అద్భుత నగరం ఆవిష్కరిస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
ఏదైనా మొక్క పెట్టే ముందే ఆలోచించాలి. పండ్ల మొక్క పెడితే
పండ్ల చెట్టు వస్తది.. ముండ్ల మొక్క పెడితే ముండ్ల చెట్టు వస్తది. ఏ చెట్టు
పెట్టాలనేది బాగా ఆలోచించాలి. ఒక బండికి ఒకవైపు కోడె దూడను కట్టి.. ఇంకోవైపు
దున్నపోతును కడితే ఆ బండి సరిగా ముందుకుపోదు. రెండు వైపులా మంచి కోడె దూడలను కడితే
బండి సజావుగా ముందుకుపోతది. అందుకే విజ్ఞులైన జంట నగరాల ఓటర్లు ఓటు వేసే ముందు
ఆలోచించండి.. అని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటర్లను కోరారు. గ్రేటర్ హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఈ-ప్రచారానికి శ్రీకారం
చుట్టిన ఆయన.. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌ను
విశ్వ నగరం చేయడం అనే అంశం ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం
కొనసాగింది. ముఖ్యంగా 40 ఏండ్ల కాంగ్రెస్ పాలన, పదిహేడున్నర
సంవత్సరాల టీడీపీ,
మధ్యలో కొంతకాలం మజ్లిస్
హయాంలో ఈ నగర దుస్థితి ఎలా మారిందో.. పర్యవసానంగా గ్రేటర్ ప్రజలు ఇప్పుడు ఎన్ని
అవస్థలు పడుతున్నారో కేసీఆర్ వివరించారు. అంతేకాదు.. విశ్వ నగరానికి ఎలాంటి
ప్రణాళికలు రూపొందించారు,
గ్రేటర్ పగ్గాలను టీఆర్ఎస్
పార్టీకి అప్పగిస్తే ప్రణాళిక అమలు ఎలా ఉంటుందనేది అంశాలవారీగా ప్రజల ముందు
ఉంచారు. ఇప్పటికే ఆ దిశగా వేసిన అడుగులు, నిధుల
సమీకరణ తీరును వెల్లడించారు.
గత
30 ఏండ్లుగా నగరవాసులు పడుతున్న గోసను కేవలం ఐదారు సంవత్సరాల్లోనే దూరం
చేయడంతోపాటు హైదరాబాద్‌కు గ్లోబల్ హంగులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి స్పష్టం
చేశారు. ప్రభుత్వ అధినేతగా,
ముఖ్యమంత్రి హోదాలో గ్రేటర్
హైదరాబాద్ ప్రజలకు ఇది తాను ఇస్తున్న హామీ అని చెప్పారు. హైదరాబాద్ ఓటర్లు పోలింగ్‌లో
తక్కువగా పాల్గొంటారనే అపవాదును తుడిచేలా ఈ గ్రేటర్ ఎన్నికల్లో భారీ పోలింగ్‌ను
నమోదు చేసి ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేయాలంటూ ఓటర్లలో చైతన్యం నింపిన
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్‌ను
అద్భుతంగా ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
“గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో
విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో జంట నగరాల్లో
ఈ-ప్రచారానికి శ్రీకారం చుట్టినం. ఎన్నికలు వచ్చాయంటే సహజంగా రాజకీయ పార్టీలు
ప్రజల వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి.
దీంట్లో కొత్తవాళ్లు ఎవ్వరూ కూడా లేరు. ఎన్నికల సందర్భంగా సృష్టించే రణగొణ
ధ్వనుల్లో కొట్టుకుని పోకుండా ప్రజలు ఓటేసే ముందు నిదానంగా కుదురుగా ఆలోచించాల్సిన
అవసరముంది. జంట నగరాల్లోని మేధావులు, విజ్ఞులు
చాలా మందికి నా విజ్ఞప్తి ఏందంటే.. ఇపుడున్న పార్టీల్లో ఏ పార్టీని గెలిపిస్తే
మంచిదో ఆలోచించి మరీ ఓటు వేయాలని కోరుతున్నా. గతంలోని కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్
పాలనలో ఏం జరిగిందో,
ప్రజలకు ఏ మేలు జరిగిందో మీ
గమనంలో ఉన్నది”.
“ఒక్క విద్యుత్
రంగాన్ని తీసుకుంటే వీరిద్దరి పాలనలో జంట నగరాలు, యావత్తు తెలంగాణ కూడా 30 ఏండ్లు గోస పడింది. ఆనాటి స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు జంట నగరాల్లో ఈ కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్ల షాపులు మూతపడ్డాయి. తెలంగాణ ఏర్పడ బోయే క్రమంలో తెలంగాణ
అంధకారమవుతుందని, చిమ్మచీకట్లు
కమ్ముకుంటాయని చాలా వాదనలు మనం చూశాం. కానీ ఐదారు నెలల్లోనే అద్భుతమైన పవర్ సప్లై అందుతున్నది. జంట నగరాలకు రెప్పపాటు కరెంటు పోకుండా సరఫరా
జరుగుతున్నది. పరిశ్రమలకూ 24 గంటలు పవర్ సప్లై ఇస్తున్నాం". “ఈరోజు
పరిశుభ్రమైన మంచినీరు పట్టణమంతటికీ వచ్చే పరిస్థితి లేదు. దీనికి బాధ్యులు ఎవరు? 60 ఏండ్లు పనిచేసిన వాళ్లా? లేక 18నెలలు పనిచేసిన వాళ్లా? ఒకప్పుడు అద్భుతమైన, పరిశుభ్ర నీటితో పరవశించి పారే మూసీని
ఈరోజు మురికి కూపంగా మార్చిన ఘనత ఎవరిది? హుస్సేన్‌సాగర్
ఒకప్పటి మంచినీటి సరస్సు. దాన్ని ఒక కాలుష్య కాసారంగా, కంపు కొట్టేలా చేసిందెవరు? ఎవరు దీనికి బాధ్యులో ప్రజలు ఆలోచించాలి.
