ఆంధ్ర వాల్మీకి- కవి సార్వభౌమ
శ్రీ వావిలి కొలను సుబ్బారావు- వాసుదాస స్వామి
రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం
అయోధ్యా కాండ - ఛందో ప్రయోగాలు-- వనం జ్వాలా నరసింహా రావు
దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకొని అందరినీ సంప్రదించి వారి సమ్మతిని పోందాడు. తనకు కలిగిన అభిప్రాయాన్ని రాముడికి తెలియచేస్తూ, అతడికి పుట్టుకతోనే వినయం-సుగుణాలు వచ్చాయని, అతనికి సమానులైన వారు మనుష్యులలో ఎవరూ లేరని అంటూ దశరథుడన్న మరికొన్ని విషయాలను చెప్పేందుకు "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకుంటారు వాసు దాసుగారు. ఆ పద్యమిలా సాగింది:
మత్తకోకిలము: నీ వెరుంగని యట్టినీత్యవి నీతు లున్న వె యెందునే ?
నేవి క్రొత్తగ నీకు నేర్పఁ గ నేను నేర్తుఁ గుమారకా !
భావితాదృతిఁ జేసి పుత్రక వత్సలత్వము పేర్మి నే
నేవియో యొకకొన్నిటిన్ వచి యించెద న్విను నందనా ! -18
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: కుమారా ! నీకు తెలియని నీతులు-అవినీతులు లేవు. నేను నీకు కొత్తగా ఏం నేర్పగలను? అయినా నీవు నా కొడుకువు కనుక, పుత్రవాత్సల్యం వల్ల కలిగిన ఆదరణతో, తండ్రులు కొడుకులకు హితోపదేశం చేయడం ధర్మం కనుక ఏవో కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. నువ్వు నా కొడుకువు కావడంవల్ల నన్ను సంతోషపర్చడం నీకు తగిన కార్యం. తండ్రి బతికున్నంతవరకు ఆయన చెప్పినట్లు నడుచుకొనేవాడినే పుత్రుడంటారు. కాబట్టి నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే సంతోషిస్తాను. అలా అయితే నన్ను ఏమి చేయమందువా?
శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుంటాయి. ఆ సంబరం చూద్దామనుకుంటున్న అయోధ్యా పురజనులు గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటారు. జనులలా గుంపులుగా గూడిన విధానాన్ని వర్ణించిన తర్వాత, ఆ వివరాలన్నీ గురువర్యుడైన వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని, ఆయన అనుమతితో తన ఇంటికి పోతున్న వైనాన్ని వర్ణిస్తూ "మానిని" వృత్తంలో రాసారీ పద్యాన్ని కవి ఇలా:
మానిని: వారల నెల్లరఁ బోవఁ గఁ బంచి నృపాలుఁ డు సింహము శైలగుహన్
జేరెడిరీతి సమగ్ర్యసువేషవి శేషవధూజనతాకులజం
భారినిశాంతమనోహరరాజగృ హంబును జొచ్చి సఋక్షగణో
దారనభంబును జందురునట్టులు దా వెలిఁ గించె స్వదీధితులన్ – 19
ఛందస్సు: 22 అక్షరాలతో, ఏడు "భ" గణాల గురువుతో, యతిస్థానంలో 7-13-19 అక్షరాలు కలిగి వుంటుంది. ప్రాస నియమం వుంది.
తాత్పర్యం: దశరథ మహారాజు (సభలోని) సభ్యుల నందరినీ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి, సింహం తన గుహలోకి పోయిన విధంగా, నానా విధాలైన నూతన అలంకారాలతో వుండి, స్త్రీ సమూహాంతో నిండిన, ఇంద్రుడి మేడలాంటి అందమైన తన గృహంలోకి ప్రవేశించి, తన (దశరథుడు) కాంతులతో, నక్షత్ర సమూహం మధ్య ఆకాశంలో వున్న చంద్రుడి లాగా ప్రకాశింప చేశాడు.
శ్రీరాముడికి దశరథుడు జరిపించదల్చుకున్న పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కైకేయి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఆమె కోరిన వరాలకు పరితపించిన దశరథుడు కైకను దూషించాడు-శ్రీరాముడి గుణాలను వర్ణించాడు-కైకను వేడుకున్నాడు. చివరకు న్యాయ నిష్ఠూరాలాడాడు. రాముడిని అడవులకు పంపి జీవించ లేనన్నాడు. ఇలా కాదనుకొని మరొక్కసారి మెత్తని మాటలతో వేడుకోవడాన్ని"తరలము" వృత్తంలో చక్కగా రాసారీవిధంగా:
తరలము: వనజలోచన ! కాననంబుల పాలుగాఁ గ సుతుండు నే
మనుటె కల్ల నిజంబు, సౌఖ్యము మాట యేటికె చెప్పగా ?
మనితిఁ బో పని యేమి నీవు ? సు మాళి నౌదునె ? విప్రియం
బును ఘటింపకు నీదు కాళ్లకు మ్రొక్కెదన్ మరి మ్రొక్కెదన్ – 20
ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం: (ముఖ ప్రీతిమాటగా "కమలముల వంటి కన్నుల దానా-వనజలోచన" అని దశరథుడితో అనిపించాడు కవి). కోపం పట్టలేక తిట్టిన దశరథుడు, తిట్టడంవలన కార్యసాధన కాదని భావించి, మెత్తటి మాటలతో చెప్తున్నాడు. కమలాక్షీ ! నా కొడుకు అడవులకు పోతే, నేను జీవించడం అసత్యం. అలాంటప్పుడు నీతో ఎలా సుఖపడతాను ? ఒకవేళ బతికినా, శోకంలో మునిగి వుండేవాడినేగాని, సంతోషంతో వుండలేనుకదా ! అప్పుడు నీతో నాకేంపని ? కాబట్టి నాకు అప్రియమైన పని చేయకు. నీ కాళ్లకు మొక్కుతాను-మరీ, మరీ మొక్కుతాను.
