శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM
బాలకాండ మందర మకరందం-BALAKANDA MANDARA MAKARANDAM
“రాయాలన్న ఆలోచన”
వనం జ్వాలా నరసింహారావు
అన్ష్ హైదరాబాద్ వెళ్లిన తర్వాత, అప్పటివరకూ (న్యూయార్క్ కు వెళ్లినప్పుడు మినహా) శెలవు మీదనే వుండి, మమ్మల్ని శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల అంద చందాలను చూపించిన ఆదిత్య తన ఉద్యోగంలో తలమునక లై పోయాడు. ఎలాగూ పారుల్ డెలివరీ తర్వాత ఇంట్లో కొంచెం సహాయంగా వుండేందుకు, ఉద్యోగంలో కొంత తీరు బడి కావాల్సి వుంటుంది కనుక, పెండింగ్ లో ఏ ముఖ్యమైన పనీ లేకుండా చూసుకునేందుకు ఎక్కువగా వాడు ఆఫీసులోనే వుండేవాడు. కోడలు పారుల్ కూడా, ఎలాగూ, నవంబర్ మూడో వారం నుంచి శెలవు పెట్టక తప్పదు కనుక, తనుకూడా, ఆఫీసు పని పెండింగ్ లేకుండా వుండేందుకు ప్రతిరోజూ వెళ్లొస్తుండేది. అయినప్పటికీ ప్రతి దినం దాదాపు సాయంత్రపు వేళల్లో-వారాంతపు శెలవుల్లో, షాపింగ్ కో- బే ప్రాంతానికో-దేవాలయాలకో వెళ్లొస్తుండే వాళ్లం. అలానే బే వంతెనను, గోల్డెన్ బ్రిడ్జ్ ను, ఫ్రీ మాంట్ టెంపుల్ ను చూశాం. అమెరికాలో కాలు పెట్తూనే, ఇక్కడ ఎలా గడపాలన్న కార్యాచరణ ప్రణాళిక హైదరాబాద్ లోనే తయారు చేసుకున్న నేను దాన్ని కార్య రూపంలో పెట్టాను. నా ఆలోచనకనుగుణంగా "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-బాలకాండ మందర మకరందం" రాయడం శాన్ ఫ్రాన్ సిస్కో కు వచ్చిన వెంటనే మొదలెట్టినా, వూపందుకున్నది లాస్ ఏంజల్స్ నుంచి తిరిగొచ్చిన తర్వాత. మరీ వేగవంతమయింది, అన్ష్ హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత. దీనికొక నేపధ్యముంది.
డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్) అడిషనల్ డైరెక్టర్ గా, నేను ఉద్యోగంచేస్తున్నరోజుల్లో, మా పొరుగున శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారుండే వారు. అప్పట్లో ఆయన నా సహాద్యోగి. ఇటీవల వరకూ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటికీ అక్కడే మరో విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన లేచింది మొదలు నిద్ర పోయే దాక రామనామం స్మరిస్తుండేవాడు. కార్యాలయంలో అధికారిక విషయాలను చర్చిస్తున్నప్పుడు, ఉన్నతాధికారుల సమక్షంలో ఉన్నప్పుడు కూడా, సందర్భోచితంగా రామాయణంలో చెప్పిన అంశాలను సంస్థలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలకు అన్వయించి మరింత నైపుణ్యంతో-నాణ్యతతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు తోడ్పడేవాడు. ప్రతి నిత్యం రామాయణం పారాయణం చేసేవాడు. నాకంటే వయసులో చిన్న వాడైనా, జ్ఞానవృధ్ధుడు. నా నిత్య కృత్యాలు చాలావరకు ఆయనకు నచ్చకపోయేవి. ఆయన ప్రతి ఉదయం అనుష్టానం చేసుకుంటుంటే చనిపోయిన మా నాన్న గారు జ్ఞప్తికొచ్చేవారు. వాసు దాసు గారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం కాండలన్నీ పాతిక సార్లకు పైగా పారాయణం చేసారు మా నాన్నగారు. వాసు దాసుగారూ ఆయన శిష్యులు సుబ్బదాసుగారూ (దాసశేశుడు) ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, వనం వారి కృష్ణా పురం గ్రామంలో వున్న మా ఇంట్లో వారి పాదాలు మోపి మా ఇంటిని పావనం చేసారు నా బాల్యంలో. మా నాన్నగారితో చిన్నతనంలో నేను, అంగలకుదురులో వాసు దాసుగారు స్థాపించిన శ్రీ కోదండ రామస్వామి సేవక ధర్మ సమాజం ఆశ్రమానికి వెళ్లాను. అలా నాకు వాసు దాసుగారిని గురించి కొంత మా నాన్నగారి ద్వారా, కొంత విజయరాఘవాచార్యులగారి ద్వారా తెలుసుకొనే అవకాశం కలిగింది.
