Monday, January 18, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-25 : తాటకను శపించిన అగస్త్యుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-25
తాటకను శపించిన అగస్త్యుడు
వనం జ్వాలా నరసింహారావు

లోకంలో యక్షులు దుర్బలులు అన్న పేరుందని, అలాంటప్పుడు ఒక యక్ష స్త్రీకి ఎట్లా వేయేనుగుల బలం కలిగిందని సంశయం వెలిబుచ్చాడు రాముడు. జవాబుగా: " పూర్వకాలంలో సదాచార సంపన్నుడైన సుకేతుడు అనే గొప్ప యక్షుడుండేవాడు. వాడికి సంతానం లేక పోవడంతో, బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు. సంతోషించిన బ్రహ్మ, వాడికి కొడుకును ఇవ్వకుండా, వేయేనుగుల బలంగల కూతురును ఇచ్చాడు. అది రూప యౌవనాలు కలిగినప్పుడు, సుకేతుడు, ఝర్ఝుని కొడుకైన సుందుడు కిచ్చి వివాహం చేశాడు. వారికి మారీచుడు అనే క్రూరుడైన కొడుకు పుట్టాడు. సుందుడు అగస్త్యుడి వల్ల మరణించాడు. మొగుడిని చంపిన అగస్త్యుడి మీద పగపట్టిన తాటక, కొడుకు మారీచుడు తో కలిసి, దిక్కులు పిక్కటిల్లే విధంగా అరుస్తూ, అతడిని చంపబోయింది. కోపగించిన అగస్త్యుడు, మారీచుడిని రాక్షసుడుగా కమ్మని, తాటకకు సుందర రూపం పోయి భయంకర రూపం కలగాలని - మనుష్యులను తింటూ, వికార ముఖంతో సంచరించమని శపిస్తాడు. శాపగ్రస్తురాలైన తాటక రాక్షస రూపంలో, అగస్త్యుడు సంచరించిన ప్రదేశంలోని మనుష్యులను తింటూ - వూళ్లకు వూళ్లనే పాడుచేసింది" అని వివరణ ఇచ్చి, గో బ్రాహ్మణులకు మేలు కలిగే విధంగా, దయను విడిచి, తాటకను చంపి, కీర్తిమంతుడవు కమ్మని రాముడితో అంటాడు విశ్వామిత్రుడు.

 తాటకను చంపమని రాముడికి బోధించిన విశ్వామిత్రుడు

"తాటక మిక్కిలి బలశాలి. శాపం వల్ల క్రూరురాలైంది. అలాంటి దాన్ని నువ్వు తప్ప మరే మగవాడు-ఎంతటి వాడైనా-ఏ లోకం వాడైనా, చంపడానికి పూనుకోడు. నిలిచి యుద్ధం చేయనే చేయడు. దయా గుణంతో, ఇతర సందర్భాలు ఆలోచిస్తూ, స్త్రీ ని చంపితే పాపం వస్తుందని భావించ వద్దు. ఇలాంటి ఆలోచన రాజకుమారులు చేయకూడదు. సర్వకాల సర్వావస్థలలో నరపాల కుమారుడు, నాలుగు వర్ణాల వారిని రక్షించాల్సిన ధర్మముంది. ’రాజ కుమారుడు కాగానే, ధర్మంతో, ప్రజలను రక్షించాలి గాని, అధర్మంగా ప్రవర్తించవచ్చా?’ అని నువ్వడగవచ్చు. భూమిని పాలించేవారు, ప్రజలను రక్షించేందుకు, క్రూరమైనా-కాకున్నా, పాపం వచ్చినా-పుణ్యం వచ్చినా, తనపై నింద పడ్డా, ఏ పనైనా చేయాల్సిందే. ఎందుకంటే, తాను చెడిపోయినా, లోకంలోని అనేకమందిని కాపాడాలి. తన క్షేమం మాత్రమే చూసుకుంటే-చూసుకుని వూరుకుంటే, లోకం చెడిపోయి పాపం కలగొచ్చు. అందరు చేసిన అన్ని పాపాలవలన తాను చెడడం మంచిదా? తానొక్కడే ఒక్క పనిచేసి చెడిపోవడం మంచిదా?. అసత్యం తో సత్యం, అధర్మం తో ధర్మం చెడిపోయే సమయం వచ్చినప్పుడు, దానిని చక్కదిద్దే సామర్థ్యం వున్నవాడు, ఉపేక్షించి వూరుకుంటే, ఆ పాపం వాడికి తగులుతుంది. ఎందరో మనుష్యులు, ఆవులు తాటక మూలాన ప్రాణాలు కోల్పోతుంటే, నువ్వు వాళ్లను రక్షించే శక్తి వుండికూడా, మౌనంగా వూరుకుంటే, గో - బ్రాహ్మణ హత్యా దోషం నీకు కలుగుతుంది.