కైక కోరిన విధంగా శ్రీరాముడు తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చడానికి అడవులకు పోయేందుకు నిశ్చయించుకుంటాడు. తాను అడవులకు వెళ్తున్న సంగతిని తల్లి కౌసల్యకు తెలియచేస్తాడు. పట్టాభిషేకం గురించి చెప్పడానికి వచ్చాడని భావించిన కొసల్య ప్రియంగా-హితంగా ఇచ్చిన దీవెనలను అందుకున్నాడు రాముడు. మెల్లగా భయంకరమైన వార్తను తెలిపాడామెకు. భరతుడికి యౌవరాజ్యమిచ్చే విషయాన్నీ చెప్పాడు. ఆ విషయాన్ని విన్న కౌసల్య దుఃఖిస్తుంది. ఆ సమయంలో, లక్ష్మణుడు కౌసల్యతో, శ్రీరాముడు అరణ్యానికి పోరాదని చెప్పే క్రమంలో, ఆయన గుణగణాలను వర్ణించడానికి-లక్ష్మణుడితో చెప్పించడానికి "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకున్నారు వాసు దాసుగారీవిధంగా:
మత్తకోకిలము: దేవకల్పు ఋజున్ సుదాంతుని దేవి ! శత్రుల నైన స
ద్భావుఁ డై దయఁ జూచు వాని నితాంతపుణ్యునిఁ బూజ్యునిన్
భూవరుం డొకతప్పు లేక యుఁ బుత్రు నెట్టిస్వధర్మ సం
భావనం బురిఁ బాసి పొ మ్మనె ? బ్రాజ్ఞు లియ్యది మెత్తురే ? – 21
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: పరదైవంతో సమానుడై, చక్కటి నడవడిగలవాడై, ఇంద్రియ నిగ్రహం గలవాడై, శత్రువులనైన మంచి అభిప్రాయంతో దయతో చూసేవాడిని, మిక్కిలి పుణ్యవంతుడిని, ఎల్లవారికి పూజించేందుకు యోగ్యుడైనవాడిని, జ్యేష్ఠ పుత్రుడిని, ఒక్క తప్పైన చేయనివాడిని, మనుష్య మాత్రుడు-వక్రవర్తనుడు-ఇంద్రియ లోలుడు-నిష్కారణంగా భార్య కొరకై దండించేందుకు సిద్ధపడినవాడైన వాడు ఏ రాజధర్మాన్ని అనుసరించి నగరాన్ని విడిచి అడవులకు పొమ్మన్నాడు ? వివేకంగలవారు దీన్ని మెచ్చుకుంటారా ?
భాతృ భక్తితో లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్న కౌసల్య, శ్రీరాముడిని ఉద్దేశించి తమ్ముడు చెప్పిన విషయాలను గుర్తుచేసి, అతడికేది ధర్మమని తోస్తే అదే చేయమని సలహా ఇస్తుంది. అడవులకు పోవడమే మంచిదనుకుంటే అలానే చేయమని అంటూ కౌసల్య తన మనసులోని మాటలను చెప్పడానికి ఒక పద్యాన్ని"కవిరాజవిరాజితము" లోను, రెండు పద్యాలను "మత్తకోకిలము" వృత్తంలోను రాసారు కావి ఈ విధంగా:
కవిరాజవిరాజితము: మనమున నాసవతాలు వచించిన మాటను బట్టి గృహంబున న
న్న నయము దుఃఖములందు మునుంగు మ టంటయు నీకును ధర్మమొకో ?
ఘనమతి ! ధర్మము సల్పఁ గ నీయెదఁ గల్గినచోఁ బరిచర్యల నన్
దనుపఁ గ రాదొకొ, తల్లిని గొల్చుట ధర్మము గాదె తనూజులకున్ ? -22
ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము".
మత్తకోకిలము: నిండుబక్తి భజించి తల్లిని నిల్చి యింటనె మున్ను వి
ప్రుండు కాశ్యపుఁ డన్మునీశుఁ డు పొందఁ డే సురలోకమున్,
దండిగౌరవమందు రేనికిఁ దక్కు వౌనొకొ తల్లి ? నీ
వుండు మిందుఁ , బ్రవాసి వౌటకు నొల్ల నాజ్ఞనొసంగగన్ -23
మత్తకోకిలము: నిన్నుఁ బాసి వసింపఁ గల్గిన నిశ్చయం బిది పుత్రకా !
యన్న మేటికి నీర మేటికిఁ బ్రాణ మేటికి సౌఖ్య మం
చెన్న నేటికి ? నీవు గల్గిన నిన్ని యున్నటు దోఁ చుఁ గా,
తిన్న చో నునుఁ బచ్చికైన మదిం బ్రియం బొనరించురా ! -24
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: నిన్ను (రాముడిని) ఆజ్ఞాపించినవాడు తండ్రిగాడు. నాకు (కౌసల్యకు) సహజవిరోధైన నా సవతి చెప్పిన మాటను మనస్సున నిలిపి, కన్న తల్లినైన నన్ను శాశ్వత దుఃఖంలో మునగమనడం నీకు ధర్మమా ?. అర్థం నాకు పరమార్థం కాదు. ధర్మమే అంటావా, రాజ్యం లేకపోయినా నాకు శుశ్రూష చేసుకుంటూ నా ఇంట్లో వుండు. కొడుకులకు మాతృసేవ ధర్మమేకదా ! పూర్వకాలంలో, కశ్యపు వంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు, అందరిలాగా అడవులకు పోయి, ఏ తపస్సు చేయకుండా, ఇంట్లోనే వుండి, మాతృ శుశ్రూషచేసి, తపస్సుచేసి సాధించే స్వర్గసుఖాన్ని సాదించాడు. విశేష గౌరవంలో రాజుకంటే-తండ్రికంటే తల్లి తక్కువవుతుందా ? కాబట్టి నీ తండ్రి ఆజ్ఞకంటె నా ఆజ్ఞ తకువైందేమీకాదు. నువ్వింట్లోనే వుండమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వూరు విడిచి పోయేందుకు నేను అనుజ్ఞనీయను. నిన్నొదలి నేను ఇంట్లో వుండడమే జరుగుతే, ఒకటి మాత్రం నిశ్చయం కుమారా ! నాకు అన్నమెందుకు ? నీళ్లెందుకు? చివరకు ప్రాణమెందుకు ? ఇక సుఖపడడం గురించి చెప్పాల్సిన పనేలేదు. రామచంద్రా, నువ్వు నాదగ్గరుంటే, ఇవన్నీ లేకున్నా వున్నట్లే. ప్రాణం సంతోషిస్తుంది-పచ్చిక తిన్నా నాకు సంతోషమే.
