2009 ఆగస్ట్ నెలనుండి విరామం - సెప్టెంబర్ లో అమెరికాకు ప్రయాణం
వనం జ్వాలా నరసింహారావు
మా అబ్బాయి ఆదిత్య శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో, అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న గూగుల్ సంస్థలో పనిచేస్తున్నాడు. కొడుకు, కేడేన్స్ సంస్థలో పనిచేస్తున్న కోడలు పారుల్ రమ్మంటే సెప్టెంబర్, 2009 మూడో వారంలో అమెరికా దేశానికొచ్చాం. అమెరికా రావడం ఇది మూడోసారి. హైదరాబాద్ లో వుంటున్న మనుమడు పాఠశాలలకు శలవులిచ్చినందువల్ల, మా వెంట, అమెరికా వచ్చాడు మూడు వారాలుండి పోవడానికి. కోడలు, నవంబర్ చివరి వారంలో ప్రసవించాల్సి వుంది. (విరోధి నామ సంవత్సరం-మార్గ శిర మాసం-సప్తమి తిథి, నవంబర్ 24 ఉదయం 8-36 కు ధనిష్ఠ నక్షత్రంలో మా మూడో మనుమరాలు కనక్ పుట్టింది. ఇంతకు ముందు ఇద్దరు మనుమరాళ్లున్నారు-బుంటి కూతురు మిహిర, కిన్ని కూతురు మేధ. యష్విన్-అన్ష్ లు మనుమలు). మేం వచ్చినప్పుడు కనక్ పుట్టడానికి కొంత వ్యవధి వున్నందు వల్ల, వాసు దాసుగారి మందరం రామాయణం బాల కాండను లఘు కృతిలో రాయడం ప్రారంభించి, నెలరోజుల్లో పూర్తి చేశాను. ఇంకా అమెరికాలో నాలుగు నెలల వరకూ వుండాలి కనుక, ఆ సమయంలో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే, ఆదిత్య "జ్వాలా మ్యూజింగ్స్" పేరుతో "బ్లాగ్" ను డిజైన్ చేసి, నేనింతవరకు రాసినవి-రాయదల్చుకున్నవి, అన్నీ ఒక చోట వుండే విధంగా, అందులో పెట్టమని సలహా ఇచ్చాడు. కోడలు పారుల్, నా శ్రీమతి విజయలక్ష్మి, అమెరికాలోనే-హ్యూస్టన్లో వుంటున్న రెండో కూతురు కిన్నెర-అల్లుడు కిషన్, హైదరాబాద్ లో వుంటూ టీవీ9 లో పనిచేస్తున్న పెద్దమ్మాయి ప్రేమ-అల్లుడు విజయ గోపాల్ కూడా ఆదిత్య చెప్పింది చేస్తే బాగుంటుందని అనడంతో ఎన్నేళ్ల క్రితం నుంచో రాసిన వాటిలో ప్రాముఖ్యతా క్రమంలో బ్లాగ్ లో చేర్చడం మొదలెట్టాను. దాంతో పాటు ప్రతివారం వర్తమాన విషయాల మీద, క్రితం వారం జరిగిన సంఘటనల ఆధారంగా ఏదైనా రాస్తే బాగుంటుందన్న ఆలోచనతో రాయడం ప్రారంభించాను. ఎక్కడ మొదలుపెట్టాలా అని ఆలోచిస్తుండగా, నాకూ-ఆగస్ట్ నెలకూ వున్న అనుబంధం గుర్తుకొచ్చింది. అదే మొదటి మ్యూజింగ్స్. మూడోసారి అమెరికా పర్యటన అనుభవాలతో ఇది కొనసాగుతుంది ప్రస్తుతానికి.
ఆగస్ట్ నెలకూ నాకూ అవినాభావ సంబంధం-జన్మతో ఏర్పడ్డ అనుబంధం. ఆగస్ట్ 15, 1947న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి, ఆగస్ట్ 8, 1948న (నా పుట్టిన తేదీలో మూడు ఎనిమిదులున్నాయి) పుట్టాను నేను. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజులవి. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చేసి, స్వతంత్ర భారతావనిలో కలిపేందుకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మీద పోలీస్ యాక్షన్ జరిపేందుకు సన్నాహాలు మరోపక్క జరుగుతున్న రోజులవి. ఈ విషయాలను నాన్న వనం శ్రీనివాస రావు గారు చెపితే విన్నాను-చరిత్రలో చదువుకున్నాను. సెప్టెంబర్ 13, 1948న మొదలయిన పోలీస్ యాక్షన్, సెప్టెంబర్ 17, 1948న-కేవలం నాలుగైదు రోజులలోనే ముగిసి, యావద్భారత ప్రజల ఆనందోత్సాహాల మధ్య, హైదరాబాద్ రాజ సంస్థానం భారత దేశంలో విలీనమయింది.