ఆయన దగ్గర వాసు దాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం సుందర కాండ మందరం తీసుకొని చదవడం, ఐదేళ్లక్రితం అమెరికా వెళ్లి, సిన్సినాటిలోని మా రెండో కూతురు కిన్నెర ఇంట్లో వున్నప్పుడు గ్రాంథికమైన తెలుగులో వున్న దాన్ని శిష్ట వ్యావహారిక భాషలో "సుందర కాండ మందర మకరందం" గా రాయడం, పుస్తకరూపంలో బాపుగారి ముఖచిత్రంతో తీసుకుని రావడం జరిగింది. మొదటి ముద్రణ పుస్తకావిష్కరణ ఆగస్ట్ 8, 2004న, రెండో ముద్రణ పుస్తకావిష్కరణ ఆగస్ట్ 8, 2009న, మా శ్రీమతి అన్నగారు-డాక్టర్ అయితరాజు పాండు రంగారావు బావగారి చేతులమీద గా జరిగింది. ప్రధమ ముద్రణకు అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీ. కే.వి. రమణ గారు (ఇటీవలి వరకు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గా పనిచేశారు) సహాయపడడమే కాకుండా, పుస్తకావిష్కరణకు గౌరవ అతిథిగా మా ఇంటికొచ్చి నా ప్రయత్నాన్ని ప్రోత్సహించారు. యాదృచ్ఛికంగానో-అదృష్ఠంగానో, ఈ బాల కాండ పుస్తకం రాయడం పూర్తయిన రోజున కూడా, ఆయన నేనున్న శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) లో వుండడం, పుస్తకం రాయడం పూర్తయిందని మొదట ఆయనకే చెప్పడం జరిగింది. "సుందర కాండ మందర మకరందం" రాయడానికి శ్రీరామచంద్రుడు అప్పట్లో అమెరికాకు పంపించినట్లే, "బాల కాండ మందర మకరందం" రాయడానికి ఆ శ్రీరాముడే, ఇప్పుడు కూడా అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు పంపాడు. అప్పుడే మో సిన్సినాటిలో వున్న మా అమ్మాయి కిన్నెరకు కూతురు పుట్టే సమయంలో నేనూ-మా శ్రీమతి కలిసి వెళ్లాం. ఇప్పుడేమో, శాన్ ఫ్రాన్సిస్కో లో వున్న మా కుమారుడు-కోడలు పారుల్ కు కూతురు పుట్టే సమయంలో వచ్చాం. ఇలా మా ఇద్దరు మనుమరాళ్లు నేను రెండు "మందర మకరందాల “ను రాసేందుకు కారణమయ్యారు. ఒక మనుమరాలు (పేరు-మేథ) వాళ్లమ్మ గర్భంలోంచి, సాక్షాత్ శారదాదేవి అంశతో, తన మేథస్సును పరోక్షంగా నాకందించి "సుందర కాండ మందర మకరందం" రాయడానికి తోడ్పడింది. ఇక మరో మనుమరాలు (పేరు-కనక్) వాళ్లమ్మ గర్భంలోంచి, సాక్షాత్ లక్ష్మీదేవి అంశతో, సీతా మాతగా ప్రోత్సహించి, "బాల కాండ మందర మకరందం" రాయడానికి తోడ్పడింది. హైదరాబాద్ లో వున్న అందరికంటే పెద్ద మనుమరాలు (పేరు-మిహిర), లక్ష్మీ-సరస్వతుల ఉమ్మడి అంశ, రెండు సార్లుకూడా, త్వరగా పుస్తక రచన పూర్తి చేయాలనేది-కారణం, ఎంత తొందరగా పూర్తి చేస్తే, అంత త్వరగా, దాని దగ్గరకు మేం వస్తామని. అందుకే, నాకు ఈ ముగ్గురంటే ఇష్టం. అంతే ఇష్టం, మా మనుమలు యష్విన్, అన్ష్ అన్నా కూడా.