అడవులకు పోవాలనుకున్న కొడుకు నిశ్చయాన్ని, తండ్రి ఆజ్ఞ శ్రీరాముడు జవదాటడనే విషయాన్ని గ్రహించిన కౌసల్య కొడుకును ఆదరించి, దయతో దీవించాలనుకుని ఆశీర్వదించే ఘట్టంలో, శ్రీరాముడితో అన్న మాటలను ఒకచోట "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలుస్తారు కవి ఇలా:
మత్తకోకిలము: దేవతాయతనంబులన్ రుచి దేఋ చైత్యములందు నీ
చే వరం బగు మ్రొక్కు లందుచుఁ జెన్ను మీరినయామహా
దేవతల్ ఋషియుక్తులై వనిఁ ద్రిమ్మరం జనుచుండు ని
న్వేవిధంబులఁ గాచుచుందురు నిర్మలం బగుసత్కృపన్ – 25
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: దేవాలయాల్లో, నాలుగు బాటలు కలిసేచోట, నీచే (రాముడు) మొక్కులుగొంటున్న ఆ మహాదేవతలు, ఋషులతో సహా, అడవిలో తిరుగుతుండే నిన్ను వేయివిధాలుగా రక్షించుదురుగాక.
ఎట్టకేలకు శ్రీరాముడు అడవులకు పోవడానికి సమ్మతించాడు దశరథుడు. కొడుకుకు మేలుకలగాలని, శీఘ్రంగా తిరిగిరావాలని ఆశీర్వదించాడు. అయితే ఒక్క రాత్రి తనతో గడిపి అడవికి పొమ్మని కోరాడు. ఒక్కపూటైనా శ్రీరాముడితో హాయిగా గడపాలని వుందంటాడు. శ్రీరాముడు మరోసారి తన మనో నిశ్చయాన్ని తెలియచేశాడు తండ్రికి. ఆయన ప్రమాణం వ్యర్థం కాకుండా సార్థకమయ్యేవిధంగా తనను అడవికి పోనిమ్మని వేడుకుంటాడు. భరతుడికి రాజ్యభారం అప్పగించమని కోరాడు. అయోధ్యలో ఇంకేమాత్రం వుండి జాగుచేయ దల్చుకోలేదంటాడు. తనకొరకు తండ్రి క్రూరమైన నిట్టూర్పులు విడవొద్దంటాడు. ఇక్కడొక పద్యాన్ని "ఇంద్రవంశము" వృత్తంలో రాసారు కవి.
ఇంద్రవంశము: ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్ – 26
ఛందస్సు: ఇంద్రవంశ వృత్తానికి ద-త-జ-ర గణాలు తొమ్మిదో అక్షరం యతి.
తాత్పర్యం: బుద్ధిమంతులు మెచ్చే నీ (దశరథుడి) ఆజ్ఞను నియమంతో, వ్రతంగా బూని నెరవేర్చే నేను, ఈ శ్రేష్ఠమైన భోగాలను కోరను సుమా ! రాజా, ఎందుకు నాకోసం వ్యసనపడతావు ?
ఎవరెన్ని మాటలు చెప్పినా గౌరవంగా అవన్నీ తిరస్కరించి, అరణ్యవాసం చేయడానికి సిద్ధమౌతున్న సీతారామ లక్ష్మణులకు నారచీరెలిచ్చి కట్టుకోమంటుంది కైకేయి. ఆమె ఇచ్చిన నారచీరెలను సంతోషంతో రామ లక్ష్మణులిద్దరూ కట్టుకుంటారు మొదట. పట్టు వస్త్రాలను కట్టుకొని వున్న సీత వాటిని తీసుకొని ఎగా-దిగా చేతిలో పెట్టుకొని చూస్తూ, అవెలా కట్టుకోవాలోనని ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలో సీత నారచీరెలు కట్టకూడదని వశిష్ఠుడు నిషేదిస్తాడు. కైకను దుర్భాషలాడుతాడాయన కొంతసేపు. ఆమె నారచీరెలు కట్టరాదనీ, శ్రీరాముడికి బదులుగా మగడెక్కవలసిన సింహాసనాన్ని అధిష్టించాలనీ సూచిస్తాడు. సీత దానికొప్పుకోకుండా మగనివెంట అడవులకు పోవడానికే సిద్ధమౌతే, యావత్తు అయోధ్యా నగరమే శ్రీరాముడి వెంట పోతుందని అంటాడు వశిష్ఠుడు. చివరకు కైక కొడుకు భరతుడు కూడా వెళ్తాడని అంటాడు. ఇవేమీ పట్టించుకోకుండా సీత సంతోషంగా నారచీరెలు ధరిస్తుంది. అందరూ అది చూసి దశరథుడిని ఈసడించుకుంటుంటే, కైకనుద్దేశించి ఆయన అన్న మాటలను "మత్తకోకిలము" వృత్తాల్లో రెండు పద్యాలుగా రాసారు వాసు దాసుగారిలా:
మత్తకోకిలము: భూపచంద్రముపుత్రి యై ధరఁ బుట్టి సాధుచరిత్ర యై
పాపమెద్ది యెరుంగ నట్టిది బాల శ్త్రీమతి యేరి కే
పాపముం బచరించెనే యిటు వల్కలంబులతోడుతన్
దాపసిం బలె నెల్లరుం గనఁ దా సభాస్థలి నిల్వఁ గన్ ! -27
మత్తకోకిలము: చేసినాఁ డనె నీకు బాసను సీత నారలతో వనీ
వాసముం బచరింప, నీగతి బంది పెట్టెద వేటికే ?
