శ్రీ వావిలి కొలను సుబ్బారావు- వాసుదాస స్వామి
రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం
అరణ్య కాండ-- ఛందో ప్రయోగాలు-- వనం జ్వాలా నరసింహా రావు
శ్రీ సీతా రామలక్ష్మణులు అరణ్యవాసం కొనసాగిస్తున్న తొలినాళ్లలో, అడవిలో పోతున్నప్పుడు పర్వత శిఖరంలా పొడవైన దేహమున్న భయంకరాకారుడైన ఒక క్రూరుడిని చూశాడు రామచంద్రమూర్తి. విరాధుడనే వాడు, సీతా రామలక్ష్మణులను చూసి కోపంతో వారిమీద పడి సీతను చంకలో పెట్టుకొని, తన పేరు వారికిచెప్పి, "పాపాత్ములైన వారిని" చంపి, ఆమెను పెళ్లిచేసుకుంటానని బెదిరించాడు. భయపడుతున్న సీతాదేవిని చూసిన రాముడు ఆమెకెంత ఆపదొచ్చిందో చూడమని తమ్ముడు లక్ష్మణుడితో అంటాడు. స్పష్ఠమైన తన భుజబలంతో వాడిని చంపుతానని అన్నతో అంటూ లక్ష్మణుడు, విరాధుడిని, వాడెవడని, వాడి పుట్టు పూర్వోత్తరాలేంటని అడుగుతాడు. విరాధుడిచ్చిన జవాబును "వసంతమంజరి" లో పద్యంగా రాసారు వాసు దాసుగారు ఈ విధంగా:
వసంతమంజరి: వినుము నా జనకుండు జయుఁ డను వీరుఁ డంబ శతహ్రదా
ఖ్య నిఖిలావనిఁ గల్గుదనుజని కాయ మెల్ల విరాధుఁ డం
చును వచించును నన్నుఁ దపమున సూర్యవంశ్య ! వరంబునేఁ
గొనితి శస్త్రముచేత మరణముఁ గూర కుండఁ గ బ్రహ్మచేన్ -41
తాత్పర్యం: నా తండ్రి జయుడు. నా తల్లి శతహ్రద. భూమిపైనున్న తనుజులందరు నన్ను విరాధుడని పిలుస్తారు. నేను తపస్సుచేసి శస్త్రంతో చావులేకుండా బ్రహ్మ వరం పొందాను. (ఆ తర్వాత విరాధుడు రామలక్ష్మణుల చేతిలో చస్తాడు).
ఛందస్సు: వసంతమంజరికి న-భ-భ-న-ర-స-వ గణాలు. పదమూడో అక్షరం యతి స్థానం.
విరాధుడిని వధించిన తర్వాత సీతా రామలక్ష్మణులు శరభంగాశ్రమానికి పోతారు. అరణ్యవాసంలో తాము నివసించుటకు నివాసయోగ్యమైన స్థలమేదో సూచించమని రాముడు కోరగా, శరభంగుడు వారుండుటకు తగిన స్థలం సుతీక్ష్ణుడను మునీంద్రుడు తెలియచేస్తాడని అక్కడికి పొమ్మని చెప్పి తన దేహం వదిలినతర్వాతే అక్కడనుండి వెళ్లమని ప్రార్తించాడు. అక్కడున్న మునులందరూ తమకష్టాలను చెప్పి తమను కాపాడమని కోరడంతో వారికి రాముడు అభయ హస్తమిచ్చిన తర్వాత, బయలుదేరి సుతీక్ష్ణాశ్రమానికి చేరుకుంటారు ముగ్గురూ. ఆ రాత్రి అక్కడే గడుపుతారు వారందరూ. ఆయన సలహామేరకు పంచవటికి ప్రయాణమైపోతుంటారు. బయల్దేరేముందర దాచిపెట్టిన ఆయుధాలను రామలక్ష్మణులకు అందచేస్తుంది సీత. దారిలో సీతాదేవి శ్రీరాముడికి వెంటవస్తున్న లక్ష్మణుడు వింటుండగానే రాబోయేకాలంలో సంభవించనున్న పరణామాలను గ్రహించినదానివలె కొన్ని హితబోధలు చేస్తుంది. ఆ క్రమంలోనే సీత రాముడికి శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెపుతుంది. శస్త్రాన్ని ధరించినట్లైతే దాన్ని ఉపయోగించాలన్న కోరిక పుటుతుందనీ, కాబట్టి అడవుల్లో వాటిని ధరించవద్దనీ, అయోధ్యకు చేరిన తర్వాత ధర్మ రక్షణార్థం శస్త్రం ధరించవచ్చనీ హితబోధచేస్తుంది. ఇక్కడ "మంజుభాషిణి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు కవి ఈ విధంగా:
మంజుభాషిణి: సిరిఁ యున్ ధరన్ విడిచి చేరి కానలన్
జరియించునీ విపుడు సం యమింబలెన్
దిరుగం దపోనియతి దేవ మోదముం
బరఁ గించు నత్తకును మామగారికిన్ -42
ఛందస్సు: మంజు భాషిణీ వృత్తానికి స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి. సీత "మంజు భాషిణి" అయినందున ఇక్కడ "మంజుభాషిణి" వృత్తంలో పద్యం రాయడం సమంజసమే అంటారు వాసు దాసుగారు.
తాత్పర్యం: అనుభవించాల్సిన ఐశ్వర్యం, పాలించాల్సిన భూమి వదిలిపెట్టి, మునిలాగా అడవులకు చేరిన నువ్వు మునుల్లాగానే తపస్సు చేస్తుంటే రాముడు యదార్థ వాది - తనతో చెప్పినట్లే చేస్తున్నాడని కైక సంతోషిస్తుంది. తన కొడుకు విశేష శ్రమ పడకుండా సుఖంగా వున్నాడని కౌసల్య కూడా సంతోషిస్తుంది. వీరే కాకుండా స్వర్గంలోని మామగారు తన కొడుకు తనను సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తాడు. కావున అలానే చేయి.
సీత హితోపదేశాన్ని విన్న రాముడు ఆర్త రక్షణే పరమ ధర్మమని అంటాడు. అడవుల్లో తపస్సు చేసుకుంటున్న మునుల రక్షణ కూడా ధర్మ రక్షణార్థమేనంటాడు. మునులను కాపాడుతానని ప్రతిజ్ఞ చేసానని, బ్రాహ్మణులకిచ్చిన మాటతప్పి తన ప్రతిజ్ఞ విడువనని సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలనైనా, భార్యనైనా, తమ్ముడినైనా విడుస్తానని స్పష్ఠంగా తెలియచేశాడు సీతకు. ఇలా చెప్పుకుంటూ ముగ్గురూ పయనమై పోతుంటారు. వాళ్లలా పోవడాన్ని ప్రణవ స్వరూపం-ప్రణవార్థం వచ్చే విధంగా తేటగీతిలో రాసిన పద్యం ఇలా సాగుతుంది: "అగ్రవర్తియై శ్రీరాముడరుగుచుండె, నువిదతనుమధ్యమధ్యమందుండెసీత, మహిత కోదండదండసంభరణహస్తు, డోలి వెన్నంటె లక్ష్మణుడొప్పుప్రేమ". మొదటిపాదం మొదటి అక్షరం "అ" కారం, రెండవ పాదం మొదటి అక్షరం "ఉ" కారం, మూడోపాదం మొదటి అక్షరం "మ" కారం వున్నాయి. మూడు కలిసి "ఓం" అయిందని, అలానే నాలుగోపాదం మొదటి-కడపటి అక్షరం కలిసి "ఓం" అయిందని కవి వివరించారు. ఈ విధంగా ఈ పద్యం ప్రణవ స్వరూపమని అంటారాయన. ఈ ప్రణవార్థం పరమార్థ తత్త్వాన్ని విపులంగా చూపిస్తుంది. ఇక్కడ "మానిని" వృత్తంలో , అక్కడి పరిసరాలను వర్ణిస్తూ, ఒక పద్యాన్ని రాసారు వాసు దాసుగారిలా:
మానిని: సారము లౌనవసారసకై రవ సౌరభవాసితభాసితకా
సారములుం దటినీతటసై కత సంచరదంచితచక్రయుగీ
వారములున్ గిరిసుందరకందర పాతసుపూతఝరీలహరీ
పూరములున్ సుమమంజులకుంజక పుంజితగుంజదళీంద్రములున్ -43
ఛందస్సు: మానిని వృత్తానికి సప్త "భ" గణాలుంటాయి. ఒక గురువు. 13 వ అక్షరం యతి.
తాత్పర్యం: సారవంతాలై కొత్తగా వికసించిన కమలాల కలువల పరిమళాల గుంపులతో ప్రకాశించే కొలకులతో, నదీతీరంలోని ఇసుక దిబ్బల్లో తిరిగే అందమైన చక్రవాక దంపతుల సమూహాలతో, కొండల్లోని సుందరమైన గుహల్లో పడుతున్న నీళ్లున్న పవిత్రమైన కొండవంకల ప్రవాహాలనే పూలతో, అందమైన పొదల్లోని గుంపుల తుమ్మెదలతో (నిండిన ప్రదేశం).
