Friday, January 8, 2016

విజయవంతం…..అయుత మహా చండీ యాగం : వనం జ్వాలా నరసింహారావు

విజయవంతం…..అయుత మహా చండీ యాగం
వనం జ్వాలా నరసింహారావు

లోక కళ్యాణానికి, విశ్వ శ్రేయస్సుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు డిసెంబర్ 23, 2015 నుంచి డిసెంబర్ 27, 2015 (శ్రీమన్మధ మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి బహుళ ద్వితీయ) వరకు, మెదక్ జిల్లా, జగదేవపూర్ మండల్, ఎర్రవల్లి గ్రామంలో వున్న వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీ మహాయాగాన్ని నిర్వహించారు. ఈ యాగానికి అందరూ ఆహ్వానితులే అని సీఎం పత్రికా సమావేశంలో చెప్పారు. సుమారు నలబై వేల మందికి ఆయన ప్రత్యేకంగా ఆత్మీయ ఆహ్వానాలు పంపారు. యాగం జరిగిన ఐదు రోజులూ, లక్షలాది మంది సామాన్య భక్తులతో పాటు, గవర్నర్లు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా, కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు-హైకోర్టు-పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, పీఠాధిపతులు, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి ఆధ్యాత్మిక గురువులు, అధికార పార్టీతో సహా వివిధ పార్టీలకు చెందిన మంత్రులు, ఎంపీలు-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఎన్నికైన ప్రతినిధులు, పలువురు అధికార-అనధికార ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు...ఇంకెందరో హాజరయ్యారు.


అయుత మహా చండీ యాగ పూర్వ రంగంలో భాగంగా, ముక్కోటి ఏకాదశి, సోమవారం (21-12-2015) పవిత్ర పర్వదినాన, మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు నిర్వహించిన ఆరంభ పూజా కార్యక్రమాలతో, ఐదు రోజుల అయుత మహాచండీయాగానికి నాంది-ప్రస్తావన జరిగింది.  ఆ రోజున సరిగ్గా ఉదయం 10.55 కు నిర్ణయించిన సుముహూర్తంలో, శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామివారిని సంబోధిస్తూ చేసిన గురు ప్రార్థనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రుత్విక్కులు. యజ్ఞ బ్రాహ్మణులు వి. ఫణి శశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, సిహెచ్. హరినాథశర్మల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తొలుత సహస్ర మోదకాలతో గణపతి పూజ నిర్వహించారు. తదేవ చంద్ర బలం, తదేవ తారా బలం... శుక్లాంభరధరం విష్ణుం.. సర్వేభ్యో, బ్రాహ్మణేభ్యః... సుముహూర్తస్తు  అంటూ కేశవ, మాధవ నామ పఠనం వీనుల విందుగా కొనసాగింది. మహా సంకల్పం కూడా చెప్పారు. గణపతి పూజ, పుణ్యాహవచనము, దేవనాంది, అంకురార్పణ, పంచగవ్య మేళనము, ప్రాశనము, గో పూజ, యాగశాల ప్రవేశము, యాగశాల సంస్కారము, అఖండ దీపారాధన, మహా సంకల్పం, మహా మంగళహారతి, ప్రార్థన, ప్రసాద వితరణము కూడా చేయించారు రుత్విక్కులు. యాగశాల నుంచి నేరుగా సమీపంలోని ఎర్రవల్లి గ్రామానికి వెళ్లిన కేసీఆర్ దంపతులు, ఆయుత చండీ మహా యాగం విజయవంతం కావాలని గ్రామంలోని పోచమ్మ, ఎల్లమ్మ దేవతలకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ, పోచమ్మ గుడి వద్ద గుమ్మడికాయలు కొట్టి పూజలు చేశారు. వేదపండితులుగ్రామస్థులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు.  


