Please click this link for the article in SUJANARANJANI of January, 2010
http://siliconandhra.org/nextgen/sujanaranjani/jan10/vanam.html
(అమెరికాలో-హ్యూస్టన్ నగరంలో తెలుగు వారి "సాహితీ లోకం” నిర్వహించిన "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమంలో 2009 నవంబర్, 21 న చేసిన ప్రసంగ సారాంశం)
బాల్యంలో చాలాకాలం, రాజకీయ పాఠాలు నేర్చుకున్న తొలి రోజులు, మా వూరి పరిసర గ్రామాల్లో గడిపాను. ఆ వూళ్లల్లో వున్న ఎంతో మందితో అప్పటినుంచి ఇప్పటిదాకా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే వున్నాను. చిన్నతనంలో పెరిగిన అక్కడి వాతావరణం, పాఠశాలల్లో-కళాశాలల్లో-విశ్వవిద్యాలయాలలో నేర్చుకున్న పాఠాలు, సాహిత్యాన్ని-మానవత్వాన్ని ఆ కోణంలోనే అర్థం చేసుకునేందుకు దోహదపడ్డాయి. ఇప్పటికీ ఆ నేపధ్యంతోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అదో నిరంతర ప్రక్రియగా భావిస్తాను. సాహిత్యానికీ, మానవ విలువలకూ విడదీయని అనుబంధం వుందనీ-వుండితీరాలనీ నా భావన.
నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునే శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్ట్ మిత్రుల మధ్య పెరిగాను. ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దవాడినైనందున, ఇప్పటికీ ఆ రెండంటే నమ్మకమే-అభిమానమే. రెంటిలోనూ వున్న మంచిని ఎలా కలిపి, లేదా విడదీసి అర్థంచేసుకోవాలన్న తపన ఎల్లప్పుడూ నన్ను వేధిస్తుంటుంది. ఈ విషయాలను నేను అర్థంచేసుకున్నంతవరకు, మిత్రులకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా, సరిగ్గా చెప్పలేకపోతున్నానేనన్న అసంతృప్తి మిగిలిపోయింది. అయినా చెప్పకుండా వుండలేకపోతున్నాను.
పుట్టి-పెరిగిన గ్రామ పరిసరాల భౌగోళిక-చారిత్రక నేపథ్యంలో, సాహిత్యం గురించి-మానవ విలువల గురించి, కొన్ని ప్రాథమిక పాఠాలను-మౌలికాంశాలను అనుభవంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న అనుభవాల జ్ఞాపకాలు-జ్ఞాపకాల అనుభవాలు, ఎప్పటికీ-ఇప్పటికీ తాజాగా గుర్తుకొస్తూనే వుంటాయి. మరిచి పోదామన్నా మరవలేని మధురమైన అనుభూతులవి. ప్రతి అనుభవం వెనుక, ప్రతి జ్ఞాపకం వెనుక, జీవితంలో నేను నేర్చుకున్న ప్రతి విషయం కళ్లకు కట్టినట్లు దర్శనమిస్తుంది. 1998లో, ఎనభై సంవత్సరాల పైనబడిన వయస్సులో మరణించిన మా నాన్న వనం శ్రీనివాసరావు గారు, బాల్యంలో నాకు నేర్పిన తొలి పాఠాలలో, చెరిపినా చెరగని నమ్మకాలున్నాయి. అందులో ఎన్నో గుడ్డి నమ్మకాలూ వున్నాయి. నాన్నగారు చదివింది ఆరో తరగతి వరకే అయినా, జీవితం నేర్పిన అనుభవంతో, పురాణాలనుండి-ఇతిహాసాలనుండి-భారత, భాగవత, రామాయణాలనుండి-వర్తమాన చారిత్రక గాధలనుండి-ఆయన పెరిగిన నైజాం నవాబుల పరిపాలనా నేపధ్యం నుండి, ఎన్నో విషయాలను నాకు చెప్పేవారు. మానవ విలువలకు మారుపేరైన బుద్ధుడు, ఆరునూరైనా అసత్యమాడని యుధిష్టరుడు, స్వధర్మ నిర్వహణే తన విధి అని తలచిన శ్రీరామచంద్రమూర్తి, కర్తవ్య బోధన చేసిన శ్రీకృష్ణుడు, అహింసే తన మతమన్న గాంధీ మహాత్ముడు, నాన్న గారు చెప్పిన పాఠాల్లో నాకు తరచుగా వినిపించిన పేర్లు. బాల్యంలోనే, "కర్మ సిద్ధాంతం" అంటే కొంచం-కొంచం అర్థం చేసుకున్నాను .
హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి, చిన్నతనంలోనే నన్నెంతో ప్రభావితుడిని చేసింది. అలానే పెరిగి పెద్ద వాడినయ్యాను. పుట్టుకతో హిందువునైన నేను, ప్రతిరోజో, నెలకోమారో, ఏడాదికొకసారో తప్పనిసరిగా గుడికెళ్లాలన్న నియమనిబంధనలు ఎప్పుడూ పాటించలేదు. అలా అని గుడికి వెళ్లకుండా వుండలేదు. ప్రతి సంవత్సరం ఏమాత్రం వీలున్నా తిరుపతికి వెళ్లి వస్తుంటాను. నేను నమ్మిన-నమ్ముతున్న ఆచార వ్యవహారాలను తప్పకుండా గౌరవిస్తాను-తు.చ తప్పకుండా పాటిస్తుంటాను. భార్య-పిల్లల నమ్మకాలనూ, పద్దతులనూ అంగీకరిస్తాను. గుడిలోకి పోయినా-పోకపోయినా, నేను వెళ్లే మార్గంలో గుడివుంటే, వీలున్నప్పుడల్లా దానిముందరనుంచే పోతాను. బయటనుంచే దేవుడికి దండం పెట్టుకుంటాను. నాన్నగారు చెప్పిన, "గాయత్రి" మంత్రాన్ని, "నారాయణ" మంత్రాన్ని సమయం దొరికినప్పుడల్లా-ఏ పనిచేస్తున్నా-నిల్చున్నా-కూచున్నా-పడుకున్నా పఠిస్తుంటాను. దాన్ని జపంచేయడమంటారో-అనరో అని నేనెప్పుడు ఆలోచించలేదు. ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి, ఇవన్నీ మనతో చేయిస్తున్నదని ఓ గుడ్డి నమ్మకం. అయితే, ఈ నమ్మకాలేవీ, నన్ను మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి. మరో అనిర్వచనీయమైన శక్తి ఆ దిశగా లాగిందేమో నన్ను. బాల్యంలో నేను పెరిగిన మరో కోణంలోని పరిసరాలే దీనికి కారణం అయుండవచ్చు. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను. ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం".