అగస్త్యాశ్రమానికి పోవడానికి సుతీక్ష్ణుడి అనుమతి తీసుకొంటాడు శ్రీరాముడు. తానే వారిని అక్కడికి పొమ్మమనమని చెప్పదల్చుకున్నానని, దక్షిణంగా నాలుగు యోజనాలు వెళ్తే అగస్త్యుడి సోదరుడి ఆశ్రమం వస్తుందని, అక్కడినుంచి మరో ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం వుంటుందని అంటాడాయన. అలా ఆయన ఆజ్ఞ తీసుకొని పోతున్న సందర్భాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:
తరలము: ముని వచించినత్రోవచొప్పున మువ్వురున్ వనిఁ బోవుచున్
గనిరి త్రోవల క్రేవలన్ ఘన కంధరాకృతబంధురం
బును ధరప్రచయంబునున్ సుమ పూర్ణరమ్యవనంబులన్
గొనబుమీరినవంకలం దమి గూర్చు మేలికొలంకులన్ -44
ఛందస్సు: తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం: సుతీక్ష్ణ మహాముని చెప్పిన తోవ పట్టుకొని అడవిలో ముగ్గురు బయలుదేరి పోతూ, మార్గ మధ్యంలో, ఇరుపక్కల కారుమబ్బులాగా విస్తారమైన కొండలగుంపును, పూలతో నిండిన మనోహరమైన వనాలను, అందమైన వంకలను, సంతోషం కలిగించే సరస్సులను చూసారు.
సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి చేరుకొని, ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయన ఇచ్చిన వైష్ణవాయుధాలను తీసుకొంటాడు రాముడు. అక్కడికి రెండామడల దూరంలో "పంచవటి" అనే సుఖప్రదమైన ప్రదేశం వుందని, అక్కడొక ఆశ్రమం నిర్మించుకొని, అరణ్యవాసాన్ని పూర్తిచేసి, తండ్రి వాక్యాన్ని పాలించమని సలహా ఇస్తాడు. పంచవటికి పోయే మార్గాన్నికూడా వివరంగా చెప్తాడు. ఆయన చెప్పిన మార్గంలో పోతుంటారు వాళ్లు. దారిలో జటాయువును చూస్తారు. అక్కడినుండి బయల్దేరి "పంచవటి" చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ ప్రదేశంలోని చెట్లను రాముడిద్వారా వర్ణించడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలిచారిలా కవి:
మత్తకోకిలము: సాలతాలత మాలతుంగర సాలజాల మధూకకు
ద్దాల వంజుల నక్తమాలవి తానసిందుక చందనో
ద్దాలచంపకపారిజాతక దంబనింబకపిత్థత
క్కోలకేసరజంభకింశుక కూటపాటలకోటులన్ -45
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: మద్దిచెట్లు, తాటిచెట్లు, చీకటి మ్రాకులు, తియ్య మామిడిచెట్లు, ఇప్ప, కాంచన చెట్లు, అశోక, కానుగు, సిందుక చెట్లు, సంపంగి, పారిజాత, వేప, వెలగ, పొన్న, నిమ్మ, మోదుగు.. .. చెట్ల సమూహాలతో కూడిన ప్రదేశం.
లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాల నిర్మిస్తాడు. అందులో వారు ముగ్గురు మిక్కిలి సుఖంగా నివసిస్తుంటారు. వనవాసం చేద్దామని రాముడు సంకల్పించుకున్న పద్నాలుగు సంవత్సరాలలో పదమూడో సంవత్సరం జరుగుతుంటుంది. ఆ సంవత్సరపు మార్గశిర మాసంలో ఒకనాడు, గోదావరి స్నానం చేసి వచ్చి, పర్ణశాలలో ముగ్గురూ ముచ్చటించు కుంటుంటారు. ఆ సమయంలో శ్రీరాముడిని చూసిన శూర్ఫణఖ ఆశ్రమంలో కొస్తుంది. రాముడిని మోహిస్తుంది. తన కోర్కెను వెల్లడిస్తుంది. పరిహాసంతో రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూపించి ఆయన దగ్గరకు పొమ్మంటాడు. ఆమె లక్ష్మణుడి వెంట బడుతుంది. లక్ష్మణుడు తనకంటే రాముడే తగినవాడని అక్కడకు పంపుతాడు. రాముడి వద్దకు పోయిన శూర్ఫణఖ సీతను మింగుతానని భయపెడుతూ ఆమె మీదకు పోతుంటే, ఒక పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:
తరలము: అని కురంగకిశోరలోచన నాయలాతనిభాక్షి హు
మ్మనుచు రోహిణిమీఁ ద బారు మహత్తరోల్క యనంగ రాఁ
గని మహాబలశాలి రాముఁ డు గ్రక్కునం బిగఁ బట్టి కిం
కను సుమిత్రతనూజుతో ననుఁ గంటె లక్ష్మణ రక్కసిన్ -46
ఛందస్సు: తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం: ఈ ప్రకారం చెప్పి, జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతపై, కొరివితో సమానమైన కళ్లున్న శూర్ఫణఖ రోహిణిమీదకు కొరివి నక్షత్రం పోయినట్లు పోవడం చూసిన శ్రీరాముడు దాన్ని బిగబట్టి కోపంతో లక్ష్మణుడి తో ఇలా అంటాడు.
నీచులతో పరిహాసాలాడడం తప్పనీ, శూర్ఫణఖను సరైన రీతిలో శిక్షించాలనీ, దానిని విరూపనుగా చేయమనీ లక్ష్మణుడిని ఆదేశించాడు రాముడు. లక్ష్మణుడు ఆమె ముక్కు-చెవులు తెగగోసి వికార రూపంగా చేశాడు. ఆ వికృత రూపాన్ని చూసిన దాని తమ్ముడు ఖరుడు కోపగించుకుంటాడు. ఆమె వికార రూపానికి కారణమైన సీతారామలక్ష్మణుల వృత్తాంతాన్నితెలుసుకుంటాడు. పగ తీర్చుకునేందుకు పద్నాలుగు మంది రాక్షసులను శ్రీరాముడి మీదకు యుద్ధానికి పంపగా వారందరూ ఆయన చేతిలో చస్తారు. వెంటనే శూర్ఫణఖ ఖరుడిని రాముడిపై యుద్ధానికి ప్రేరేపించడంతో వాడు తన పద్నాలుగు వేలమంది సైన్యంతో పోతాడు. సింహనాదం చేస్తూ యుద్ధానికి సన్నద్ధమౌతున్న ఖరుడిపై గెలవాలని కాంక్షిస్తూ ఆకాశం నుండి వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు రాముడికి శుభం కలగాలని కోరుకుంటున్న విధానాన్ని "మాలిని" వృత్తంలో పద్యంగా రాసారిలా:
మాలిని: జయతు జయతు రామ స్సం యుగే సర్వదై త్యా
న్న యగుణహీతచక్రీ వాశరా న్నంచు మింటన్
రయమునఁ జనుదేరన్ రాక్షసక్రూరసేనా
చయములఁ గని రంతన్ సంభ్రమోత్సాహదీప్తిన్ -47
ఛందస్సు: మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.
తాత్పర్యం: లోకహితం గోరి శుభకార్యాలు చేసే సుదర్శన చక్రధారైన విష్ణువు రాక్షసులను జయించిన విధంగా, శ్రీరామచంద్రుడు సర్వ రాక్షసులను యుద్ధంలో జయించాలని అంటూ, ఆకాశం నుండి (వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు) రాక్షస సేన సంతోషంతో-ఉత్సాహంతో ప్రకాశిస్తుండగా చూసారు.
శ్రీరామచంద్రుడు ఖరదూషణాదులతో యుద్ధంచేస్తున్న సమయంలో నెలకొన్న పరిస్థితిని వివరించడానికి వాసు దాసుగారు ఎంచుకున్న వృత్తాలలో మూడు సుగంధి, స్రగ్ధర, కవిరాజవిరాజితములు. ఆ పద్యాలిలా సాగుతాయి.
సుగంధి: మానవేంద్రము క్తశాత మార్గణాసహిష్ణులై
వైనతేయపక్షజాత వాతధూతభూజసం
తానరీతి భీతయాతు ధాన కోటి యోటమై
దీనవృత్తిఁ బారఁ జొచ్చె దేవవైరి డాయఁ గన్ -48
ఛందస్సు: సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.