తా సుఖంబుగ సర్వరత్న వి తాన సంయుత యై చనున్,
గాసి యేటికి నొంద ? నారలు గట్ట కుండెడుఁ గావుతాత్న్- 28
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: మహారాజు కూతురై లోకంలోని వారివలె కాకుండా, భూమిలో పుట్టి, పతివ్రతై, ఏ పాపం ఎరుగని బాలశోభావతి సీత, ఈ ప్రకారం తాపసిలాగా నారచీరెలు కట్టి, అందరు చూస్తుండగా సభాప్రదేశంలో నిలబడడానికి, ఆమె చేసిన పాపం ఏంటి ? ఓసీ, సీతను నారచీరెలతో వనవాసానికి పంపుతానని నీకేమైనా నేను ప్రమాణంచేశానా ? ఎందుకిలా నిర్భందిస్తున్నావు ? యథా సుఖంగా, సమస్తాభరణాలతో పోవాల్చిందే. ఎందుకామె నిష్కారణంగా ఇబ్బందుల పాలుకావాలి ? కాబట్టి ఆమె నార చీరెలు కట్టుకోకూడదు.
శ్రీరామ లక్ష్మణులు సీతతో గూడి అడవులకు బయల్దేరుతారు. వెంట వస్తున్న పురజనుల కంటబడకుండా వారిని ఏమరిచి ఉత్తరాభిముఖంగా ప్రయాణమై పోతారు. అలా వెళ్తూ, ఉత్తర కోసలదేశాన్ని దాటి పోతారు. మార్గమధ్యంలో కనిపించిన వేదశ్రుతి నదిని, గోమతి అనే నదిని దాటుతారు. ఆ తర్వాత గంగానది కనిపిస్తుంది. గంగను వర్ణిస్తూ "లయగ్రాహి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు ఈ విధంగా:
లయగ్రాహి: అంగుగ దినేశకుల పుంగవుఁ డు మోద మలరంగను గనుంగొనె నభంగతరభంగో
త్సంగను శివాంబుచయ రంగను మహాఋషినిషంగను శుభాశ్రమచ యాంగను సురీవ్యా
సంగనుత సుందరవిహంగకుల రాజిత తరంగకజలాశయవిభంగను సరౌఘో
త్తుంగభవభీహనన చంగను నభంగురశుభాంగను దరంగముఖరంగ నలగంగన్ – 29
ఛందస్సు: లయగ్రాహికి భ-జ-స-న-భ-జ-స-న-భ-య గణాలుంటాయి. తొమ్మిదో అక్షరం ప్రాసయతి. ఇలాంటివి పాదానికి నాలుగుండాలి.
తాత్పర్యం: పెద్ద-పెద్ద అలలు గలదైన, స్వఛ్చమైన జలాలు గలదైన, మహర్షుల సంభంధం కలదైన, పుణ్య కార్యాలు చేయాల్సిన ఆశ్రమాలను తనతీరంలో కలదైన, స్నానం చేసే దేవతాస్త్రీలు గలదైన, పొగడదగిన అందమైన పక్షిజాతులతో ప్రకాశించే అలలుగల మడుగులను అక్కడక్కడా కలదైన, మనుష్య సమూహాల అతిశయమైన జనన-మరణాలనే భయాన్ని పోగట్టే సామర్థ్యం కలదైన, అధిక శుభాన్నిచ్చే అవయవాలు కలదైన గంగ అనే పేరున్న ప్రసిద్ధ నదిని శ్రీరాముడు సంతోషంతో చూసాడు.
