Tuesday, January 26, 2010

జ్వాలా మ్యూజింగ్స్-18 (నెలనెలా తెలుగు వెన్నెల)

హ్యూస్టన్ తెలుగువారి "నెలనెలా తెలుగు వెన్నెల"

వనం జ్వాలా నరసింహా రావు

శాన్ ఫ్రాన్ సిస్కో నుండి అమ్మాయి కిన్నెర వుంటున్న హ్యూస్టన్ కు వచ్చిన రెండువారాలకు నవంబర్ 21న, అక్కడి తెలుగువారు ప్రతినెలా నిర్వహించుకునే "నెలనెలా తెలుగు వెన్నెల" కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, "హిందూత్వం-మార్క్సిజం-రామాయణం-మానవ విలువలు" గురించి మాట్లాడమన్నారు. మా అమ్మాయి కిన్నెరకు అన్నిట్లోను అంతో-ఇంతో అభిరుచి వుంది. హ్యూస్టన్లోని "రేడియో మిర్చి" కార్యక్రమానికి తీరిక వున్న ప్రతి శనివారం వెళ్లి, సమన్వయ కర్తగా పాల్గొంటుంది. అలానే, హ్యూస్టన్ తెలుగు సాహితీ లోకం వారు నిర్వహించే కార్యక్రమాల్లోనూ యాక్టివ్ రోల్ తీసుకుంటుంది. ఆ సంస్థ ముఖ్య నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ పిల్లుట్ల సుదేష్, నేను శాన్ ఫ్రాన్ సిస్కోలో వుండగానే, హ్యూస్టన్ వచ్చినప్పుడు తమ సంస్థ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించారు. ఆయనతో పాటు, సంస్థ కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో, శ్రీయుతులు చెరువు రమ, వంగూరి చిట్టెన్ రాజు, పాకాల రమ, అర్రా షర్వన్ కృషి చేస్తున్నారు. నా కంటె ముందు-నా తర్వాత ఆ సంస్థ ఆహ్వానించిన గౌరవ-ముఖ్య అతిథుల్లో అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, "కళాప్రపూర్ణ శ్రీమతి ఎ. అనసూయాదేవి గారు, హనుమాన్ స్వామి ఆచార్యులు గారు, కళానాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు, రామ్మోహన్ గారు, వెన్నెలకంటి మాణిక్యం గారు, వేదాంతం రాఘవ గారు, ఆచార్య పాడూర్ జగదీశ్వరన్ గారు, సరోజ శ్రీ శ్రీ గారు, ఆర్టిస్ట్ చంద్ర గారు, పప్పు నరసింహమూర్తి గారి లాంటి ప్రముఖులున్నారు. వారికి లభించిన గౌరవం నాకూ కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇక్కడొక విషయం చెప్పాలి.

సీ. నారాయణరెడ్డి, మహాకవి శ్రీ శ్రీ లాంటి ప్రముఖులను ముఖ్య అతిథులుగా పిల్చిన సంస్థ నన్నొకసారి, వారినెందుకు పిలిచారో-నన్నూ అందుకే పిలిచే సరికి, ఏమని జవాబివ్వాలో తోచలేదు. "ఇళ్లక్కియ చింతనై" అనే ప్రముఖ తమిళ సాహీతీసంస్థ ఏటేటా చెన్నైలో జరుపుకునే వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళభాషేతర సాహిత్యరంగ ప్రముఖులను పిలవడం ఆనవాయితి. అప్పట్లో చిదంబరం సోదరుడు లక్ష్మణన్ ఆ సంస్థకు అధ్యక్షుడు. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిగారికి ఆయన సన్నిహితుడు. చంద్రమౌళిగారి ద్వారా-నా ద్వారా లక్ష్మణన్ ఆహ్వానించిన సాహితీ ప్రముఖులు ఆఖరు క్షణంలో హఠాత్తుగా రాలేమని చెప్పడంతో, నన్ను రమ్మనీ-"సాహిత్యం-మానవ విలువలు" అన్న అంశంపై మాట్లాడమనీ ఆ సంస్థ అధ్యక్షుడు లక్ష్మణన్ కోరాడు. పది సంవత్సరాల క్రితం మాట ఇది. ఒప్పుకోక తప్పలేదు. ఒప్పుకున్నాను కనుక మాట్లాడక తప్పలేదు. ఆనాటి ఆ సభలో చేసిన ఆంగ్ల ఉపన్యాస సారాంశం ఒకవిధంగా నాలో నిరంతరం రేపే ఆలోచనలే. సాహిత్యం-మానవ విలువలు ఒకరకంగా - ఏదో ఒక రూపంలో, నా చిన్నతనంనుండి, నేను ఆలోచించి-ఆచరణలో పెడుతుండే భావాలకనుగుణమైనవే. అవి బాల్యంలో ఒక విధంగా, పెరుగుతున్నా కొద్దీ మరో రకంగా మలుపులు తిరుగుతూ వచ్చాయి. ఊహ తెలిసినప్పటినుండి, ఏదో ఘర్షణ-అర్థంకాని ఏదో ఆలోచన, ఏదో తపన, ఏమిటో చెయ్యాలన్న పట్టుదలకు లోనవుతుండే వాడిని.

