Saturday, January 30, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-37 : కుమారస్వామి జన్మ చరిత్ర : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-37
కుమారస్వామి జన్మ చరిత్ర
వనం జ్వాలా నరసింహారావు

          "పార్వతితో శివుడు తపస్సు చేసేందుకు హిమవత్పర్వతానికి పోవడంతో దేవతలందరూ ఋషీశ్వరులతో కలిసి, బ్రహ్మ దగ్గరకు పోయి, తమకాయన పూర్వం సేనానాయకుడిగా ఇచ్చిన శివుడు ఆ పని వదలి తపస్సు చేసుకుంటున్నాడని అంటారు. జగత్తును రక్షించేందుకు-ప్రజల మేలు కోరి ఏదైనా చేసేందుకు తామేం చేయాలనీ, రాక్షసులేమో జగత్తును పీడిస్తున్నారని, వారితో ప్రతిదినం పోరేననీ, యుద్ధం చేసేందుకు తగిన బలవంతుడైన సేనానాయకుడు లేకపోతే తామేమీ చేయలేమనీ మొర పెట్టుకుంటారు. ఒకవైపు పార్వతి శాపంతో ఏడ్వాలో-మరోవైపు రాక్షసుల తన్నులకు ఏడ్వాలో అర్థం కావడం లేదని, తమను రక్షించుకునే విధానాన్ని ఆలోచించమని ప్రార్థించారు వారంతా. పార్వతి శాపాన్నుంచి దేవతలు తప్పించుకోలేరని, అది యదార్థమవుతుందని, దానికిప్పుడు వారి చింతించి ప్రయోజనం లేదని, వారి భార్యలయందు వాళ్లకు సంతానం కలగదని, ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టమని సలహా ఇస్తాడు. సేనానాయకుడు ‍లేరన్న విషయాన్ని ప్రస్తావించి, గంగ ద్వారా అగ్నిహోత్రుడికి ఒక కుమారుడు కలగనున్నాడని, వాడు దేవతలకు సేనానాయకుడై వాళ్లను రక్షిస్తాడని చెప్తాడు. గంగకు పుట్టిన కొడుకును ఆమెవలనే, పార్వతికూడా తన కుమారుడిగానే అంగీకరిస్తుందని, ఆ విషయంలో సందేహం లేదని అన్న బ్రహ్మను స్తుతించి కైలాసానికి పోయి అగ్నిదేవుడిని కలిసారు దేవతలు. అగ్నిదేవుడిని ప్రపంచ రక్షణకు ఆసక్తిగలవాడని పొగిడి, ఆయన ధరించిన ఈశ్వర తేజాన్ని గంగలో విడిచి కుమారుడిని కనమని-లోకాలకెల్ల ఇది హితమైన కార్యమని వేడుకుంటారు. అంగీకరించిన అగ్ని గంగను చేరగా, ఆమెకూడా అయన కోరికను ఒప్పుకుంటుంది. గంగ సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన్ను సమీపించగా, అగ్నిహోత్రుడు తన సర్వావయాలనుండి తనలో వున్న తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది".

"తానీ గర్భ వేదనను సహించలేక పోతున్నాననీ, తేజస్సును భరించలేక పోతున్నాననీ, అవయవాలు దుర్బలమై తెగిపోతున్నాయని, మండిపోతున్నాయని నిట్టూర్పులిడిచింది గంగ. దిగాలుపడిన గంగను చూసిన అగ్నిహోత్రుడు, ఆమె తన గర్భాన్ని హిమవంతం కిందిభాగంలోని నేలపై విడవమని చెప్పాడు. ఆ ప్రకారమే గంగ దాన్ని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి-బంగారం అయింది. దానివేడిగాలికి బూడిదైన ప్రదేశం రాగి-ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం-తగరం అయింది. అది ప్రవహించిన ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా బంగారు మయమయింది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు-తీగలు-పొదలు-పచ్చిక బంగారమయింది. అప్పటినుంచి బంగారం అగ్ని వర్ణంలో వుండడంతో జాత రూపం అనే పేరొచ్చింది".


(శివరేతస్సును పాదరసం అంటారు. రసవాదులు పాదరసం నుండి వెండీ-బంగారాలు చేస్తారు. ఈ ఘట్టంలో ఆ ప్రక్రియను గుప్తంగా చెప్పడం జరిగింది. తొలుత భూస్థాపనం-తదుపరి అగ్నిపుటం-ఆ తదుపరి నీళ్లలో వేయడం ఈ క్రియాంగాలు. ’నాగరస గంథకం-హేమరస మర్ధనం-బాలరవి చుంబనం-హేమకరో హేమకరో’ అనేవి బంగారం చెసే విధానం. వాల్మీకి ఇక్కడ రాసిన శ్లోకం అర్థం సరిగ్గా తెలుసుకున్నవారెవరైనా బంగారం తయారుచేయవచ్చునేమో ! బహుశా లోహాలన్నీ పాదరసం నుండే ఉత్పత్తి అవుతాయన్న విషయాన్ని పూర్వీకులెప్పుడో చెప్పారనుకోవాలి. పూర్వులు రహస్య విషయాలను తెలిపే మార్గం ఇదయ్యుండవచ్చు-ప్రత్యక్షంగా చెప్పకపోవచ్చు).

కుమారస్వామి జననం


"శరవణంలో పుట్టిన కొడుకును చూసిన ఇంద్రాది దేవతలు, ఆయన తమ సేనాపతి అవుతాడని బ్రహ్మ చెప్పడంవల్ల, బాలుడికి చనుపాలివ్వమని కృత్తికలనే స్త్రీలను ప్రేరేపించారు. వారూ సంతోషించి, ఆ బాలుడిని తమ కొడుకుగా దేవతలంగీకరిస్తే వారు కోరినట్లే పాలిస్తామంటారు. సమ్మతించిన దేవతలు, వారిపేరుమీద ఆ బాలుడు, కృత్తికానందనుడు-కార్తికేయుడు అని పేరొందుతాడంటారు. సంతోషంతో బాలుడికి ఆ ఆరుగురు స్త్రీలు, తమ బిడ్డగా భావించి, పాలిచ్చి-నీళ్లు పోసేవారు. గర్భం జారినందువల్ల పుట్టిన ఆ బాలుడికి స్కందుడు అన్న పేరుకూడా తగునని దేవతలు ఆ పేరు పెట్టారు. మనుష్యులు ఆ పేరుతోనే ఆయనకు పూజలు చేస్తుంటారు. ఆ బాలుడు ఆరుగురు కృత్తికా స్త్రీలకు ఆరు ముఖాలతో కనిపించి ఆరుగురి చను బాలను ఒక్కసారే తాగడంతో, ఒక్క పూటకే వృద్ధికాసాగాడు. తన బల సంపదతో ఘోరమైన యుద్ధంలో, రాక్షస సేనా సమూహాల గర్వం అణచడంవల్ల, దేవతలు ఆయనను తమ సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు" అని విశ్వామిత్రుడు గంగాదేవి చరిత్రమంతా రామ లక్ష్మణులకు చెప్పి, పుణ్యాత్ముడైన కుమారస్వామి చరిత్రను వినినందున ఆయనకెప్పుడు శుభాలు కలుగుతాయని అంటాడు.

No comments:

Post a Comment