స్రగ్ధర: ఘోరప్రాసాసిఖడ్గా కుటిల శరశతుల్గుప్పగా మీఁ ద గుప్పన్
జ్యారావోద్భిన్న శత్రూచ్చయహృదయపుటీ సద్ముఁ దై కంఠ రావో
దారుం డై శత్రుఘాతార్థముగ భయదగాం ధర్వనారాచ్ మేసెన్
నీరంద్రం బై దిశాళుల్ నిశితఖగతితిన్ నిండ సీతేశుఁ డంతన్ -49
ఛందస్సు: స్రగ్ధరకు మ-ర-భ-న-య-య-య గణాలు. ఎనిమిదింట ఎనిమిదింట యతులు.
కవిరాజవిరాజితము: విరిగినతేరులు గూలినశూరులు వ్రీలినకేతువులున్ గొడుగుల్
తెరచిననోరులు పారెడివీరులు ద్రెళ్లినగౌరులు పొర్లుహరుల్
తరిగినచేతులు తున్గినమూతులు తారెడిభీతులు మిక్కుట మై
తెరఁ గరి రాక్షససైన్యము సర్వము దీరుచు నుండఁ గ దూషణుడున్ -50
ఛందస్సు: కవిరాజవిరాజితమునకు ఒక్క "న" గణం, ఆరు "జ" గణాలు, "వ" గణం. పద్నాలుగవ ఇంట యతి.
తాత్పర్యం: రామభద్ర భూపాలుడిచే విడువబడిన పదునైన బాణాలను సహించలేక, గరుడుడి రెక్కలగాలిలో ఎగిరిన చెట్ల గుంపుల మాదిరిగా, భయపడిన రాక్షస సమూహాలు, పరాభవంతో-దుఃఖంతో ఖరుడి చాటున దాక్కున్నారు. భయంకరమైన ఈటెలు, కత్తులు, బాణపరంపరలు, కుప్పలు-కుప్పలుగా వారు (ఖరుడి సైనికులు) తనమీద పడవేస్తుంటే, రామభద్రుడు ధనుష్టాంకారంతో వారిగుండెలు పగిలేలా సింహనాదంచేసి, శత్రుసంహారానికై దిక్కుల్లో సందులేకుండా కరకుబాణాలు నిండే విధంగా గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. (ఫలితంగా) విరిగిన రథాలు, చనిపోయిన శూరులు, నేల కూలిన ధ్వజాలు, గొడుగులు, తెరిచిన నోళ్లు, పరుగిడుతున్న వీరులు, పడిపోయిన ఏనుగులు, దొరులుతున్న గుర్రాలు, తెగినచేతులు, తునకలైన మూతులు, పక్కకొదిగిన పిరుదులు పెరుగిపోతుండడాన్ని- రాక్షస సైన్యం సర్వనాశనం కావడాన్ని గమనించిన దూషణుడు (యుద్ధానికి సిద్ధమౌతున్నాడు).
దూషణుడు శ్రీరాముడితో యుద్ధంచేసి చనిపోతాడు. తదుపరి తనమీదకొచ్చిన రాక్షసులను, వారి సేనానాయకులను చంపాడు రాముడు. అలా పదునాలుగు వేలమందినీ చంపేశాడు రాముడాయుద్ధంలో. ఆ తర్వాత ఖరుడి మరో సేనా నాయకుడు త్రిశిరుడనేవాడు కూడా భయంకరమైన యుద్ధంచేసి చివరకు అతడూ నేలకూలుతాడు. అదిచూసిన సేనలోని వారంతా తలోదిక్కుకు పారిపోతారు. చివరకు ఖరుడే స్వయంగా రణంలోకి దిగి, శ్రీరాముడి కవచాన్ని భేదించడంతో, రాముడు అగస్త్యుడిచ్చిన వైష్ణవ ధనస్సుతో బాణాలను సంధించాడు అతడిపైకి. చివరకు ఇంద్రుడిచ్చిన అమోఘమైన బాణాన్ని ప్రయోగించి ఖరుడిని వధించాడు రాముడు. మహర్షుల ప్రశంసలందుకుంటాడు రాముడు. జనస్థానంనుండి అకంపనుడనే రావణుడి వేగులవాడు లంకకు పోయి, ఖర-దూషణాదుల మరణవార్తను తెలియచేశాడు. శ్రీరాముడి పరాక్రమాన్ని కూడా వర్ణించి చెప్పాడు రావణాసురుడికి. చెప్పి, శ్రీరాముడిని చంపాలంటే, సీతాపహరణమే తగిన ఉపాయమంటాడు. ఇంతలో లంకకెళ్లిన శూర్ఫణఖ రావణుడితో తనగోడు చెప్పుకుంటుంది. తన దుఃఖాన్ని చూసికూడా ఓదార్చని రావణుడిని నిందిస్తుంది. రాముడివల్ల తనకు జరిగిన అవమానాన్ని, దుఃఖాన్ని తెలిసికూడా ఓదార్చని రావణుడిని ఆయన కొలువులోనే-మంత్రుల సమక్షంలోనే శూర్ఫణఖ నిందించిన విధానాన్ని ఒక "మత్తకోకిలం" లో రాసారీవిధంగా:
మత్తకోకిలము: ఎండుకట్టెల మంటిపెళ్లల నేనియున్ మరి దుమ్ముచే
నొండు కార్యము కల్గుఁ గాని స మూహ చేయఁ గ రాజుగా
నుండి భ్రష్టత నొందినట్టిన రోత్తముం డొకగవ్వకేన్
ఖండితాహితసంచయా ! కొరగాఁ డు నిక్కము నమ్ముమీ -51
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: లోకంలో దేనికీ పనికిరాని అల్పమైన ఎండుకట్టెలు, మట్టిపెళ్లలు, నేలదుమ్ములాంటివి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడవచ్చేమోగాని, ఎంత ఆలోచించినా, రాజైవుండి-రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు గవ్వకైనా కొరాగడనేది వాస్తవం.
ఒకవైపు రాముడిని, రావణుడిని దూషిస్తూనే, శ్రీరాముడిని గురించి వివరంగా వర్ణించి చెపుతుంది శూర్ఫణఖ. ఖర-దూషణాది పదునాలుగు వేలమందిని, మూడు గడియల్లో ఒంటరిగా బాణాలతో నాశనం చేశాడని పొగుడుతుంది. సీతనూ వర్ణించి చెపుతుంది. అందమైన గమనం కలదని, సమస్త సద్గుణాలవల్ల గొప్ప కీర్తిగాంచినదని అంటుంది. రాముడి చేతిలో చచ్చిన ఖర-దూషణాదుల మీద ఏ మాత్రం ప్రేమున్నా రాముడిని, అతడికి సహాయం చేస్తున్న వారందరిని చంపమంటుంది. ఇవన్నీ విన్న రావణుడు రహస్యంగా మారీచాశ్రమానికి పోతాడు. నిర్మలమైన ఒక ప్రదేశంలో, మితాహారుడై, ఇంద్రియనిగ్రహంతో, జింకచర్మం ధరించి, నార వస్త్రాలు కట్టుకొని తపస్సుచేస్తుంటాడు మారీచుడు. జనస్థానం వృత్తాతంతాన్ని చెప్పి, సీతాపహరణంలోతనకు సహాయం చెయ్యమని మారీచుడిని వేడుకుంటాడు రావణుడు. సమాధానంగా మారీచుడు, శ్రీరాముడి బలపరాక్రమాలను గురించి రావణుడికి తెలియ చెప్పుతాడు. ఆయన ధర్మమూర్తంటాడు. "జనకాత్మ జ సంబంధం, బున రాముం డప్ర మేయ పురుతేజుం డ య్యెను నట్టిరాముచాపము, తను గాపగ నున్న సీత దరమాతేరన్" (సీతాదేవి సంబంధం వల్ల రాముడు, ఛేదింపగరాని గొప్పతేజం కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే, సీతను తేవడం నీకు సాధ్యమా ?) అంటాడు మారీచుడు. శ్రీరాముడితో తాను పడ్డపాట్లను రావణుడికి తెలియచేస్తూ, అందగత్తెలైన తనభార్యలతో దీర్ఘకాలం సుఖపడాలన్న కోరికుంటే, రామచంద్రుడికి కీడుచేసే పని చేయొద్దనీ-సీతను ఎత్తుకొని రావద్దనీ హితబోధచేసే సమయంలో, "మాలిని" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారీవిధంగా కవి.
మాలిని: వలదు వలదు సీతా వారిజాక్షిన్ గ్రహింపన్
జెలిమికలిమి నీకుం జెప్పెదం, గాదటుంచున్
బలిమిని గ్రహియింపన్ బంధుమిత్రాళితోడన్
గలవు కలనఁ గూలన్ క్ష్మాసుతానాధుచేతన్ -52
ఛందస్సు: మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.
తాత్పర్యం: రావణా ! సీతాదేవిని నీవు హరించవద్దు. నేను ఈ మాటను నీ మీద నాకున్న ప్రేమవల్ల, నీ క్షేమం కోరి చెపుతున్నాను. నా మాట వినకుండా, బలాత్కారంగా సీతను తీసుకొస్తే, బంధువులతో-మిత్రులతో రాముడి చేతిలో యుద్ధంలో చస్తావు.