నేనర్థంచేసుకున్న హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం, ఈ సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ ఒక్కడేనని. ఏ పనిని, ఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో-లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ అనుకుంటాం. బహుశా అది నిజంకాదేమో. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అయుండాలి. ఆ ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డి పోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే, సృష్టికొక అధికారినీ (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారినీ (రుద్రుడు) నియమించాడు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే. అంటే, ఎవరో ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి-నిర్మించి-దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అధ్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాయి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-ఆగమన్నప్పుడు ఆగి, జీవితం చాలించాలి. ఆ తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదలాలి. ఉదాహరణకు బ్రహ్మనే తీసుకుందాం. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్లీ-మళ్లీ సూర్యచంద్రులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరిగినట్లే, ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి స్థితి గతులన్నీ ఒకే విధంగా వున్నా, జీవులు మాత్రం మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రుల వలెనే ఆకారాలు కలిగి, అవే పనులను చేస్తుంటారు. ఆ కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. ఆ జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి, ఆ స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. భూలోకంలో ఉద్యోగికి ప్రమోషన్ వచ్చినట్లే ఇది కూడా.
నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయి . ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థ"కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ-ముందున్న వ్యవస్థ కూలిపోతుందనీ, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనీ, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్, థీసిస్, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనొచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో-వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం-అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా. కాకపోతే అసలు-సిసలైన "జగన్నాటక సూత్రధారి" నిర్ణయానికి లోబడే అవన్నీ జరిగుండాలి.
"ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగేయుగే" అన్న వేదవాక్కు ప్రకారం, కార్ల్ మార్క్స్ లాంటి మహా మహానుభావులు-కారణజన్ములు-గొప్ప ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్నికోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పుచెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒకవైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశదపర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు.
మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆమాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం. ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడివుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనేదానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.
మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమే, వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడు. వాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది-అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదా. రామాయణంలోని పాత్రలను-చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకి. శ్రీరామచంద్రమూర్తిని దైవంగా, మహావిష్ణువు అంశగా, జరగబోయే దాన్ని వివరంగా-రామాయణగాధగా లోకానికి తెలియచెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి, దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా-భక్తుడిగా-కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురై, శ్రీరాముడికి శత్రువుగా-రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాసాడు వాల్మీకి. మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినా, రష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్, మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రులే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తి, చైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులు. మార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గం" లాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమిపాలయ్యాడు. కూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడు. ఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడు, ఆచార్య లక్షణాలున్న హనుమంతుడు. మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే: మావో, లెనిన్, చౌ-ఎన్-లై, స్టాలిన్ కోవకు చెందినవారు. మార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్, థీసిస్, సింథసిస్" రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చు. మార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక" రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు. వాల్మీకైనా, మార్క్సైనా వారి-వారి సాహిత్యాలలో దేశకాల పరిస్థితులకనుకూలమైన మానవ విలువల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు.
మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడాడనేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, మనలాంటి వారు అంధకారంలో పడి, దురాచార పరులమైపోయి, మానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో.
మానవ విలువలను పరిరక్షించగలవాడికి కొన్ని గుణగణాలుండాలి. నాయకత్వ లక్షణాలుండాలి. అందరికీ అన్నీ సాధ్యపడవు. రామాయణ రచనకు పూనుకొమ్మని వాల్మీకిని ప్రేరేపించేందుకు ఆయనదగ్గరకొచ్చిన నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్న-సమాధానం రూపంలో ఆ గుణగణాలను తెలియచేస్తాడు రచయిత. "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు" ఎవరో వారే మానవ విలువలను కాపాడగలవారని అర్థంచేసుకోవాలి.
శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరని చెప్పుకున్నాం. అలాంటిదే ఇది. శ్రీరాముడలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వాల్మీకి విశ్వామిత్రుడితో చెప్పిస్తాడు. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా తాటకను చంపాడు. వాల్మీకి రామాయణంలోని "వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం", బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. "ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు" మధ్య జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య అన్నీ నేర్చుకున్నప్పటికీ, వాడు, ఆత్మవంతుడిని గెలవలేడని స్పష్టమవుతుంది. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. వర్గపోరాటంలో కూడా, కార్మికవర్గ నియంతృత్వానికి పూర్వ రంగంలో, తమ హక్కులకొరకు శ్రామికులు పోరాడుతారని మార్క్స్ అంటాడు. "సంకెళ్లు తప్ప కార్మికులు కోల్పోయేదేమీలేదు" అంటాడు మార్క్స్. దీనర్థం: ఎదుటివారిని దెబ్బతీసేందుకన్నా, తమను తాము రక్షించుకోవడమే ప్రధానమని. ఇదీ మానవ విలువలనే సూచిస్తుంది.
మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. విజ్ఞాన సముపార్జనకవసరమైన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలకు సంబంధించిన ప్రతి అంశం, సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీదనే ఆధారపడి వుండే రీతిలోనే మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. ఎన్నో వందల-వేల పర్యాయాలు యుగాలు మారతాయంటారు. అందుకే, పరిణామక్రమంలో ఏం జరిగిందోననో-జరుగుతుందోననో చెప్పేకన్నా, ఏ యుగానికి సంబంధించిన కథలను ప్రామాణికంగా తీసుకోవాలన్న విషయంలో పరిశోధనలు జరిగితే మంచిదేమో. ఏదేమైనా, మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. అందులో సందేహం లేదు.