ఇపుడు పోటీలో ఉన్నవి కొత్త పార్టీలు కావు. వీళ్లందరి చరిత్రలు మీకు తెలుసు.
కాంగ్రెస్
గానీ, టీడీపీ గానీ వాళ్లు పనిచేసిన టైమ్‌లో
జరిగినటువంటి భూకబ్జాలు,
నాలాల కబ్జాలు, సరస్సులు మాయం కావడం.. ఇలాంటి
దుర్మార్గాలన్నింటికీ తెరలేపింది ఈ రెండు పార్టీలే. మళ్లీ ఈరోజు అవే పార్టీలు
వచ్చి మేం మళ్లీ చేస్తామని చెప్తున్నాయి. దీన్ని జంట నగరాల ప్రజలు విశ్లేషించాలి.
ఓటేసే ముందు పార్టీ,
నాయకుల నిబద్ధత, ప్రతిబద్ధతను ప్రజలు పరిగణనలోనికి
తీసుకోవాలి. సరైన పౌర సేవలు అందాలన్నా.. ఈ విషయంపై ప్రజలు తప్పకుండా దృష్టిపెట్టాలి.
సరైనటువంటి తీర్పును ఇవ్వాల్సిన అవసరముంది”.
“టిఆర్ఎస్‌ను 2001లో ప్రారంభించిన
సందర్భంలో ఒకే ఒక్క మాట చెప్పిన. నేను నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం
సాధించాలని బయల్దేరిన. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా ఉద్యమ మార్గం
వీడేదిలేదు. ఒకవేళ వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన. అనేక అవమానాలు, అనేక అవరోధాలు, అనేక ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ 15
సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి,
ఈ రోజు తెలంగాణ
సాధించుకోగలిగినం.
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ
నల్లా ద్వారా కృష్ణా,
గోదావరి నీళ్లు తెచ్చి
అద్భుతంగా మిషన్ భగీరథతో ఈ టర్మ్‌లోనే మంచి నీళ్లు అందిస్తాం. మంచి నీళ్లు
కొనుక్కునే దుస్థితి తప్పిస్తాం. ఒకవేళ మంచి నీళ్లు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్
ఓటు అడగదని ముఖ్యమంత్రి హోదాలో నేను శాసనసభలో చెప్పిన. ఇట్ల చెప్పిన పార్టీగానీ, ప్రభుత్వం గానీ, నాయకుడు గానీ 67 ఏండ్ల స్వతంత్ర
దేశంలో ఎవరూ లేరు. లక్ష్య సిద్ధి,
చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా
సాధ్యమవుతుంది. ఒక పార్టీ,
అందులోని నాయకులందరి
భవిష్యత్తును పణంగా పెట్టి చెప్పిన టీఆర్ఎస్ దృక్పథాన్ని ఓటర్లు గమనించాలి”.
“హైదరాబాద్లో
అనేక విషయాలు ఉండాల్సిన స్థాయిలో లేవు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించినం. గవర్నర్, ముఖ్యమంత్రితో సహా సిఎస్, ఐఏఎస్,
ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు జంట
నగరాలను 400 భాగాలుగా
విడదీసి.. గల్లీ గల్లీలో వారం
పాటు తిరిగినం. తిరగడమే కాకుండా
అక్కడి నుంచి విజ్ఞప్తులు తీసుకొని రూ.200 కోట్లతో వందల వేల పనులు చేపట్టినం.
పార్టీలు, రాజకీయాలకతీతంగా జంట నగరాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కమిటీలు
ఏర్పాటు చేసి ఢిల్లీ,
నాగపూర్‌కు
పంపి, అక్కడి
పరిస్థితులపై అధ్యయనం చేయించినం. 2500 మందికి ఆటోట్రాలీలు ఇచ్చినం. 44 లక్షల డస్ట్ బిన్స్ పంపిణీ చేసినం.
ఇది ఒక అడుగు. హైదరాబాద్ అంతా కంచన్ బాగ్, కుందన్ బాగ్ లాగా
ఉండేది. బస్తీలను
ఉద్యానవనాలుగా పిలుచుకునే వాళ్లు. ఇప్పుడవి కనుమరుగైపోయినయ్. ఒకప్పుడు సిటీ ఆఫ్ పెర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్ అని హైదరాబాద్ కు పేరుండె. 11 వేల పైచిలుకు చెరువులుండే నగరంలో ఈరోజు 118 మాత్రమే ఉన్నాయి.
