Tuesday, January 26, 2016

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-VII : వనం జ్వాలా నరసింహారావు

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-VII

వనం జ్వాలా నరసింహారావు

ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి ఏడవ విడత పది పద్యాలు). 

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-61

సీII విద్య నేర్చితినంచు విర్రవీగగ లేదు,
భాగ్యవంతుడనంచు బలుకలేదు,
ద్రవ్యవంతుడనంచు దరచు నిక్కగలేదు,
నియతి దానములైన నెరపలేదు,
పుత్త్రవంతుడనంచు బొగడుచుండగ లేదు,
భృత్యవంతుడ నంచు బెగడలేదు,
శౌర్యవంతుడ నంచు సంతసింపగ లేదు,
కార్యవంతుడ నంచు గడపలేదు,
తేII నలుగురికి మెప్పుగానైన నడవలేదు,
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-62

సీII అతిలోభులను భిక్ష మడుగ బోవుట రోత
తన ద్రవ్య మొకరింట దాచ రోత
గుణహీనుడగువాని కొలువు గొల్చుట రోత,
యొరుల పంచల క్రింద నుండ రోత;
భాగ్యవంతుని తోడ బంతమాడుట రోత,
గురిలేని భందుల గూడ రోత,
యాదాయములు లేక యప్పుదీయుట రోత,
జారచోరుల గూడి చనుట రోత,
తేII యాదిలక్ష్మీశ! నీబంట నైతినయ్య
యింక నెడబాపు జన్మం బదెన్న రోత.
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-63

సీII వెర్రివానికి నేల వేదాక్షరంబులు?
మోటువానికి మంచి పాటలేల?
పసులగాపరికేల పరతత్త్వ బోధలు?
విటగాని కేటికి విష్ణుకథలు?
వదరు శుంఠలకేల వ్రాత పుస్తకములు?
తిరుగు దిమ్మరికేల దేవపూజ?
ద్రవ్యలోభికినేల దాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచి సంగతేల?
తేII క్రూరజనులకు నీమీద గోరికేల?
ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-64

సీII నా తండ్రి, నా దాత! నా యిష్ట దైవమా!
నన్ను మన్ననసేయు నారసింహ!
దయయుంచు నామీద దప్పులన్ని క్షమించి
నిగమగోచర! నాకు నీవె దిక్కు,
నే దురాత్ముడనంచు నీ మనంబున గోప
గింపబోకుము స్వామీ! కేవలముగ!,
ముక్తిదాయక! నీకు మ్రొక్కినందుకు నన్ను
గరుణించి రక్షించు కమలనాభ!
తేII దండి దొరవంచు నీవెంట దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర



శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-65

సీII వేమారు నీ కథల్ వినుచు నుండెడివాడు
పరుల ముచ్చటమీద భ్రాంతిపడడు,
అగణితంబుగ నిన్ను బొగడనేర్చినవాడు
చెడ్డమాటల నోటజెప్పబోడు,
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాడు
ధనమదాంధుల వెంట దగులబోడు,
సంతసంబున నిన్ను స్మరణజేసెడివాడు
చెలగి నీచుల పేరు దలపబోడు
తేII నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగ
గోరి చిల్లర వేల్పుల గొల్వబోడు.
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-66

సీII నే నెంత వేడిన నీకేల దయరాదు?
పలుమారు పిలచిన బలుకవేమి?
పలికిన నీకున్న పదవేమి పోవును?
మోమైనబొడ చూపవేమి నాకు?
శరణుజొచ్చినవాని సవరించవలె గాక
పరిహరించుట నీకు బిరుదుగాదు,
నీ దాసులను నీవు నిర్వహింపక యున్న
బరులెవ్వరగుదురు పంకజాక్ష?
తేII దాత దైవంబు తల్లియు దండ్రి వీవె,
నమ్మియున్నాను నీ పాద నలినములను,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-67

సీII వేదముల్ చదివెడు విప్రవర్యుండైన
రణము సాధించెడు రాజులైన,
వర్తక కృషికుడౌ వైశ్య ముఖ్యుండైన
బరిచరించెడి శూద్రవర్యుడయిన,
మెచ్చు ఖడ్గము బట్టి మెరయు మ్లేచ్చుండైన,
బ్రజల కక్కరపడు రజకుడైన,
చర్మమమ్మెడు హీన చండాల నరుడైన,
నీ మహీతలమందు నెవ్వడైన.
తేII నిన్నుగొని యాడుచుండెనా నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ వసుధలోన;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-68

సీII సకల విద్యలు నేర్చి సభ జయింపగ వచ్చు
శూరుడై రణమందు బోరవచ్చు,
రాజరాజై పుట్టి రాజ్య మేలగ వచ్చు,
హేమ గోదానంబు లియ్యవచ్చు,
గగనమందున్న చుక్కల నెంచగావచ్చు,
జీవరాసుల పేర్లు చెప్పవచ్చు,
నష్టాంగయోగంబు లభ్యసింపగవచ్చు,
కఠినమౌ రాల మ్రింగంగవచ్చు,
తేII తామరసగర్భ హరపురందరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-69

సీII నరసింహ! నీవంటి దొరను సంపాదించి
కుమతి మానవుల నే గొల్వజాల;
నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను
బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనముగాదిది నీకు గరుణ బోషింప;
గష్ఠ మెంతటి స్వల్ప కార్యమయ్య?
పెట్టజాలక యేల బిక్షమెత్తించెదు?
నన్ను బీదనుజేసినావదేమి?
తేII విమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగ
గన్నులకు బండువై నీకు గానబడునె?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-70

సీII వనరుహనాభ! నీ వంక జేరితి నేను,
గట్టిగా నను గావు; కావు మనుచు
వచ్చినందుకు వేగ వరము లీయక కాని
లేవబోయిన నిన్ను లేవనియ్య
గూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగబట్టి
పుచ్చుకొందును జూడు భోగిశయన
ఈ వేళ నీకడ్డ మెవరు వచ్చినగాని
వారికైనను లొంగి వణకబోను,
తేII కోపగాడను నీవు నా గుణము దెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

No comments:

Post a Comment