయడం. రాముడికంటే సత్యం మీదే ప్రీతిగలవాడైన దశరథుడు తన ప్రియ కుమారుడు శ్రీరాముడిని అడవులకు పంపాడు. రాజ్యపాలన శక్తి, తండ్రిని ధిక్కరించి రాజ్యాన్ని గ్రహించే శక్తీ గల వీరుడైన రాముడు, కైకకు సంతోషాన్నిచ్చే జనకుడి ఆజ్ఞ నెరవేర్చేందుకు అరణ్యాలకు పోయాడు. అలా అడవులకు పోదలచిన శ్రీరాముడిని చూసి, ఆయనపై స్నేహభావంగల చిన్న తమ్ముడు, వినయ సంపన్నుడు, అన్న ప్రీతికి పాత్రుడు, దశరథుడి రెండో భార్య సుమిత్రా దేవి కొడుకైన లక్ష్మణుడు, పెద్దన్నగారి సేవ చేద్దామన్న కారణంతో ఆయన వెంట పోయాడు అడవులకు. శ్రీరామచంద్రమూర్తికి ప్రాణ సమానురాలైన ఇల్లాలు, మనోహర గుణవంతురాలు, స్వభావంచేతనే వినయ గుణాలు కలది, హిత బోధయందు ఆసక్తిగలది, జనక మహారాజు కూతురు, దేవమాయలా అయోనిజగా జన్మించినది, మంచి గుణాల కూడలి, లోకమంతా పొగిడే నడవడిగలిగిన పవిత్రురాలు, సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉత్తమస్త్రీలకుండాల్సిన శుభ లక్షణాలన్నీ వున్న దశరథ మహారాజు కోడలు, ఉత్తమ స్త్రీ సీతాదేవి, చంద్రుడిని రోహిణి ఏ ప్రకారం ఎల్లవేళలా అనుసరించి పోతుందో, అలానే నిండారు ప్రేమతో, తన భర్త వెంట పోయింది అడవులకు.


సీతా లక్ష్మణుల లాగానే, పురజనులుకూడా రాముడిని వెంబడించారు. రాముడిని విడిచిపెట్టలేక, సహించలేని వియోగ తాపంతో, తపించిన అయోధ్య వాసులు శ్రీరామచంద్రుడు రావద్దని వారిస్తున్నా వినకుండా, ఆయన వెంటబడి చాలాదూరం పోయారు. తండ్రికూడా కొంతదూరం పోయాడు. ధర్మ బుద్ధిపై అత్యంత ఆసక్తి వున్న రాముడు గంగానదీ తీరం దగ్గరున్న శృంగిబేరపురం చేరాడు. అక్కడున్న ఆత్మ మిత్రుడు-గుహుడు, అనే బోయ నాయకుడిని చూసి, సారథి సుమంత్రుడిని అయోధ్యకు పొమ్మంటాడు రాముడు. ఆతర్వాత గుహుడు ఆ ముగ్గురినీ గంగ దాటిస్తాడు.


ఇట్లా రాజకుమారులిద్దరు-రాజకుమారి సీత,ముగ్గురు అడవి మార్గంలో గంగానదిని దాటి, భరద్వాజుడి ఆజ్ఞానుసారం చిత్రకూట పర్వతం చేరుకుంటారు. అక్కడ ఓ పర్ణశాల (లక్ష్మణుడు కట్టిన ఆకుల గుడిసె) నిర్మించుకుని అందులో సంతోషంగా నివసిస్తుంటారు. అక్కడ అయోధ్యలో (తన కొడుకులు చిత్రకూటం చేరారని తెలిసిన) దశరథుడు శ్రీరాముడిపై నున్న ప్రేమాతిశయంతో, ’రామా రామా’ అని ఏడ్చి-ఏడ్చి, చనిపోతాడు. తండ్రి మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదు. రాజ్యమేలడానికి కావలసిన దేహ బలం,సేనా బలం, ఇంద్రియనిగ్రహ బలం భరతుడికున్నప్పటికీ, శ్రీరామచంద్రచరణారవిందాల అనుగ్రహం కొరకై చిత్రకూటానికి బయల్దేరి పోయాడు. ఒక్కడేపోలేదు. సర్వ సైన్యంతో వెళ్లాడు.