          భోజన విరామం తరువాత, యాగశాలకొచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాలినడకన పరిసరాలన్నీ అంగుళం-అంగుళం కలియదిరిగి, అక్కడి ఏర్పాట్లను మరో మారు క్షుణ్ణంగా పర్యవేక్షించారు. యాగానికి వచ్చే భక్తులు, బ్రాహ్మణులు, మహిళలు, ప్రముఖులు, సీనియర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పురోహితులు, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్త పరిచారు. యాగాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు చేసిన వసతి, భోజనం, విశ్రాంతి, వీక్షణం ఏర్పాట్లను పరిశీలించారు. యాగ ప్రాంగణంలో 2000 మంది ఒకేసారి కుంకుమార్చన చేసుకోవడానికి వీలుగా చేసిన ఏర్పాట్లను, వారికి కావాల్సిన అర్చన సామాగ్రిని ఉచితంగా అందించడానికి తీసుకున్న చర్యలను సమీక్షించారు. కుంకుమార్చన నిర్వహణకు ప్రత్యేక పురోహితులతో పాటు మహిళా బ్రాహ్మణ వలంటీర్లను కూడా నియమించాలని సూచించారు. యాగ శాల సమీపంలో ప్రవచనాలు, ఆధ్యాత్మిక-సాంస్కృతిక కార్యక్రమాలు, అనుగ్రహ భాషణాలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. అవి కూడా ఆయన పరిశీలించారు. ప్రత్యేకంగా భారీ వేదికను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నుండి భక్తులు నేరుగా యాగ శాలకు వెళ్లి యాగ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ప్రదక్షిణ చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. యాగం జరుగుతుండగా ప్రత్యక్షంగా చూడటానికి వీలుగా యాగ శాల నలు దిక్కులా మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు కూడా యాగ శాలకు ఇరువైపులా దాదాపు 4000 మంది ఒకేసారి కూర్చోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి చండీ యాగం వలంటీర్లకు సూచించారు. శృంగేరి నుండి వచ్చే రుత్విజుల కోసం, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే బ్రాహ్మణుల కోసం, ప్రముఖుల కోసం, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి శాలలను సిఎం పరిశీలించారు. రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు విడిది చేసే ప్రత్యేక కాటేజీలను సందర్శించిన ముఖ్యమంత్రి వాటిలో ఎసి, ఫ్రిజ్‌, టాయిలెట్లు, ఇతర సదుపాయాలను సమకూర్చడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించడానికి సమాచార కేంద్రాన్ని, వ్యాఖ్యాతలను, ఆరోగ్య కేంద్రాన్ని, అంబులెన్సులను, అగ్నిమాపక ఇంజన్లను, రెస్క్యూ టీమ్‌లను అందుబాటులో ఉంచారుపార్కింగ్‌ స్థలాన్ని, భోజన శాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు


        మరుసటి రోజునుంచి ప్రారంభం కానున్న అయుత చండీ మహాయాగం పూర్వ రంగంలో, ద్వాదశి నాడు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్విక్కులు పణిశశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, హరినాథ శర్మ, ఇతర వేద పండితులు తొలుత శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వారిని సంభోదిస్తూ "గురువు చిరుతావళి'' పఠించారు. శివపార్వతుల విగ్రహాల ముందున్న మహారుద్ర యాగశాల హోమ గుండం వద్ద జ్యోతి ప్రజ్వలన జరిగింది. "జయ మంగళ గౌరి.. భద్రకాళి.. సర్వమంగళ... అయమ్ముహుర్తః సుముహూర్తమస్తు... లోకాభి రామం శ్రీరామం... గంగాధి పతయేనమః... క్షేత్రపాలాయ నమః... అంటూ కేశవ, మాధవ, నారాయణ నామాలు పఠించారు. మంగళ వాయిద్యాల మధ్య సాగిన కార్యక్రమంలో "శ్వేత వరాహ - కల్పే..." అంటూ మహా సంకల్పం చెప్పారు. విశ్వ కళ్యాణం కొరకు జరుగనున్న ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగేందుకు మహా గణాధిపతి పూజ చేశారుదంపతులు ఇద్దరూ హోమ గుండం చుట్టూ  ప్రదక్షిణా నమస్కారాలు చేశారుత్రైలోక్య మోహన గౌరీ హోమం నిర్వహించారుఇందులో భాగంగా పదివేల సార్లు గౌరీ జపం, వేయి పర్యాయాలు హోమాలు చేశారు. యాగానికి వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని, క్రమశిక్షణతో మెలగాలనీ, ఆ ప్రేరణతో మనస్సు లగ్నం చేయాలని గౌరీ హోమం  ద్వారా రుత్విజులు ఆకాంక్షించారుపూజల్లో భాగంగా ఉదకశాంతి, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం, తదనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. రుత్విజుల ఆశీర్వచనంతో కార్యక్రమం ముగిసింది