అప్పటినుంచి, ఒక నెల అటు-ఇటుగా నా జీవితంలో ముఖ్య సంఘటనలన్నీ జులై-సెప్టెంబర్ నెలల మధ్యనే జరిగాయి-ఇంతవరకూ జరుగుతూనే వున్నాయి. యాదృచ్చికమే కావచ్చు. నా పెళ్లైన రెండేళ్లకు జులై 8, 1971న మా పెద్దమ్మాయి ప్రేమ మాలిని పుట్టింది. అది పుట్టడానికి మూడు రోజుల ముందర ఎం. ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పాసయ్యాను. అది పుట్టిన మూడు వారాలలో, అదే నెల ఆఖరు వారంలో, అనుకోకుండా (ఖమ్మం జిల్లా విద్యాధికారిణితో బస్ ప్రయాణంలో) అయిన పరిచయంవల్ల, నా జీవితంలో మొట్టమొదటి ఉద్యోగం రావడం, వెంటనే ఆగస్ట్ నెలలో ఆ ఉద్యోగంలో చేరడం జరిగింది. రెండేళ్లు తిరిగేసరికల్లా జులై-ఆగస్ట్ 1973లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ కోర్స్ లో సీటు లభించి చేరడం, ఏడాదిలో ముగిసి, ఇంకా పరీక్షలు రాయక ముందే, జులై 1, 1974న బీ.హెచ్.ఇ.ఎల్. హయ్యర్ సెకండరీ పాఠశాల (హైదరాబాద్) లో లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరడం జరిగింది. జులై నెలాఖరులో పరీక్షలు జరిగి నాకు యూనివర్సిటీ రెండో రాంక్ ఆగస్టులో రావడం మరో విశేషం. ఆ తర్వాత పదకొండేళ్లకు ఆగస్ట్ 1985లో సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి చంద్రమౌళి గారితో డాక్టర్ ఏ. పి. రంగారావు ద్వారా పరిచయం కావడం వల్ల, కొన్నాళ్లకు గవర్నర్ కుముద్ బెన్ జోషి అధ్యక్షత నున్న "చేతన గ్రామీణాభివృద్ధి స్వచ్చంద సంస్థ” లో ప్రాజెక్ట్ అధికారిగా చేరడం (మొదలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) జరిగింది. బీ.హెచ్.ఇ.ఎల్. హయ్యర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి. వై. పద్మావతి గారి దగ్గర క్రమశిక్షణను, ఇంగ్లీష్ భాషను (కొద్దో-గొప్పో) అలవాటు చేసుకుంటే, రాజ్ భవన్ లో పనిచేస్తున్న రోజుల్లో అధికార-అధికారేతర, రాజకీయేతర-రాజకీయాలకు చెందిన అనేక మందితో పరిచయాలయ్యాయి. ఈ నాటికీ ఆ పరిచయాలు కొనసాగుతూ, జీవితంలో ఎదుగుదలకు-నేను పనిచేస్తున్న సంస్థలకు నా ద్వారా లాభం చేకూరేందుకు ఎంతగానో పనికొచ్చాయి.
మూడేళ్ల తర్వాత ఆగస్ట్-సెప్టెంబర్ 1988లో, పాత్రికేయ మిత్రుడు పర్సా వెంకట్ ద్వారా, స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారితో మొదటి సారి పరిచయమయింది. ఆ పరిచయంతో ఆయనకు దగ్గరై, రెండోసారి ఆయన 1989లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయనకు పౌర సంబంధాల అధికారిగా పనిచేశాను. అయితే ఆయన అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత దాదాపు జులై-ఆగస్ట్ 1990నుంచి ఆయనకు దూరమవుతూ వచ్చి, ఆర్నెల్ల తర్వాత (రాజ్ భవన్) ఉద్యోగం కోల్పోయి, తిరిగి ఆగస్ట్ 1991లో హస్తకళల అభివృద్ధి సంస్థలో ఉద్యోగంలో చేరాను. నాలుగేళ్ల తర్వాత సెప్టెంబర్ 1995 మొదటి వారంలో (అప్పటి ఐ. ఓ.ఏ) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఫాకల్టీ మెంబర్ గా చేరాను డిప్యుటేషన్ మీద. అప్పటికి రెండు-మూడు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. జులై 1999లో మొట్ట మొదటి సారి నేను-శ్రీమతి కలిసి సిన్సినాటిలో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వెళ్లేందుకు అమెరికా ప్రయాణం అయ్యాం. వచ్చిన వెంటనే మొదటిసారి తానా మహాసభలను చూశాం. నా పుట్టిన తేదీకి నాలుగు రోజుల ముందు, ఆగస్ట్ 4, 1999న "ఫస్ట్ గ్రాండ్ చైల్డ్"-మనుమడు యష్విన్ పుట్టాడు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏడు సంవత్సరాల డిప్యుటేషన్ పూర్తయిన తర్వాత, నిబంధనలు ఒప్పుకోనందున జులై 31, 2002న రిలీవ్ అయి, మాతృ సంస్థ హస్తకళల అభివృద్ధి సంస్థలో చేరి, మర్నాడు ఆగస్ట్ 1, 2002న స్వచ్చంద పదవీ విరమణ చేశా నక్కడ. అక్కడ రిలీవ్ అయ్యి, అయిదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిపై, తిరిగి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో, అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉద్యోగంలో చేరాను ఒక రోజు తర్వాత. అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే, సెప్టెంబర్ 3, 2002న ఇంకో మనుమడు, అన్ష్ పుట్టాడు. వాడు పుట్టిన కొద్ది రోజులకే యు. ఎన్. డి. పి ప్రాజెక్ట్ కింద నాకు ఇంగ్లాండ్ దేశంలోని “థేమ్స్ వాలీ యూనివర్సిటీలో” మూడు వారాల శిక్షణకు వెళ్లే అవకాశం దొరికింది.
