అమెరికా అధ్యక్షుడిగా బారక్ హుస్సేన్ ఒబామా (జనవరి 20, 2010న)
ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ...
వనం జ్వాలా నరసింహారావు
హ్యూస్టన్, యూ.ఎస్.ఏ
మున్నెన్నడూ జరగని రీతిలో లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి అధిక సంఖ్యలో పరిశ్రమలు మూత బడడంతో, ఎన్నేళ్ల గానో అమెరికన్ ప్రభుత్వం ఇస్తూ వస్తున్న నిరుద్యోగ భీమా, ఫుడ్ స్టాంప్స్ కార్డ్స్, ధన రూపేణా సమకూరుస్తున్న సంక్షేమ సహాయం అంచనాలను మించి పోయి ప్రభుత్వానికి గుదిబండలాగా తయారయ్యాయని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు. ఒక వైపు లబ్దిదారుల సంఖ్య పెరగడం, మరో వైపు కను చూపు మేరలో పరిస్థితులు మెరుగయ్యే సూచనలు కనిపించక పోవడంతో, దారుణమైన ఈ ఆర్థిక మాంద్య ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలని ఒబామా ప్రభుత్వం ఆలోచనలో పడింది. కాకపోతే సంక్షోభ తీవ్రతను అదుపులో వుంచేందుకు చేతనైన ప్రయత్నం కొనసాగిస్తూనే వుంది ప్రభుత్వం. అరవై లక్షల "అమెరికన్ పేదల పాలిటి పెన్నిధి"గా పిలవదగిన (భారత దేశంలో అమలవుతున్న) "జాతీయ పనికి ఆహార పథకం" లాంటి అమెరికా "ఫుడ్ స్టాంప్ ప్రోగ్రాం" పటిష్టంగా అమలు జరిపేందుకు చర్యలు చేపట్టింది.
ఆహార భద్రత-ఉపాధి పథకాలను భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న-బీద దేశాలలో అమలు పరచడం మామూలే. "సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన పథకం", "జాతీయ పనికి ఆహార పథకం" అలాంటివే. ఆర్థికంగా-సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి, దారిద్ర్య రేఖకు దిగువనున్న గ్రామీణ పేద కుటుంబాల వారికి ఆహారంతో పాటు, ఉపాధి కలిగించే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలివి. "జాతీయ పనికి ఆహార పథకం" కింద దేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న అత్యంత వెనుకబడిన కుటుంబాల వారిని గుర్తించి, ప్రతి కుటుంబానికి నెల రోజుల పాటు ఉపాధి కలిగించి, పనిచేసిన వారికి ఆర్నెల్ల పాటు బియ్యం, డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సరిగ్గా అలాంటిదే అమెరికాలో ఇటీవల కాలంలో పలువురిని ఆదుకుంటున్న "ఫుడ్ స్టాంపుల పథకం". ఎప్పుడో 1961లో పైలట్ ప్రోగ్రాంగా అప్పట్లో నెల కొన్న ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి చట్టంగా చేసి అమలుపర్చిన ఫుడ్ స్టాంప్స్ ప్రోగ్రాం ఇప్పడు ఒబామా ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నదనవచ్చు.
ఆరంకెల డాలర్ల నెలసరి ఆదాయం-ఆరు గదుల అందమైన ఇల్లు కోల్పోయి, తినడానికి తిండి -ఉండడానికి ఇల్లు లేక, గంపెడు కుటుంబంతో, కేవలం ప్రభుత్వ సహాయంతో జీవించే అమెరికన్ల సంఖ్య రోజు-రోజుకు పెరిగిపోతుంది. కనీ-వినీ ఎరుగని ఆర్థిక మాంద్యం నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన పలువురు, ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడం-అవన్నీ బుట్ట దాఖలా కావడం సర్వసాధారణ విషయమై పోయిందిప్పుడు అమెరికాలో. అలా ఇబ్బందులకు గురవుతున్న వారితో పాటు, మరెన్నో కారణాలవల్ల ఉపాధికి-ఆదాయ వనరులకు నోచుకోని వారికి ఆసరాగా అమెరికన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకమే "ఫుడ్ స్టాంపుల పథకం". కాకపోతే ప్రభుత్వం నుండి అందే సహాయం, లబ్ది పొందేవారి అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వ అంచనా మేరకు ధన రూపేణా కాకుండా, కొన్ని వందల డాలర్ల విలువ చేసే "ఫుడ్ స్టాంపుల" రూపంలో మాత్రమే వుంటుంది. ఈ విధంగా ప్రభుత్వ సహాయంతో బ్రతుకుతున్న అరవై లక్షల మంది అమెరికన్లు "ఫుడ్ స్టాంపులు" పొందాలంటే, తమ కెలాంటి ఆదాయం లేదనీ-నిరుద్యోగులమనీ-ఏ రకమైన ఇతర ధనరూప సహాయం తమకు ఎక్కడనుంచి లభించడం లేదనీ-సంక్షేమ, నిరుద్యోగ, భీమా, పెన్షన్ సౌకర్యం కింద ఎలాంటి భృతి దొరకడం లేదనీ-తమ పిల్లలకు గాని, కుటుంబంలోని వికలాంగులకు గాని మరే విధమైన సహాయం అందడం లేదనీ నిర్ధారించే ధృవీకరణ పత్రం ఇవ్వాలి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సహాయం లభిస్తుంది.
ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపి వేయడాని కంటే ముందే, అమెరికన్ సంక్షేమ చట్టాల అమలు కఠినతరం చేసిన కారణంగా, గతంలో ధన రూపేణా లభిస్తుండె నిరుద్యోగ భృతిని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు అమెరికన్లు, ఫుడ్ స్టాంప్స్ పథకం వైపు దృష్టి సారించడంతో, లబ్దిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ, గత రెండేళ్లలో అనూహ్యంగా 50%నికి పైగా దాటిపోయింది. ప్రస్తుతం అమెరికాలోని ప్రతి 50 మందిలో ఒకరు ఏరకమైన ఆదాయం లేని కుటుంబ సభ్యుడుగా మిగిలిపోయి, కేవలం ప్రభుత్వం ఇచ్చే “ఫుడ్ స్టాంప్ కార్డ్” మీదే బతుకుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ సహాయంతో జీవిస్తున్న ఇలాంటి కుటుంబాలు అదనపు ఆదాయ వనరుల కొరకు-కనీస ఆశ్రయం కొరకు అన్వేషించని మార్గాలు లేవు. కొంద రైతే తమ చదువుకు సంబంధం లేని చిన్నా-చితకా "బల్ల కింద ఉద్యోగాలు" చేసుకుంటూ నో, బంధువుల దగ్గర గడుపుతూ నో కాలం వెళ్లబుచ్చుతున్నారు. అమెరికాలో నెల కొన్న నిరుద్యోగ సమస్య వృద్ధి చెందుతూ, సుమారు 14%నికి చేరుకోవడంతో, పని దొరకని పలువురికి ఈ పథకం ఒక వరమన వచ్చు.
నిరుద్యోగ సమస్య వృద్ధి రేట్ నానాటికి పెరుగుతూ 10% దాటిందిప్పుడు. ఆ ప్రభావం "ఫుడ్ స్టాంప్స్ కార్డ్స్" కొరకు ఎదురు చూసేవారి సంఖ్య పెరగడానికి దారితీసింది. అమెరికాలోని 3140 కౌంటీలకుగాను, 239కి పైగా కౌంటీలలో నివసిస్తున్న కనీసం నాలుగోవంతు జనాభా ఫుడ్ స్టాంప్స్ మీద ఆధారపడుతున్నారు. 750 కౌంటీలలో నివసిస్తున్న నల్ల జాతీయులలో ప్రతి ముగ్గురి లో ఒకరి జీవనాధారం, 800కౌంటీలలో నివసిస్తున్న చిన్న పిల్లలలో ప్రతి ముగ్గురి లో ఒకరి బతుకు ఫుడ్ స్టాంప్స్ ద్వారా దొరికే సహాయమే. ఫుడ్ స్టాంప్స్ సహాయం కోరుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్న వైనం పరిశీలిస్తే కుంచించుకొని పోతున్న అమెరికా వ్యవస్థ దర్శనమిస్తుంది. నెలసరి ఆదాయం 150డాలర్ల కంటే తక్కువుండి, బాంక్ లోగాని, చేతిలోగాని 100డాలర్లకు మించకుండా డబ్బుగలవారందరు ఫుడ్ స్టాంప్స్ కార్డ్స్ పొందేందుకు అర్హులే.