ఎవరి హయాంలో మాయం అయ్యాయో ప్రజలు గమనించాలని
కోరుతావున్నా. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ.30 వేల కోట్లతో రోడ్లను నిర్మించేందుకు ప్లాన్
చేస్తున్నం. చైనాకు
వెళ్లినప్పుడు బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్, మన భారతీయుడు కామత్‌ను కలిసిన.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ అవస్థలు చెప్పి.. రూ.25వేల కోట్లు కావాలని అడిగిన. ట్రాఫిక్ బాధల నుంచి విముక్తికి స్కైవేలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని
చెప్పిన. పీవీ
నరసింహారావు స్కైవే లెక్క నాలుగు వైపులా స్కైవేలు రావాలి.
ఉప్పల్‌నుంచి ఘట్ కేసర్, ప్యారడైజ్‌నుంచి తూంకుంట, బొల్లారంనుంచి కొంపల్లి ఇలా స్కైవేలు రావాలి. వరంగల్ వాళ్లు ఉప్పల్ వరకు రావడానికి
గంటంబావు పడితే.. నగరంలోకి
వచ్చేందుకు గంటన్నర పడుతున్నది. ఈ ఇబ్బందులు పోయేందుకు స్కైవేలు ఏర్పాటు చేయాల్సివుంది".
“నేను 2014 జూన్ రెండున ప్రమాణ
స్వీకారం చేస్తే.. ఆరో తేదీన జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం పెట్టిన. వర్షాకాలం
సిటీ మొత్తం జలమయం అవుతుంటే వాటిపై చర్చించినం. సీఎం క్యాంపు ఆఫీసు, అసెంబ్లీ, రాజ్‌భవన్ ముందు మోకాల్లోతు, కార్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి.
దీని బాగు చేయలేరా?
అని అడిగిన. ఏం చేయలేం సార్..
అని అధికారులు అన్నరు. కాంగ్రెస్,
టీడీపీ ప్రభుత్వాల పుణ్యమా
అని రెయిన్ వాటర్ డ్రెయిన్స్ అన్నీ కబ్జా అయిపోయినయి. రూ.11-12వేల కోట్లు ఖర్చు
పెట్టడమే కాదు మూడేండ్లు సమయం ఇస్తే తప్ప బాగు చేయలేమన్నరు. మురుగునీరు, మంచినీటి వ్యవస్థ కావచ్చు.. పౌర
సేవలకు కావాల్సిన వసతులు కావాలంటే 30వేల కోట్లు ఖర్చు పెట్టాలి. త్వరలో బ్రిక్స్
బ్యాంక్‌తో మాట్లాడి రూ.25వేల కోట్లు తెస్తం”.
“హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం.
గతంలో తెలంగాణ తెస్తా అని ఎట్ల చెప్పిన్నో.. అదే నిబద్ధత, చిత్తశుద్ధితో హైదరాబాద్‌ను గ్లోబల్
సిటీగా తీర్చిదిద్దే అవకాశం టిఆర్ఎస్‌కు ఇవ్వండి. జంట నగరాల ప్రజలమీద ఒక బాధ్యత
ఉంది. సరైన వారిని గెలిపించి సరైన వారికి అధికారం కట్టబెట్టాలి. జంట నగరాల వాసులు
ఓటింగ్‌లో సరిగా పాల్గొనరనే అపవాదు ఉంది. ఇది తొలగిపోవాలంటే ఓటింగ్ శాతాన్ని
పెంచాలి. పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే మందుగానే వచ్చి ఓటేయండి. లేకపోతే సాయంత్రం
వేయండి. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విజ్ఞతను చాటాలని కోరుతున్నా. కొందరు పెద్దలు ఫ్రస్టేషన్‌లో
వాగ్దానాలు చేస్తున్నరు. అన్నింటికీ టాక్స్‌లున్నాయిగానీ... టాక్స్ లేనిది వాగ్దానాలకే. ఫ్రీగా మంచి నీళ్లు
ఇస్తామని కాంగ్రెసోళ్లు పరిపక్వత లేకుండా వాగ్దానాలు చేస్తున్నరు. జీహెచ్‌ఎంసీకి, జల మండలికి సంబంధమే లేదు. జల మండలి
చైర్మన్ సీఎం. మరి జీహెచ్‌ఎంసీలో గెలిస్తే ఉచిత నీళ్లు ఎట్ల ఇస్తరు? అడ్డగోలు వాగ్దానాలు.. పరిణతి చెందిన
పార్టీ అంటరు. పేలవంగా మాట్లాడుతున్నరు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా”.
“టిఆర్ఎస్‌కు ఓటేసేందుకు రాష్ట్రం
మొత్తానికి, హైదరాబాద్‌కు కరెంటును ఇస్తున్నదనే
విషయం ఒక్కటి చాలు. ముంబైకి ఐలాండ్ తరహా పవర్ సైప్లె ఉంది. అందుకే ముంబైని నెవర్
స్లీప్ సిటీ అంటరు. హైదరాబాద్‌కు కూడా త్వరలోనే ఐలాండ్ తరహా పవర్ సైప్లె చేయబోతున్నాం.
అన్ని జనరేటింగ్ స్టేషన్లను హైదరాబాద్‌కు అనుసంధానించి.. రెప్పపాటు కూడా హైదరాబాద్‌ల
కరెంటు పోకుండా ఏర్పాట్లు చేస్తున్నం.