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండనుకూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన సొంత-స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగుచెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో-ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకున్నాయి. దురదృష్టవశాత్తు, కాలక్రమంలో, అవన్నీ మరుగున పడిపోతున్నాయేమోనన్నభయం-ఆందోళన నా లాంటి కొందరికి కలిగింది. ఆ అలోచనతో, వాసు దాసుగారి మందరాలన్నీ, "మందర మకరందాలు" గా, ఆయనే వక్తగా, నేను కేవలం అను వక్త-వాచవిగా, సరళమైన వాడుక భాషలో-సాధ్యమైనంత లఘు కృతిలో అందించుదామని తొలి ప్రయత్నంగా "సుందర కాండ మందర మకరందం" రాసి, మలి ప్రయత్నంగా "బాల కాండ మందర మకరందం" రాయడం ఆరంభించాను. రామానుగ్రహంవల్ల "సుందర కాండ మందర మకరందాని" కి పెద్దల అనుగ్రహం లభించి రెండో ముద్రణకు కూడా నోచుకుంది. ఆ పుస్తకం చదివిన పలువురి ఆశీర్వచనాలను-ఆదరాభిమానాలను అనునిత్యం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ పెద్దల ఆశీర్వచనం, రాముడి అనుగ్రహం లభించి, "బాల కాండ మందర మకరందం" రాయడం కూడా పూర్తి చేయగలిగాను. భగవంతుడి అనుగ్రహం లభించగానే ముద్రణకు నోచుకుంటుందని ఆశిస్తున్నాను.
ప్రాతఃస్మరణీయుడి ఆణిముత్యాలు: ఇక్కడొక విషయం చెప్పాలి. 1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయం చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి నుంచి సేకరించిన విషయాలను "మందర మకరందం” లో పొందుపరుస్తున్నాను. అపురూపమైన అలనాటి గ్రంథకర్త అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. తెర మరుగవుతున్న వందేళ్లనాటి అపురూపమైన తెలుగు సాహిత్యంలోని అత్యంత ఆదరణీయమైన వాసు దాసుగారి అలనాటి "నిర్వచన రామాయణం" లోని నాలుగు (బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ) కాండలతో పాటు, ఆయన ఎందుకు-ఎలా వాల్మీకి రామాయణం చదివింది, ఎలా రాసింది, ఎలా అంకితం ఇచ్చింది లాంటి విషయాలనేకం వున్నాయందులో. గూగుల్ సంస్థ కృషిని అభినందించాలి. ఆ సంస్థలో మా అబ్బాయి ఆదిత్య ఉన్నత హోదాలో పనిచేయడం నిజంగా మాకు గర్వ కారణం.
చిలకపాటి వారు "సుందర కాండ మందర మకరందం" పుస్తకానికి రాసిన "మంగళ తోరణం” లో, మిగిలిన కాండలను కూడా అదే రీతిలో రాయగల శక్తి-సమయ-సామర్థ్యాలను నాకను గ్రహించాలని ఆశిస్తున్నానన్నారు. బహుశా ఆయన ఆశ, నా ఆశయం ఈ విధంగా నెరవేరుతున్నదేమో. వాస్తవానికి "బాల కాండ మందర మకరందం" రాయడానికి ప్రేరణ-ప్రోత్సాహం లభించింది మాత్రం "దర్శనమ్" ఆధ్యాత్మిక సంచిక సంపాదకుడి గారి వలనే అనాలి. అప్పట్లో ఆ పత్రికను ప్రతినెలా ప్రచురించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్న సీనియర్ పాత్రికేయుడు శ్రీ బీ.ఎస్.రామకృష్ణ ప్రోద్బలంతోనే బాల కాండను నెల నెలా దర్శనమ్ పత్రికకు రాసేవాడిని. "రామాయణం రసరమ్యం" అన్న శీర్షిక కింద దాన్ని వారు ప్రచురించేవారు. బహుశా వారి ప్రోద్బలం లేకపోతే నేను అంత తొందరగా ఇది రాయడానికి పూనుకోక పోయేవాడినే మో.