సీతా రామలక్ష్మణులు గంగానదీ సమీపంలో మిత్రుడు గుహుడిని కలుస్తారు. సీతాదేవిని, అన్నదమ్ములను విశ్రాంతి తీసుకొమ్మని-నిదురించమని, నిద్రాభంగం కాకుండా తాను రక్షణగా వుంటానని అంటాడు గుహుడు. శ్రీరామ వనవాసంవల్ల అయోధ్యలో కలుగనున్న పరిణామాల గురించి లక్ష్మణుడు గుహుడికి చెప్పుతాడు. ఆ తర్వాత శ్రీరామ లక్ష్మణులు, సీత గంగను దాటడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ గుహుడు చేస్తాడు. తమవెంట ఇంతదూరం వచ్చిన సుమంత్రుడిని అయోధ్యకు మరలిపొమ్మంటాడు శ్రీరాముడు. భరతుడు రాజ్యమేలుతున్న రాజ్యాన్ని కైక అనుభవించాలన్నదే తన ముఖ్యాభిప్రాయంగా దశరథుడికి ప్రియమైన విధంగా తెలియచేయమని సుమంత్రుడిని కోరుతాడు రాముడు. శ్రీరామ లక్ష్మణులు జడలు ధరిస్తారు-మునుల మాదిరిగా కనిపించారప్పుడు. గంగనుదాటేందుకు నావ ఎక్కిన పిదప సీతాదేవి తమనందరిని రక్షించమని గంగను ప్రార్తిస్తుంది. నావ అవతలి ఒడ్డుకు చేరిన తదుపరి అందరు కిందకు దిగుతారు. నిజమైన అరణ్యవాసం ఇక అప్పటినుండి మొదలవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు తల్లిదండ్రులను తలచుకొని దుఃఖిస్తుంటాడు. తనను గర్భంలో ధరించిన కౌసల్య నిర్భాగ్యురాలని బాధపడ్తాడు. అలా శ్రీరాముడు బాదపడడం, ఆయన్ను తమ్ముడు లక్ష్మణుడు ఓదార్చడం జరుగుతున్న క్రమంలో నాలుగు పద్యాలను (తోటకము, తోదకము, ఉత్సాహము, మత్తకోకిలము) రాసారీవిధంగా:
తోటకము: అని పెక్కు తెరంగుల నశ్రుయుతా
ననుఁ డై విజనంపు వనంబున నా
యనఘాత్మకుఁ డేడిచి యానిశ యం
దొనరన్ మునిపోలికి నున్న యెడన్ -30
ఛందస్సు: తోటకమునకు నాలుగు "స" గణాలు 9వ యింట యతి
తోదకము: అలలు చలింపని యంబుధినామం
టల పెను పార ధనంజయు నట్టుల్
నిలిపి విలాపము నివ్వెర నుండన్
లలివచనంబుల లక్ష్మణుఁ డాడెన్ -31
ఛందస్సు: తోదకమునకు న- జ- జ- య గణాలు. పాదమునకు 12 అక్షరములుంటాయి. ప్రాస నియమం వుంది.
ఉత్సాహము: నిక్కమింత రామచంద్ర నీవు వీడి వచ్చుటన్
దిక్కుమాలి యాయయోధ్య తేజు మాసి యుండెడిన్
జుక్కరేఁ డు లేని రేయి చొప్పునన్; వ్యథామతిన్
న్రుక్కఁ దగునె నేను సీత న్రుక్కమే నినుం గనన్ -32
ఛందస్సు: ఉత్సాహమునకు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి. ఇందులో అన్నీ "హ" గణాలే అవుతే అది "సుగంధి" వృత్తం అవుతుంది. సగణ-హగణాలకు సూర్య గణాలని పేరు.
మత్తకోకిలము: నిన్నుఁ బాసి ధరాతనూజయు నేను నొక్క ముహూర్తమే
ని న్ని లం గలవారమే తమ నీటి బాసిన చేఁ పల
ట్లన్న! యాజనకాఖ్యుఁ డేటికి నంబ యేటికిఁ దమ్ముఁ డేన్
నిన్నుఁ వాసిన స్వర్గమేటికి నిక్క మియ్యది రాఘవా -33
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: తన (రాముడి) వలన తల్లికి, లోకులకు కలిగిన దుఃఖాన్ని తలచుకొని అనేకవిధాలుగా పరితపించి, కన్నీళ్లతో కూడిన కన్నులు కలవాడై, ఓదార్చేందుకు జనులెవరూలేని అడవిలో ఏ పాపం ఎరుగని శ్రీరామచంద్రుడు ఆ రాత్రంతా ఏడిచి మౌనవ్రతం పూనిన వాడివలె వుండిపోయాడు. అలలు కదలని సముద్రంలాగా, మంటలు చల్లారిన అగ్నిహోత్రం లాగా ఏడుపును ఆపుచేసి కొంచెం కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పుడు, తమ్ముడు లక్ష్మణుడు "ఉత్సాహకరమైన" మాటలు చెప్పుదామనుకుంటాడు అన్నకు. ("నిలిపి విలాపము" అనడమంటే, తనంత తానే ఉపశమించుకున్నాడని భావం. "అలలు చలింపని అంబుధి" అంటే, వాయువు ప్రేరితమైనప్పుడే అలలు ఎగిసినట్లు, దుఃఖం ప్రేరించు వారెవరూ లేనప్పుడు ఉపశమనమే దారి అని భావన. ఒక విధంగా ఈ ఉపమానం పూర్తిగా శ్రీరాముడికి అన్వయించక పోవచ్చు). ఇలా అంటున్నాడు రాముడితో: రామచంద్రా ! నీవు చెపుతున్న మాటల్లో కొంత నిజం లేకపోలేదు. నువ్వు వదిలివచ్చిన కారణాన దిక్కులేనిదైన ఆ అయోధ్య, కాంతిహీనమై, చంద్రుడు లేని రాత్రిలాగా వుంటుందనడంలో సందేహం లేదు. కాని, వనవాసానికి రాకముందు చేయాల్సిన ఆలోచన, వనవాసం చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత, ఇప్పుడు-ఇక్కడ ఆలోచించి దుఃఖపడడం తగిన పనికాదు. ముందు చేసిన కార్యం గురించి వెనుక ఆలోచించేవాడు బుద్ధిమంతుడనిపించుకోడు. వెనుక చింత వెర్రితనం లాంటిది. నువ్వు ధైర్యంగా వున్న కారణాన, ఆయనే ధైర్యంతో వుంటే మనమెందుకు దుఃఖించి ఆయనకు కష్ఠం కలిగించాలనుకొని, నీ కొరకు మేము నిబ్బరంగా వున్నాం. నువ్విలా దుఃఖపడితే, నీ కోసం మేమెంత దుఃఖపడాలో ఆలోచించు. రాఘవా ! నువ్విక్కడ దుఃఖపడుకుంటూ నన్ను వూరికి పొమ్మన్నావుగాని, నా మనస్స్థితిని ఆలోచించలేదు. నేనుగాని, సీతగాని మా సుఖం కొరకు నీ వెంట రాలేదు. సుఖపడాలనుకుంటే అయోధ్యలోనే వుండిపోయేవాళ్లం. అయోధ్య నుంచే ఆ సేవ చేసేవాళ్లం. అడవిలో వున్నా చేసేవాళ్లం. కాల దేశాలు మాకు ప్రధానం కాదు. ( ఆ తర్వాత రాముడామాటలకు సంతోషించాడు).