“జంట నగరాల్లో కూరగాయలు, మాంసం, చేపల
మార్కెట్లు జనాభాకు అనుగుణంగా లేవు. 200 మార్కెట్లు ఉండాలి. ఏడు మాత్రమే ఉన్నాయి.
ఇది సిగ్గు చేటు. ఇది ఎవరి నిర్లక్ష్యానికి నిదర్శనం? ప్రభుత్వ స్థలాల్లో ఈ 200 మార్కెట్లు
నిర్మించేందుకు చర్యలు తీసుకున్నం. ఇంత పెద్ద నగరంలో 500 పబ్లిక్ టాయిలెట్స్
ఉండాలె. అన్నీ కలిపి 150 కూడా లేవు. ఉన్నా సమగ్రంగా లేవు. ముఖ్యంగా మహిళలు.. వారి
బాధ వర్ణనాతీతం. అందుకే 250 టాయిలెట్లు నిర్మిస్తున్నాం. క్రైస్తవ, మహ్మదీయ, హిందూ సోదరులకు కావాల్సిన దహన, ఖనన వాటికల ఏర్పాటుకు మున్సిపల్
అధికారులకు ఆదేశాలిచ్చాం. డంపింగ్
యార్డ్స్ కూడా క్రమ పద్ధతిలో లేవు. జవహర్ నగర్‌లోని డంపింగ్‌యార్డు ప్రజల
జీవితాలను కలుషితం చేసేలా ఉంది. నగరానికి నాలుగు వైపుల నాలుగు డంపింగ్
యార్డులుండాలని నిర్ణయించాం. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు
తీసుకుంటున్నం. దవాఖానల వద్ద నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నం. వీటిని వందల
సంఖ్యలో నిర్మిస్తాం. నగరంలో 50మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి
ఆదేశించాం. 3800 సిటీ బస్సులు తిరిగే నగరం మనది. 45 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో
ప్రయాణం చేస్తున్నరు. బస్‌బేలు సరిగా లేవు. అధునాతన పద్ధతిలో వీటిని
నిర్మించేందుకు చర్యలు తీసుకున్నం. మిషన్ కాకతీయద్వారా జంట నగరాల్లోని 1069
చెరువుల పునరుద్ధరణ చేపట్టినం. రెండు బస్టాండ్లు సరిపోవు. ఇంక నాలుగు బస్
టర్మినల్స్ అవసరమన్నాయి. రైల్వే స్టేషన్లు కూడా మూడే ఉన్నాయి. ఢిల్లీ మాదిరిగా
రెండు వైపులా కొత్త రైల్వే టర్మినల్స్ కావాలని చెప్పాం. చర్లపల్లి వద్ద కొత్త
రైల్వే టర్మినల్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 12 మిలియన్ల మంది
ప్రయాణికులు ఉంటే రెండో రన్‌వే ఏర్పాటు చేయాలి. శంషాబాద్ విమానాశ్రయం సామర్థ్యం 10
మిలియన్లు దాటిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా సెకండ్ రన్‌వే కూడా
ఏర్పాటు చేయాల్సి ఉంది. జీఎం ఆర్‌తో మాట్లాడాం. ఒప్పందంలో ఉన్నందున దాన్ని
చేపట్టాలని చెప్పినం. ఇది చారిత్రక నగరం. సిస్మలాజికల్ కండిషన్లు కావొచ్చు..
పర్యావరణ సమతుల్యత కావొచ్చు దేశంలో ఏ నగరానికీ లేని హంగులు హైదరాబాద్‌కు ఉన్నాయి.
మాస్టర్‌ప్లాన్ ఏ విధంగా ఉండాలో అలా రూపొందించాలని హెచ్‌ఎండీఏకు ఆదేశాలిచ్చినం. రీ
ఇంజినీరింగ్ జరిగింది. త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. దేశంలో ఏ రాష్ట్ర
ప్రభుత్వం తీసుకోని విధంగా రూ.40వేల కోట్లతో సంక్షేమ పంథాలో పోతున్నం. పేదవాడు
ఆత్మగౌరవంతో బతకాలనేది టీఆర్ఎస్ నినాదం. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం చేపట్టినం.
వెయ్యి రూపాయల పింఛను ఇచ్చినం. బియ్యం ఆరు కిలోలు ఇస్తున్నం. 40 లక్షల మంది
హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం ఇస్తున్నం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదలకు
ఊరటనిస్తున్నం. రైతులకు రుణాలు మాఫీ చేసినం”.