తాను రాముడిబారినుండి ఎలా తప్పించుకున్నది వివరించాడు మారీచుడు రావణాసురుడికి. ఇన్ని చెప్పినా మనసుకెక్కని రావణుడు మారీచుడిని పరుషాలాడి, బలాత్కరించి, తనకు తోడ్పడాడినికి ఒప్పించాడు. తనకు సహాయం చేయాల్సిన విధానాన్ని తెలిపాడు. వెండి చుక్కల బంగారు జింక ఆకారాన్ని ధరించి, రాముడి ఆశ్రమం దగ్గర తిరుగుతుంటే, సీత నిజమైన జింకని నమ్మి పట్టుకొని రమ్మని కోరుతుందనీ, ఆతర్వాత సీతను ఎత్తుకొని పోవచ్చనీ వివరించాడు మారీచుడికి. అదివిన్న మారీచుడు రావణుడిని నిందిస్తూ, హితవాక్యాలు కొన్ని చెప్తాడు. అప్పుడు "వసంతతిలక" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:
వసంతతిలక: నీ మేలు గోరి యిటు నేను హితంబుఁ బల్కన్
నామాట నీ వెద న నాదృతిఁ జేసె దయ్యో
యే మందు రావణ సు హృజ్జనపథ్యవాక్యం
బేమాడ్కి మృత్యువశుఁ డేర్పడ నాలకించున్ -53
ఛందస్సు: వసంతతిలక కు త-భ-జ-జ-గ-గ గణాలు. ఎనిమిదింట యతి.
తాత్పర్యం: రావణా ! నీ మేలుగోరి నీకు హితమైనదానిని బోధించగా, నామాటను నీవు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో ! నేను నిన్నేమి చేయగలను ? మృత్యువునకు వశపడి చావదల్చుకున్నవాడు మితృలు చెప్పే మంచిమాటలు వింటాడా ?
రావణ-మారీచులు పంచవటికి ప్రయాణమై పోతారు. మారీచుడు మాయా జింక వేషాన్ని ధరించాడు. రాముడుండే తపోవనంలోకి ప్రవేశించాడు. జానకి మాయామృగాన్ని చూస్తుంది. రావణుడు ఊహించినట్లే మాయామృగాన్ని పట్టితెమ్మని సీత కోరుతుంది రాముడుని. దాన్ని సులభోపాయంతో పట్టితెమ్మని, ఒకవేళ ప్రాణాలతో దొరక్కపోతే దాని చర్మంతోనన్నా ఆడుకోవాలని వుందని అంటుంది. అంగీకరించిన రాముడికి అది మారీచుడి మాయేనన్న అనుమానంకూడా కలుగుతుంది. అలాంటప్పుడు దానివధ అవశ్యమనుకుంటాడు. అదే విషయాన్ని లక్ష్మణుడితో చెప్పి, ఒక్క వాడి బాణంతో జింకను చంపి చర్మాన్ని తీసుకొని వస్తానని, తానొచ్చేవరకు సీతను "జటాయువు" సహాయుడుగా వుండగా రక్షింపమని అంటాడు రాముడు. అది చెప్పడానికి "మత్తకోకిలము" వృత్తంలో పద్యాన్ని రాసారీవిధంగా కవి:
మత్తకోకిలము: దక్షుఁ డున్ దృఢసత్త్వుఁ డున్ మతి ధైర్యయుక్తుఁ డు లక్ష్మణా !
పక్షిరాజు జటాయు వియ్యెడ బాసటై చరియింపఁ గా
రక్షణంబు ఘటింపుమీ యుడు రాజబింబసమాస్యకున్
దీక్షఁ బూని ప్రమాద మేది ప్ర తిక్షణంబును శంకి వై -54
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మిక్కిలి బలవంతుడు. కార్యాలోచన, కార్యంచేయగల ధైర్యంగలవాడు. ఆయన నీకు సహాయకుడుగా సీతాదేవిని అనుక్షణం, ఏ మూలన ఏమి ఆపద వస్తుందోనని, శంక గలవాడై-పొరపాటుపడకుండా, ఒక వ్రతంగా భావించి రక్షించు.
లక్ష్మణుడితో సీతను కాపాడమని చెప్పిన శ్రీరాముడు మాయామృగం వెంట పోతాడు. చేత్లో ధనస్సుతో వస్తున్న రాముడిని చూసిన మారీచుడు తనకు చావు తధ్యమనుకున్నాడు. మాయలుచేస్తూ రాముడికి చిక్కకుండా తిరగసాగింది జింక. అలా ఆ జింక వినోదంగా తిరుగుతున్న విధానాన్ని "మాలి" వృత్తంలో ఒక పద్యంరాసారిలా:
మాలి: కనఁ గ గనఁ గ గాంతుల్ గ్రక్కుచున నిల్చుధ్వనిన్
గనుచుఁ గనుచుఁ బాఱు న్దవ్వుగాఁ జిక్కకుండన్
మునుఁ గు వెఱను బాణంబుం గనున్ మింట నాడున్
వనుల దరుల డాఁ గున్ వంచనన్ గాసిమ్రాఁ గున్ – 55
తాత్పర్యం: రామచంద్రమూర్తి చూస్తుండగానే, కాంతులు విరజిమ్ముతున్నదానివలె, మెరుస్తూ నిలుస్తుంది. ఆయన విల్లెత్తగనే దృష్టి దానిమీదనే వుంచి, దూరంగా చిక్కకుండా పరుగెత్తుతుంది. భయపడుతున్నట్లు నటించుకుంటూ బాణం వైపు చూస్తుంది. ఆకాశంలోనే గంతులుపెట్టుకుంటూ ఆడుతుంది కాసేపు. అడవుల్లో చెట్లచాటున గుహల్లో దాక్కుంటుంది. అలసిపోయిందానిలాగా వంచనతో సోలుతుంది.
ఇలా తనతో దోబూచులాడుతున్న మాయా మృగంపై కోపగించిన రామచంద్రుడు, దాన్ని చంపాలనుకొని, బ్రహ్మాస్త్రాన్ని గురిచూసి వేశాడు. ఆ దెబ్బకు మరణించబోతున్న మారీచుడు, రావణుడికి సహాయపడదలిచి, రాముడి గొంతును అనుకరిస్తూ, "హా సీతా లక్ష్మణా" అని అఱచి చనిపోయాడు. రాముడు మారీచుడిని చంపిన తర్వాత ఆశ్రమానికి బయల్దేరి పోతుంటాడు. రాముడి గొంతువిన్న సీత లక్ష్మణుడిని అతడికి సహాయంగా పొమ్మంటే, అన్న ఆజ్ఞ ప్రకారం వెళ్లకుండేసరికి ఆమె కోపగించుకుంటుంది, నిష్టూరాలాడుతుంది. చివరకు లక్ష్మణుడు రాముడుని వెతుక్కుంటూ పోతాడు. ఆ తర్వాత రావణుడు యతి వేషంలో సీతాపహరణానికి వస్తాడు. వచ్చినవాడు రాక్షసుడని తెలిసి కూడా, కొంతసేపు ఆలశ్యంచేస్తే రామ లక్ష్మణులు రాకపోతారా అని ఎదురుచూస్తున్న సందర్భంలో తరలము వృత్తంలో ఒక పద్యం రాసారీవిధంగా:
తరలము: వనికి వేఁ టకు జన్న భర్తయు భ్రాతతోఁ జనుదెంచునా
యనుచు నాలుగు దిక్కులున్ జలజాయతాక్షి వనీదిశన్
గనియెఁ గ్ాని రఘోత్తముల్ పొడకట్టరైరి, యథాస్థితిన్
వనకుజంబులు దోఁ చు చుండెను భామచిత్తము కందఁ గన్ -56
ఛందస్సు: తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం: మాయా మృగాన్ని వేటాడేందుకు అడవికి పోయిన రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వస్తాడా అని, అడవి వైపు నాలుగు దిక్కులా చూసినప్పటికీ వాళ్లు కానరాలేదు. యథాప్రకారం అడవిచెట్లు మాత్రం కనిపించాయి. అది తెలుసుకొన్న సీత మనస్సు భయ సంతాపాలతో వాడిపోయింది.
