“శ్రీమతి పుట్టిన రోజు బహుమతి”
"బాల కాండ మందర మకరందం"
వనం జ్వాలా నరసింహారావు
అమెరికా వచ్చినప్పటి నుంచి, ఆదిత్యకు చెప్పి "న్యూ యార్క్ టైమ్స్" దినపత్రికకు చందా కట్టి ఇంటికి తెప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాను. అమెరికాలో సర్వ సాధారణంగా ఎవరు పత్రికలకు చందా కట్టి తెప్పించుకునే అలవాటుండదు. ఆన్ లైన్‌లోనే చదువుతారు. కొన్ని పత్రికల వాళ్లు చందా కట్టకపోయినా, వారంలో కొన్ని రోజులు ఉచితంగానే వేసి పోతూంటారు. కొందరు వారానికి ఒకటో-రెండో రోజులకు చందా కట్టి, పత్రిక వేయమని అడుగుతే, ఆ డబ్బులకే వారమంతా వేస్తుంటారు. ఏ పద్ధతిలో దిన పత్రిక ఎవరింటికి వచ్చినా, అది ఇంటి ముందర వేసే తీరు అమెరికన్ల క్రమశిక్షణకు నిదర్శనంగా వుంటుందనే చెప్పుకోవాలి. తెల్లవారక ముందే, ఎప్పుడు వేస్తాడో-ఎవరు వేస్తాడో తెలియదు గాని, లేచేసరికి ఇంటి ముందర, చక్కటి ప్లాస్టిక్ కవర్లో, వర్షం కురిసినా తడవకుండా వుండే విధంగా పెట్టి, ఇంటి ముందర వేసి పోతారు. నాలాంటి వాళ్లు వచ్చినప్పుడు తప్ప వాటి జోలికి సాధారణంగా పోరు ఇక్కడుండే మనవాళ్లు గాని, అమెరికన్లు గాని. యధా ప్రకారం "ట్రాష్" లోకన్నా పోతుంది-లేదా-ఇంట్లోకి తేబడి తెరవకుండా "ట్రాష్” లోకన్నా పోతుంది. ఒకవేళ తెరవడమంటూ జరుగుతే, అందులో వుండే "కూపన్లు" చించు కోవడానికి మాత్రమే పరిమితం చేసి, మిగతాది ట్రాష్ లోకి చేరుస్తారు.
సరే, నా అలవాటు మార్చుకోలేక, పేపర్ తెప్పించుకోవడం, చదవడం, ఆసక్తికరంగా వున్న వార్తలను మరింత విశ్లేషణ చేసి, ఇంకొంచెం విషయ సేకరణ చేసి, ఏదో ఒక పత్రికకు పంపడం చేసేవాడిని. కొన్ని ప్రచురించబడ్డాయి వాటిలో. కొన్ని యధా ప్రకారం ఏమైనాయో కూడా తెలియదు. ఎక్కడో ఒకచోట వచ్చేంతవరకు వెంట బడే వాడిని. కొన్ని "ఆంధ్ర జ్యోతి" లో, కొన్ని సిలికానాంధ్ర వారి "సుజన రంజని" లో, కొన్ని మితృడు శంకర్ నడిపే "ఎమ్మెల్యే డాట్ కాం" ఇంటర్నెట్ లో, కొన్ని అన్నింటిలోనూ దర్శనమిచ్చాయి. నేను అమెరికా వచ్చిన మొదటి రోజుల్లో న్యూయార్క్ మేయర్ ఎన్నిక జరుగుతున్న విధానం, అభ్యర్థుల ఎన్నిక వ్యూహాలు, పెడుతున్న ఖర్చుకు సంబంధించిన వార్తలు నన్ను ఆకర్షించాయి. ఇంటికి వస్తున్న న్యూయార్క్ టైమ్స్ తో పాటు, ఆన్‌లైన్లో కూడా వార్తలు చదివేవాడిని. ఇంకో వార్త నన్ను బాగా ఆకర్షించింది, ఆరోగ్యరంగంలో, అమెరికాలో ఒబామా ప్రభుత్వం ప్రవేశ పెట్టదల్చుకున్న సంస్కరణలు. ఈ రెండింటి మీద శ్రద్ధగా చాలా చదివేవాడిని.
"రామాయణం-బాల కాండ మందర మకరందం" రాయడం నవంబర్ మొదటి తేదీతో అయిపోయింది. అయిపోవడమంటే, మొదటి డ్రాఫ్ట్ రాయడం, కంప్యూటర్ లో తెలుగులో స్వయంగా 250 పేజీలకు పైగా కంపోజ్ చేయడం అయిపోయింది. శ్రద్ధగా చదివి అభిప్రాయం చెపుతారని నేను భావించిన వారందరికీ, సాఫ్ట్ కాపీని, మెయిల్ చేశాను. కొందరికి, నేను పంపలేదని అనుకుంటారని-అంటారనీ భయపడి పంపాను. చిలకపాటి విజయ రాఘవా చార్యులు గారి లాంటి వారు, మా శ్రీమతి కజిన్ కొమరగిరి ఫణి లాంటి ఇద్దరు-ముగ్గురు చదివి అభిప్రాయాలు చెప్పారు. సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను తగు విధంగా పొందుపరుస్తున్నాను. రాయడం-కంప్యూటర్‌లోకి ఎక్కించడం అయిపోయింది కనుక ఆదిత్య, పారుల్, శ్రీమతి-ముగ్గురు, నా ఆలోచన కను గుణంగా, మొదటి కాపీని ఆవిష్కరిద్దామన్నారు. సిన్సినాటిలో అయిదేళ్ల క్రితం "సుందర కాండ మందర మకరందం" పూర్తి చేసినప్పుడు మొదటి డ్రాఫ్ట్ ను, మా అమ్మాయి కిన్నెర అత్తగారు శ్రీమతి లక్ష్మి సుందరి గారితో ఆవిష్కరించి, మొదటి కాపీని ఆమెగారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మర్నాడే, అనుకోకుండా, అదే వూళ్లో వుంటున్న, బంధువు-మిత్రుడు గన్నంరాజు వెంకటేశ్వర రావు తీసుకెళ్లడంతో పుస్తక ప్రతిని "పిట్స్ బర్గ్" లోని "వెంకటేశ్వర స్వామి" గుడిలో ఆయన పాదాల చెంత పెట్టి తెచ్చుకున్నాను. అలానే ఈ సారి కూడా "బాల కాండ మందర మకరందం" విషయంలో చేద్దామనుకున్నాం.