పండితులైనా-పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడు కుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. పదిమందితో చదివించగలిగిన రచనే సాహిత్యమవుతుంది. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే తన "సాహిత్యం అంటే ఏంటి" అన్న పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని-ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే.. అలా నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమానమంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.
దక్షిణాది ప్రాచీన భాషలైన తమిళం, తెలుగు సాహిత్యాల మధ్యనున్న సంబంధం, వాటిని మాట్లాడేవారి మధ్యనున్న అనుబంధం, మానవ విలువలపై ఎంతగానో ప్రభావం చూపిందనాలి. అతి ప్రాచీనకాలంనాటి భాషల్లో ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా-సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగువారు నివసిస్తుండే ఆంధ్ర ప్రదేశ్, తమిళులుండే తమిళనాడు సరిహద్దు రాష్ట్రాలు. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథానున్న తూర్పు కోస్తా ప్రాంతంలో తిరిగి-తర్వాత పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారంటారు.
తెలుగు వారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలాగా తెలుగువాడి ప్రాంతమయింది. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్.. .... .... ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ఈ మధ్యనే ఎవరో అన్నారు... .... ... ముక్కోటి ఆంధ్రులల్లా ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని. ఎవరి లెక్కలు వారివి. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు ఆంధ్రా వాలీగా-తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ పేర్లతో పిలిచే మూడు ప్రాంతాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారుకూడా వున్నారు.
తెలుగు-తమిళ ప్రజలకు సుపరిచితుడైన సాహితీ ప్రియుడు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్. బెజవాడ గోపాలరెడ్డి, 1956లో ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ ను సమర్పిస్తూ ఆసక్తికరమైన ప్రసంగం చేస్తూ, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల సాంస్కృతాభివృద్ధిలో ప్రాంతీయ పరమైన తేడాలున్నాయన్నారు. ఏభై ఏళ్లక్రితంనాటి మాట ఇది. మూడు ప్రాంతాలు ఒకే పాలనా వ్యవస్థ కింద వుండకపోవడంవల్లే ఆ తేడాలొచ్చాయని ఆయన అభిప్రాయ పడ్డారు. బమ్మెర పోతన, అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, తిక్కన, నన్నయ లాంటి మహానుభావులు-సాహితీ సార్వభౌములు సంచరించిన తెలుగునాడంతా ఒకే గొడుగు కిందకు తెస్తే సాంస్కృతిక-భాషా భేదాభిప్రాయాలు సమసిపోయి ఉమ్మడిగా సహజీవనం చేస్తూ తెలుగు సాహితీ గానం చేస్తారని గోపాలరెడ్డిగారన్నారప్పుడు. ఆయననుకున్నట్లే, నవంబర్ 1, 1956న తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో-లేదో తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు-తమిళులు మాత్రం విడిపోయారు. భాషాపరంగా ఒకరిమీద పడ్డ ఇంకొకరి ప్రభావం అలానే చెక్కు చెదరకుండా వుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఏ ప్ర్రాంతంవారైనా మాట్లాడే భాషను "ఆంధ్రము" అని, "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని, "మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా వారు అలానే పిలిచేవారు. "మసూలీపట్నం", "మచిలీపట్నం", "బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రాన్ని పిలుస్తాం.
విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ బహిష్కృతులైన ఆయన ఏబైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలోవున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది. ఆర్యన్ కు వికృతి "అయిరాన్: అనీ, అదే ఇరాన్ గా మారిందనీ చెప్పబడింది.
మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం-క్రీస్తు శకం ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని-తెగలవారిని కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.
ఆదిమానవులు తొలిరోజుల్లో ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే ఆంద్రలో కూడా, అత్యధిక సంఖ్యలో జంతువులను ఆరాధించి-పూజించే వారు. జంతువు లక్షణాలను-గుణాలను దైవానికి ఆపాదిస్తూ, ఆ దైవాన్నే పూజించే "జూమోర్ఫిజం" అనే మతాన్ని అనుసరించేవారు. భగవంతుడిని సగం జంతువు గానూ, సగం మనిషి ఆకారంలోనూ కొలిచేవారు. ఉదాహరణకు నరసింహుడు, హనుమంతుడు చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో "టోటమిజం" లాంటి సిద్ధాంతం వాడుకలోకి వచ్చింది. మానవులకు జంతువులతోనూ-వృక్షాలతోనూ, జన్మజన్మల అవినాభావ సంబంధముందని నమ్మేవారు దానిని నమ్మినవారు. దాని స్థానంలో గ్రామ దేవతలను ఆరాధించడం మొదలయింది. దేశ ద్రిమ్మరులుగా వుండే తెగలవారు వ్యవసాయం వృత్తిగా జీవించడం మొదలుపెట్టడంతో, వర్షాలు పడడానికి, పంటలు పండడానికి, సుఖ జీవనం గడపడానికి రకరకాల రూపాలలో గ్రామ దేవతలను కొలిచేవారు. మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పొలిమేర దేవత లాంటి పేర్లతో పిలిచేవారు. జంతు బలీ ఇచ్చేవారు.
దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యకతకు ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.
ఆంధ్రుల మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహూశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు.