రావణుడికి సీత తన వృత్తాంతాన్నంతా వివరంగా చెపుతుంది. రావణుడూ తన వృత్తాంతాన్ని చెప్పి ఆమెను దుర్భాషలాడుతాడు. సీత నిష్ఠూరాలాడుతుంది. బెదిరిస్తుంది. మరణకాలం ఆసన్నమయిందంటుంది. సీతకు తన నిజస్వరూపం చూపించి భయపెట్తాడు రావణుడు. సీత రావణుడిని నిందిస్తూ చెప్పినమాటనే మళ్లీ మళ్లీ చెపుతుండడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలిచారిలా వాసు దాసుగారు:
మత్తకోకిలము: దుష్టచిత్తుఁ డ వజ్రహస్తుని తోయజాక్షిఁ బులోమజన్
భ్రష్టశీలుడ ! యాహరించి మ నంగవచ్చును గాక యు
త్కృష్టతేజుఁ డు రామచంద్రుని యీశ్వరిన్ ననుబోఁ టి నీ
కష్టవాక్యము లాడి మోక్షము కానవున్ సుధఁ ద్రావినన్ – 57
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: ఓరీ చెడ్డ మనస్సుగలవాడా ! ఇంద్రుడి భార్యను హరించైనా బ్రతకవచ్చునుగాని, రామచంద్రుడి భార్యనైన నా లాంటి దానిని, నీచవాక్యాలాడడంతో నువ్వు అమృతం తాగినా నీకు మోక్షం కలగదు. ఇక హరించితే ఏమవుతుందో తెలుసా ? మృత్యువునుండి నీకు విడుదలలేదు. మిక్కిలి మలినమైన అంతఃకరణం కలవాడివైనందునే జ్ఞానం వల్ల కలగాల్సిన మోక్షం నీకు కలగలేదని అర్థం.
సీతాదేవి మాటలను లెక్కచేయకుండా, రావణుడు ఆమెను కఠిన వాక్యాలతో దూషించుకుంటూ అపహరించుకొని పోతాడు. రథం మీద తీసుకొని పోబడుతున్న సీత పిచ్చిపట్టిన దానివలె, రామలక్ష్మణులను పేర్కొంటూ దుఃఖిస్తుంది. అలా విలపిస్తున్న సీతకు జటాయువు కనిపించడంతో, పెద్దగొంతుకతో గట్టిగా పిలుస్తుంది. పాపాత్ముడైన రావణుడు దయాహీనుడై ఎత్తుకొనిపోతున్నాడని అంటుంది. జటాయువును ఉద్దేషించి ఆమె అన్న పలుకులను "మత్తకోకిలము" వృత్తంలో ఇలా పద్యంగా రాసారు కవి:
మత్తకోకిలము: అన్న ! తండ్రి ! జటాయువా ! దురితాత్ముఁ డీయసురుండు న
న్ని న్నెఱిన్ హరియించి యేగెడి నిట్టినాదురవస్థలన్
విన్నవింపఁ గదయ్య యిప్పుడ వేగ మేగి సమస్త మా
యన్నదమ్ముల కోమహాత్మక యార్తనన్ దయఁ బ్రోవుమా -58
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: అన్నా ! తండ్రీ ! జటాయువా ! పాపాత్ముడగు ఈ రాక్షసుడు, నన్నీవిధంగా బలవంతంగా పట్టుకొనిపోతున్నాడు. యుద్ధంచేయ వలదంటివే. ఇక నేనేమి చేయగలనందువేమో ? ఇప్పుడే శీఘ్రంగా పోయి, నా కష్టస్థితిని సమస్తం రామలక్ష్మణులకు చెప్పు. మహాత్మా ! ఈ మాత్రం సహాయం చేసి ఈ దీనురాలిని రక్షించు.
సీత చేస్తున్న మొరను విన్న జటాయువు, రావణుడిని సంబోధిస్తూ, తానెవరో-తన బలం ఏమిటో, శ్రీరామచంద్రుడనగా ఏమిటో తెలియచేసి, వాడికి రాముడు చేసిన కీడేమీ లేనప్పుడు ఏ పాపం ఎరుగని రాముడి విషయంలో ఎందుకు దోషం చేస్తున్నావని-దాని వల్ల అతడికి అపాయం జరుగుతుందని హెచ్చరించాడు. ఇలా ప్రశ్నిస్తూ, మగతనం వుంటే శ్రీరాముడితో యుద్ధం చేయమంటాడు. ఈ సందర్భంలో రావణుడిని వారిస్తూ జటాయువు చేసిన హెచ్చరికను "మాలిని" వృత్తంలో పద్యంగా రాసారీవిధంగా:
మాలిని: వలదు వలదు రక్షో వల్లభా నీవు సీతన్
బలిమిని గొనిపోవం బాప మాభూపరుండున్
దెలిసినయెడ నిన్నున్ దృష్టిచేనే దహించున్
గులిశమునను వృత్రుం గూల్చు జంభారిమాడ్కిన్ – 59
ఛందస్సు: మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.
తాత్పర్యం: రాక్షసరాజా ! నువ్వు సీతను బలాత్కారంగా తీసుకొనిపోవద్దు. వలదు. అది అతి మిక్కిలి పాప కార్యం. నువ్విలా చేశావని రామచంద్రమూర్తికి తెలిస్తే, వజ్రంతో ఇంద్రుడు వృత్రుడిని వధించినట్లు చూపులతోనే నిన్ను దహించివేస్తాడు.
రావణుడిని హెచ్చరించిన జటాయువు, వాడు మగవాడైతే తనతో యుద్ధంచేయమంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నరావణాసురుడు, జటాయువుతో ఢీకొంటాడు. జటాయువు-రావణుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. యుద్ధం మధ్యలో రావణుడుని జటాయువు మరోమారు దూషిస్తాడు-పరుషోక్తులాడుతాడు. రావణుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. (పర్ణశాలకు మైలు దూరంలో వున్న జటాయువు వృక్షం దగ్గర మొదలైన వారిద్దరి మధ్య యుద్ధం, ఐదారు మైళ్ల దూరంలో వున్న దుమ్ముగూడెం వరకూ కొనసాగి, జటాయువు రెక్కలు ఖండించబడేంతవరకూ సాగుతుంది). ఇది చూసిన సీత రామలక్ష్మణుల గురించి ఆక్రోశిస్తుంది. ఇదంతా పట్టనట్లు రావణుడు సీతనెత్తుకొని పరిగిడుతుంటాడు. రామలక్ష్మణుల కొరకు పరితపిస్తూనే, సీత రావణుడుని నిందిస్తుంటుంది. శ్రీరాముడిని మోసగించిన రావణుడు లంకలోనే కాదు స్వర్గ-పాతాళాలలో దాక్కున్నా రామచంద్రమూర్తి వాడిని వధించడం తధ్యమంటుంది. సీత అలా రావణుడుని నిందిస్తున్నప్పుడు ఆమె పరిస్థితిని "కరిబృంహితము" వృత్తంలో పద్యంగా రాశారిలా:
కరిబృంహితము: ఇట్టు పలుకుచుఁ బెక్కువిధముల నేడ్చి కరుణము దోఁ పగాఁ
దిట్టుచును ఘనశోక భరమున దీన యయి స్మృతి దప్పుచున్
గట్టిగను విలపించి పొరలుచుఁ గంప మొనరఁ దపించుచో
దిట్ట యయి యసురాధముఁ డు నృపు దేవి గొని చనె బాపియై – 60
ఛందస్సు: "కరిబృంహితము" నకు భ-న-భ-న-ర గణాలు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం: ఈ విధంగా పలు విధాలుగా మాట్లాడుతూ, ఏడుస్తూ, తిట్తూ, శోకాతిశయంతో దీనురాలై స్మృతి తప్పి పడితూ-గట్టిగా ఏడుస్తూ, పొర్లుతూ, దేహం వణుకు పుట్టి తపిస్తుండగా, రాక్షసాధముడు దిట్టతనంతో సీతను తీసుకొని పారిపోయాడు.
పాపాత్ముడైన రావణాసురుడు అలా తననెత్తుకొని పారిపోతుంటే, తనను కాపాడేవాడు ఒక్కడుకూడా కనిపించక పోయేసరికి తపించిపోయిన సీతాదేవికి ఒక కొండ శిఖరం మీదున్న ఐదుగురు వానరులు కనిపించారు. కనీసం వాళ్లైనా తన దుస్తితిని గురించి రాముడితో చెప్పకపోతారా అని తలపోసి సీత తన ఆభరణాలను తీసి కొంగులో ముడివేసి, వారిముందు పడేటట్లు విసురుతుంది. ఆదరబాదరగ పోతున్న రావణుడది గమనించలేదు. సుగ్రీవాదులైన ఆ వానరులు "రామ రామ" అని ఏడుస్తున్న దానిని, రావణుడెత్తుకు పోవడం గమనించి కూడా భయంతో వూరుకుంటారు. రావణుడావిధంగా సీతతో లంక చేరుకుంటాడు. సీతను నిర్భందంలో వుంచి, రాక్షస స్త్రీలను కాపలా వుంచుతాడు రావణుడు. కొంచెం సేపైన తర్వాత సీతవద్దకు పోయి రావణుడు ఆమెను బలాత్కారంగా తీసుకొని తన నగరాన్ని చూపించసాగాడు. లంకను ఏలమని, తనను వరించమని వేడుకుంటాడు. ఇద్దరం చందనం రాసుకొని, బంగారు సొమ్ములు ధరించుదామంటాడు. సీతను తానెంతగానో ప్రేమిస్తున్నానని అంటూ, "జానకీ ! నీ పాద ధూళి నా శిరస్సున ధరించుతాను" అని చెపుతాడు రావణుడు సీతతో. ఇక్కడ రెండు పద్యాలను-ఒకటి "మత్తకోకిలము" వృత్తంలో, మరొకటి "తోటకము" వృత్తంలో రాశారిలా కవి:
మత్తకోకిలము: ఇంచుఁ బోణిరొ పుష్పకాఖ్యస మిద్ధ మైనవిమాన మ
భ్యంచదర్కవిభావికాసము యక్షు నగ్రజుఁ బోర ని
ర్జించి తెచ్చితి హృద్య మయ్యెడఁ జేరి ఇద్దఱ మెంతయున్
జంచదిష్టసుఖోపభోగముఁ జాన ! పొందుచు నుందమా ! -61
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం: సీతా ! పుష్పకమని ప్రసిద్ధికెక్కిన ఈ విమానం నాలుగు దిక్కులా వ్యాపించే సూర్యకాంతి లాంటి కాంతిగలది. మా అన్న కుబేరుడుని జయించి దీన్ని తెచ్చుకున్నాను. ఇది మిక్కిలి మనోజ్ఞమైంది. దీంట్లో మనిద్దరం గడియ-గడియకు మారుతున్న సుఖభోగాలను అనుభవించుదామా !