"రామాయణం రసరమ్యం... ... ... రామనామం సదాస్మరణీయం... ... ... రామాయణం రసరమ్య కావ్యం. అష్టాక్షరీ మంత్రంలోని -రా- శబ్దం, పంచాక్షరీ మంత్రంలోని -మ- శబ్దం కలిపి వశిష్ట మహర్షి ఏ పుణ్య ముహూర్తంలో దశరథ తనయుడికి -రామ- నామాన్ని ఖరారు చేశారో కాని, యుగయుగాలకు, రామ నామం తారక మంత్రమైంది-అజరామరమైంది. రామాయణాన్ని ఎన్నిసార్లు చదివినా-విన్నా తనివి తీరదు. ఆదర్శ పురుషుడైన రాముడి చరితాన్ని రామాయణ కావ్యంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. ఎందరో మహానుభావులు రామాయణాన్ని భక్తజన కోటి ముందుంచారు. ఎన్నో ప్రపంచ భాషల్లో విరాజిల్లుతున్న రామాయణం నిత్య పారాయణ గ్రంథమైంది" అని అంటూ, రామాయణ మాధుర్యాన్ని దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక పాఠకులకు అందించి, రామ సేవకు అంకితమవ్వాలని, ఆ పత్రిక సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ. బీ.ఎస్. రామకృష్ణ గారి ద్వారా నాకు తెలియచేసి, నన్ను ప్రోత్సహించి ఆ పని నాకప్పగించారు. డిసెంబర్ 2005 సంచికనుండి బాల కాండను ప్రతి నెలా రాయడం ఆరంభించాను.
పరమ భాగవతోత్తములు, ఋషితుల్యులు, ఆంధ్ర వాల్మీకిగా-కవి సార్వభౌమగా ప్రసిద్ధికెక్కిన వాసు దాసుగారి (వావిలికొలను సుబ్బారావు గారు) విరచిత శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం-బాల కాండ మందిరాన్నే మందర మకరందంగా, ఆయనే వక్తగా, నేను కేవలం అను వక్త-వాచవిగా దర్శనమ్ పత్రిక ద్వారా అందించిన దాన్నే పుస్తక రూపంగా త్వరలో అందిస్తున్నాను.
ముందు మిగతా కాండలను కూడా మందర మకరందాలుగా మల్చాలని నా కోరిక- భగవదనుగ్రహం వల్ల అది నెరవేరుతుందని ఆశ.
మా నాన్న వనం శ్రీనివాసరావు గారు ఇప్పుడు జీవించి వుంటే బహుశా ఆయన కంటే ఈ విషయంలో సంతోషించే వారెవరూ వుండరనుకుంటా ! ఆయన బ్రతికున్నప్పుడు నే నెట్లా వుండాలని ఆయన కోరుకున్నాడో అలా కొంతవరకు వున్నాననడానికి ఇంతకుముందు రాసిన సుందర కాండ మందర మకరందం, ఇప్పటి ఈ బాల కాండ మందర మకరందం ఒక నిదర్శనం.
నన్నింత వాడిని చేసిన నా తండ్రి-తల్లి, వనం శ్రీనివాసరావు గారికీ-సుశీలమ్మ గారికీ, వారి ద్వారా ముత్తవరం శ్రీసీతారామచంద్ర స్వామి వారికీ ఈ పుస్తకం అంకితం చేస్తున్నాను.
No comments:
Post a Comment