“గత ప్రభుత్వ హయాంలో బుల్‌డోజర్లతో
పేదల గుడిసెలను కూలగొట్టేవారు. కానీ చరిత్రలో మొదటిసారిగా లక్షల మంది పేదలకు
పట్టాలిచ్చినం. డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా కట్టిస్తం. మైనారిటీలకు రూ.1100
కోట్లు బడ్జెట్‌లో పెట్టినం. వచ్చే సంవత్సరంనుంచి వారికి 60 రెసిడెన్షియల్
కాలేజీలు ఏర్పాటు చేస్తున్నం. అంగన్‌వాడీల జీతాలు పెంచినం. ఆటో రిక్షాలకు టాక్స్
రద్దు చేసి రూ.70 కోట్లు మాఫీ చేసినం. 10 లక్షల ఆటో డ్రైవర్లు, 15 లక్షల భవన నిర్మాణ కార్మికులకు
రూ.5 లక్షల బీమా కల్పించినం. నగరంలో 14% క్రైం రేటు తగ్గిందని అధికారులు
చెప్తున్నరు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు మీ అందరి గమనంలో ఉన్నది. పోలీసులకు
అధునాతన వాహనాలు కల్పించినం. కృష్ణా, గోదావరి
నదుల నుంచి వందల కిలోమీటర్ల నుంచి పైపు లైన్లతో నీళ్లు తీసుకువస్తున్నం. మధ్యలో ఓ
పది రోజులు నీటి సరఫరా ఆగిపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంది? గతంలోని పాలకులు ఎవరూ దీని గురించి
ఆలోచించలె. అందుకే నగరానికి రెండు వైపులా 20 టీఎంసీల చొప్పున రెండు డెడికేటెడ్
జలాశయాలు నిర్మిస్తున్నం. సిటీ బస్సుల్లో సెపరేటర్స్ పెట్టించినం. టీఆర్ఎస్
పార్టీని 2001లో ప్రారంభించిన సందర్భంలో ఒకేఒకమాట నేను ప్రజలకు చెప్పిన. నేను నా
జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని బయలుదేరిన.. ఎట్టి పరిస్థితుల్లో
ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమ మార్గం
వీడేదిలేదు. ఒకవేళ వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండని ఆనాడు చెప్పిన. అనేక
అవమానాలు, అనేక అవరోధాలు, అనేక ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ
పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ సాధించుకోగలిగినం”.
హైదరాబాద్‌ను
విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే అజెండా.. అందులో ఏమాత్రం రాజీ లేదని సీఎం కేసీఆర్
స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు తాము చేయబోమని, నగరాభివృద్ధి ప్రణాళికల అమలుకు
ఐదారేండ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం సచివాలయం
నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని చెప్పారు. హుస్సేన్‌సాగర్, మూసీ ప్రక్షాళణకు ఆస్ట్రియా బృందానికి
పనులు అప్పగించామని తెలిపారు. నగరంలో నాలుగైదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని
చెప్పారు. జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఇప్పటికే ఖాయమైందని స్పష్టం చేశారు. తమ
ప్రణాళికలకు నిధులు ఎక్కడినుంచి సేకరిస్తున్నదీ మొదలుకొని జీహెచ్‌ఎంసీ మేయర్
పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబుతున్నదీ గణాంకాలతో సహా వివరించారు. పొలిటికల్
టెర్రరిజం ఎవరిదని ప్రశ్నించిన కేసీఆర్.. ఇతర రాజకీయ పార్టీల నాయకులు టిఆర్ఎస్‌లో
చేరుతున్నారు. దానిని తెలంగాణ శక్తుల పునరేకీకరణ గా భావిస్తున్నా మన్నారు. ఈ
ఎన్నికల్లో తమకు ప్రత్యర్థి అంటూ పలానా పార్టీ అని చెప్పే పరిస్థితి లేదన్నారు.
“అసలు చంద్రబాబు ఇక్కడికి రావటమే
అసంబద్ధం. ఆయనకు ఇక్కడేం పని?
ఊడ్చుకోవడానికి ఆయనకు
హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉంది. తిరుపతి, గుంటూరు, వైజాగ్ ఇలా అనేక పట్టణాలున్నాయి.
అవన్నీ డెవలప్ అయిపోయినయి.. ఇగ చేసేదేంలేదని ఇక్కడికి వస్తున్నడా? అవన్నీ వదిలేసి హైదరాబాద్ రోడ్లు
ఊడుస్తుమంటే ఎవరు నమ్ముతరు?
17 సంవత్సరాల సుదీర్ఘ టీడీపీ
పాలనలో ఆయన మామ, ఆయనే ఉన్నారు. హైదరాబాద్‌కు చేసిందేం
లేదు. ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఫలితం కూడా అదే విధంగా ఉండబోతోంది. జీహెచ్‌ఎంసీ
పై గులాబీ జెండా ఎగరడం ఖాయం. దానిని ఎవరూ అపలేరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్
ఆవిర్భవిస్తుంది. ప్రతిపక్షాల సర్వేల్లోనూ ఇదే తేలింది. ఎక్స్ అఫీషియో మెంబర్లు
మాకే ఎక్కువ ఉంటారు. ఇక మజ్లిస్ మాకు మిత్రపక్షమే. ఎట్ల లెక్క చూసినా మాదే మేయర్
పీఠం. మొన్న నమస్తే తెలంగాణ వాళ్ళు కూడా రాశారు. లెక్క ఉంది.. తేలాల్సింది సీట్ల
లెక్కనే. మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడరే అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా
ఉంటామని ప్రకటించారు. వాళ్లది ఏ తత్వమైనా రాజకీయంగా మాకు మిత్రపక్షమే. వారి బ్లడ్
గ్రూప్ ఏంది.. బీజేపీ బ్లడ్ గ్రూప్ ఏంది అనేది మాకు సంబంధం లేదు. బీఫ్ మీద కూడా
మాట్లాడటం రాజకీయ దౌర్బల్యం. ఎవరు ఏం తింటేంది? ప్రపంచవ్యాప్తంగా
బీఫ్ తింటరు. చైనాలో పాములు,
కప్పలను కూడా తింటరు.