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి అరణ్యవాసానికి పోయిన కొన్నాళ్లకు దశరథుడు దుఃఖంతో మరణించాడు. ఆయన మరణానికి అంతఃపుర స్త్రీలు ఏడుస్తారు. రాజకీయ వ్యవహారాలు తెలిసినవారు ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చి, మృత దేహానికి చేయాల్సిన ధర్మ విధులగురించి తదుపరి చర్యలు చేపట్తారు. అంత దుఃఖంలో అంతఃపుర స్త్రీలు కైకను దుర్భాషలాడుతారు. భవిష్యత్ లో కైక పెత్తనంలో తామెలా అక్కడ వుండగలమోనని పొరలి-పొరలి ఏడుస్తుంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, కాంతిహీనమైన అయోధ్యాపురుని గురించి, అక్కడి పరిస్థితి గురించి మూడు పద్యాలు - మాలిని, కలితాంతము, మానిని వృత్తాల్లో- రాసారీవిధంగా కవి.
మాలిని: కలయఁ గ జను లెందుం గార్పఁ గన్ బాష్పవారిన్
గులతరుణులు హాహా ఘోషముల్ నించు చుండన్
లలి నలుకులు మ్రుగ్గు ల్గానరా కెట్టి యింటన్
బొలుపు దొరఁ గి యుండెం బ్రోలు గుర్తింపకుండన్ -34
ఛందస్సు: మాలిని వృత్తానికి న-న-మ-య-య గణాలు. 9 వ అక్షరం యతి.
కలితాంతము: భూమీశ్వరుఁ డేడ్చుచు బొంది విడన్
భామాజన మార్తిని వ్రాలనిలన్
శ్రీమద్రవి యస్తముఁ జేర జనెన్
భూమిం బెనుఁ జీఁ కటి పొల్పెసఁ గెన్ -35
ఛందస్సు: కలితాంతమునకు త-ట-జ-వ గణాలు. 8 వ అక్షరం యతి.
మానిని: తామరసాప్తుఁ డు లేనినభం బనఁ దారలు లేని త్రియామ యనం
గా మహితాత్ముఁ డు భూపతి లేమిని గద్గదకంఠసమాకులితా
యామమహాపథచత్వరసంఘము నై పురి యొప్ప నరుల్ సతులున్
స్తోమములై చెడఁ దిట్టుచు నుండిరి ద్రోహి మొనర్చినకై కయినిన్ -36
ఛందస్సు: మానిని వృత్తానికి ఏడు "భ" గణాలు, గురువు, 13 వ అక్షరం యతి.
తాత్పర్యం: ఎక్కడ చూసినా ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కుల స్త్రీలు హాహా కారాలు చేస్తుంటే, ఎవరి ఇంటి ముందు కూడా అందంగా అలకడం గానీ-ముగ్గులు వేయడం గానీ లేకుండా, ఇది అయోధ్యా పురమా అని గుర్తించ లేకుండా వుండి సౌందర్యం లేనిదయింది. పుడమి రాజు ఏడుస్తూ శరీరాన్ని వదిలి పెట్టగా, భార్యలందరు దుఃఖంతో నేలగూలారు. శోభాయమానంగా వుండే సూర్యుడు అస్తమించాడు. భూమంతా పెనుచీకటి వ్యాపించింది. సూర్యుడు లేని ఆకాశం-నక్షత్రాలు లేని రాత్రి అన్నట్లుగా, గొప్ప మనస్సు గల రాజు లేనందువల్ల, వ్యసనంతో డగ్గుత్తిక పడిన కంఠాల వారితో కలత చెందిన రాచ బాటలు, నాలుగు త్రోవలు కలిసే ప్రదేశాలు కనిపించాయి. స్త్రీ-పురుషులు గుంపులు-గుంపులుగా చేరి రాజద్రోహం, భర్తృ ద్రోహం, పుత్ర ద్రోహం, ప్రజా ద్రోహం చేసిన కైకేయిని నాశనమై పోవాలని నోటి కొచ్చినట్లు తిట్టారు.
దశరథుడికి ఉత్తరక్రియలు చేసిన భరతుడు, రాజకర్తలు అతడిని పట్టాభిషేకం చేసుకొమ్మని కోరినప్పటికీ, ఒప్పుకోక, అరణ్యవాసంలో వున్న శ్రీరాముడిని తీసుకొచ్చేందుకు అడవులకు ప్రయాణమైపోతాడు. పాదచారియైన భరతుడు రామాశ్రమాన్ని వెతికి, ఆయన్ను దర్శించుకుంటాడు. కుశల ప్రశ్నలనంతరం భరతుడు శ్రీరాముడికి దశరథుడు మరణించిన సంగతి తెలియచేస్తాడు. దశరథుడు మరణించిన విధానాన్ని రాముడికి చెప్పడానికి "తరలము" వృత్తంలో పద్యం రాసారు వాసు దాసుగారిలా:
తరలము: నినుఁ దలంచియ యేడ్చుచున్ మరి నీదు దర్శనకాంక్షి యై,
నినుఁ దలంగకయున్న బుద్ధిని నేర కేమియుఁ ద్రిప్పఁ గా,
ననఘ ! నీవిడనాడుటన్, భవ దార్తిపీడితుఁ డౌచు, నీ
జనకుఁ డక్కట యస్తమించెను జాల నిన్నె స్మరించుచున్ -37
ఛందస్సు: తరలమునకు స-భ-ర-స-జ-జ-గ గణాలు. 12 వ అక్షరం యతి.