తోటకము: అని యీగతిఁ బల్కి ద శాస్యుఁ డు దా
జనకాత్మజ నాత్మను సంతసిలెన్
వనితామణి దక్కెను నాకిఁ కఁ బో
యని యంతక పాశవ శాత్మకుఁ డై -62
ఛందస్సు: తోటకము నకు నాలుగు "స" గణాలు, తొమ్మిదో అక్షరం యతి వుంటాయి.
తాత్పర్యం: ఈ ప్రకారం సీతతో పలికిన రావణుడు తనలో తాను, ఈ స్త్రీరత్నం తనకు దక్కిందని, యమపాశానికి వశపడ్డవాడైనందున భావించాడు.
తనను బలాత్కారం చేయగల శక్తి రావణుడుకి లేదని, బలాత్కారాన్ని నిషేదించే శాపం రావణుడుకి వున్నదని తెలియని సీత వాడిని పరుషోక్తులాడుతుంది. వాడికి నాశనమైపోయే కాలం దాపురించిందని, వాడి రాక్షస సమూహం, కట్టుకొన్న స్త్రీలు ఏక కాలంలో నాశనమైపోతారని అంటుంది. కోపంతో మండిపడ్డ రావణుడు సీతను అశోకవనానికి తీసుకొనిపొమ్మని, కాపలాగా వున్న రాక్షస స్త్రీలు ఆమెను మచ్చికచేసుకొని తనకు స్వాధీనపరచమని ఆజ్ఝాపించాడు. ఇక్కడ లంకలో సీతాదేవి పరిస్థితి ఇలావుంటే, అడవిలో రాముడు మాయా మృగాన్ని చంపి వెనక్కు వస్తుండగా, అపశకునమైన నక్క కూత వినిపిస్తుంది. మారీచుడి కంఠధ్వని విన్న లక్ష్మణుడు తనను వెతికేందుకు వచ్చి వుంటాడనీ, ఒంటరిగా వున్న సీతకు ఏం కీడు జరిగిందోనని భయపడ్డాడు. ఇంతలో ఆశ్రమం సమీపానికి వచ్చిన రాముడికి ఒంటరిగా వున్న తమ్ముడు కనిపించాడు. కలత చెందినట్లు కనిపిస్తున్న లక్ష్మణుడితో, రాక్షస మాయ గురించి, తాను జింకను చంపడం గురించి చెప్పాడు రాముడు. తనకు ఎదురైన అపశకునం గురించి రాముడు లక్ష్మణుడికి చెప్పిన సందర్భంలో "తరలము" వృత్తంలో ఒక పద్యం రాశారు. సీత కనిపించనందుకు పరిపరివిధాల దుఃఖించాడు. సీత అసలు ప్రాణంతో వుందా-లేదా అని సందేహిస్తాడు. అలా సీతాదేవిని తలచుకుంటున్నప్పుడు "మంజుభాషిణి" లో మరో పద్యాన్ని రాశారీవిధంగా కవి:
తరలము: అదరె వామవిలోచనంబు, ప్ర హర్ష మేమియు లేదు నా
మదిని, నాశ్రమభూమి నిక్కము మానినీమణి లేదురా
సుదతినిన్ హరియించురో తమ సూడు దీఱఁ గ రక్కసుల్
ముది త దా మరణించెనో వని లోనఁ ద్రోవయె తప్పెనో – 63
ఛందస్సు: తరలమునకు న-భ-ర-స-జ-జ గణాలు. పన్నెండో అక్షరం యతి.
తాత్పర్యం: లక్ష్మణా ! ఎడమ కన్ను అదురుతున్నది. ఏ మాత్రం సంతోషం మనస్సులో లేదు. నాయనా, ఆశ్రమంలో సీత లేదురా. తమ పగ తీర్చుకొనేందుకై రాక్షసులు సీతను పట్టుకొనే పోయారో, లేక, వారి బాధ పడలేక తానే చనిపోయిందో, లేక, మనల్ని వెతుక్కుంటూ దారి తెలియక వేరే దారిలో పోయిండేమో.
మంజుభాషిణి: అని మంజుభాషిణిని నాత్మ నెంచుచున్
జనియెం బిపాస క్షుధ జాలి గొల్ప మో
మును వాడఁ గాఁ దొలఁ గ ముర్వు, స్వాశ్రమం
బున కింతిలేమి నటఁ బొక్కి యేడిచెన్ – 64
ఛందస్సు: మంజు భాషిణీ వృత్తానికి స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి. సీత "మంజు భాషిణి" అయినందున, ఇంతకు ముందువలె, ఇక్కడ కూడా "మంజుభాషిణి" వృత్తంలో పద్యం రాయడం సమంజసం అంటారు వాసు దాసుగారు.
తాత్పర్యం: అని సీతాదేవిని తలచుకుంటూ, ఆకలి దప్పిక భాదించగా, అందం తొలగగా, తన ఆశ్రమంలో సీత లేనందుకు వెక్కి-వెక్కి ఏడిచాడు.
సీత కానరానందున పరితపించిన రాముడు, సీతను ఎందుకు విడిచివచ్చావని లక్ష్మణుడుని ప్రశ్నించాడు. వచ్చిన వాడు సీతను కూడా తీసుకొని రావల్సిందని అంటాడు. తానలా రావడానికి కారణం సీతేనంటాడు. వివరంగా జరిగిందంతా చెప్పినప్పటికీ, అలా విడిచిరావడం లక్ష్మణుడు చేసిన తప్పిదమని కూడా అంటాడు. లక్ష్మణుడి స్థితి శోచనీయమవుతుంది. మరో పక్క రాముడి దుఃఖం కొనసాగుతూనే వుంటుంది. ఆమెను వెతుక్కుంటూ ప్రతి చెట్టు చాటునా చూస్తాడు. కనిపించిన పశుపక్ష్యాదులను ఆమె గురించి అడుగుతాడు ఆవేశంతో. అలా ఆయన వెతకడాన్ని, ఆమెతో భ్రమపడి సంభాషించడాన్ని, "కవిరాజవిరాజితము" వృత్తంలో పద్యంగా రాశారు కవి ఇలా:
కవిరాజవిరాజితము: నిలు నిలు మేగకు మోకలికీ ! యెద ! నిర్దయమే మరుపూ ములికీ !
యలుఁ గఁ గ నేటికి ప్రాణసఖీ ! పరి యాచకమా యిది చంద్రముఖీ ?
కులుకుచుఁ గుల్కుచుఁ బర్విడెదే కనుఁ గొంటిని లే జిగిచీర యదే
పలుకవు కోపమ నీలకచా ! ననుఁ బాలన సేయుము ! కుంభకుచా ! -65
ఛందస్సు: కవిరాజవిరాజితమునకు ఒక్క "న” గణం, ఆరు "జ" గణాలు, ఒక్క "వ" గణం వుంటాయి. పద్నాలుగవ ఇంట యతి.
తాత్పర్యం: కాంతా ! పోవద్దు. పోవద్దు. నిలు-నిలు. మన్మధపుష్పబాణమా ! నీ హృదయ మింతదయలేనిదా ? ప్రాణసఖీ ! ఎందుకు నాపై అలిగావు ? ఇది పరిహాస సమయమా ! కులుకుతు-కులుకుతు పరిగెత్తుతున్నావు ? అదిగో నేను చూసానులే ! నీ చీరె నాకు కనిపించింది. నల్లని వెంట్రుకలున్నదానా ! ఇలా నిన్ను చూసి నేను పిలిచినా పలుకవేమి ? కోపమా ? నన్ను రక్షించు.