మరో ముఖ్యమైన ఘట్టం ఆ సాయంత్రం జరిగిన ఆచార్యాది రుత్విగ్వరణం. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వేల మంది రుత్విక్కులకు ముఖ్యమంత్రి దంపతులు దీక్షా వస్త్రాలు అందచేశారు. స్వయంగా వారిరువురు పన్నెండు మందికి పాదాభివందనం చేసి లాంఛనంగా ఇవ్వగా మిగిలిన వారందరికీ పంపిణీ చేశారు. దంపతులిరువురూ యాగశాలలోకి ప్రవేశించి, రుత్విక్కుల తలపై పూలు, అక్షింతలు చల్లి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిలో కొందరికి వారి-వారి బాధ్యతలు విధులు అప్ప చెప్పారు. కేసీఆర్ సోదరికి పాదాభివందనం కూడా చేసి ఆశీర్వాదం తీసుకున్నారు దంపతులు. రుత్విగ్వరణంలో భాగంగా దుర్గా దీప నమస్కార పూజ, రక్షా సుదర్శన హోమం నిర్వహించారు.


          నిర్ణయించిన ముహూర్తానికి, బుధవారం ఉదయం మహాయాగం ప్రారంభమయిందిసరిగ్గా ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు ఆవరణ ప్రవేశం చేశారు. రుత్విజులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారుసాంప్రదాయ బద్ధంగా, వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన బ్రాహ్మణులు సీఎం దంపతులను యాగ శాలకు తోడ్కొని వచ్చారు. మొదలు, రుత్వికులతో కలిసి సిఎం దంపతులు యాగశాల ప్రదక్షిణ చేశారు. 8.45 గంటలకు యాగ శాలకు వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులకు బుకేతో ముఖ్యమంత్రి దంపతులు, పూర్ణ కుంభంతో  రుత్విజులు స్వాగతం పలికి సాదరంగా లోనికి తీసుకెళ్లారు. చండీమాత ప్రతిరూపాలైన మహా కాళి, మహా సరస్వతి, మహా లక్ష్మి విగ్రహాల ముందు గురు ప్రార్థనతో మొదటి రోజు  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రుత్విక్కులు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు గవర్నర్  దంపతులు కూడా పూజలో పాల్గొన్నారుమహా గణపతి పూజ, మహా సంకల్పం జరిగింది. అయుత చండీ మహాయాగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి సందేశం పంపారు. లోక కళ్యాణార్థం కెసిఆర్ దంపతులు అయుత చండీ యాగం చేస్తున్నారని తెలిసి తనకు సంతోషం కలిగిందని, అసురులను సంహరించిన లోకమాత చండీ దేవి అనుగ్రహంతో యాగం ఫలప్రదం అవుతుందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వుంటారని ఆశాభావం వ్యక్తం చేశారుఈ మేరకు సందేశంతో కూడిన లేఖను యాగశాలలో ప్రధాన రుత్విజులు చదివి వినిపించారు.


            శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చిన ముఖ్య కార్య నిర్వహణ-పాలన అధికారి గౌరీ శంకర్ గురువుగారి ఆశీస్సులు అందచేస్తూ ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రుత్విజులతో యాగశాల "మినీ ఇండియా"గా కనిపిస్తున్నదని ఆయన అన్నారుగడచిన రెండు వందల ఏళ్లుగా, చరిత్రలో ఏ చక్రవర్తి గానీప్రజాస్వామ్య పాలకుడు గానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి యాగం చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. మహా భారతంలో చెప్పినట్లు... ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి జరిగినట్లే, కెసిఆర్ నిర్వహిస్తున్న యాగానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి, ఇక్కడో అద్భుత  ప్రపంచాన్ని సృష్టించారన్నారుకెసిఆర్  ప్రజల సంక్షేమం  కోసం చిత్తశుద్ది, నిబద్ధతతో చేస్తున్న యాగం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారుపిల్లలకు ఇబ్బంది కలిగితే తల్లి అనుగ్రహించినట్లుగానేప్రజల బాగోగుల కోసం పాలకులు చండీ మాతను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. కెసిఆర్ ఇప్పడు చండీ యాగం చేస్తున్నది కూడా  తల్లి అనుగ్రహం కోసమే అన్నారు. నాలుగేళ్ల క్రితం శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి నిర్వహించిన పద్దతిలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా యాగం చేయడం అరుదైన సందర్బం అన్నారు. శృంగేరి పీఠాధిపతి పంపిన రుత్విజులు సంకల్ప కర్త (కెసిఆర్) నిబద్ధతకు అనుగుణంగా యాగం జరిపించాలని గౌరీ శంకర్ పిలుపునిచ్చారు.   మహారాజులు కూడా చేయలేని బృహత్కార్యాన్ని ప్రజా సంక్షేమం  కోసం తలకెత్తుకున్న కెసిఆర్ సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని ఆకాంక్షించారు.