పాతబస్తీలో టిఆర్ఎస్‌ను బ్రహ్మాండంగా హర్షిస్తున్నారు. సర్వేల్లోనూ అక్కడ మజ్లిస్, టీఆర్ఎస్ రెండు పార్టీలకే ఓట్లు పడతాయని
అంటున్నారు. ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించడం సాధ్యం కాదు. మేయర్ అభ్యర్థిని
గెలిచిన తరువాత అందరూ కూర్చుని నిర్ణయిస్తారు”.
“డబుల్ బెడ్ ఇండ్లకు నిధులెక్కడివి
అంటున్నారు. అనేక పథకాలనుంచి సమీకరిస్తున్నాం. కేంద్ర పథకాల్లో అర్బన్ హౌసింగ్
స్కీములున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర పథకాల నిధులు కలిపి నిర్మించి ఇస్తాం.
కేసీఆర్ నిబద్ధతతో ఉన్నాడు. హడ్కో నుంచి , రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతాం. హైదరాబాద్‌లో భూములు అమ్మితే వచ్చేవి
కూడా ఇండ్లకు పెడతాం. ప్రభుత్వం తరపున నగరంలో వెయ్యి ఎకరాలు సేకరించినం. ఎక్కువ
భాగం స్థలాలకే ఖర్చు ఉంటుంది. ఈ స్థలాల్లో వచ్చే యేడాది కల్లా లక్ష డబుల్ బెడ్ రూం
ఇండ్లను నిర్మించబోతున్నాం. రాష్ట్ర ఆదాయంలో ఈ సంవత్సరం 15 శాతం పెరుగుదల ఉంది.
కేవలం ప్లాన్డ్ ఎక్స్‌పెండిచరే రూ. 60 వేల కోట్ల పైచిలుకు ఉంది. చైనాలో కూడా 15
శాతం లేదు. ఏడాదికి రూ. 6 లక్షల ఆదాయం ఉన్న మధ్య తరగతి వర్గాలకు కూడా క్రెడిట్ లింకే
జీ స్కీం కింద డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం. తెలంగాణ
ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నిబద్ధతతో లబ్ధిదారుల ఎంపికలో
రాజకీయాలు ఉండొద్దని అనుకున్నాం. ఎమ్మెల్యే కేవలం తన నియోజకవర్గంలో ఇండ్లు
నిర్మించే గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అంతా అధికారులదే.
చిన్న తప్పు జరిగినా ఉద్యోగం ఊడదీస్తామని హెచ్చరించాం. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం
ఇండ్ల దరఖాస్తులను వంద శాతం రెవెన్యూ అధికారులతో కలెక్ట్ చేయిస్తాం. కట్ ఆఫ్ డేట్, అన్ని వివరాలు ప్రకటిస్తాం”.
“కొత్త సెక్రటేరియట్‌కు జీహెచ్‌ఎంసీ
ఎన్నికల తరువాత నేనే శంకుస్థాపన చేయబోతున్నా. ఉస్మానియా ఆసుపత్రి టవర్స్‌కూడా
రూపకల్పన పూర్తయింది. ఉన్న భవనం వెనుక కొత్త భవనాలను నిర్మిస్తాం. చెస్ట్ ఆసుపత్రి
ఆటోమేటిక్‌గా తరలిపోతుంది. హుస్సేన్ సాగర్ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. సమైక్య
రాష్ట్రంలో కుళ్ళిపోయి సర్వనాశనం అయ్యింది. కెమికల్స్ దాంట్లో కలవకుండా మళ్లించే పనులు
చేపట్టాం. దానిని వివాదం చేశారు. ఆస్ట్రియా బృందం వద్ద కొత్త టెక్నాలజీ ఉంది. మూసీ, హుస్సేన్‌సాగర్ పనులను వాళ్ళకు
అప్పగించాం. కేసీఆర్‌గా హామీ ఇస్తున్నా.. వాటిని ప్రక్షాళన చేసి ఆచరణలో చూపెడతాం. రేస్
కోర్స్‌ను తరలిస్తాం. చర్లపల్లి జైలు వద్ద 90 ఎకరాల ఓపెన్ స్పేస్ ఉంది. చంచల్‌గూడ
జైలును తరలిస్తే పాతబస్తీలో 170 ఎకరాల జాగా ఉంటది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరికీ సంబంధించి
విద్యాలయాలను ఏర్పాటు చేస్తాం. బస్‌బేలు, మార్కెట్ల
వంటి మౌలిక వసతుల కోసం కొంత స్థలాన్ని వినియోగిస్తాం”.
“హైదరాబాద్‌కు ఉత్తర భాగంలో గానీ, తూర్పు బాగంలో కానీ ఇంకో ఎయిర్‌పోర్టు
రావాలి. ప్రభుత్వం వద్ద 700ఎకరాల భూమి ఉంది. కేంద్రంతో మాట్లాడుతున్నాం. సివిల్
ఎయిర్‌పోర్టు కింద ఇది పనిచేస్తుంది. ఔటర్ రింగు రోడ్డుపై క్రాసింగ్స్, రేడియల్ రోడ్లు సంపూర్ణం కాలే. హెచ్‌ఎండీఏ
మాస్ట్‌ర్‌ప్లాన్‌లో అవన్నీ కూడా ఉంటాయి. లీడ్ సంస్థతో ఓఆర్‌ఆర్‌ను ఇంటిగ్రేట్
చేస్తూ క్రాస్ ఓవర్ లేకుండా చేస్తున్నాం. జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూం కంటే మంచి
సదుపాయం కల్పిస్తాం. 580 చదరపు అడుగులు కాకుండా 800 చదరపు అడుగుల్లో నిర్మించి
ఇస్తాం. కమిటీ వేసి అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం. నేను
ఫౌండేషన్ స్టోన్ వేస్తా. సంవత్సరం లోపు ప్రారంభించుకుందాం”.