పది సంవత్సరాల క్రితం జులై 1999లో మొదటిసారి నేనొచ్చిన అమెరికాకు ఇప్పటి అమెరికాకు పోలికే లేదు. అప్పుడదో "భూతల స్వర్గం-భోగ భూమి". భారతదేశమంటే అక్కడ నుండి ఇక్కడ కొచ్చి స్థిరపడినవారికి కూడా కేవలం "కర్మ భూమి" మాత్రమే ! రెండో పర్యాయం మార్చ్ 2003లో వచ్చినప్పుడు అమెరికా ఇరాక్ తో భీకర సంగ్రామంలో కూరుకుపోయింది. "భవిష్యత్ ప్రకంపనలు" అమెరికా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొట్టొచ్చినట్లు కనబడ్డాయప్పటికే. అనుకున్నంతా అయిందనిపిస్తోదిప్పుడు. రాజకీయాలనుంచి, సామాజిక జీవన శైలి వరకు-దైనందిన జీవనశైలి తో సహా, ప్రతి విషయంలోను వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రతివారిలో ఏదో అ భద్రతా భావం, ఏదో కోల్పోతున్నా మన్న తపన, ఎలా అంతో-ఇంతో వెనకేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుందిప్పుడు. ఈ విషయంలో అమెరికన్లకు, వలస వచ్చి స్థిరపడిన ఇతర దేశీయులకు తేడా ఏ మాత్రం లేదనాలి.
అమెరికా చరిత్ర ఆధునికమైందే అయినా, గట్టి పునాదుల మీద లిఖించబడింది. సుమారు రెండు శతాబ్దాల క్రితం జార్జ్ వాషింగ్టన్ బ్రిటీష్ సైన్యాన్ని పారదోలి, ఏకగ్రీవంగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆటుపోట్లను అడపాదడపా ఎదుర్కున్నా, తిరుగులేని ప్రపంచాధిక్య దేశంగా తన స్థానాన్ని పదిలపరచుకుంటూనే వుందనాలి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అంతర్జాతీయంగా, అగ్ర రాజ్యంగా అమెరికా ఎదుగుదలను వర్తమాన చరిత్రకారులు గుర్తించారు-గుర్తిస్తూనే వున్నారింకా. అమెరికా 1929లో హూవర్ అధ్యక్షుడుగా వుండగా మొట్ట మొదటిసారి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ రోజుల్లోనే కోటి మందికి పైగా అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. ఎన్నో బాంకులు దివాలా తీశాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. అలా కొనసాగిన సంక్షోభం రూజ్వెల్ట్ "న్యూ డీల్" తో కుదుటపడి ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ నిధులతో నిరుద్యోగులకు ఉపాధి కలిగించేందుకు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. బాంకులను, పరిశ్రమలను ఆదుకుంది ప్రభుత్వం. సంక్షోభం నుండి గట్టెక్కింది అమెరికా అప్పట్లో. రెండో ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ సారధ్యంలో అమెరికా విజయం సాధించిన తర్వాత ట్రూమన్ డాక్ట్రిన్ పుణ్యమా అని, కమ్యూనిజం వ్యాప్తి చెందకుండా వుండేందుకు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చుచేసింది అమెరికా. ఆ డాక్ట్రిన్ ప్రభావం, ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు, 1950 కొరియన్ యుద్ధంలో అమెరికా తన సైన్యాన్ని పంపడంతో దరిమిలా చోటూ చేసుకున్న పరిణామాలు, బహుశా "అంతర్జాతీయ తీవ్రవాదం"- "సీమాంతర ఉగ్రవాదం" ఆవిర్భావానికి పరోక్షంగా దోహదపడ్డాయి.
జాన్ కెన్నెడి హత్యానంతరం అధ్యక్షుడయిన లిండన్ జాన్సన్ హయాంలోనే మొట్ట మొదటిసారిగా "ఫుడ్ స్టాంప్స్ ప్రోగ్రాం “కు అంకురార్పణ జరిగింది. అయినా వియత్నాంలో యుద్దానికి ఐదు లక్షల మంది అమెరికన్ సైనికులను పంపిన జాన్సన్ అప్రదిష్టపాలైనాడు. ఆయన వారసుడు నిక్సన్ ఆ తప్పును సరిదిద్ది సేనలను ఉపసంహరించాడు. గత శతాబ్దం డబ్భై దశకంలో జిమ్మీ కార్టర్ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి, నిరుద్యోగ సమస్య మరో మారు అమెరికాను కుదిపేసింది. ఉగ్రవాదం ఉదృత రూపం దాల్చడం మొదలై, ఇరాన్ లోని అమెరికన్ దౌత్య కార్యాలయంలో, అమెరికన్లను బందీలుగా చేసే స్థాయికి చేరుకుంది. కార్టర్ వారి విడుదలకొరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడాయన. రీగన్ హయాం ఆరంభమై "కోల్డ్ వార్" రోజులకు నాంది పలికింది. సోవియట్ యూనియన్ లో కమ్యూనిజంకు చివరిరోజులప్పుడే మొదలయ్యాయి కూడా. "రీగనా మిక్స్" మంచే చేసిందా-చెడే చేసిందా గాని, ఆయన తర్వాత వచ్చిన సీనియర్ బుష్ హయాంలో ఆర్థిక మాంద్యం ఆరంభమై సామాజిక సమస్యలనేకం తలెత్తాయి. ఆయన కాలంలోనే జరిగిన గల్ఫ్ యుద్ధం సీమాంతర ఉగ్రవాదానికి మరింత బలం చేకూర్చింది. బిల్ క్లింటన్ రోజుల్లో అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగాయి.
