Saturday, January 23, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-30 : విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తున్న శ్రీరామ లక్ష్మణులు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-30
విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తున్న 
శ్రీరామ లక్ష్మణులు
వనం జ్వాలా నరసింహారావు

గురువును ఎప్పుడు-ఎలా-ఏ ప్రదేశంలో ప్రశ్నించాలన్న విషయంలో నేర్పరులు, తియ్యటి మాటలతో చేయాల్సిన కార్యాన్ని చక్కపెట్టి-సాధించగల శక్తిగలిగిన శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, "మహాత్మా ! రాక్షసులు ఏ సమయంలో ఇక్కడ కొచ్చి కలహానికి కాలు దువ్వుతారు? అది మీరు చెప్తే, ఆ కాలాన్ని అతిక్రమించకుండా, మేము యజ్ఞాన్ని కాపడుతుంటాం" అని అడుగుతారు. యుద్ధానికి పోవడమంటే, ఆటలకు పోవడమన్నట్లుగా ఉత్సాహం చూపిస్తున్న సాహసవంతులైన వారిద్దరినీ చూసి, మునులందరు సంతోషించి, వారికి మేలు జరగాలని పొగిడారు. నాటినుండి ఆరు రాత్రులు వారు యజ్ఞాన్ని కాపాడాలని-రాక్షసులు రాత్రివేళల్లోనే వస్తారని, విశ్వామిత్రుడు దీక్ష వహించి మౌన వ్రతంలో వున్నాడు కనుక, ఆయన మాట్లాడడని, అందువల్ల వాళ్లీ ఆరు రాత్రులు హెచ్చరికతో యజ్ఞాన్ని రక్షించాలని బోధిస్తారు మునులు. వాళ్లు చెప్పినట్లే శ్రీరామ లక్ష్మణులు భయంకరమైన బాణాలను దగ్గరుంచుకుని, హెచ్చరిక తప్పకుండా, విశ్వామిత్రుడి యాగ భూమిని ఆరు దినాలు రాత్రింబగళ్లు రక్షించిన తర్వాత, ఆరవనాడు, రాముడు లక్ష్మణుడిని హెచ్చరిస్తాడు. "లక్ష్మణా ! రాక్షసులు వచ్చే రోజిదే. నీవు-నేను హెచ్చరికగా వుండి యజ్ఞాన్ని మరింత ప్రయత్నం తో కాపాడాలి" అని యుద్ధ సన్నద్ధులై వున్నారిరువురు. అప్పుడు యజ్ఞవేది పూలతో, స్రుక్కుతో, దర్భలతో, ఋత్విజులతో, సోమపానం చేసే పాత్రతో ప్రజ్వలించింది. శాస్త్రంలో చెప్పిన విధంగా, సమంత్రకంగా యజ్ఞం జరుగుతున్న సమయంలో, ఆకాశం పగిలి పోయేటట్లు-భయంకరమైన పెద్ద ధ్వని వచ్చింది. వెంటనే, వానాకాలంలో కారు మబ్బులు కమ్మినట్లు, ఆకాశం మరుగున పడే విధంగా రాక్షసులు మాయావులై, ఆకాశమంతా కమ్ముకున్నారు. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు తమ సేనలతో వచ్చి, నెత్తురు వానను వేదిపై ఘోరంగా కురిపించారు. వేదికూడా రక్తంతో ప్రకాశించసాగింది.

వనం జ్వాలా నరసింహారావు


మారీచుడిని తరిమికొట్టి సుబాహుడిని చంపిన శ్రీరాముడు
ఆ రాక్షసులు చేసిన దానిని చూసి కోపించిన శ్రీరాముడు, ఆకాశం నుండి వస్తున్న వారిని గమనించి, మనుష్య భక్షకులైన దుష్ట రాక్షసులను మానవాస్త్ర బలంతో పెనుగాలికి మేఘాలు చెదిరిపోయేటట్లు చెదరగొట్తానని, తమ్ముడు లక్ష్మణుడితో అంటూ, ఆ అస్త్రాన్ని తీసుకుని మారీచుడి రొమ్ముపై కొట్టాడు. వాడిని తాకిన ఆ అస్త్రం మారీచుడిని ఈడ్చుకునిపోయి నూరామడ దూరంలో-సముద్రంలో పడేసింది. అస్త్రం తగిలి, మారీచుడు మూర్ఛపోయి-స్మృతి తప్పుతే, తన మానవాస్త్రం కారణంగా, పెనుగాలికి ఆకులాగా కొట్టుకుపోతున్న రాక్షసుడిని చూపించి రాముడు లక్ష్మణుడితో " మానవాస్త్రం ధర్మబుద్ధికలది కనుక, మారీచుడిని చంపకుండా ఆకాశ మార్గంలో దూరంగా తీసుకుని పోతుంది. మునులను బాధించే, దయలేని చెడు గుణాలున్న దేవతా శత్రువులను-పాప స్వభావులను పదునైన బాణాలతో చంపుతాను చూడు" అంటాడు. అంటూనే, ఆగ్నేయాస్త్రాన్ని తీసి, వింటిలో సంధించి, కోపంతో, సుబాహువుడి రొమ్ముకు గురి చూసి, ఈడ్చివేయగానే, వాడు చచ్చిపడిపోతాడు. మిగిలిన రాక్షసులపై వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించగా, వారంతా నేల కూలుతారు. ఈ విధంగా యజ్ఞానికి విఘ్నం కలిగించాలనుకున్న రాక్షస సేనలను వధించి, యుద్ధంలో గతంలో గెలిచిన ఇంద్రుడిలాగా, రామచంద్రమూర్తిని ఋషులు పూజించారు. రాక్షసుల మాయవల్ల కమ్మిన మబ్బులు పోవడంతో దిక్కులు ప్రకాశించసాగాయి. యజ్ఞం సక్రమంగా నెరవేరింది. ఆని చోట్లా రాక్షసుల బాధలు తొలిగాయి. ఇదంతా గమనించిన విశ్వామిత్రుడు, "రామా ! నేను కృతకృత్యుడనయ్యాను. మీ తండ్రి చెప్పిన ప్రకారం నీవు గొప్పగా యజ్ఞాన్ని రక్షించి, ఈ ఆశ్రమానికి ’సిద్ధాశ్రమం’ అన్న పేరును సార్థకం చేశావు" అని అంటాడు. 

No comments:

Post a Comment