ఆలోచన వచ్చిందే తడవుగా, కోడలు పారుల్ కార్యరూపంలో పెట్టడం మొదలెట్టింది. ముందుగా పుస్తకం పేజీలన్నీ ప్రింట్లు తెచ్చింది. కలర్ పేజీలను ఆదిత్య ప్రింట్ చేయించాడు. మర్నాడు నవంబర్ 2, 2009 సాయంత్రం అయిదింటికల్లా చక్కటి ఫైల్ గా పుస్తకం కంటే అందంగా తయారుచేశారు ఆదిత్య-పారుల్. అదే రోజు మా శ్రీమతి విజయ లక్ష్మి 55వ పుట్టిన రోజు. హ్యూస్టన్ లో వుంటున్న మా రెండో కూతురు కిన్నెర పుట్టిన రోజు కూడా అదే రోజున. ఆ సాయంత్రం ఆదిత్య స్నేహితులు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్న ఒకరిద్దరు పరిచయస్తులు ఇంటికొచ్చారు. ఒక రకంగా పండుగ వాతావరణం నెలకొంది. అందరి కోరికపై, "బాల కాండ మందర మకరందం" మొదటి కాపీని శ్రీమతికి అందచేసాను. సరదాగా గడిచిందా సాయంత్రం. నిజానికి శాన్ ఫ్రాన్ సిస్కోకు వచ్చిన తర్వాత మేం జరుపుకున్న పారుల్ పుట్టిన రోజు, శ్రీమతి పుట్టిన రోజు, దసరా-దీపావళి పండుగలు హైదరాబాద్ లోకంటే ఘనంగా జరుపుకున్నా మనాలి. దీపావళి నాడు పారుల్-మా శ్రీమతి కలిసి, ఆదిత్య తోడ్పాటుతో ఏర్పాటుచేసిన లైట్లు చాలా బాగున్నాయి. ప్రమిదలు కూడా ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి వరకు-ఆనాడు కూడా అలానే ప్రమిదలు లైట్లు పెట్టారు. కోడలు పారుల్ కు మా శ్రీమతి లాగానే పూజా-పునస్కారాలంటే ఇష్టం. అదేం టోగాని, మా ఇంట్లో మా నాన్న వారసత్వమైన పూజా-పునస్కారాలు కొడుకులకన్నా, కోడళ్లకే బాగా అబ్బుతున్నాయి. అయితే మా రెండో కూతురు కిన్నెర మాత్రం వాళ్లమ్మ లాగానే, ఉద్యోగం చేస్తున్నా- చేయకపోయినా, పూజల విషయంలో మాత్రం అశ్రద్ధ చేయదు.
రామాయణం రాయడం కార్యక్రమంలో కొంత విశ్రాంతి లభించడంతో మనసు ఆర్టికల్స్ రాయడం వైపు మరలింది. మొదటి ఆర్టికల్ "ఆంధ్ర వాల్మీకి వాసుదాసు"ను సుజనరంజనికి పంపాను. వాళ్లు అక్టోబర్ సంచికలో వాడారు. రెండోది న్యూయార్క్ మేయర్ ఎన్నికల మీద రాసి ఆంధ్ర జ్యోతికి పంపాను. నవంబర్ 8, 2009 న "అమెరికా ఎన్నికల్లోను అదే తంతు" శీర్షికన ఆంధ్ర జ్యోతి దాన్ని ప్రచురించింది. (డిసెంబర్ 27, 2009 న దాన్ని నా బ్లాగ్ లో వుంచాను). మర్నాడు నవంబర్ 9, 2009 న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వచ్చాం. అక్కడ కూడా (శాన్ ఫ్రాన్ సిస్కో లో కట్టిన చందా కిందనే, మా కోరిక ప్రకారం, అడ్రెస్ మార్చి పేపర్ వేసే వాళ్లు) న్యూయార్క్ టైమ్స్ పేపర్ వచ్చేది. అక్కడకు పోయిన తర్వాత రాసిన మొదటి ఆర్టికల్ అమెరికా ఆరోగ్య సంస్కరణల మీద. దాన్ని కూడా ఆంధ్ర జ్యోతికి పంపాను. అది నవంబర్ 20, 2009 న ఆంధ్ర జ్యోతిలోను, డిసెంబర్ నెల సుజన రంజనిలోను వచ్చింది. (డిసెంబర్ 27, 2009 న దాన్ని నా బ్లాగ్ లో వుంచాను).
No comments:
Post a Comment