మళ్లా ఇన్నేళ్లకు, నాకిష్టమైన విషయాన్నే హ్యూస్టన్ తెలుగు సాహితీ సమితి వారు ఎంపిక చేసి, నన్ను ప్రసంగించమనడంతో, నా ఆలోచనలను ఇతరులతో పంచుకునే అవకాశం మళ్లీ కలిగింది. నా ప్రసంగ సారాంశాన్ని సిలికానాంధ్ర వారి ఇంటర్నెట్ మాగజైన్ "సుజనరంజని" జనవరి సంచికలో ప్రచురించింది. నా (జ్వాలా మ్యూజింగ్స్) బ్లాగ్ లో డిసెంబర్ నెలలో వుంచాను.

శ్రీ సుదేష్ గారు నాకు మా అమ్మాయి కిన్నెర ద్వారా హ్యూస్టన్ లో పరిచయమైన "మంచి సాహితీ మిత్రుడు". ఎక్కడో వేల మైళ్ల దూరం వచ్చి తెలు తల్లికి సేవచేస్తున్న మంచి మనసున్న కుటుంబం వారిది. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూసినట్లే, వీళ్ళింట్లోకి వెళ్తే, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముంద సాక్షాత్కరిస్తాయి. హిందువుల సాంప్రదాయ పండుగలకైనా, ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే లాంటి సందర్భంలోనైనా, న్యూ ఇయర్స్ డే కైనా, ఆయన-కుటుంబ సభ్యులు శ్రద్ధతీసుకుని చేసే ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత మధ్యలో పదిరోజుల పాటు మా మనుమరాలు కనక్ బారసాలకు శాన్ ఫ్రాన్ సిస్కో వెళ్లి, డిసెంబర్ 30 న తిరిగి వచ్చాం. నిజానికి, అలా రావడంవల్ల న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఆ నాటి కార్యక్రమం, మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోతుందనాలి. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలసి-మెలసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. అలానే సంక్రాంతి సంబరాలు జరిపించారు. ఎక్కడ ఏ సందర్భంగా కార్యక్రమం జరిగినా, మా కిన్నెర స్నేహ బృందం అంతా వుండాల్సిందే. మా మనుమడు యష్విన్, మనుమరాలు మేథ, కిన్నెర-కిషన్ కనీసం ఒక్క సాంస్కృతిక కార్యక్రమంలోనన్నా పాల్గొనాల్సిందే. యష్విన్ కు డాన్స్ అన్నా, గిటార్ లాంటి సంగీత వాయిద్యాలు పలికించడమన్నా ఎంతో ఇష్టం.