చిత్రకూటం చేరిన భరతుడు, అన్నకు తెలియని ధర్మం లేదనీ, పెద్దవాడుండగా చిన్నవాడు పట్టాభిషేకం చేసుకోకూడదని, రాముడే రాజు కావాలనీ ప్రార్థిస్తాడు. తండ్రి ఆజ్ఞ మీరరాదని భావించిన రాముడు, ఇతరులను సంతోషపెట్టే స్వభావమున్నప్పటికీ, దానికొరకు ఎలాంటి త్యాగమైనా చేసేవాడైనప్పటికీ, అలా చేయడానికి బాధపడనివాడైనప్పటికీ, ఇతరుల మనోరథం వ్యర్థం చేయడన్న కీర్తి సంపాదించినప్పటికీ, జనకుడి ఆజ్ఞను స్మరించి, రాజ్యం అంగీకరించక-భరతుడి ప్రార్థన వ్యర్థం చేయక, తనకు ప్రతినిధిగా తన పాదుకలిచ్చి, భరతుడినప్పటికి సమాధాన పరిచి, బలవంతంగా పంపుతాడు. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసి, ఆయన దగ్గరుండి సేవ చేద్దామన్న కోరిక నెరవేరక పోవడంతో, ఆయన బదులు ఆయన పాదుకలకు సేవ చేస్తూ, రాముడెప్పుడొస్తాడా-ఎప్పుడు కళ్లారా చూస్తానా-ఎప్పుడు సేవిస్తానా అని ఎదురుచూస్తూ, శ్రీరాముడు లేని అయోధ్యకు పోవడం ఇష్టం లేక, భోగ కాంక్ష-ఫల కాంక్ష లేక, నంది గ్రామం అనె పల్లెటూరులో వుంటూ రాజ్యం చేస్తాడు భరతుడు.


భరతుడు తన ఆజ్ఞ ప్రకారం తన పాదుకలను తీసుకుని అయోధ్యకు పోయిన తర్వాత అక్కడి పురజనులు తానిక్కడున్నానని తెలిసి వీలున్నప్పుడల్లా తన్ను దర్శించడానికి వచ్చే అవకాశం వుందని గ్రహిస్తాడు రాముడు. దానివల్ల ఆశ్రమవాసుల తపస్సుకు భంగం కలుగుతుందని భావిస్తాడు. ఈ అలోచనరాగానే, ఇంద్రియాలను జయించిన సత్యస్వరూపుడైన రామచంద్రుడు దండకారణ్యం చేరుకుంటాడు. విరాధుడిని చంపుతాడు. శరభంగుడిని దర్శిస్తాడు. సుతీక్షణుడిని చూస్తాడు. అగస్త్యుడిని, ఆయన తమ్ముడు సుదర్శనుడిని దర్శిస్తాడు. అగస్త్యుడు చెప్తే, ఆయన దగ్గరున్న ధనస్సును, ఖడ్గాన్ని, రెండంబుల పొదలను, పదునైన అక్షయ శరాలను సంతోషంగా తీసుకుంటాడు. మునీశ్వరుల దగ్గరుంటూ, వాళ్ల కోరిక మేరకు వారి తపస్సు భంగం చేసే రాక్షసులను సంహరిస్తానని అభయమిస్తాడు రాముడు.


పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ ఇష్టప్రకారం తిరిగే సమయంలో, జన స్థానంలో నివసించే కామ రూపిణి-భయంకర రాక్షస స్త్రీ-శూర్పణఖ, ముక్కు చెవులు కోసి వికార రూపం వచ్చేటట్లు చేస్తాడు లక్ష్మణుడు. ఇది తెలిసిన జన స్థానంలోని ఖర-దూషణ-త్రిషిరుడితో సహా పద్నాలుగు వేల రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారు. లక్ష్మణుడి సహాయం లేకుండానే, రణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి, పద్నాలుగు వేల మందినీ, కేవలం భుజబలంతోనే వధిస్తాడు. తన బంధువుల మరణ వార్త విన్న రావణుడు, కోపంతో, తనకు సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడు. మహా బల పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా ఇస్తాడు మారీచుడు. ఆ ఆలోచన మాను కొమ్మని బోధిస్తాడు. మృత్యువు ప్రేరేపిస్తుంటే, వాడిని తీసుకొని సీతారాములున్న చోటికి పోతాడు రావణుడు. వంచన చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారువన్నెగల జింక రూపంతో సీతకు కనిపిస్తాడు. ఆ జింక కావాలని సీత కోరితే, దాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడు. చస్తూ ’హా లక్ష్మణా’ అని అరుస్తాడు మారీచుడు. ఆ ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడు. ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువనే గద్దను చంపి లంకకు చేరి సీతను అశోక వనంలో వుంచుతాడు రావణుడు.


సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. తనవల్ల కదా జటాయువుకింత దుఃఖం కలిగిందని బాధపడి విలపిస్తాడు.


అడవులన్నీ వెతుక్కుంటూ పోయి, శ్రీరాముడు భయంకర-వికార స్వరూపుడైన కబంధుడనే రాక్షసుడిని చంపి దహనం చేసాడు. శాప విముక్తుడైన కబంధుడు, పంపా తీరంలో వున్న శబరిని చూసిపొమ్మని బోధించాడు. ఆమె శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదనీ, అతిథి పూజలాంటి సకల ధర్మాలను ఎరిగినందున, ఆ బోయసన్యాసినిని తప్పక చూడమనీ అంటాడు.


శత్రుసంహార దక్షుడైన రాజకుమారుడు శ్రీరామచంద్రమూర్తి శబరిని కలిశాడు. ఆమె నిండు శ్రద్ధా భక్తులతో సమర్పించిన ఆతిథ్యాన్ని కడు ప్రీతితో స్వీకరించాడు. సీతను వెతికే పనిలో తన అభీష్టం నెరవేరేందుకు శబరి చెప్పిన విధంగానే పంపా సరస్సు చేరుకుంటాడు రాముడు. పంపా తీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సూర్య నందనుడైన సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు. తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు రామచంద్రుడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు.


తనకూ-తన అన్న వాలికి విరోధం కలిగిన విధాన్ని సుగ్రీవుడు రాముడికి వివరిస్తాడు. వాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. వాలి బల పరాక్రమాలు వినిపించి అంతటి బలవంతుడిని చంపగలడా రాముడని సందేహం వెలిబుచ్చుతాడు సుగ్రీవుడు. తనకు నమ్మకం కలిగేలా, ఓ పెద్దకొండలాగున్న దుందుభి అనే రాక్షసుసుడి కళేబరాన్ని చూపించి, దాన్ని చిమ్మమని రాముడిని కోరతాడు సుగ్రీవుడు. ఇంత చిన్న పరీక్షా అని చిరునవ్వుతో, దాన్ని అలకగా కాలిబొటనవేలితో, పేడును చిమ్మినట్లు, పది ఆమడల దూరంలో పడే విధంగా చిమ్ముతాడు రాముడు. వాలికంటే రాముడు బలశాలి అనే నమ్మకం కుదిరేందుకు మరో పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. సాల వృక్షాన్ని భేదించ మంటాడు. ఆయన కోరిక నెరవేర్చేందుకు, మళ్ళీ సందేహానికి తావులేకుండా వుండేందుకు, సాల వృక్షాలను ఛేదించి, అవుండే కొండను భేదించాడు. ఆయన బాణం రసాతలానికి పోయి తిరిగి ఆయన చేతిలోకి వచ్చింది. దాంతో సుగ్రీవుడు తృప్తిపడ్డాడు. తనపగ తీరబోతుందన్న నమ్మకంతో వానర రాజ్యం లభించబోతుందన్న ఆశతో, సంతుష్టి పడిన మనస్సుతో, రామచంద్రమూర్తిని తీసుకొని కిష్కింధకు పోయాడు.


ఆ వెంటనే బంగారువన్నె దేహ కాంతిగల వానరేశ్వరుడు-సూర్యపుత్రుడు, సుగ్రీవుడు సింహనాదం చేశాడు. ఆ ధ్వనిని విన్న ఇంద్రకుమారుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి బయల్దేరతాడు. రాముడి సహాయం సుగ్రీవుడి కుందని తార ఆయనకడ్డుపడుతుంది. తమ్ముడితో సంధిచేసుకొమ్మంటుంది. ఇతరులతో యుద్ధం చేస్తున్న తనను ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఎందుకు చంపుతాడని తారను సమాధాన పరిచి సుగ్రీవుడిని యుద్ధానికి ఒప్పిస్తాడు. తన మిత్రుడిని తన ఎదుటే నొప్పిస్తుంటే కళ్ళారా చూసిన రాముడు, శరణాగత ఆర్తత్రాణపరాయణత్వం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని భావించి, ఒకే ఒక్క బాణంతో వాలిని నేలగూల్చుతాడు. వాలిని యుద్ధంలో చంపిన రాముడు, సుగ్రీవుడు కోరినట్లే, వాలి పరిపాలిస్తున్న వానర రాజ్యానికి, సుగ్రీవుడిని వాలి స్థానంలో ప్రభువును చేస్తాడు.


