బాలకాండ
మందరమకరందం
సర్గ-31
రామ లక్ష్మణులను
మిథిలా
నగరానికి
తీసుకెళ్తున్న విశ్వామిత్రుడు
వనం
జ్వాలా నరసింహారావు
రాజవంశంలో పుట్టిన
విశ్వామిత్ర ఋషి చేసిన యజ్ఞం ఈ విధంగా రక్షించిన సూర్య వంశపు రాజకుమారులు-రామ
లక్ష్మణులు, తండ్రి ఆజ్ఞాపించిన
కార్యాన్ని చేశామన్న నిండు సంతోషంతో, కంటి నిండా నిద్రించి, తెల్లవారగానే మేల్కున్నారు. ప్రాతఃకాలకృత్యాలు తీర్చుకుని, వీరాగ్రగణ్యులైన శ్రీరామ లక్ష్మణులు ముందుగా గురువైన
విశ్వామిత్రుడికి-తర్వాత తపస్సంపున్నులైన ఋషీశ్వరులకు నమస్కరించి, తేనెలొలికే ముద్దుమాటలతో అన్నారీవిధంగా: " మునీంద్రా ! నువ్వు
మితిమీరిన తపశ్శక్తితో నీ కార్యాలన్నీ చక్కబర్చుకోగలవు. మేం మీకు సాధించి
ఇచ్చిందేమీలేదు. అయినా, మాకు తరుణోపాయంగా, సేవనేదొకటి కల్పించి, మాచేత చేయించుకుని-మీరు సంతోషపడి-మాకు గురు సేవ లభించి, ధన్యులమైతిమన్న సంతోషం కలిగించమని కోరుతున్నాం. స్వయంగా మేం మీ పనులు
చేయలేకపోయినా, మీ వాక్య బలమే మాతో ఆ
కార్యాలు చేయించగలదు. కాబట్టి మీరు చేయాల్సిన కార్యమేదో చెప్పి మాతో
చేయించండి". జవాబుగా విశ్వామిత్రుడు, శిష్యుల యోగ క్షేమం కనుక్కోవడం గురువుకు ముఖ్యమని-వారికి శుభం కలిగే
ఉపాయాన్ని ఆలోచించి, రామ లక్ష్మణులకు
తెలియచేశాడీవిధంగా.
" రామచంద్రా !
మిథిలా దేశపు రాజు జనకుడు మిక్కిలి ధర్మాత్ముడు. ఆయన ఇప్పుడు యజ్ఞం చేసే
ప్రయత్నంలో వున్నాడు. నేను-ఇతర మునీశ్వరులు అక్కడకు పోతున్నాం. మీరు కూడా రండి.
ఆయన రాజు-మేం రాజకుమారులం-ఆయన పిలవకుండా పోవడం మర్యాద కాదని అనవద్దు. పిలువకున్నా, యజ్ఞానికి పోవచ్చని శాస్త్రం చెపుతున్నది. అదీ కాకుండా, రాజులైనవారు అక్కడకు పోవాల్సిన పనుంది. ఆయన దగ్గర దేవతా
సంబంధమైన-మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ధనస్సుంది. దాని మహిమ ఆశ్చర్యకరం. పూర్వం దాన్ని
దేవతలు దేవరాతుడు అనే రాజుకిచ్చారు. ఆ విల్లెక్కు పెట్టడం దేవతలకు, గంధర్వులకు, పన్నగులకు, కిన్నరులకు, రాక్షసులకు, యక్షులకు, వీరిలో ముఖ్యులైన వారి
సమూహానికి సాధ్యపడదు. మనుష్యులకు అసలే చేతకాదు. రఘువంశ దీపమా ! నీవు ఆ మహాత్ముడి
యజ్ఞాన్ని-అక్కడున్న దివ్యమైన, అమోఘమైన, శ్రేష్ఠమైన చాపాన్ని కీర్తి కరంగా చూడవచ్చు-పోదాం రమ్మ" ని
అంటాడు.
తర్వాత వింటి
వృత్తాంతాన్ని ఆయన వెంట వస్తున్న ఋషులు వివరిస్తారీ విధంగా: " కీర్తనీయ
చరిత్రుడైన మిథిలాపతి ఒక గొప్ప యజ్ఞాన్ని శాస్త్ర ప్రకారం నిర్వర్తించి, దానితో దేవతలను తృప్తి పరిచి, ప్రతిఫలంగా ’సునాభం’ అనే దివ్య చాపాన్ని ఇమ్మని దేవతలను కోరాడు. ఆయన
కోరినట్లే వారిచ్చి వెళ్లారు. అప్పటినుంచి ఆ చాపం ఆయన రాజగృహంలోనే వుంది.
ప్రతిదినం గంధంతోను, పూలు-ధూపం-దీపం మొదలైన
సామగ్రులతోను, అది
పూజించబడుతున్నది".
తన వెనుక శ్రీరామ
లక్ష్మణులు ప్రయాణానికి సన్నద్ధమౌతుండగా, విశ్వామిత్రుడు, సిద్ధాశ్రమాన్ని వదిలి
హిమవత్పర్వతానికి పోతున్నానని అక్కడున్న వన దేవతలను సంబోధిస్తూ అంటాడు. అంటూనే, ఆశ్రమానికి ప్రదక్షిణ చేసి, ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఆయన వెంట మునీంద్రులు, శ్రీరామ లక్ష్మణులు బయల్దేరారు. వనంలోని జింకలు, మృగాలు, చిలుకలు, ఇతర రకాల పక్షులు విశ్వామిత్రుడి వెంట వస్తుంటే-వాటిని చూసి ఆయన, వెనక్కు మరలి పొమ్మని మంచిమాటలతో నచ్చచెప్పి, మరలిపోయేటట్లు చేస్తాడు. దూర ప్రయాణం చేసిన పిదప, సూర్యుడు అస్తమించగానే, మునీశ్వరులు శోణ నదిలో స్నానం చేసి, సంధ్యావందనం చేసి, ఇతర సాయంకాల కాల
కృత్యాలను నెరవేర్చుకున్నారు. ఆ సమయంలో విశ్వామిత్రుడి చుట్టూ చేరిన వారిలోని
శ్రీరాముడు, తీగలతోను-చెట్లతోను
అలంకరించబడిన ఆదేశం ఎవ్వరిదని వినేందుకు ఉత్సాహంగా వుందని అంటాడు. అందరూ వింటుండగా
విశ్వామిత్రుడు ఆ దేశం కథను యదార్థంగా చెప్ప సాగాడు.
No comments:
Post a Comment