తాత్పర్యం: అన్నా ! నీ తండ్రి నిన్ను తలచుకుంటూ, ఏడ్చి-ఏడ్చి, నిన్ను చూడగోరి అది లభించనందున, నీ పైనే బుద్ధి దృఢంగా నిలిపి, దానిని మరలించ లేక, నువ్వు వదిలి వచ్చిన కారణాన నీ వియోగ బాధవల్ల, కష్ట పడుతు, రామా-రామా అంటూ నిన్నే స్మరించుకుంటు అస్తమించాడు. (దశరథుడి మరణ వార్తను కైక భరతుడికి చెప్పిన విధానానికి, భరతుడు రాముడికి చెప్పిన పద్ధతికి తేడా వుంది. తండ్రి మరణానికి కారణభూతుడు రాముడేనన్న అర్థం స్ఫురిస్తుంది కూడా. ఆయన చేసిన పని సరైందికాదని భరతుడి అభిప్రాయంగా చెప్పించాడు కవి. రాముడవై లోకాన్ని సంతోషపెట్టే బదులు దుఃఖపెడుతున్నావని భావన).
అయోధ్యకొచ్చి రాజ్యమేలమన్న భరతుడి ప్రార్థనను తిరస్కరించిన శ్రీరాముడు, తనకు బదులుగా తన పాదుకలను ఇచ్చేందుకు అంగీకరించాడు. అవి తీసుకొని భరతుడు అయోధ్యకు ప్రయాణమై పోతూ, దారిలో యమునా నదిని, గంగను దాటి శృంగిబేరి పురం గుండా సాగిపోతూ, అన్న-తండ్రి లేని అయోధ్యను చూసి, సారథితో సంతోషహీనమైన అయోధ్య వున్న విధాన్ని వర్ణించడానికి "నిరానందయైన అయోధ్యాపురి వర్ణన" అన్న పేరుతో "మధురగతిరగడ" లో పద్యాన్ని రాసారు కవి ఇలా:
మధురగతిరగడ:
పిల్లలు గూబలు పెల్లవుదానిని, మల్లడిగొను కరి మనుజులదానిని
శ్రీ లరఁ జిమ్మని చీఁ క ట్లలమఁ గఁ , గాలనిశాగతిఁ , గ్రాలెడిదానిని
గ్రహపీడితశశి కాంతారీతిని, మహమరి తేజము మలిగినదానిని
నిగిరిన క్రాఁ గిన యించుకనీళ్లను, సెగలను బొగిలెడి చిరువిహగములను
విలయముఁ గాంచువి విధమత్స్యములను, సెలయే రనఁ గను జెలఁ గెడిదానిని
సవమున బంగరు చాయల మండుచు, హవిసున నణఁ గిన యగ్నిని బోలుచుఁ
జెదరినగజములు జిట్లినధ్వజములు, బదరినవాజులు బగిలిన తేరులుఁ
గలిగి విరోధులు కలఁ చిన బెగ్గిలి, కలఁ గినదం డనగా దగుదానిని
ఫేనము ధ్వానము పెల్లయి పెద్దతు, పానును గాలియు బరిశాంతముగా
స్తిమితతఁ గాంచిన సింధుతరంగము, గుమి నా మ్రోఁ తలు గూడనిదానిని
యజనాంతంబున యాజకయూథము, యజనాయుధములు నన్నియుఁ బాయగ
వీతరవం బగు వేదిని బోలుచు, వాతతజనశూన్యం బవుదానిని
దినఁ బచ్చికఁ దలదిరముగ వ్రాల్పక, పెనుగోడియచన వెతలం గొనియెడి
గోవులమందనఁ గూడినదానిని, శ్రీవిలసితమయి స్నిగ్దతరం బయి
తేజును గూడుచు దివ్యతరం బయి, రాజిలునుత్తమ రత్న శ్రేణులు
తీరఁ గ రాలినఁ దేజము దూలిన, హార మొయనఁ గొమ రారినదానిని
జలిపినపుణ్యము క్షయ మయి పోవఁ గ, నిలఁ బడు చుక్కను నెనసినదానిని
బంభర కోటులఁ బలుసూనంబుల, సంభరిత మయి వసంతముకడపలఁ
గారున నగ్గికి గమరినతీఁ గల, తీరునఁ గాంతులు దీరిన దానిని
బేరము సారము పేరును లేమిని, ద్వారము తెరవని పణ్యస్థలమై
మరుఁ గఁ గఁ జుక్కలు మబ్బున శశితో, నెరిమాసినయా నిశ నగుదానిని
నుత్తకడవలును నుత్తపిడుతలును, గత్తరఁ గెడసిన కలుమందిరమున
దొరలెడికుండలుఁ దూలెడి గోడలు, జరుగుచుఁ బాడరు చలిపందిలి యన
వీరుని బెడిదపు వింటను నెక్కిడ, నారసమో యన నరకఁ గ వైరులు
బిగి చెడి నేలను వ్రీలినజ్యాలత, వగ వగ చెడి జిగి పాసినదానిని
నాహవశూరుం డశ్వవిభాండస, మూహంబులచేఁ బొలుపుగఁ దీర్చియుఁ
గలనికి నుపయోగము గా కుండుట, తొలఁ చు కిశోరము తోఁ బో ల్దానిని
గఛ్చపమత్స్యని కాయములొప్పఁ గ, నఛ్చం బయి శుష్కాంబుక మగుచును
గూలము దొరలగ గువలము వెడలఁ గ, హాళి చెడినకూ పాళిని బోలుచు
వగపునఁ జిర్చా భరణ విహీనుని, జిగిచెడు మే ననఁ జెలఁ గిన దానిని
జడికారున బహు జలధరసంతతి, విడువక క్రమ్మ ర విప్రభ నాఁ గను
నొప్పుచు నున్నయయోధ్యనుగనుగొని, యప్పుడు భరతుండలమటఁ జొచ్చెను -38
ఈ విధంగా సీతారామలక్ష్మణులు లేని అయోధ్యా నగరం స్థితి వర్ణించబడింది.