కృతయుగంలో కూడా "ఆంధ్రము" అనే విషయానికి సంబంధించిన ప్రస్తావన వుంది. అగ్నిమిత్ర అనే ఒక రాజుండేవాడు. ఒక వేసవికాలంలో ఎండల తీవ్రతకు ఆయనకు దృష్టి లోపం వచ్చి, కళ్లు కనిపించలేదు. సూర్య భగవానుడిని ప్రార్థించాడట. అగ్నిమిత్ర.కు ఆయన ప్రత్యక్షమై, తనను కొలిచేందుకు ఒక కొత్త భాషను నేర్పాడంటారు. సూర్యుడిని అగ్నిమిత్ర అదే భాషలో ప్రార్తించడంతో, ఆ భాషకున్న పదజాల ప్రభావంతో, అగ్నిమిత్రకు పోయిన దృష్టి తిరిగొచ్చింది. సంస్కృతంలో "అంధ" అంటే "గుడ్డి" అని-చీకటి అని అర్థమొస్తుంది. చీకటిని తొలగించి, గుడ్డి తనాన్ని పోగొట్టగలిగింది కాబట్టి ఆయన నేర్చుకున్న భాషకు "ఆంధ్ర భాష" అని పేరొచ్చింది. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నందివర్ధనుడు-ఆయన శిష్యుడు దేవలరాయ అని అంటారు.
ఆంధ్ర భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదు-కాకూడదనీ లేదు. క్రీస్తు శకం మూడవ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న "లంకావతార సూత్రం" అనే బౌద్ధ మత గ్రంథంలో ఒక రావణుడిని గురించిన ప్రస్తావన వుంది. కాకపోతే ఈ రావణుడు కూడా సిలోన్ కు చెందినవాడే. ఆంధ్ర దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. అయితే ఆ రావణుడు ఎవరైనా కావచ్చు. ఇలా ఇంతవరకూ చెప్పుకున్నవాటిలో కొన్ని విన్నవీ-కన్నవీ కావచ్చు, ఇంకొన్నిటికి ఆధారాలుండవచ్చు, మరికొన్నిటికి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవచ్చు--- ---- ---- వాస్తవాలూ కావచ్చు. అయితే ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.
పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం-అభివృద్ధి నన్నయకు పూర్వం-క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి: తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి. క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక దశ-వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.
ప్రాచీన ద్రావిడ భాషలైన తెలుగు, తమిళాల మధ్య-అవి మాట్లాడేవారి మధ్య నెలకొని వున్న సంబంధ బాంధవ్యాలు, మానవ విలువల పై వాటి ప్రభావం చరిత్రకారులు వివరంగా ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేసి భావితరాల వారికి అందించాలి. ప్రస్తుతం ఉత్తర ఆర్కాట్ గా పిలువబడుతున్న అరవ దేశం ఆంధ్ర ప్రాంతానికి సమీపంలో వున్న ప్రదేశమైనందున, తమిళులను "అరవ" లని తెలుగువారు సంబోధించేవారు. అదేవిధంగా తమిళనాడు సరిహద్దు చివరలో "తిరుమల" అర్థం స్ఫురించే "ఉత్తర వేంగడం" ఒక వైపున, కన్యాకుమారి లోని దక్షిణ కేప్ కామెరూన్-"థెన్ కుమారి" మరొక వైపున వున్నట్లు ప్రాచీన తమిళ సాహిత్యంలో పేర్కొనబడింది. "ఆంధ్ర ద్రావిడ భాష్యం" కు సంబంధించిన ప్రస్తావనను ప్రముఖ ఎటిమోలొజిస్ట్ కుమారిల భట్ట అధ్యయనంలో వుంది. విష్ణు సహస్ర నామాల్లో కూడా ఆంధ్రులకు సంబంధించిన ప్రస్తావన వుంది. ఆంధ్రులొకప్పుడు మాట్లాడింది ప్రాకృత భాష. ఉదాహరణకు, హల శాతవాహన కాలంలో "గుణాఢ్య బృహత్కథ “ను పైశాచిగా పిలువబడే ప్రాకృతంలోనే రాయబడింది.
ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.
అయాం ఎ బిగ్ జీరో (45) - భండారు శ్రీనివాసరావు
1 hour ago
Response to మార్క్సిజం-రామాయణం
ReplyDeleteName: రాజు
Email: krajasekhara@gmail.com
Phone: chennai
Message: "శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్ట్ మిత్రుల మధ్య పెరిగాను. ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దవాడినైనందున, ఇప్పటికీ ఆ రెండంటే నమ్మకమే-అభిమానమే. రెంటిలోనూ వున్న మంచిని ఎలా కలిపి, లేదా విడదీసి అర్థంచేసుకోవాలన్న తపన ఎల్లప్పుడూ నన్ను వేధిస్తుంటుంది."
మొదట సాంప్రదాయిక వాతావరణంలో పెరిగినా తర్వాత దానికి వ్యతిరేకమైన జీవితంలోకి పోయిన వారు మీలాగే చాలామంది ఉన్నారు మనలో. కానీ ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దయిన మీరు ఇప్పటికీ ఆ రెండింటిపైనా నమ్మకం ఉంచుకోవడం చాలా ఆశ్చర్యకంరంగానూ, తీవ్ర వైరుధ్యపూరితం గానూ ఉంది. ఇలా ఉండటం ఎవరికయినా ఎలా సాధ్యం?
"హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి, చిన్నతనంలోనే నన్నెంతో ప్రభావితుడిని చేసింది. అలానే పెరిగి పెద్ద వాడినయ్యాను. ఈ నమ్మకాలేవీ, నన్ను మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి."
మీరు సాహిత్య పరంగా మార్కిజం పట్ల ఆకర్షితుడయ్యారే కానీ దాని ఆచరణాత్మక జీవితానుభవం మీకు లేదనే అనిపిస్తోంది.
"నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను."
హిందూత్వ కర్మ సిద్ధాంతం, మార్క్సిజం-కమ్యూనిజం కర్మసిద్ధాంతం... ఎక్కడో తేడా కనబడుతూ ఉంది. స్పష్టంగానే..
"ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం".