అంతా బాగుందనుకుంటున్నప్పుడే 2004లో ఎన్నికలు జరగడం, కోరుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. నాకింకా అప్పటికి మరో మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ వుంది. ఏప్రియల్ 2003లో మనుమరాలు మేధ పుట్టినప్పుడు అమెరికా వెళ్లిన సందర్భంగా రాసిన "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-సుందరకాండ మందర మకరందం" ప్రధమ ముద్రణ పుస్తకాన్ని(బాపు బొమ్మ కవర్ పేజీతో) ఆగస్ట్ 8, 2004న ఆవిష్కరించడం జరిగింది. అయినా అనుకున్నదొకటి-అయిందొకటి. అనతికాలంలోనే, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిటైర్‌మెంట్ వయసు కంటె ఏడాది ముందరే ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాను ఆగస్ట్ 31, 2004న. ఎంత ప్రయత్నం చేసినా ఆ ఉద్యోగం తిరిగి సంపాదించలేకపోయాను. ఏడాది తర్వాత ఆగస్ట్ నెలలోనే "సెంటర్ ఫర్ మీడియా స్టడీస్" హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లు అక్కడ పనిచేసింతర్వాత, 108-అత్యవసర సహాయ సేవలను అందించే ఈ. ఎం. ఆర్. ఐ సంస్థలో చేరి, మూడున్నర సంవత్సరాల తర్వాత ఆగస్ట్ నెల ప్రారంభం కావడానికి ఒకరోజు ముందర 31-07-2009న ఉద్యోగాన్ని వదిలేసి, విరామం కొరకు అమెరికాకు ప్రయాణం కట్టాను. సెప్టెంబర్ 22న శాన్ ఫ్రాన్ సిస్కో చేరుకున్నాను శ్రీమతితో కలిసి కొడుకు ఆదిత్య-కోడలు పారుల్ దగ్గరకు. వీరి వివాహం ఆగస్ట్ 20, 2008న జరిగింది. అంతకు ముందు “08-08-08”న మా షష్టి పూర్తి జరుపుకున్నాం.
అమెరికా ప్రయాణానికి ముందు నెలలో ఆగస్ట్ 8, 2009న "సుందర కాండ మందర మకరందం" ద్వితీయ ముద్రణ పుస్తకావిష్కరణ ఎప్పటిలాగే, బంధువుల-స్నేహితుల మధ్య మా ఇంటిలో ఆరుబయట జరుపుకున్నాం. ప్రధమ ముద్రణ-ద్వితీయ ముద్రణ పుస్తకాన్ని డాక్టర్. రంగారావు గారే ఆవిష్కరించారు. మొదటి ముద్రణ ఆవిష్కరణకు, సీనియర్ ఐ. ఏ. ఎస్ అధికారి, అప్పటి రాష్ట్ర సమాచార-పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. వి. రమణాచారి, పొరుగునున్న చిలకపాటి విజయ రాఘవాచార్యులు రాగా, రెండవ ముద్రణ ఆవిష్కరణకు వచ్చినవారిలో సినీ కళాకారుడు తనికెళ్ల భరణి, సూర్య పత్రిక సంపాదకులు హరినాథ్, రామ భక్తుడు సీతారామయ్య, రావులపాటి-భండారు-రాంపా కుటుంబాలున్నాయి.
No comments:
Post a Comment