సంక్రాంతి సందర్భంగా ఇక్కడి తెలుగు వారు చేసిన హడావిడి ఇంతా-అంతా కాదు. సంక్రాంతి ముగిసిన వారాంతపు శనివారం రోజున, స్థానిక మీనాక్షి దేవాలయం ఆడిటోరియంలో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు సంక్రాంతి సంబరాలను. అందులో పాల్గొనదల్చుకున్న వాళ్లు తమ పేర్లను రెండు-మూడు నెలలకిందనే నమోదు చేయించుకోవాలంటే, ఎంతమంది ఔత్సాహిక కళాకారులున్నారో అర్థం చేసుకోవచ్చు. సమయాభావం వల్ల పేర్లిచ్చిన అందరికీ అవకాశం దొరకక పోవచ్చు కూడా. ఇక రక రకాల కార్యక్రమాలకు రిహార్సల్లు-డ్రెస్స్ రిహార్సల్లు పెద్ద స్థాయిలో జరుగుతాయి. సరే, మా మనుమడు-మనుమరాలు-కిన్నెర స్నేహ బృందం పిల్లలు పాల్గొంటున్నందున మేము ఇద్దరం కూడా ఆ రోజు సాయంత్రం అక్కడకు వెళ్లాం. వెళ్లినందుకు ఆనందించాం.

కార్యక్రమ ఖర్చుల కింద వచ్చిన ప్రతివారు పది డాలర్లు చెల్లిస్తారు. అయితే ఆడిటోరియంలో వెళ్లేటప్పుడు టికెట్ కొన్నామా-లేదానని ఎవరూ అడగరు. కొనకుండా ఎవరూ పోరు. పది డాలర్లకు సరిపోను, టీ-కాఫీలు, స్నాక్స్, డిన్నర్ ఉచితంగా తిన్నంత ఇస్తారు. ఇంటికి పార్సిల్ కూడా తీసుకుపోవచ్చు.

కార్యక్రమంలో మొదలు చిన్న పిల్లలకు సంక్రాంతి భోగి పళ్లు పోసారు. ఇక పాటలు, పద్యాలు, సోలో నాట్యాలు, బృంద గానాలు, ఒంటరి పాటలు, సినిమా నృత్యాలు, గ్రూప్ డాన్సులు, నాటికలు-నాటకాలు, శంకరాభరణం నుంచి-పరమానంద శిష్యులనుంచి కొన్ని భాగాలు, కూచిపూడి-భరత నాట్యాలు.. ... ఇలా అనేకం .. అద్భుతంగా ప్రదర్శించారు పిల్లలు-పెద్దలు. శంకరా భరణంలోని, దాసు "బ్రోచేవారెవరెవరురా" కీర్తనను వక్రీకరిస్తుంటే, శంకర శాస్త్రి కోపగించుకున్న సన్నివేశం, కుర్రకారు కేకలేస్తుంటే శంకర శాస్త్రి వాళ్లకు బుద్ధి చెప్పడం సన్నివేశం అద్భుతంగా వున్నాయి. శంకర శాస్త్రిగా సాక్షాత్తు సోమయాజులు గారి సోదరుడి కుమారుడు జొన్నల గడ్డ అరుణ్ నటించారు. ఆయన ఇద్దరు పిల్లలు, మా మనుమడు యష్విన్ కూడా అందులో నటించారు. మావాడు శాస్త్రిగారిని ఆట పట్టించిన "రవ రవ" సంగీత కారుడు. రిహార్సల్స్ అన్నీ మా కిన్నెర ఇంట్లోనే జరిగాయి. మా మనుమరాలు మేథ "లాలీ-లాలీ" అనే క్లాసికల్ డాన్స్ లో పాల్గొంది.

"రామశబ్దం" నృత్యం, డోలే-డోలే" నృత్యం, అభినవ్ పాడిన పాట, సంక్రాంతి సంబంధమైన నాట్యం, "దశావతారం" నృత్యం, "అష్ఠ లక్ష్మి" నృత్యం, "చెప్పవే చిరుగాలి" పాట, "అల్లెగ్రా" డాన్స్, వళ్లు గగుర్పొడిచే సినిమా డాన్సులు ప్రేక్షకులను ఆరు గంటల పాటు అలరించాయి. జానకి-శర్మల పిల్లలు స్నేహ, అమూల్య, మానస-శ్రీనివాస్ కూతురు భవ్య, శివ-పల్లవి పిల్లలు అనూహ్య-ప్రణవ్, సోనాలీ కూతురు అందరూ అందరే-బాగా చేశారు. మధ్యలో హ్యూస్టన్ తెలుగు వారందరికీ సన్నిహితుడైన వంగూరి చిట్టెన్ రాజు గారికి సన్మానం చేశారు. హ్యూస్టన్ లో ఇదో అద్భుతమైన అనుభూతి. సప్త సముద్రాల ఆవల, తెలుగుపై నున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్న అందరూ అభినందనీయులే.