దాని ఆచరణలో 90 ఏళ్లుగా జరుగుతూ వచ్చిన అరాచకాలను పక్కనబెట్టి చూస్తే.... మీరన్న పై వాక్యం అక్షర సత్యం. మనిషికి 8 గంటల పని అవసరం గురించి ఎలుగెత్తి చాటిన సిద్ధాంతం మార్క్సిజమే మరి. ఇంతకు మించిన మానవ విలువ ఎక్కడైనా ఉందా? 8 పని గంటలకు సంబంధించిన ఈ మహత్తర విలువే ఈనాడు పూర్తిగా తలకిందులవుతూ వస్తోంది. ఎంతగా రాత్రింబవళ్లూ ప్రాజెక్టుల మీద పనిచేసినా సరే ఇంకా చేయలేదే అనేంత గొప్ప స్థాయికి ఇప్పటి సమాజం ఎదిగిపోతోంది..
"రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది".
అగ్రవర్ణ, నిమ్నవర్ణ పునాదిని పదిలపర్చిన రామరాజ్యంలో మానవవిలువలు ఎవరికి ప్రయోజనం కలిగించి ఉంటాయి. రామరాజ్యం వర్ణ వివక్షకు పట్టం గట్టిన రాజ్యం. అక్కడ మానవ విలువలు అంటే సవర్ణ మానవ విలువలు అనే అర్థమే వస్తుంది.
ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం అని మీరు ఓ చోట అన్నారు. ఇది మీకు కూడా ఎక్కువగానే వర్తిస్తుందనుకుంటున్నా. మిమ్మల్ని నొప్పించాలని కాదు.
మొత్తంమీద చూస్తే రెండు విభిన్న దృక్పధాలను కలిగి ఉంటున్నట్లుగా చెప్పిన మీ నిజాయితీకి అభినందనలు. కానీ ఈ ద్వంద్వజీవన దృక్ఫథమే నాకు బోధపడటం లేదు.
జీవితవిధానానికి సంబంధించి మీ ఎంపికను నేను తప్పు పట్టదల్చుకోలేదు. మిమ్మల్ని నొప్పించే ఉద్దేశం కూడా లేదు.
రాజు
Dear Raju Garu,
ReplyDeleteI saw your excellent comment on my article "మార్క్సిజం-రామాయణం"
(carried in Sujanaranjani also and forwarded to me by Mr. Rao Tallapragarda).
I really like the way you had put it. However, my inner thing says that I still respect both the ideologies. Let me wait for few more days or months or years (I am 61+ now) either to change or continue to think the same way.
Regards,
Jwala Narasimha Rao Vanam
Please visit my BLOG when free at:
http://jwalasmusings.blogspot.com
ప్రియమైన జ్వాలా నరసింహారావు గారికి,
ReplyDeleteమార్క్సిజం - రామాయణంపై వచ్చిన మీ వ్యాసంపై నా వ్యాఖ్యకు స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. దానిపై మరి కొంత వివరణను పంపిస్తున్నాను చూడండి.
"అయితే, ఈ నమ్మకాలేవీ, నన్ను మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి. మరో అనిర్వచనీయమైన శక్తి ఆ దిశగా లాగిందేమో నన్ను. బాల్యంలో నేను పెరిగిన మరో కోణంలోని పరిసరాలే దీనికి కారణం అయుండవచ్చు. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను."
నేను విమర్శా పూర్వకంగా మీ వ్యాసంపై వ్యాఖ్య పంపినప్పటికీ ఎంతే సహృదయతతో మీరు దాన్ని స్వీకరించి మీ అభిప్రాయం చెప్పడం నిజంగా కదిలించివేస్తోంది. రెండు విభిన్న దృక్పధాలను ఒకే సారి, ఒకే వ్యక్తి పాటించడం హేతువిరుద్ధమనే దృష్టితోటే ఆవ్యాఖ్య అలా పంపాను. కానీ నిజం చెప్పాలంటే తెలంగాణాలో మీరు మీ నాన్నగారి ద్వారా సాంప్రదాయక జీవన విలువలను, మీ మిత్రుల ద్వారా వామపక్ష సిద్ధాంత దృక్పధాన్ని ఎలాగైతే ఒడిసి పట్టుకున్నారో, సరిగ్గా అలాంటి అనుభవమే నాకూ ఉంది.
బాల్యంలో నేను పెరిగిన సంప్రదాయ జీవనకోణంలోని పరిసరాలు ఒక రకం వ్యక్తిత్వాన్ని నాలో పెంపొందిస్తే, తర్వాత విద్యార్థి జీవితపు మలిదశలో పరిచయమైన మార్క్సిస్ట్ సిద్ధాంత మరో రకమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించింది. ఇప్పటికీ ఈ రెండింటి కలయికతోటే నా జీవితమూ కొనసాగుతోంది. కానీ, ప్రస్తుతం ఉద్యమ జీవితంతో సంబంధం లేకున్నప్పటికీ వ్యక్తిగా కూడా మార్క్సిస్టు దృక్పధాన్ని నా జీవితమార్గంగా ఎంచుకున్నాను.
రాజకీయ మార్క్సిజం దాని పెడధోరణుల కంటే సమాజాన్ని అవగాహన చేసుకోవడంలో మార్క్సిజం అన్ని సిద్ధాంతాలకంటే పై మెట్టులో ఉందని నా అభిప్రాయం. అందుకే "ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం" అని మీరు జనవరి నెల సుజనరంజని వ్యాసం -మార్క్సిజం - రామాయణం (సాహిత్యం మానవ విలువలు)- లో మీరు ప్రకటించిన భావానికి వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను.
రాజశేఖర రాజు
చందమామ
blaagu.com/chandamamalu (my blog)
telugu.chandamama.com (our website)
ప్రియమైన జ్వాలా నరసింహారావు గారికి,
ReplyDeleteఅలాగని నా బాల్యజీవితాన్ని వెలిగించిన సంప్రదాయ సాహిత్యాన్ని, సంగీతాన్ని ఈనాటికీ నేను మర్చిపోవడం లేదు. నా చందమామబ్లాగు లో నిన్ననే పోస్ట్ చేసిన "మా తెలుగు మాష్టారూ - మా తెలుగు పద్యమూ" అనే బాల్య జ్ఞాపకాన్ని దయచేసి చూడగలరు.