సీతను రాక్షసులు చంపేసి వుంటారని విలపించాడు రాముడు. లక్ష్మణుడు రాముడిని సమాధాన పరుస్తాడు. అయినాగాని రాముడు ఉన్మత్తుడిలా సీతకొరకు రోదించాడు. తన తల్లి కౌసల్య కోడలేదిరా అంటే ఏమని సమాధానం చెప్పాలని లక్ష్మణుడిని అడుగుతాడు. లక్ష్మణుడిని అయోధ్యకు పోయి భరతుడిని తన ఆజ్ఞలాగా శాశ్వతంగా రాజ్యాన్ని పాలించమని చెప్పమంటాడు. గోదావరీ తీరమంతా అన్న ఆజ్ఞ ప్రకారం మళ్లీ వెతుకుతాడు సీతకొరకు లక్ష్మణుడు. రాముడుని అర్థం చేసుకున్న అడవిమృగాలు, భూమిని-ఆకాశాన్ని-దక్షిణ దిక్కును చూపించి అటువైపుగా సీత పోబడిందని సూచించాయి. ఆ సమయంలో రాముడికి సీతాదేవి భూషణాదులు కనిపించాయి. జటాయువు రావణుడితో యుద్ధం చేస్తూ వాడికి జరిపిన నష్టం తాలూకు పదార్థాలన్నీ కూడా కనిపించాయి అక్కడక్కడ. రాక్షసులే సీతను అపహరించి వుండాలని భావించారు రామలక్ష్మణులు. రాక్షసులు తన సీతకు అపకారం చేస్తుంటే చూసిన దేవతలు ఆమెను ఆదుకోలేదని లక్ష్మణుడితో అంటూ, వాళ్లపై కోపించి జగత్సంహారం చేయడానికి సిద్ధమౌతాడు రాముడు. లక్ష్మణుడు శ్రీరాముడిని శాంతపరిచాడు. ఇద్దరం చేయాల్సిన పనంతా చేసి, అప్పటికీ దేవతల సహాయం లభించకపోతే, అప్పుడు రాముడు చెప్పినట్లే చేద్దామంటాడు. లక్ష్మణుడు రాముడితో చెప్పినదాన్ని, ఇక్కడ "మానిని" వృత్తంలో రాశారు కవి ఇలా:
మానిని: సామముచేతను శీలముచేతను సాధుమతీ ! వినయాదులచే
భూమితనూభవ చేపడ కున్నను భూవరనందన ! యాపయి సు
త్రామకఠోరసుసాధనసన్నిభ రాజతపుంఖశరౌఘములన్
సమదివచ్చిన చొప్పున లోకము నీఱుగఁ జేయుము యుక్తమగున్ – 66
ఛందస్సు: మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం: మంచిమాటలతో, మంచినడవడితో, వినయం మొదలైన వాటితో, సీతాదేవి లభించకపోతే, సాధుమనస్సుగల రాజనందనా, ఆ తర్వాత వజ్రాలవంటి కఠోరమైన-బంగారు పింజల బాణాలతో నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి. అది తగిన కార్యమవుతుంది.
రామచంద్రుడిని పరిపరివిధాలుగా శాంతించే ప్రయత్నం చేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి మాటలకు శాంతించిన రాముడు తిరిగి సీతను వెతికే ప్రయత్నంలో వుంటాడు. సీతను అపహరించినవాడిపై అమితమైన కోపంతో, ధనస్సులో బాణం సంధించి, చేతిలో ధరించి అడవిలోని జనస్థానంలో తమ్ముడితో కలిసి వెతకసాగాడు. అలా వెతుకుతున్న వారికి జటాయువు కనిపిస్తుంది. జటాయువు సీతాపహరణ వృత్తాంతాన్నంతా రామలక్ష్మణులకు వివరించాడు. జటాయువు దుస్థ్సితికి రాముడు దుఃఖించాడు. పాపాత్ముడైన రావణుడు సీతను ఎలా పట్టుకొని పోయాడని రాముడు జటాయువును ప్రశ్నించడాన్ని ఒక వినూత్నమైన "చంపకమాల" వృత్తంలో రాసారీవిధంగా వాసు దాసుగారు:
చంపకమాల: ఆమెయుఁ గొంచు నేగ దురితాత్ముఁ డు తన్ను ధరిత్రికన్య దా
నే మనుచుండె ? నప్పలుకు లేర్పడఁ జెప్పుమ, దైత్యుఁ డెట్టివాఁ
డేమెయివాఁ డు ? వానిపురమెయ్యది ? శౌర్యమ దెంతమట్టు ? తం
డ్రీ ! మన మారఁ గాఁ బలుకవే సతి నెట్లు హరించి యేగెనో ?
ఛందస్సు: రెండూ ప్లుతాక్షరాలే అయినప్పుడు సర్వ మైత్రి వుంటే చాలునంటారు కవి. వ్యంజనమైత్రితో పనిలేదని, దీనికి ప్లుత్లయుగ విశ్రామయతి అని పేరని కూడా అంటారు. పద్యంలో నాలుగో పాదంలో రెండూ ప్లుతాక్షరాలే.
తాత్పర్యం: ఆ విధంగా పాపాత్ముడు రాక్షసుడు తనను తీసుకొని పోతున్నప్పుడు, సీత ఏమంటున్నది ? ఆ మాటలు స్పష్టంగా చెప్పు. ఆ రాక్షసుడెట్టివాడు ? ఏ దేహం గలవాడు ? వాడుండే పురమేది ? వాడెంత మాత్రపు శూరుడు ? తండ్రీ, సీతను ఏ విధంగా పట్టుకొని పోయెనో సర్వం చెప్పు.
జటాయువు అన్నీ సవివరంగా రాముడికి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రావణుడి పూర్తి పేరు చెప్పే లోపల, కుబేరుడి సోదరుడన్న మాటవరకు మాత్రమే అనగలిగాడు. మిగతాది చెప్పుతుండగానే ప్రాణం విడిచాడు. జటాయువు మృతికి రాముడెంతగానో శోకించాడు. తండ్రికి చేసిన విధంగానే జటాయువుకు అగ్నిసంస్కారాదులు చేస్తాడు. అక్కడనుండి సీతాన్వేషణకు బయలుదేరి నైరుతి మూలనున్న క్రౌంచారణ్యం చేరుకుంటారు. తర్వాత మతంగవనం ప్రవేశించారు. సమీపంలోనే కబంధుడనే రాక్షసుడి చేతులకు చిక్కుతారు. రామలక్ష్మణులు వాడి చెరొకచేతిని నరికేస్తారు. లక్ష్మణుడు కబంధుడికి తమ వృత్తాంత్తాన్నంతా చెప్పాడు. కబంధుడు కూడా తన శాపాన్ని గురించి చెప్పి, సీత అపహరణ విషయం తనకు తెలుసనీ, అయితే శాపగ్రస్తమైన వికార స్వరూపంతో ఏదీ స్ఫురించడంలేదనీ, తన దేహాన్ని కాల్చితే నిజస్వరూపం పొంది సీతను దాచినవాడి రహస్యం చెపుతాననీ అంటాడు. వాడు కోరినవిధంగానే అగ్నిలో వేసిన కాసేపటికి, మంటల్లోనుండి ఆకాశానికి ఎగిరి, సీతను కనుగొనే విషయం పరోక్షంగా తెలియచేశాడు. రామలక్ష్మణులిద్దరూ సమర్థులే అయినప్పటికీ, ప్రస్తుతం కష్టదశలో వున్నారనీ, సుగ్రీవుడితో మైత్రిచేసుకొని కార్యాన్ని సాధించమనీ అంటాడు. సుగ్రీవుడుండే ప్రదేశం ఋశ్యమూక పర్వతమనీ, పంప ఒడ్డున సంచరిస్తుంటాడని కూడా చెపుతాడు. రాముడిని ఎడబాసి దుఃఖిస్తున్న సీతను రావణుడుంచిన ప్రదేశాన్ని కనుగొనగల సమర్థుడు అతడేనంటాడు. సుగ్రీవుడుండే చోటుకు చేరే విధంకూడా చెప్పాడు. ఇక్కడ కబంధుడు రాముడికి పంపాసరస్సుని గురించి వర్ణించడానికి వాసు దాసుగారు "మానిని" వృత్తంలో పద్యంగా రాశారిలా:
మానిని: సారసరాజమరాళరథాంగక చారురసంబు, లశై నలవ
న్నీరములున్, సికతాతలరాజిత నిర్మలగాఢసమావను లౌ
తీరములున్, నవసారసకై రవ దివ్యసుగంధిఘమంఘమవాః
పూరములున్, విలసిల్లఁ గఁ బంప యపూర్వముదావహమై యొసఁ గున్ – 67
ఛందస్సు: మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం: బెగ్గురుల-రాజహంసల-చక్రవాకముల మనోహర ధ్వనులతోను, పాచితీగలు లేని జలాలతోను, ఇసుకనేలతో ప్రకాశించే నిర్మలమైన గడ్డిగల చదరపు నేలల తీరాలతోను, కొత్తగా వికసించిన కమలాలతోను, కలువలతోను, మేలైన మంచివాసనలతో గుమగుమలాడు జలప్రవాహాలతోను నిండిన పంప ఇంతవరకూ అనుభవించని సంతోషాన్ని కలిగించేదవుతుంది.
