Tuesday, January 5, 2016

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-V : వనం జ్వాలా నరసింహారావు


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-V

వనం జ్వాలా నరసింహారావు

ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి ఐదవ విడత పది పద్యాలు)

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-41

సీII ఇలలోన నే జన్మ మెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య పాతకములు;
తెలిసి చేసితి గొన్ని, తెలియజాలక చేసి!
బాధ నొందితినయ్య పద్మనాభ!
అనుభవించెడు నప్పు డతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పగ జాల భయముగలిగె;
నెగిరిపోవుటకునై యే యుపాయంబైన
జేసి చూతమటన్న జేతగాదు;
తేII       సూర్యశశినేత్ర! నీచాటు జొచ్చినాడ,
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-42

సీII తాపసార్చిత! నేను పాపకర్ముడనంచు
నాకు వంకల బెట్టబోకుసుమ్మి,
నాటికి శిక్షలు నన్ను జేయుటకంటె
నేడు సేయుము నీవు నేస్తమనక,
అతిభయంకరులైన యమదూతలకు నన్ను
నొప్పగింపకుమయ్య యురగశయన!
నీ దాసులను బట్టి నీవు దండింపంగ
వద్దు వద్దన రెంత పెద్దలైన,
తేII       తండ్రివై నీవు పరపీడ దగులచేయ
వాసిగలపేరు కపకీర్తి వచ్చునయ్య;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-43

సీII ధరణిలోపల నేను తల్లి గర్భమునుండి
పుట్టినప్పటినుండి పుణ్యమెరుగ
నేకాదశీవ్రతం బెన్నడుండగ లేదు,
తీర్థయాత్రలకైన దిరుగలేదు,
పారమార్థికమైన పనులు సేయగలేదు,
బిక్షమొక్కనికైన బెట్టలేదు,
జ్ఞానవంతులకైన బూని మ్రొక్కగ లేదు,
ఇతర దానములైన నీయలేదు,
తేII       నళినదళనేత్ర నిన్ను నే నమ్మినాను,
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-44

సీII అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను?
మృగజాతికెవ్వడు మేతబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె
జెట్లకెవ్వడు నీళ్ళు చేదిపోసె?
స్త్రీ గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?
ఫణుల కెవ్వడు పోసె బరగబాలు
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె?
బసులకెవ్వడొసంగె బచ్చిపూరి?
తేII       జీవకోట్లను బోషింప నీవెకాని,
వేరె యొకదాత లేడయ్య వెదకిచూడ!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-45

సీII దనుజారి! నావంటి దాసజాలము నీకు
కోటిసంఖ్య గలరు కొదువలేదు;
బంట్ల సందడివల్ల బహుపరాకై నన్ను
మరచిపోకుము భాగ్య మహిమచేత;
దండిగా భృత్యులు తగిలి నీకుండంగ
ఒక్కబంటేపాటి పనికి నగును?
నీవు మెచ్చెడి పనుల్ నేను జేయగలేక
యింత వృధా జన్మ మెత్తినాను;
తేII       భూజనులలోన నే నప్రయోజకుడను
గనుక నీ సత్కటాక్షంబు గలుగజేయు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !




శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-46

సీII కమలలోచన! నన్నుగన్న తండ్రివి కాన
నిన్ను నేమరకుంటి నేను విడక,
యుదర పోషణకునై యొకరి నే నాశింప
నేర! నాకన్నంబు నీవు నడపు,
పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన
దగవు కిప్పుడు దీయదలచినాను;
ధనము భారంబైన దలకిరీటములమ్ము,
కుండలంబులు పైడి గొలుసులమ్ము;
తేII       కొసకు నీ శంఖచక్రముల్ కుదుపబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-47

సీII కువలయ శ్యామ! నీ కొలువు చేసిన నాకు
జీతమెందుకు ముట్ట జెప్పవైతి?
మంచిమాటలచేత గొంచెమీయగలేవు
కలహమౌనిక జుమ్మి ఖండితముగ,
నీవు సాధువుగాన నింతపర్యంతంబు
చనువుచే నిన్నాళ్ళు జరుపవలసె,
నిక నే సహింప నీవిపుడు నన్నేమైన
శిక్ష చేసిన జేయు సిద్ధమయితి.
తేII       నేడు కరుణింపకుంటివా నిశ్చయముగ
దెగబడితి జూడు నీతోడ జగడమునకు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-48

సీII హరి! నీకు బర్యంకమైన శేషుడు చాల
బవనము భక్షించి బ్రతుకుచుండు,
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు
గొప్పపామును నోట గొరుకుచుండు,
నదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు దిరుగుచుండు,
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలుచేసి
ప్రేమ బక్వాన్నముల్ పెట్టుచుంద్రు,
తేII       స్పష్టముగ నీకు గ్రాసము జరుగుచుండ
గాసు నీచేతి దొకటైన గాదు వ్యయము.
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-49

సీII పుండరీకాక్ష! నా రెండు కన్నుల నిండ
నిన్ను జూచెడి భాగ్య మెన్నడయ్య!
వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు
సొగసుగా నీ రూపు చూపవయ్య
పాపకర్ముని కంటబడక పోవుదమంచు
బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె?
వసుధలో బతితపావనుడ వీవంచు నే
బుణ్యవంతుల నోట బొగడ వింటి,
తేII       నేమిటికి విస్తరించె నీ కింతకీర్తి?
ద్రోహినైనను నా కీవు దొరకరాదె?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-50

సీII పచ్చి చర్మపు దిత్తి పసలేదు దేహంబు
లోపలనంతట రోయ రోత,
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త
మాంసముల్ కండలు మైలతిత్తి,
బలువైన యెండవానల కోర్వదెంతైన
దాళలే దాకలి దాహములకు,
సకల రోగములకు సంస్థానమయి యుండు
నిలువ దస్థిరమైన నీటిబుగ్గ;
తేII       బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత
గాటికే కాని కొరగాదు గవ్వకైన;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర 

No comments:

Post a Comment