శ్రీరామచంద్రమూర్తి తన కోరిక నెరవేర్చడంతో సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం, మిక్కిలి బల పరాక్రమవంతులైన వానరులను, సీతాదేవిని వెదికేందుకు, నాలుగు వైపులకు పంపించాడు. వారిలో ఒకడైన హనుమంతుడికి, జటాయువు సోదరుడైన సంపాతి, సీతాదేవి లంకలో వుందని చెప్తాడు. ఆయన మాట ప్రకారం, సుమారు నూరామడల సముద్రాన్ని సునాయాసంగా దాటి రావణాసురుడేలే లంకా పట్టణానికి చేరుకుంటాడు హనుమంతుడు. లంక ప్రవేశించిన హనుమంతుడు, రావణుడి అంతఃపురం దగ్గరలోవున్న అశోక వనంలో శోకిస్తూ, తన భర్తనే ధ్యానిస్తూ, తపోబలంతో-శీల సంపత్తితో, నిజ వర్చస్సుతో ప్రకాశిస్తున్న సీతాదేవిని చూశాడు. అగ్నిహోత్రుడి మిత్రుడి కుమారుడైన హనుమంతుడు, సీతాదేవి తనను నమ్మేందుకు, శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామ ముద్రికను చూపిస్తాడు. దుఃఖ పడవద్దనీ, రాముడు త్వరలో వచ్చి సీతను చెరనుండి విడిపిస్తాడని అంటూ ఆమెను సమాధాన పరిచాడు. రామ లక్ష్మణులిరువురు సముద్రమెట్లా దాటుతారని-దాటినా, ఇంతటి బలశాలి రావణుడి నెట్లా జయించగలరని సందేహం వెలిబుచ్చుతుంది సీత. సూర్యపుత్రుడైన సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి స్నేహం లభించిన విషయం చెప్తాడప్పుడు ఆమెకు ధైర్యం కలిగేందుకు హనుమంతుడు.


ఒక్క వానరుడే ఇంత పనిచేస్తే, వానర సేనతో రామచంద్రమూర్తి వచ్చి, లంకనంతా ధ్వంసం చేయడంలో సందేహం లేదు అని రావణాసురుడనుకోవాలనీ-దాంతో సీతాదేవికి ధైర్యం కలగాలనీ భావించాడు హనుమంతుడు. అందుకు ముందుగా రావణుడి బలమెంతో తెలుసుకునేందుకు, వాడిని యుద్ధానికి ఈడ్చి తన్నాలనుకుంటాడు హనుమంతుడు. అలా చేస్తే వాడికి తెలివొచ్చి సీతను అప్పగించి సమాధానపడ్తాడని తలుస్తాడు. వెంటనే హనుమంతుడు పరాక్రమంతో ఉపక్రమించి, అశోక వనం తలవాకిటున్న ద్వారాన్ని విరగ్గొట్టి, సేనానాయకులందరినీ-ఏడుగురు మంత్రి పుత్రులనూ చంపి, అక్షయ కుమారుడిని హతమార్చి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు. బ్రహ్మ వరంతో ఆ కట్లు తెగిపోయినట్లు తెలిసినా, రావణుడిని చూసి వాడితో మాట్లాడాలని భావించి, తనను ఈడ్చుకుంటూ పోతున్న రాక్షసులను చంపక విడిచిపెట్టాడు. సీతాదేవిని తప్ప తక్కిన లంకంతా భస్మం చేసి, శీఘ్రంగా రామచంద్రమూర్తికి సీతాదేవి వార్త తెలపాలని, లంక విడిచి మరలి పోతాడు హనుమంతుడు. ధీరాగ్రగణ్యుడైన శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి, ’ రామా చూసితి సీతను - శీలం విడవక జీవించి వున్న దానిని ’ అని చెప్తాడు.