“కేంద్ర ప్రభుత్వం దేశంలో 20 నగరాలను
స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తే తెలంగాణకు ఒక్కటీ లేదు. ఏపీలో కాకినాడ, వైజాగ్‌లు ఉన్నాయి. మరి తెలంగాణ కాకి
ఎత్తుకుపోయిందా? కేంద్రం తీరు హర్ట్ చేసే విధంగా ఉంది.
అప్పట్లో పెట్టుబడిదారులకు అనుకూల ప్రదేశాల్లో తెలంగాణను ప్రకటించలేదు. టీఎస్‌ఐపాస్
కింద ఏర్పాటుచేసిన ఇంక్యుబేటర్ సెంటర్‌ను సత్యనాదెళ్ళ, రతన్ టాటా, సుందర్‌పిచాయ్‌లు అభినందించారు.
కేంద్రం మాత్రం అభినందించలేదు. ఏదో చిల్లర ప్రచారం కోసం టీఆర్ఎస్, కేసీఆర్‌పై అప్పర్ హ్యాండ్
సాధిస్తామంటే అది సాధ్యం కాదు. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారు. తెలంగాణ కరువు నివేదిక
ఇయ్యలేదని బీజేపీ వాళ్ళు చెప్పిస్తారు. ప్రభుత్వానికేమో అక్టోబర్ 30 వరకు ఇవ్వాలని
అధికారికంగా లేఖ రాస్తారు. కేంద్రం, రాష్ట్రం
మధ్య రాజ్యాంగ సంబంధం ఉండాలి. వెంకయ్యనాయుడు ప్యాకేజీ, లీకేజీ అంటే.. ప్యాకేజీ ఎక్కడిది..
లీకేజీ ఎక్కడిది. ఆయన ప్రాస అందరికీ తెలిసిందే. నాక్కూడా అద్భుతమైన తెలుగు వస్తది”.
“వ్యవసాయానికి వాడకపోవడం వల్లనే నగరంలో
24 గంటల కరెంట్ ఇచ్చారనేది అవాస్తవం. గతంలోకంటే 5 నుంచి 10 వేల మిలియన్ యూనిట్ల వాడకం
పెరిగింది. ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి. పాఠశాల ఫీజులపై ఒక నియంత్రణ
చేపట్టాల్సి ఉంది. రానున్న క్యాబినెట్‌లో ఈ అంశంపై విధాన నిర్ణయం తీసుకోనున్నాం.
రూ. 500కోట్ల నుంచి రూ. 1000 కోట్ల లోపు వచ్చే అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్‌ను ప్రవేశపెడతాం.
బీసీ క్రీమీలేయర్ అనేది సుప్రీంకోర్టు ఆదేశం. కేంద్రం, రాష్ర్టాలు ఖచ్చితంగా అమలు
చేయాల్సిందే. చేయమని చెప్పే ఆస్కారమే లేదు”.
“తెలంగాణ ప్రభుత్వం ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదంతో
వ్యవహరిస్తుంది. అసాంఘిక శక్తులను అణచివేస్తాం. సంఘ వ్యతిరేక శక్తుల ఆటలు సాగనివ్వం
శాంతి భద్రతలు సామరస్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. ఇదే టాప్ ప్రయారిటీ.
ఎక్కడా రాజీపడం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితే లేదు. ప్రైవేటు మనీ లెండర్స్
అంశంపై కఠినమైన చట్టాలు తేవాల్సి ఉంది. ఇప్పటివరకు బ్లాక్ మనీ, వైట్ మనీ చూసినం. కానీ ఇప్పుడు కొత్తగా
ఈ కాల్ మనీ వచ్చింది. ఆంధ్రలో కాల్ మనీ సృష్టికర్తలే ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి
ఓట్లు అడుగుతున్నారు. అందుకే హైదరాబాద్ ఓటర్లు తస్మాత్ జాగ్రత్త”.
“ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల్ని
తరలించే పనులు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందనేది వాస్తవం. కానీ మా ప్రభుత్వం అన్ని
ఆటంకాలు, అవరోధాల్ని తొలగించి, వేగంగా పూర్తి చేశామని చెబుతున్నం.