స్త్రీ వధ అధర్మమంటే, నిష్కారణంగా- అధర్మంగా, ఇంత మందిని ఈ క్రూరురాలు చంపుతుంటే, రక్షించే శక్తి వుండికూడా, సహించి వూరుకోవడం ధర్మమా? అలా వూరుకుంటే, క్రమక్రమంగా దుష్టులు ప్రబలిపోతారు. శిష్టులు హతమై పోతారు. ఇదేనా ప్రజా రక్షణంటే? ఇదేనా ధర్మ సంస్థాపన? అధర్మాన్ని ధర్మమే జయించాలి గాని, అధర్మంతో జయించాలనుకుంటే, ఇరువురికీ తేడా లేదుకదా! ఒకడెక్కువ-మరొకరు తక్కువ అనడానికి వీల్లేదు. ఇరువురు అధర్మ వర్తనులే! అధర్మాన్ని ధర్మంతో జయించాలని అనుకున్నప్పుడే, అది ఉత్తమమైన మార్గమవుతుంది. అదే కనుక సాధ్యం కాకపోతే, అధర్మ వర్తనులను, అధర్మ మార్గంలోనే జయిస్తే, వారి అధర్మమే వారిని చంపినట్లవుతుంది. దీనివలన, అధర్మవర్తనుడు ధర్మంతోనైనా-అధర్మంతోనైనా చెడిపోతాడని భావమొస్తుంది. కాబట్టి, క్రూరులను క్రూరంగానూ-కుటిలులను కుటిలత తోనూ-అధర్మ వర్తనులను అధర్మంగానే, లోక హితం కోరి అణచడం తప్పుకాదు. నువ్వు రాజకుమారుడవు కనుక ప్రజలను రంజింపచేయాలి. ప్రజలు నిష్కారణంగా చస్తుంటే చూసేవాడు రాజు కాడు. నువ్వు అధర్మ కార్యం చేయాలని నేను చెప్పుతున్నానని అనుకోవద్దు. నేనూ కొన్నాళ్లు రాజ్యం ఏలిన వాడినే-ప్రజలను పాలించినివాడినే. నాకందుకే, శాస్త్రం చదవడం వల్ల-అనుభవం వల్ల, రాజ ధర్మం తెలుసు. నేనింతవరకు చెప్పింది రాజ్యభారం వహించే రాజపుత్రులకందరికీ వర్తించే సనాతనమైన ధర్మం. కాబట్టి దానికి విరోధంగా ప్రవర్తించకూడదు. తాటకకు సమయోచితమైన నీతి అంటే అధర్మమే-ధర్మం అంటే తెలియదు-అధర్మం అంటే ప్రీతి. కాబట్టి దాన్ని చంపు. రామచంద్రా!  నీకు నేను చెప్పిన విషయాలకు పూర్వ దృష్టాంతాలున్నాయి. విరోచనుడి కూతురు మంథర భూమిని చంపే ప్రయత్నం చేస్తుంటే వజ్రధారతో ఇంద్రుడు దానిని చంపలేదా? లోకంలో ఇంద్రుడుండకుండా పోవాలని సంకల్పించిన భృగు మహర్షి భార్యను-శుక్రుడి తల్లిని విష్ణువు తన చక్ర ధారతో చంపలేదా? వీళ్లిదరే కాదు-అధర్మ ప్రవర్తన గల స్త్రీలను చంపిన రాజులెందరో వున్నారింకా. కాబట్టి నువ్వింక ఆలోచించాల్సిన పనిలేదు. నేను చెప్పినట్లే తాటకను చంప" మని విశ్వామిత్రుడు రాముడికి పలు విధాలుగా బోధిస్తాడు.

No comments:

Post a Comment