          ఐదు రోజుల పాటు జరిగే అయుత చండీ యాగం మొదటి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఆరంభ పూజల్లో పాల్గొన్న ప్రముఖుల్లో గవర్నర్‌ నరసింహన్‌, ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎ.ఆర్‌.భోస్లే, న్యాయమూర్తులు చంద్రయ్య, దుర్గాప్రసాద్‌, రామోజి గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌ రావు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ ఉన్నారు


            శృంగేరి పీఠం నుంచి వచ్చిన శాస్త్ర పండితులు నరహరి సుబ్రహ్మణ్య భట్‌, తంగిరాల శివకుమార్ శర్మపవిత్ర శ్రీ చక్రానికి నవావరణ పూజా కల్పోక్తంగా ప్రత్యేక అర్చనలు జరిపారుమధ్యాహ్నం జరిగిన శ్రీ రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో ఆచార్య రవిశంకర్‌, వేద పండితులు కుప్పా రామజోగి సోమయాజులు పాల్గొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దంపతులను ఆశీర్వదించారుప్రసిద్థ సంస్కృత పండితులు ఆచార్య ఆయాచితం నటేశ్వరశర్మ, "యజ్ఞాలు - సామాజిక ప్రయోజనాలు''  అనే అంశంపై ప్రసంగించారు. హంపి విరూపాక్ష పీఠం అధిపతి విద్యారణ్య విరూపాక్ష స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠం అధిపతులు శ్రీ వీరశైవ మహాస్వామి పాల్గొని కెసిఆర్‌ దంపతులను ఆశీర్వదించారు. సాయంత్రం పూట రుద్రక్రహర్చన, నీరాజ సేవ, శ్రీరామ లీల గేయ కథా గానము భక్త జనులను అలరించాయి.   యాగ శాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో వేలాది మంది మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారుశ్రీదేవి దీక్షాదారులైన రుత్విజులు పవిత్ర దీక్షా వస్త్రాలు ధరించి శ్రీ దుర్గా సప్తశతీ పారాయణం చేయడంతో పాటు ఇతర పూజలు నిర్వహించారుముఖ్యమంత్రి నుంచి మొదలుకుని అందరూ మొదటి రోజు కోసం నిర్దేశించిన పసుపు వర్ణం దీక్షా వస్త్రాలు ధరించారు.   యాగం చూడడానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదంతో పాటు దైవ ప్రసాదం, పసుపు, కుంకుమ అందించారు.


 మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గో పూజ, మహామండప స్థాపనం, చండీ యంత్రలేఖనము, యంత్ర ప్రతిష్ఠ, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ఠ, నవావరణార్చన, ఏకాదశ న్యాసపూర్వక సహస్ర చండీ పారాయణము, పంచబలి, యోగినీ బలి, మహారుద్ర యాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగ ప్రారంభం, మహాసౌరము, ఉక్తదేవతా జపములు, మంత్ర పుష్పము, విశేష నమస్కారములు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణము జరిగాయి. సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్చరణ, విశేష పూజా ఆశ్లేషా బలి, అష్టవధరణ సేవ, శ్రీరామలీల (హరికథ) కూడా జరిగాయి.