ఒబామా కంటె ముందు అధ్యక్ష పదవిలో ఎనిమిదేళ్లున్న జూనియర్ బుష్ కు మొదటి విడత అధికారపు మొదటి సంవత్సరమే చేదు అనుభవం ఎదురయింది. అగ్ర రాజ్యంగా-తమనెవరూ ఏమీ చేయలేరని విర్రవీగిన అమెరికాను క్షణాలలో మట్టికరిపించి, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన న్యూయార్క్ నగరంలోని "వరల్డ్ ట్రేడ్ సెంటర్" టవర్స్ ను "అల్ ఖైదా" ఉగ్రవాదులు నేలమట్టం చేశారు సెప్టెంబర్ 11, 2001న. పర్యవసానంగా "ఉగ్రవాదం" మీద, "ఉగ్రవాదుల" మీద యుద్ధం ప్రకటించాడు బుష్. అఫ్గానిస్థాన్ మీద యుద్ధం చేసి అల్ ఖైదా నాయకత్వాన్ని అక్కడ నుండి పారదోలగలిగినా ఇంకా అజ్ఞాతంలో నాయకత్వం తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వుంది. తర్వాత కువైట్ స్థావరంగా ఇరాక్ మీద 2003లో యుద్ధం చేసి, సద్దాం హుస్సేన్ ను బంధించి, ఆ తర్వాత వురితీసింది అమెరికన్ ప్రభుత్వం. అయినా అమెరికా పెంచి పోషించిన ఉగ్రవాదం అంతం కాలేదు-కాదే మో కూడా.
అమెరికా 44వ అధ్యక్షుడుగా, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతీయుడైన బారక్ హుస్సేన్ ఒబామా జనవరి 20, 2009న అధికారం చేపట్టాడు. ఒక వైపు అంతర్జాతీయ ఉగ్రవాదం, మరో వైపు తీవ్ర ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్న క్లిష్ట తరుణంలో అధ్యక్షుడయ్యాడు ఒబామా. ఆయన పదవీకాలమంతా లోటు బడ్జెట్ తోనే గడపాల్సి వస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాక్, అఫ్గానిస్థాన్ సమస్యలతో సహా ఆర్థిక పరమైన విషయాలన్నిటికి సంబంధించి మొదటి సంవత్సరం తాను చేయాలనుకుంటున్న కార్యాచరణ ప్రణాళికను అధికారం చేపట్టడానికంటే ముందే సిద్ధం చేసుకున్నాడు ఒబామా. అధికారం చేపట్టిన ఆరంభపు వారాల్లోనే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చట్టసభలతో విస్తృతంగా చర్చించి, 787 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయక ప్యాకేజ్ ను ప్రకటించాడు. అదో మైలురాయిగా అభివర్ణించారు ఆర్థిక నిపుణులు. వాయిదా పద్దతుల మీద ఇళ్లు కొనుక్కొని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, ఉద్యోగాలు కోల్పోయి, బాంక్ ఋణాలు చెల్లించలేక, నానా అవస్థలు పడుతున్న వారికి వెసులుబాటు కలిగించే మరో ప్యాకేజ్ ను ప్రకటించాడు. ఆ తర్వాత సమగ్ర జాతీయ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించి, దిగువసభ ఆమోదం పొంది, సెనేట్ ఆమోదంకొరకు ఎదురుచూస్తున్నాడు. ఇవన్నీ చక్కదిద్దే చర్యలే.
నిరుద్యోగ వృద్ధి రేట్ 10% దాటిపోవడంతో ఒబామా ప్రకటించిన 787 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయక ప్యాకేజ్ ఏ మూలకూ సరిపోదనుకుంటున్నారు. ఆరున్నర లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి లక్ష్యంగా పెట్టుకున్న ప్యాకేజ్ నిజంగా ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగిందానని ప్రశ్నిస్తున్నారు పలువురు.
తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న ఇరాక్ యుద్ధాన్ని కొనసాగించే విషయంలో వ్యూహం మార్చుకున్నాడు. ఆగస్ట్ 2010నాటికి అక్కడున్న బలగాలన్నీ ఉపసంహరించుకుంటానని ప్రకటించాడు. అణ్వాయుధాల తయారీ-పెద్దఎత్తున నిల్వ చేయకపోవడం విషయంలో రష్యా, అమెరికా దేశాలు ఒక అంగీకారానికి వచ్చేలా ఒబామా చొరవ తీసుకున్నాడు. ఎనిమిదేళ్లగా నడుస్తున్న అఫ్గానిస్తాన్ వ్యవహారానికి "చరమగీతం" పాడతానని ప్రకటించి 30వేలమంది అదనపు బలగాలను పంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అంటే బలగాల సంఖ్య లక్షకు చేరనున్నదన్నమాట. అల్ ఖైదా ఉగ్రవాదులందరినీ తుదముట్టిస్తానంటున్నాడు. ఆ విషయంలో తమకు తోడ్పడాల్సిందేనని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఒబామా అఫ్గానిస్తాన్ నిర్ణయం స్వపక్షం నుంచి, విపక్షం నుంచి విమర్శలకు గురైంది. దేశం ఎదుర్కుంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కుంటూ, తమకు నేరుగా సంబంధించిన అంతర్జాతీయ సమస్యలకే ప్రాధాన్యమిస్తూ, ఇతర సమస్యల జోలికి ఒబామా పోకుండా వుంటే మంచిదని పలువురు అమెరికన్లు భావిస్తున్నారు.
అధ్యక్షుడు నల్లజాతివాడైనా, జాతి వివక్షత పూర్తిగా సమసి పోయినట్లు లేదింకా. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందినప్పటికీ, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతి వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమై పోతున్నది. నల్ల-తెల్లవారి మధ్య అసమానతలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, షికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఏ పొంది, నల్ల జాతి వాడైనందున ఉద్యోగం లభించక, చివరకు బయోడేటా నుంచి తన జాతికి సంబంధించిన వివరాలను ఒక వ్యక్తి తొలగించుకోవాల్సి వచ్చింది. నిరుద్యోగుల శాతం తెల్ల వారికంటే నల్ల వారిలో రెండింతలు పైగా వుందిప్పుడు. నల్ల వారినుండి ఎంత వ్యతిరేకత వచ్చినా రాజకీయంగా తనకు ఎటువంటి నష్టం కలగదని ఒబామా భావిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి, అమెరికాలోని నల్ల జాతి ఓటర్లందరూ ఓటింగ్ లో పాల్గొన కుండా ఇళ్లలో కూరుచున్నా, ఒబామా గెలిచేవాడు. తెల్ల వారిలో అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా, నల్లజాతివారి పక్షాన పక్షపాత దృష్టితో వ్యవహరించనివాడిలా పేరు తెచ్చుకుంటున్నాడు ఒబామా.
ఒబామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య సంస్కరణల చట్టం దిగువ సభ ఆమోదం పొంది, సెనేట్ ఆమోదం కొరకు ఎదురుచూస్తున్నది. చట్టంగా రూపు దిద్దుకునే సమయానికి దాని రూపురేఖలెలా వుంటాయనేది ఇంకా ప్రశ్నార్థకమే. అయితే గుడ్డిలో మెల్ల లాగా, 2009 డిసెంబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నదని, ఆర్థిక మాంద్యంలో వెసులుబాటు కలుగుతున్నదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నట్లు మీడియా కథనాలొస్తున్నాయి. అదెంతవరకు వాస్తవమో కాలమే తేల్చాలి.
ఇవన్నీ ఇలా వుండగా, అక్టోబర్ 9, 2009న, ఒబామాకు నోబెల్ శాంతి బహుమానం ప్రకటించడం-దాన్ని ఆయన ఆస్లో నగరంలో నిరసన ధ్వనుల మధ్య అందుకోవడం జరిగింది.
అంతర్జాతీయ సమస్యలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య తీవ్రత, జాతి వివక్షత, అమెరికాపై పెరిగిపోతున్న ఉగ్రవాద ప్రభావం, స్వపక్ష-విపక్షాలనుండి ఎదురవుతున్న విమర్శలతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఒబామా భవిష్యత్ లో మిగిలున్న మూడేళ్ల కాలాన్ని ఎలా పూర్తిచేసుకుంటాడోననేది ఆసక్తికరమైన విషయమే.
No comments:
Post a Comment