బాలకాండ
మందరమకరందం
సర్గ-9
సనత్కుమార
వచనాలను
దశరథుడికి చెప్పిన సుమంత్రుడు
వనం జ్వాలా నరసింహారావు
(ఈ సర్గనుండి మూడు
సర్గలవరకు భగవదవతారానికి ముఖ్య కారణమైన పుత్ర కామేష్టికి సంబంధించిన ప్రస్తావనుంటుంది). అంతఃపురంలో వున్న దశరథుడితో ముఖ్యమంత్రి సుమంత్రుడు తనకు తెలిసిన ఒక
ఉపాయాన్ని-దేన్నైతే సనత్కుమారుడు ఋషులందరూ వింటుండగా వెల్లడిచేశాడని వశిష్ఠాది
మునులంటుండగా తాను విన్నాడో, దాన్ని చెపుతానని అంటాడు.
ఆ ఉపాయంతో, పుత్రులు లేరన్న చింత
తొలగిపోతుందని, అది పుత్రులు కలిగేందుకు
నిర్విఘ్నమైన ఉపాయమని అంటాడు. కాశ్యపుడు అనే మునికి-హరిణిలకీ గొప్ప
తపస్వి-పుణ్యవంతుడైన ఋశ్యశృంగుడనే కొడుకున్నాడనీ, అతడు పుట్టినప్పటినుండీ అడవుల్లోనే విహరించేవాడని సుమంత్రుడంటాడు.
అడవుల్లో తిరిగే అతడు తన తండ్రిని చూడడానికి వచ్చే మునులను తప్ప ఇంకెవ్వరినీ
చూడలేదు. ఎల్ల వేళలా తండ్రి ఆజ్ఞానుసారం తపస్సు చేస్తుండేవాడు. ఈ విషయాలను చెప్తూ
బ్రహ్మచర్యం గురించి కూడా వివరిస్తాడు సుమంత్రుడు దశరథుడికి.
"బ్రాహ్మణులు
ఉత్తమమైనదిగా భావించే బ్రహ్మచర్యానికి యావత్ ప్రపంచంలోనే గొప్ప వ్రతమన్న పేరుంది.
అది రెండు రకాలు. గృహస్థాశ్రమానికి ముందే స్త్రీ గురించిన ఆలోచన లేకుండా గడపడం ఒక
రకమైన బ్రహ్మచర్యం. వివాహానంతరం భార్యతో కేవలం రుతు కాలంలోనే సంగమించడం రెండో రకం.
ఋశ్యశృంగుడికి రెండు రకాలైన బ్రహ్మచర్యం ఆచరించే అవకాశం కలిగింది. తండ్రి
ఆజ్ఞానుసారం అగ్నిహోత్ర సంబంధిత కార్యక్రమాలను-చండీ సేవను చేయడం మినహా మరే ఇతర
వ్యాపకాల జోలికి పోలేదు ఋశ్యశృంగుడు. ఆ రోజుల్లో, మహా బల పరాక్రమ వంతుడు, అంగ దేశ రాజైన రోమపాదుడు తన దేశంలోని బ్రాహ్మణులను అవమానించిన కారణాన
చాలామంది బ్రాహ్మణులు దేశాన్ని విడిచిపోతారు. దాంతో, అంగ దేశంలో వర్షాలు కురవక, భారీ ఎత్తున కరవు-కాటకాలు సంభవించడంతో, ప్రజలు పడే బాధలు చూసి చింతించి దుఃఖ పడతాడు రోమపాదుడు. తాను చేసిన
పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే, తిరిగి దేశం సుభిక్షమౌతుందేమోనని ఆలోచిస్తాడు. శాస్త్రాలనభ్యసించిన
వృద్ధ బ్రాహ్మణులను పిలిపించుకుని, తనకు మంచి సలహా ఇమ్మని అడుగుతాడు. రాజులో మార్పు వచ్చినందుకు వేద
శాస్త్రాలను చదివిన బ్రాహ్మణులు సంతోషపడతారు. ఋశ్యశృంగుడిని అంగ దేశానికి
తీసుకొస్తే ఉపద్రవం తీరుతుందనీ-రాజు కుమార్తైన శాంతను ఆయనకిచ్చి వివాహం జరిపిస్తే
మరీ మంచిదనీ సలహా ఇస్తారు బ్రాహ్మణులు. అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షలో వున్న
ఋశ్యశృంగుడు-మహా వీర్యవంతుడు, అంగ దేశానికి పిలిపించడం
ఎలా కుదురుతుందని-ఒకవేళ ఆయనొచ్చినా కాముకుడు కాని అతడు తన కూతురును వివాహమాడడానికి
ఎలా ఒప్పుకుంటాడని బ్రాహ్మణులను ప్రశ్నిస్తాడు రోమపాదుడు".
"ఏం చేస్తే మంచిదని
విచారించేందుకు, మంత్రులను పిలిచి వారి
సలహా అడుగుతాడు రాజు. ఋశీశ్వరుడి తండ్రి ముక్కోపి అని, ఆయన శాపానికి తిరుగులేదని చెప్పిన మంత్రులు ఋశ్యశృంగుడిని
రప్పించేందుకు ఒకే ఒక్క ఉపాయముందని అంటారు. వేశ్యలను పంపితే వారు తీసుకొచ్చే
అవకాశం వుందని-అనాదిగా వేశ్యలకు ఋషులను
వశపరచుకోవడమే వృత్తి అని-వేశ్యలు ఋశ్యశృంగుడితో కామ క్రీడలు
చేయలేరని-ఋశ్యశృంగుడికి వేశ్యా సాంగత్య దోషం కలగదని మంత్రులంటారు. రోమపాదుడు
తనకూతుర్ని ఆయనకిచ్చి వివాహం చేయదల్చుకున్నందున, రాజుమీద ఋశ్యశృంగుడికి కోపం రాదని, ఆయన రాకతో వర్షాలు కురుస్తాయని వారంటారు. తక్షణం వేశ్యలను పంపే
ఏర్పాటు చేద్దామంటారు. రోమపాదుడు మంత్రుల సూచన మేరకు వార కాంతలను పంపి, ఋశ్యశృంగుడిని అంగ రాజ్యానికి తీసుకొచ్చి, తనకూతురును ఆయనకిచ్చి వివాహం జరిపిస్తాడు" అని సనత్కుమారుడు
రుషులకు చెప్పిన మాటలను ఆయన చెప్పినట్లే దశరథుడికి చెప్పి తాను చెప్పదల్చుకుంది
కూడా చెప్పుతాడు. ఋశ్యశృంగుడు ఋత్విజుడిగా దశరథుడితో యజ్ఞం చేయిస్తే, కీర్తిమంతులైన కుమారులు కలుగుతారని సుమంత్రుడు చెప్పగానే, ఋశ్యశృంగుడిని వేశ్యలు ఎలా వంచించి తీసుకొచ్చారనే విషయాన్ని వివరంగా
చెప్పమని ఆయన్నడుగుతాడు.
No comments:
Post a Comment