ఈ రోజుకీ మా యింట్లో ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండూ కలిసే కాపురం చేస్తుంటాయి. తెలుగు పద్యం, శ్లోకాలలోని సంగీత ఝరి నన్ను ఎంతగా ఆకట్టుకుంటుందో దాస్ కేపిటల్ పుస్తకం కూడా అంతే ఉద్వేగానుభూతిని కలిగిస్తుంది. ఇది దాదాపు ఉద్యమాల్లో పనిచేసిన, బయట ఉండి మద్దతు పలికిన ప్రతివారి అనుభవంలోనూ కొనసాగుతూ వస్తోంది.
విరసం ఒకప్పటి కార్యదర్శి, సుప్రసిద్ధ మార్క్సిస్ట్ విమర్శకుడు కేవీఆర్ ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తో దాదాపు అందరికీ తెలుసు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా వినే గీతాల్లో త్యాగరాజ కృతులు ఒకటి అంటే నమ్మండి. మార్క్సిజాన్ని విశ్వసిస్తూ ఇదేమిటీ చాదస్తం అని ఎవరైనా అంటే అప్పట్లో ఆయన ఒకే ఒక మాట అనేవారు. అవును నేను 'పెట్టుబడి'నీ చదువుతాను. త్యాగరాజ కృతినీ వింటాను. మీకేమన్నా అభ్యంతరమా..! అనేవారాయన.
భక్తి సాహిత్యానికే తలమానికంగా నిలిచిన అన్నమయ్య సంకీర్తనలు వింటే, అన్నమయ్య సినిమాలో 'అంతర్యామీ అలసితీ' వంటి పాటలు వింటూంటే నా కళ్లవెంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటాయి. రాజులు మత్తులై, మదోన్మత్తులై రాజ్యాలు ఏలుతున్న కాలంలో తన దేహము, తన గేహము తన సర్వస్వాన్ని దేవుడు అనే భావానికి అంకితం చేసి మానవానుభవాన్ని అక్షరీకరించిన మహితాత్ముడు అన్నమయ్య. రేపు నవ సమాజం ఏర్పడినా అన్నమయ్య సంకీర్తనలు ప్రజలలో ప్రాచుర్యం పొందుతూనే ఉంటాయి.
జీవితం పట్ల, సమాజం పట్ల, నమ్మకం కోల్పోయిన చోట, తమను ఆదుకునే వారు ఈలోకంలో ఎవరూ లేరు అనే సామూహిక చింతన గట్టిపడిన చోట మధ్యయుగాల్లో భక్తిసాహిత్యం మానవజాతికి ఊరట కలిగించిందనటం సత్యదూరం కాదు. భక్తిసాహిత్యంలో ప్రగతిశీల ధోరణిని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలనుకుంటాను. రేపటికి సంబంధించిన భయాలు, వృత్తికి సంబంధించిన భయాలు, జీవితానికి సంబంధించిన నిత్య భయాలు సమాజంలో లేకుండా పోయిన రోజు ఈ భక్తిసాహిత్యం కూడా పండుటాకులాగే మారిపోతుందనడంలో సందేహపడవలిసింది ఏదీ లేదు.
మీ అంత గట్టిగా నేను సంప్రదాయ విశ్వాసాన్ని ఇప్పుడు పాటించకపోయినప్పటికీ విశ్వాసం, భక్తి పట్ల నాకు గుడ్డి వ్యతిరేకత లేదు. భక్తిపేరుతో జరిగే అరాచకాలపట్ల వ్యతిరేకతే తప్ప, మనిషి నమ్ముతున్న విశ్వాసాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తాను. హృదయంలేని ప్రపంచంలో ఊరట నిచ్చేది, ఆత్మలేని ప్రపంచంలో ఆత్మే మతం అని ఏ నాడో మార్క్స్ చెప్పాడు గదా. సమాజానికి భక్తి, విశ్వాసం అవసరమైనంతకాలం అవి కొనసాగుతాయి. వాటి అవసరం తీరిపోయినప్పుడు అవి పండుటాకులా రాలిపోతాయి.
ఇదే అవగాహనతో నేను ప్రాచీన సాహిత్య, సంస్కృతులనూ నాదిగా చేసుకుంటున్నాను. అదే సమయంలో యవ్వన జీవితంలో పరిచయమైన సామ్యవాదాన్నీ విశ్వసిస్తూ వస్తున్నాను. మానవ జాతి సాధించిన సమస్త విజ్ఞానాన్ని యువజనులు తమదిగా చేసుకోవాలని లెనిన్ ఏనాడో అన్నాడు కదా. ప్రాచీన సాహిత్య సంపద కూడా మానవ విజ్ఞానంలో భాగమే అయినప్పుడు దానికి దూరంగా ఎలా ఉండగలం.
మీ వ్యాసాన్ని నా విశ్వాసం ప్రాతిపదికనే వ్యాఖ్యానించాను, విమర్శించాను తప్పితే మరేవిధంగాను మిమ్మల్ని నొప్పించలేదనే భావిస్తున్నాను. అలా జరిగి ఉంటే మనఃపూర్వక క్షమాపణలు.
మనిషిలో ఉంటున్న సాంప్రదాయ, ఆధునిక విశ్వాసాల, అలవాట్ల వైచిత్రిని మీ జీవితం సాక్షిగా ఆవిష్కరించారు. ఆవిధంగా నావంటి ఎంతోమంది జీవితాల్లోని విశ్వాసాల వెనుక గల గతాన్ని మరోసారి గుర్తుతెచ్చుకునేలా చేశారు. అందుకు మీకు ఆత్మీయ అభినందనలు.
61 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీ పరస్పర విరుద్ద విశ్వాసాలను, భావజాలాన్ని మార్చుకోగలగడం లేదా మరి కొంత కాలం అట్టిపెట్టుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. మీ సాంప్రదాయిక విశ్వాసానికి, మార్క్సిజం పట్ల మీ ఆరాధనకు నిండు నీరాజనాలు.