1 comment:

  1. జ్వాలా నరసింహారావు గారూ, గత రెండు రోజులుగా దాసరి గారి వార్తల సేకరణలో చందమామలో ప్రచురణ పనుల్లో ఉండి అస్సలు స్పందించలేకపోయాను. శనివారం రాత్రి నుంచి ఇంట్లో నెట్ పనిచేయకపోవడంతో మీకు రిప్లై పంపడం మరికాస్త లేటయింది. మీరు దివికుమార్ గారితో సంబందంలోకి వచ్చినందుకు సంతోషం. శ్రీశ్రీకి పౌరహక్కుల ఉద్యమానికి ఉన్న సంబంధం గురించి అరుదైన చరిత్రను మీరు తడిమారు. బహుశా ఇది తదనంతర చరిత్రకు రిఫరెన్స్‌గా ఉండిపోవచ్చు.

    మీ మిత్రుడు శ్రీ భండారు శ్రీనివాసరావు గారు మార్పు చూసిన కళ్లు పేరిట రాసిన మాస్కో జీవిత అనుభవాలు నిజంగా అదరగొట్టేశాయి. ఎంత ఆబగా చదివానంటే మొత్తం 13 కథనాలను అలాగే కాపీచేసుకుని ఫైల్లో భద్రపర్చుకున్నాను. ఒక వ్యాఖ్యలో తనను విశాలాంధ్రవారిని సంప్రదించి మాస్కో అనుభవాలు పూర్తయిన వెంటనే పుస్తకరూపంలోకి తీసుకురావలసిందిగా కోరాను. నిజంగా ఇదొక అమూల్య రచన. ఆయనకు నా తరపున అభినందనలు తెలియజేయండి.

    మీరు అమెరికాలో చందమామ గురించి పరిచయం చేసిన ప్రభావం ఫలితంగా కాబోలు ప్రస్తుతం అమెరికా నుంచి చందమామ వెబ్‌సైట్‌ను, చందమామ బ్లాగును చూస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రతిరోజూ అమెరికాలో ఏదో ఓ చోటనుంచి వీక్షకులు బ్లాగును చూస్తున్నట్లు ఫలితాలు చూపుతున్నాయి. అందుకు మీకు చందమామ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అమెరికాలో మీ పర్యటన విశేషాలను మీ బ్లాగులో చదువుతున్నాను. అక్కడి తెలుగువారి తపన, వారి సాంస్కృతిక కార్యక్రమాలు చదువుతుంటే హృద్యంగా ఉంది.

    మీ అమ్మాయి కిన్నెర గారు తెలుగు చదువగలరా? చదువగలిగితే చందమామను మర్చిపోవద్దని చెప్పండి.

    మీరు పరిచయం చేసిన మిత్రుడు సుదేష్ గారు ఇటీవలే నాకు ఈమెయిల్ మెసేజ్ పంపారు. రెండురోజులుగా నెట్ పనిచేయక తనకూ రిప్లై ఇవ్వలేదు. ఈరోజు తప్పక పంపుతాను. తెలుగుకు పూర్తి భిన్నమైన వాతావరణంలో పెరుగుతున్న అమెరికా తెలుగు పిల్లలకు తెలుగును పరిచయం చేయడం చాలా కష్టంగా ఉందని ఆయన చెప్పారు. మన రాష్ట్ర్రంలోనే తెలుగు రాని, తెలుగు మీడియం చదవని పిల్లలు వేలాది మందిగా ఉంటున్నప్పుడు అమెరికాలో తెలుగు పిల్లలు తెలుగు చదవలేకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగు సంస్కృతిని, తెలుగుతనాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి అక్కడి పెద్దలు చేస్తున్న ప్రయత్నం నిజంగా హర్షించదగింది. వారి ప్రయత్నాలు ఆలస్యంగా అయినా ఫలిస్తాయని ఆశిద్దాము.

    ప్రస్తుతానికి ఉంటాను

    మీ
    రాజు
    చందమామ

    ReplyDelete