లేకపోతే ఇంకా మూడేండ్లకు కూడా పూర్తి కాకపోయేది. రైల్వే సహాయనిరాకరణ వల్ల ఒక్కచోట
రెండేండ్లనుంచి పెండింగ్‌లో ఉంది. నేను రైల్వే జీఎం శ్రీవాత్సవ ఉన్నపుడు ఆయనకు
ఫోన్ చేసి... మీ రైల్వే వాళ్లు 200 బోర్లు వేసుకోండి.. మీకు బల్క్‌గా నీళ్లివ్వటం
మావల్ల కాదు. మాకే నీళ్లు లేవు అని అంటే, అదేంది
సార్... గుస్సా అవుతున్నరు అని ఒక్క రోజులో పర్మిషన్ ఇచ్చిండు. డిఫెన్స్ భూములకు
సంబంధించి.. కంటోన్మెంట్‌కు కూడా అదే చెప్పినం. వెంటనే అనుమతులిచ్చినరు. నిరంతరం
పర్యవేక్షణతో ఎఫెక్టివ్‌గా స్టెప్స్ తీసుకున్నం. వర్షాభావంతో సింగూరు ఎండిపోయినా
నగరంలో నీటి కొరత రాకుండా చూసినమని ప్రజలకు చెప్పినం”.
“దురాశతో కాంగ్రెస్ నాయకులు వీ హెచ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రా వాళ్లను
మీరు రాక్షసులన్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న
వారందరినీ మేము రాక్షసులు అన్నమాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి సమైక్య
పాలకులకు మడుగులొత్తితే.. వాళ్లను కూడా దద్దమ్మలు, చవటలు, సన్నాసులు అనికూడా అన్నాం. ఉద్యమ
నాయకుడిగా ఆరోజు అది నా కర్తవ్యం. అప్పుడు టీఆర్ఎస్ ఫక్తు ఉద్యమ పార్టీ. ఆ
రీతిగానే ఉన్నం. తెలంగాణ సాధించుకున్నం. 2014 జూన్ 2 తరువాత టీఆర్ఎస్ రాజకీయ
పార్టీగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న కన్నడిగులు, మళయాళీలు, గుజరాతీలు సహా అందరూ మావారే.
హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా గర్వంగా హైదరాబాదీయులుగా చెప్పుకోవాలని సభల్లో కూడా
చెప్పాను. 18 నెలల్లో చీమన్నా చిటుక్కుమన్నదా? చంద్రబాబు
హైదరాబాద్‌లో సెక్షన్ 8 ను అమలు చేయాలని అన్నారు. ప్రాంతాల మధ్య కక్షలు
రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సింగిల్ కంప్లైంట్‌కూడా లేదు. చిల్లర రాజకీయాల
కోసం, వచ్చే నాలుగు ఓట్ల కోసం కక్కుర్తి పడి
హైదరాబాద్ ప్రశాంతతకు భంగం కలిగించకండి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా
కాలనీల్లో టిఆర్ఎస్‌కు ఓటేస్తామని ముందుకు వస్తున్నారు”.
“నగరాభివృద్ధికి నిధులెక్కడివని కొందరు
అడుగుతున్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంస్థ రూ. 7500 కోట్లు ఇస్తానంది. హడ్కో రూ. 2 వేల
కోట్ల రుణం ఇచ్చింది. మొత్తం రూ. 9500 కోట్లకు టై అప్ జరిగిపోయింది. బ్రిక్స్
బ్యాంకుతో మాట్లాడాల్సి ఉంది. రూ. 20 నుంచి రూ. 25 వేల కోట్ల రుణానికి వారు ఎస్
అనగానే కార్యాచరణ మొదలవుతుంది. జీహెచ్‌ఎంసీ నిధులు, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ మొత్తం, భూములు అమ్మగా వచ్చిన మొత్తాన్ని
కలిపి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అయితే సమస్యలు ఓవర్ నైట్‌లో
పరిష్కారం కావు. నేను మాయమాటలు చెప్పను. నగరంలో మురుగు నీటి వ్యవస్థ, వాన నీటి కాలువలు బాగు చేయాలంటే మూడు
నాలుగు సంవత్సరాలు పడుతుంది. కబ్జాలు తొలగించాలి. కోర్టుల్లో కేసులు ఉంటాయి. పరిపాలనా
పరమైన సౌలభ్యం ఉండాలని రంగారెడ్డి జిల్లాను అలాగే ఉంచి ఇబ్రహీంపట్నం, మేడ్చెల్ వంటి ప్రాంతాలను కలుపుకొని
గ్రేటర్ హైదరాబాద్‌ను 4-5 జిల్లాలుగా చేస్తాం”.
“చంద్రబాబు హైదరాబాద్‌కు కేంద్రం
నిధులు తెస్తడా? ఆయన అమరావతికే దిక్కులేదు. పీఎం వచ్చి
నీళ్లు, మట్టి ఇచ్చిపోయిండు. రెండు కుండలు
తెస్తే ఇదేందిరా? అని పరేషాన్ అయిన. వెంకయ్యనాయుడుని
అడిగిన ఏమన్న ఇస్తున్నరా అని. ఏంలేదని చెప్పిండు. వాస్తవానికి అమరావతి పోకముందు
అక్కడ ఏదైనా సాయం ప్రకటించాలని అనుకున్నం. కాని ప్రధానమంత్రే మట్టి, నీళ్లు ఇచ్చినపుడు నేను ఏదైనా సాయం
ప్రకటిస్తే బిడ్డా నాకంటే గొప్పోనివి అయిపోయినవా? అనుకుంటారని
ప్రకటించలేదు. ఈ విషయాన్ని యనమలతో, చంద్రబాబుతో
కూడా చెప్పిన”.
28-01-2016 (నమస్తే తెలంగాణ సౌజన్యంతో)