రాజశేఖర రాజు
చందమామ
blaagu.com/chandamamalu (my blog)
telugu.chandamama.com (our website)
రాజు గారూ,
ReplyDeleteనా వ్యాసంకంటె మీరు విడతలుగా చేసిన వ్యాఖ్యానం అద్భుతంగా వుంది. ఇంతకాలం నాలాంటి వాళ్లలో నేనొకడినే అనుకుంటుండే వాడిని. నేనెప్పుడు నావాదనను వినిపించే ప్రయత్నం చేసినా స్పందన కరవయ్యేది. అయినా పదిమంది స్నేహితులం కలిసినప్పుడు చెప్పదల్చుకుంది చెప్పితీరేవాడిని. నాకిప్పుడు "మీలో" నా భావాలను అర్థంచేసుకోగల సన్నిహితుడొకరు దొరికారన్న ఆనందం కలుగుతుంది. సీ. నారాయణరెడ్డి, మహాకవి శ్రీ శ్రీ లాంటి ప్రముఖులను ముఖ్య అతిథులుగా పిల్చిన "ఇళ్లక్కియ చింతనై" అనే ప్రముఖ తమిళ సాహీతీసంస్థ నన్నొకసారి, వారినెందుకు పిలిచారో-నన్నూ అందుకే పిలిచే సరికి, ఏమని జవాబివ్వాలో తోచలేదు. ఏటేటా చెన్నైలో జరుపుకునే వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళభాషేతర సాహిత్యరంగ ప్రముఖులను పిలవడం ఆ సంస్థకు ఆనవాయితి. అప్పట్లో చిదంబరం సోదరుడు లక్ష్మణన్ ఆ సంస్థకు అధ్యక్షుడు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిగారికి ఆయన సన్నిహితుడు. చంద్రమౌళిగారి ద్వారా-నా ద్వారా లక్ష్మణన్ ఆహ్వానించిన సాహితీ ప్రముఖులు ఆఖరు క్షణంలో హఠాత్తుగా రాలేమని చెప్పడంతో, నన్ను రమ్మనీ-"సాహిత్యం-మానవ విలువలు" అన్న అంశంపై మాట్లాడమనీ ఆ సంస్థ అధ్యక్షుడు లక్ష్మణన్ కోరాడు. పది సంవత్సరాల క్రితం మాట ఇది. ఒప్పుకోక తప్పలేదు. ఒప్పుకున్నాను కనుక మాట్లాడక తప్పలేదు. ఆనాటి ఆ సభలో చేసిన ఆంగ్ల ఉపన్యాస సారాంశం ఒకవిధంగా నాలో నిరంతరం రేపే ఆలోచనలే. సాహిత్యం-మానవ విలువలు ఒకరకంగా - ఏదో ఒక రూపంలో, నా చిన్నతనంనుండి, నేను ఆలోచించి-ఆచరణలో పెడుతుండే భావాలకనుగుణమైనవే. అవి బాల్యంలో ఒక విధంగా, పెరుగుతున్నా కొద్దీ మరో రకంగా మలుపులు తిరుగుతూ వచ్చాయి. ఊహ తెలిసినప్పటినుండి, ఏదో ఘర్షణ-అర్థంకాని ఏదో ఆలోచన, ఏదో తపన, ఏమిటో చెయ్యాలన్న పట్టుదలకు లోనవుతుండే వాడిని. దాని సారంశమే తెలుగులోని ఈ వ్యాసం. నా బ్లాగ్ లో నేను ఆంగ్లంలో చేసిన ఉపన్యాసం కూడా వుంది. వీలున్నప్పుడు చూడగలరు.
జ్వాలా నరసింహారావు వనం
ఒక రచనకు కానీ ఒక రచయితకు కానీ సార్ధకత లభించడం ఆ రచనని ఎవరయినా చదివినప్పుడు కాదు. చదివిన దానిపై ఏ చదువరి కూడా అనవసరంగా స్పందిన్చడన్నది నా అభిప్రాయం.
ReplyDeleteఅయితే ఆ మహానుభావుడు, తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తీ చేతులెత్తి నమస్కరించ తగిన ఆ రాజు గారికీ నీకూ నడుమ సాగిన స్పందన, ప్రతిస్పందన గమనించిన తర్వాత నీ రచన సంపూర్తిగా సార్ధకం
అయినట్టుగా నేను భావిస్తున్నాను.
అభినందనలతో -
భండారు శ్రీనివాసరావు
Bhandaru Srinivas Rao (I.I.S.)
Cell: 98491 30595 Res: 040 2373 1056.
Please click on below URL to visit my Blog:
http://bhandarusrinivasarao.blogspot.com
Raja Sekhara Raju
ReplyDeleteDate: 2010/1/10
Subject: Re: అభినందనలతో -
To: vanam jwala narasimha rao
ప్రియమైన జ్వాలా నరసింహారావు గారూ,
అనుకోకుండా మీతో ఏర్పడిన ఓ పరిచయం నాజీవితానికో వెలుగులా మారుతోంది. ఓ
గొప్ప వ్యక్తిని అనడం అతిశయోక్తి అవుతుంది కాబోలు. ఎంత మంచి వ్యక్తిని
పరిచయం చేశారు మీరు! మూడు రోజుల క్రితమే మీరు భండారు శ్రీనివాసరావు గారి గురించి చెబుతూ మెయిల్ పెట్టారు.
"చదివిన దానిపై ఏ చదువరి కూడా అనవసరంగా స్పందించడన్నది నా అభిప్రాయం.
అయితే ఆ మహానుభావుడు, తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తీ చేతులెత్తి
నమస్కరించ తగిన ఆ రాజు గారికీ నీకూ నడుమ సాగిన స్పందన, ప్రతిస్పందన గమనించిన తర్వాత నీ రచన సంపూర్తిగా సార్ధకం అయినట్టుగా నేను భావిస్తున్నాను."