ఛందస్సు: నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నలి విరమణలు
గలసి మధురగతి కనలును జగణము, తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము
అయోధ్యా కాండాంతంలో రెండు పద్యాలను "వనమంజరి" లోను, "కమల విలసితము" లోను రాసారు కవి. మొదటి పద్యంలో రాముడిని స్తుతిస్తూ రాయగా, రెండవ పద్యంలో కాండలో వున్న పద్యాల సంఖ్య 2604 అనే అర్థం స్ఫురించే విధంగా రాసారు.
వనమంజరి: గురుజనవాక్య సమాచరణాసమ కోపకామవిహీనధీ
పరమకృపాశ్రయ నిశ్చలచిత్తక భ్రాతృవత్సల కామదా
విరహిత దుఃఖసుఖాంతరచేతన విశ్వసన్నుత భూధవా
నిరుపమదర్మవిధాయి దయామయ నిత్యహర్ష గుణోజ్జ్వలా -39
ఛందస్సు: వనమంజరికి న-జ-జ-జ భ-ర గణాలు. 14 వ అక్షరం యతి.
తాత్పర్యం: తండ్రి వాక్యాన్ని పరిపాలించడంలో అసమానమైన వాడు-కీడుచేసిన వాడిమీదకూడా కోపంగాని, కామంగాని లేని బుద్ధిగలవాడు-ఉత్తమమైన దయకు నిలువనీడైనవాడు-ఎంత విపత్తు వచ్చినా, సంపత్తు వచ్చినా చలించని మనస్సుగలవాడు-సోదర ప్రీతికలవాడు-కోరినవారి కోర్కెలను తీర్చువాడు-ఇది సుఖమని, దుఃఖమని అంతఃకరణలో లేనివాడు-సమస్త ప్రపంచం పొగిడేవాడు-భూమికి భర్తైన వాడు-అసమానమైన ధర్మాన్ని అనుష్టానంతో విధించువాడు-దయాస్వరూపుడు-ఎప్పటికీ సంతోషమే కలవాడు-సౌశీల్య, సౌలభ్య కృతజ్ఞతాది కల్యాణగుణాలతో ప్రకాశించేవాడు శ్రీరాముడని అర్థం.
కమల విలసితము: భువనదిఖరజ ముఖనయనాంక
ప్రవిదితపురకృత ప్రథితచరిత్రా
దివిజమనుజనుత స్థిరతరచిత్తా
ధవవర భవహర దశరథపుత్రా -40
ఛందస్సు: కమల విలసితమునకు న-న-న-న-గ- గ గణాలు.
తాత్పర్యం: భువనధికి అర్థం సముద్రం-ఇది నాలుగవ (4) అంకెను సూచిస్తుంది. "ఖ" అంటే ఆకాశం-ఇది సున్నాను (0) సూచిస్తుంది. శరజముఖకు అర్థం కుమారస్వామి ముఖాలని-ఇది ఆరవ అంకెను (6) సూచిస్తుంది. నయనకు అర్థం కళ్లు-ఇది రెండు అంకెను (2) ను సూచిస్తుంది. ఇవన్నీ కలిపితే 4062 అని ఏర్పడుతుంది. దీన్ని తిప్పి చదివితే 2604 వస్తుంది. అయోధ్యా కాండలో 2604 పద్యాలున్నాయి.
అయాం ఎ బిగ్ జీరో (51) - భండారు శ్రీనివాసరావు
14 hours ago
వనమంజరికి న-జ-జ-జ-జ-భ-ర గణాలు ఉంటాయి. జ గణాలు 4 ఉంటాయి, 3 కాదు . సరిచేయగలరు. ఈ క్రిందనిచ్చినది చూడగలరు.
ReplyDeleteవనమంజరి (న, జ, జ, జ, జ, భ, ర)13(ప్రకృతిచ్ఛందం) పాదమునకు 21 అక్షరములు. ప్రాస నియమం కలదు.
తనర న జా జ జ భా గ్భకారయుత త్రయోదశయుగ్యతిన్
వినుత మగు న్వనమంజరినాఁ దగువృత్త మింపెసలారఁగన్.
ఇక్కడ యతి 13 అన్నారు. కాని వాసుదాసుగారి పద్యంలో 13 వఅక్షరమే యతిస్థానంగా వుంది.
కమలవిలసితమునకు యతి 9వ అక్షరము.
వాసుదాసుగారి పద్యంలో 14 వ అక్షరమే యతి స్థానంగా వుంది. -అని చదువుకోగలరు.
ReplyDeleteదయచేసి వర్డ్ వెరిఫికేషన్ను తీసివేయగలరు.
కృతజ్ఞతలు. మీ సూచనను పొందుపరుస్తాను.
ReplyDeleteజ్వాలా నరసింహారావు వనం
వర్డ్ వెరిఫికేషన్ను meens what?
ReplyDeleteఅది మీ బ్లాగు కామెంట్లకు డిఫాల్టుగా వుంది. దానిని తీసివేయాలంటే మీ బ్లాగు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కామెంట్సులోనికి వెళ్ళి అక్కడ enable word verification ను no అనేదానిని click చేయండి. అలా చేస్తే మీ బ్లాగులో కామెంటు పెట్టాలనుకునేవారికి ప్రతీసారీ word verification చేయాల్సిన బాధ తప్పుతుంది.
ReplyDelete