సూర్యవంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు, సూర్యుడి కొడుకైన సుగ్రీవుడితో-అతడి సైన్యంతో, దక్షిణసముద్రపు తీరం చేరి, దాటేందుకు దారిమ్మని సముద్రుడిని ప్రార్తిస్తాడు. దారివ్వని సముద్రుడిపై కోపించిన రాముడు, సూర్యుడితో సమానమైన బాణాలను వేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ క్షోభకు గురైన సముద్రుడు, తన భార్యలైన నదులతో సహా నిజ స్వరూపంతో వచ్చి, రామచంద్రమూర్తి పాదాలపై పడి, క్షమించమని వేడుకుని, నలుడితో సేతువు కట్టించమని ఉపాయం చెప్తాడు. అదే ప్రకారం చేసి, దానిపై సేనలతో నడచిపోయి, లంకలో నిర్భయంగా ప్రవేశించి, యుద్ధభూమిలో రావణుడిని చంపి, సీతాదేవిని చూసి, ఇన్నాళ్ళూ పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి, సీతాదేవిని కఠినోక్తులాడుతాడు. పతివ్రతైన సీత, తన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి, లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చి, సీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరనీ, ఆమెలో ఎట్టి లోపంలేదనీ, ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడామెను మరల స్వీకరించి, బ్రహ్మ రుద్రాదిదేవతలందరు మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు.


దేవతా సమూహాల గౌరవం పొందిన శ్రీరామచంద్రమూర్తి, తను చేసిన పని, లోకోపకారం-లోక సమ్మతమైన పనైనందున, సంతోషపడ్తాడు. రావణాసుర వధనే ఆ మహాకార్యాన్ని చూసిన దేవతలు-మునులు- ముల్లోక వాసులు, రావణుడి బాధ తొలిగిందికదా అని సంబరపడ్డారు. తదనంతరం విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి, వీరుడై, కృతకృత్యుడై, మనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు.


ఇంద్రాది దేవతల వరాలు పొంది, ఆ వర బలంతో యుద్ధంలో మరణించిన వానరులకు ప్రాణం పోసి బ్రతికించి, మిత్రులైన సుగ్రీవ విభీషణులతో కలిసి సార్థక నామధేయమైన అయోధ్యకు పుష్పక విమానంలో బయల్దేరి పోతాడు శ్రీరాముడు. త్రోవలో భరద్వాజుడి ఆశ్రమంలో దిగి, తనరాక విషయం భరతుడికి చెప్పాల్సిందిగా ముందు హనుమంతుడిని ఆయన వద్దకు పంపుతాడు. తర్వాత పుష్పక మెక్కి అయోధ్యకు పోతూ, దారిలో గతంలో జరిగిన వృత్తాంతమంతా సుగ్రీవుడికి చెప్తాడు. సాధుచరిత్రుడైన భరతుడుండే నందిగ్రామంలో దిగి, తమ్ములతో సహా జడలు తీసేస్తాడు.


"సీతామహాలక్ష్మి తోడుండగా, సూర్యతేజుడైన శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు మిక్కిలి సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీరామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీరామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్టలేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తనసుఖాన్ని వదులుకోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ, పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. శ్రీరామచంద్రమూర్తి పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు.


ఇదే సంక్షిప్త రామాయణం. దీనిని బాల రామాయణం అని కూడా అంటారు. ఇదే సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణంలో ప్రధమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం "త" కారం తో మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి గ్రంథమని పేరు. "గ్రంథోధనే వాక్సందర్భే ద్వాత్రింశ ద్వర్లసంహతౌ" అన్న శ్లోకంలో ఇది విశదమవుతుంది.


ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రధమ సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో, తక్కిన అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే, వారికి సవినయంగా నమస్కరిస్తానని, తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో రాసారు. ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు వాసుదాసుగారు. ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం" అనడం నిర్వివాదాంశం. యతిని అనుసరించే, ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్" య కారంతో ముగించబడింది. తెలుగులో "త్" శబ్దం కడపట రాకూడదు-దానికి ముందున్న "య" కారాన్నిగ్రహించాలంటారు వాసుదాసుగారు- వనం జ్వాలా నరసింహా రావు

No comments:

Post a Comment