అంటూ మీకు ఆయన ఇచ్చిన మెయల్‌ను నాకు పంపారు. చదివిన ఆ క్షణం నా తలను కృతజ్ఞతతో కిందికి వాల్చేశాను. "రామాయణం, మార్క్సిజం సాహిత్యంలో మానవ విలువలు" పేరిట మీరు రాసిన వ్యాసం సుజనరంజనిలో చదివిన క్షణాల్లో నా హృదయంలో అప్పటికప్పుడు చెలరేగిన భావాలను వ్యాఖ్యగా మలిచి పంపాను. దానికి మీరు ఎంతగా కదిలిపోయి స్పందించారో అంతకు మించి మీ స్నేహితుడు శ్రీనివాసరావు గారు చలించిన హృదయంతో నాపై ప్రశంసల జల్లు కురిపించినట్లుంది. ఓ మంచి వ్యక్తి హృదయాన్ని కదిలించిన ఫలితమే ఆయన నాపై కురిపించిన ఈ ప్రశంసల జల్లుగా భావిస్తున్నాను. ఈ క్షణంలో నేనేమీ కోరుకోవడం లేదు. నా చిన్ని జీవితానికి ఇది చాలు. ఈ ప్రశంసకు నేను అర్హుడిని కానని నా కనిపిస్తున్నప్పటికి మీ మిత్రుడి హృదయావిష్కరణను వినమ్రంగా స్వీకరిస్తున్నాను.
మీరు ఈ మెయిల్ పంపిన తర్వాత గత మూడు రోజులుగా స్పందించలేకపోయాను, నిన్న కూడా సెలవే అయినప్పటికీ సిస్టమ్ ముందు కూర్చోలేదు. ఇవ్వాళే మీ మిత్రుడి బ్లాగు చూసాను. నా కళ్లముందు ఓ కొత్త ప్రపంచం ఆవిష్కరించబడినట్లయింది. నిజం చెప్పాలంటే "మార్పు చూసిన కళ్ళు" పేరిట ఆనాటి మాస్కో అనుభవాలు గురించి ఆయన రాస్తున్న బాగాలను చదువుతుంటే ఒకనాటి మహత్తర దేశంతో ఆయన
పొందిన మమేకత్వాన్ని ఆత్మావిష్కరణ చేసుకుంటున్నట్లుగా నాకనిపించింది. ఈ క్షణంలోనే ఆయన బ్లాగును నా కిష్టమైన బ్లాగుగా ఎపీ మీడియా కబుర్లు అనే కేటగిరీలో జోడిస్తున్నాను. మీది కూడా ఇక్కడే ఉంటుంది.
"ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే"... ఇది చదువుతుంటేనే నేను ఫ్లాట్‌గా పడిపోయానంటే నమ్మండి. ఆయన రాసిన మూడు భాగాలను అపరూపంగా నా సిస్టమ్‌లో దాచుకున్నాను. రష్యాలో ఆయన పొందిన అనుభవాలను ఇలాగే ధారావాహికగా రాస్తూపోవాలని కోరుతూ ఇప్పుడే ఆయన బ్లాగులో కామెంట్ పెడుతున్నాను. ఆయన తన మొబైల్, లోకల్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కాని ఈ ఆదివారం తనను ఎక్కడ ఇబ్బంది పెడతానో అని సంకోచంతో కాల్ చేయలేకపోతున్నాను. ఆయన రోజులో ఏ
సమయంలో తీరికగా ఉంటారో చెప్పండి. ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలనుంది. అలాగే మీతో కూడా. ఎంత చక్కటి శైలితో ఆయన ఒక మహా దేశపు చరిత్రతో తన అనుబంధాన్ని రాస్తున్నారు? నిజంగా పిచ్చెత్తిపోతోంది నాకు. అలాగే ఆయన రాజకీయ విశ్లేషణాత్మక వ్యాసాలు కూడా. మీవి కూడా చదివాను. ఇకపై ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ ఇద్దరి బ్లాగులను రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. నాలుగైదు దశాబ్దాల నాటి మన దేశ రాజకీయ చరిత్ర విశేషాలను చదవాలంటే మీ ఇద్దరి బ్లాగులూ చదివితే చాలనిపిస్తోంది నాకు.
ప్రస్తుతం చందమామ ప్రింట్ మరియు ఆన్‌లైన్ విభాగాల్లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. మీ ఇద్దరితో ఈ అపరూప పరిచయం చిరకాలం కొనసాగుతుందని మనసారా కోరుకుంటూ. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఇలాగే రచనలు చేయాలని ఆశిస్తున్నాను.
హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనలతో..
రాజశేఖర రాజు
మొబైల్ : 9884612596 (చెన్నయ్)
blaagu.com/chandamamalu
telugu.chandamama.com
రాజు గారూ,
ReplyDeleteభండారు శ్రీనివాస రావు ఒక అజ్ఞాత రచయిత. మేమిద్దరం బాల్యం నుంచీ స్నేహితులం. కలిసి పదో తరగతి వరకు (కలిసింది మధ్యలోనే అయినా) చదువుకున్నాం. దారులు వేరైన (ఆయన మాటల్లో చెప్పాలంటే "బారులు ఒకటైనా" )కొన్నాళ్లకు ఆయన మేనకోడలును నేను పెళ్లి చేసుకోవడంతో మళ్లీ కలిసాం. 1974లో ఆయన హైదరాబాద్ ఆకాశవాణిలో విలేకరిగా చేరినప్పటినుంచి, నేనూ హైదరాబాద్ బీ.హెచ్.ఇ.ఎల్ లో ఉద్యోగం చేస్తుండంవల్ల (అప్పట్లో), ఇరువురం-ఇరు కుటుంబాల వారం కలిసి మెలిసి వుంటున్నాం. ఆయన గొప్ప ఆయనకే తెలియని అతి కొద్దిమందిలో భండారు శ్రీనివాస రావు ఒకరు. మీ స్పందన ఆయనకు పంపాను.
కృతజ్ఞలతో,
జ్వాలా నరసింహా రావు