పంపను వర్ణించి చెప్పిన కబంధుడు శబరికి దర్శనం ఇమ్మని అంటాడు. సదా తపస్సు చేస్తుండే శబరి రాముడి రాకకై వేచివున్నదని కూడా అంటాడు. కబంధుడు చెప్పినట్లే రామలక్ష్మణులు శబరిని కలుస్తారు. వారిద్దరికీ శబరి, మతంగాశ్రమంలోని వింతలను చూపిస్తుంది. చక్కటి ఆతిధ్యమిస్తుంది. అక్కడనుండి బయలుదేరి రామలక్ష్మణులు పంపాతీరం చేరుకుంటారు. చేరుకుంటూ, సుగ్రీవుడిని గురించిన ఆలోచన చేస్తారు. పంపాతీరానికి చేరుకుంటున్న రామలక్ష్మణులను గురించి "మానిని" వృత్తంలో రాశారిలా వాసు దాసుగారు:
మానిని: ఈ విధి దుఃఖకరంబులఁ గానల నెల్లను దాఁ టి క్రమంబుగ వి
ఘ్నావళిఁ బాయఁ గ జేయుచు దవ్వు ప్రయాణము చేసి మనోజ్ఞక నా
నావిధిపక్షిసమాకులఁ బంపను నవ్యజలాశయసత్తమ నా
భూవరనందనయుగ్మము గాంచి యపూర్వముదంబున నుల్లసిలెన్ -68
ఛందస్సు: మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం: ఈ ప్రకారం దుఃఖాలను కలిగించే అడవులన్నింటినీ వరుసగా దాటి, మధ్య-మద్య కలిగిన విఘ్నాలనన్నింటినీ తొలగించుకుంటూ, దూర ప్రయాణం చేసి, మనోహరమై-అనేక విధాలైన పక్షులతో నిండిన అందమైన కొలకగు పంపను చేరి, ఇన్ని రోజులుగా లేని సంతోషాన్ని రాజకుమారులిద్దరూ పొంది, ముఖ వికాసాన్ని కలిగినవారయ్యారు.
అరణ్య కాండాంత పద్యాల్లో ఒకదానిని "మందాక్రాంత" లో రాశారు వాసు దాసుగారు. మిగిలిన రెండు కాండలలో లాగానే, ఈ పద్యంలోని అర్థంలో, ఒకవైపు రామచంద్రమూర్తిని స్థుతిస్తూనే, అరణ్య కాండలో మొత్తం పద్యాలెన్ని వున్నాయో వివరీమ్చారు కవి. ఆ పద్యమిలా సాగింది:
మందాక్రాంత: ధీరా ! యూర్ధ్వేశ శుచినముచి ద్వేషిదిక్సాంఖ్యపద్యో
దారారణ్య ప్రథితచరితో ద్దామ వాత్సల్యసీమా
క్రూరారాతిక్రథనకలిత క్రూరకోపా యపాపా
వారాశీడ్జాకమలమధుపా భక్తహృత్పద్మసద్మా-69
తాత్పర్యం: ఊర్ధ్వ అంటే పది దిక్కుల్లో తొమ్మిదోదని, ఈశాన్యం దిక్కు ఎనిమోదదని, శుచి (ఆగ్నేయం) రెండోదని, సముచిద్వేషిదిన్ అంటే ఇంద్రిడి దిశ మొదటిదని-అన్నీ కలిపి చదివితే 9821 వస్తుందని-ఇది తలకిందుగా చదివితే 1289 వస్తుందని దీనర్థం. వాసు దాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం అరణ్యకాండలో 1289 పద్యాలున్నాయి.
123.మానిని (భ, భ, భ, భ, భ, భ, భ, గ) 7, 13,19(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు. ప్రాస నియమం కలదు.
ReplyDeleteకారము లున్క్రియ గన్గొన నేడు భ కారములొక్క గకారముతో
గారవమై చన గావళు లన్నియు గల్గిన మానిని కామ నిభా.
ఇక్కడ 7, 13, 19 మూడు యతిస్థానాలుండాలంటున్నారే !
171.సుగంధి (ర, జ, ర, జ, ర) 9 ప్రాస లేదు
ReplyDeleteదంబుజం బురంబు జంబు రంబు చెన్నుమీరగా
దొమ్మిదింట విశ్రమంబు తోరమై సుగంధికిన్.
సుగంధికి ప్రాస లేదు అని పైన ఉన్నది. కాని వాసుదాసుగారి పద్యంలో ప్రాస నియమం పాటించారు. ప్రాస ఉన్నట్లా లేనట్లా
స్రగ్ధర ( మ, ర, భ, న, య, య, య,)8,15(ప్రకృతిచ్ఛందం) పాదమునకు21 అక్షరములు.ప్రాస నియమము కలదు.
ReplyDeleteసారెస్ నాగాధి రాట్పంచదశ విరమతన్ స్రగ్ధరా వృత్తమౌ గాం
తా రాజీవాస్త్ర యుద్యన్మరభనయయయోద్భాసి యై రంగభూపా.
యతి 8,8 నా 8, 15 నా ? తెలియజేయగలరు.
.కవిరాజ విరాజితము (న, జ, జ, జ, జ, జ, జ, ల,గ) 8, 14(వికృతిచ్ఛందం) పాదమునకు 23 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ReplyDeleteక్రమమున నొక్క నకారము నాఱుజకారములున్ బరగంగ వకా
రమును నొడంబడి రా గవిరాజ విరాజిత మన్నది రామ నిభా.
కవిరాజవిరాజితమునకు రెండు యతులా ( 8,14) ఒక్క యతినా(14) ? తెలియజేయగలరు.
కరిబృంహితమునకు భ-న-భ-న-ర కాదండి. భ-న-భ-న-భ-న-ర . ఒక భ-న- మిస్సయ్యాయండి. సరిచేయగలరు.
ReplyDeleteనరసింహ (వేదుల బాలకృష్ణమూర్తి) గారికి,
ReplyDeleteనమస్కారాలు. ఇంత త్వరగా మీరు ఇది చదివి అభిప్రాయంకూడా పంపినందుకు కృతజ్ఞతలు.
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసు దాసుగారు, ఏ ఏ సందర్భంలో, ఏ ఏ వృత్తాలలో-జాతులలో-ఉప జాతులలో పద్యాలు రాసారో తెలుసుకుందామనీ, వాసు దాసుగారు ఆంధ్ర వాల్మీకి రామాయణంలో చేసిన ఛందో ప్రయోగాలమీద ఉద్దండ కవి పండుతులు ఒక్కసారి వారి పరిశోధనాత్మక దృష్టిసారించి, ఈ తరం వారికి-భావి తరాలవారికి ఆ మహానుభావుడి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆశతో దీన్ని కూర్చడం జరిగిందనీ నా ముందుమాటలో వినమ్రంగా తెలియచేసుకున్నాను. నాకు తెలుగు భాషలో "ప్రవేశమే" కాని "ప్రావీణ్యం" లేదు. వాసుదాసుగారు చెప్పింది చెప్పినట్లు మీ లాంటి భాషా ప్రావీణుల ముందు పెట్టాను. ఆయన ఒక్కో పద్యం విషయంలో రాసిన ఛందస్సునే కేవలం నేను మీ అందరికి తెలియచేస్తున్నాను. అందులోని "తప్పొప్పులు" చర్చనీయాంశమే. అర్థం చేసుకుంటారనుకుంటాను. మానిని, సుగంధి, స్రగ్ధర, కవిరాజవిరాజితానికి సంబంధించి మీ అభిప్రాయంతో నేను ఏకీభవించినా, మరికొందరేమన్నా అభిప్రాయం తెలియచేస్తారోమో ఎదురుచూస్తాను. అచ్చుతప్పు (కరిబృంహితము౦) విషయంలో మాత్రం మీరు సూచించినట్లు సరిదిద్దుకుంటాను.
జ్వాలా నరసింహారావు
అయ్యా నాకు కూడా తెలుగు భాషలో కేవలం ప్రవేశమే కాని పూర్తి పరిజ్ఞానం ఏమీ లేదు. న్ను వ్రాసినది కూడా కవిరాజ విరాజితము , మరియు యితర గ్రంధాలలో నేను చూసినదే. నేనుకూడా కేవలం నేర్చుకుందామనే ఉద్దేశ్యంతోనే నా అభిప్రాయాల్ని , సందేహాలను వ్రాసాను. గ్రహించగలరు.
ReplyDelete