ఓం నమో భగవతే రుద్రాయ... అంటూ బ్రాహ్మణుల స్తోత్ర పఠనంతో, రెండవ రోజైన, గురువారం నాడు, అయుత చండీ మహాయాగం ప్రారంభమైందినిర్ణీత సమయానికి రుత్విజులు యాగ స్థలానికి చేరుకుని, పూజలు ప్రారంభించారుఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు యాగ శాలకు చేరుకున్నారు. బ్రాహ్మణులు స్వాగతం పలికారు. చండీ రూపాలైన మహా కాళి, మహా సరస్వతి, మహా లక్ష్మి విగ్రహాల ముందు రుత్విజులు గోపీకృష్ణ శర్మపణిశశాంక శర్మ, హరినాథశర్మలు శృంగేరి పీఠం నుంచి ప్రత్యేకంగా వచ్చిన నరహరి సుబ్రహ్మణ్య భట్ ఆధ్వర్యంలో గురు ప్రార్థన జరిపారు. "శ్రీ సచ్చిదానంద.. చంద్రశేఖర భారతీ తీర్థ... విద్యా తీర్థ గురుంభజే... వందే గురు పరంపర.. సాష్టాంగ ప్రమాణ సమర్పయామి" అంటూ ముఖ్యమంత్రితో సహా, రుత్వికులంతా గురు ప్రార్థన చేశారుతర్వాత రెండువేల సప్తశతీ,  30 లక్షల నవావరణ పూజ, చతుష్షష్టి యోగిని బలి, మహా గణపతి పూజలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. పూర్వాశ్రమంలో శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి తండ్రి కుప్ప శివ సుబ్రహ్మణ్యం, తాత కుప్ప గోపాల వాజ్ పాయి యుజి  గురువారం నాటి యాగంలో పాల్గొని కెసిఆర్ ను  ఆశీర్వదించారు. కార్యక్రమంలో  గురు ప్రార్థనతో పాటు గోపూజ, ఏకాదశన్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణములుమహా ధన్వంతరీ యాగము, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణ, మహా సౌరము, ఉక్త దేవతా జపములు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా  మంగళ హారతి తదితర  కార్యక్రమాలు జరిగాయి.


            సాయంత్రకాల పూజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు సాయంత్రం 5.20 గంటలకు హాజరయ్యారు. ముందుగా యాగశాలలో రుత్విజులకు ముఖ్యమంత్రి అభివాదం చేశారు. శివపార్వతుల విగ్రహాల దగ్గర రుద్ర క్రమార్చనలో సిఎం దంపతులు పాల్గొన్నారు. మంగళహారతి కార్యక్రమం, చతుర్వేద పారాయణం జరిగాయి. ధార్మిక ప్రవచనంలో భాగంగా యాగ మహిమ, దత్త జయంతి విశేషాలు పురాణం మహేశ్వర శర్మ సవివరంగా ఆహుతులకు తెలియజేశారు. మరోసారి హారతి కార్యక్రమం ముగిసిన  తర్వాత  కార్యక్రమం చండీ రూపాల విగ్రహాల దగ్గర జరిగింది. లలితా నామావళి, కోటి నవాక్షరీ పురశ్చరణ, విశేష పూజ ఆశ్లేషాబలి, అష్టవధరణ సేవ జరిగాయి.    మొదటిరోజు మాదిరిగానే శ్రీరామ లీల హరికథా కార్యక్రమం జరిగింది.  


            సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డిడైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, యశోదా  హాస్పిటల్స్  డైరెక్టర్ సురేందర్ రావు తదితరులు పూజలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో హాజరై యాగాన్ని తిలకించారు. ఆంగ్లో - ఇండియన్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ పాల్గొన్నారు. మంత్రులు  ఇంద్రకిరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్కొత్త ప్రభాకర్ రెడ్డిఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, పత్తి పాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, ఎన్.టి.వి, భక్తి టివి చైర్మన్  టి.నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.


దర్శనానికి, ప్రదక్షిణకు మొదటి రోజు నుంచే మొదలైన జన వాహిని, రెండవ రోజు కల్లా లక్షకు చేరుకుంది. వారందరికీ అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు, పసుపు, కుంకుమ అందించారు నిర్వాహకులు.

            అయుత మహా చండీ యాగం మూడవ రోజు కార్యక్రమం శుక్రవారం ఉదయం గురు ప్రార్థనతో ప్రారంభమయిందిఉదయం 8.20 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గురు ప్రార్థనలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామి వారికి "వందే గురు పరంపర" అంటూ రుత్విజులు పఠనం చేస్తుండగా ముఖ్యమంత్రి గురువుకు సాష్టాంగ ప్రమాణం చేశారుసప్తశతీ పారాయణం ప్రారంభించే ముందు పూర్వాంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అంతర మాతృక న్యాసాలు, బహిర్ మాతృక న్యాసాలు, చండీ కవచం, అర్గళ, కీలక పఠనం, ఏకాదశి న్యాసాలు నిర్వహించారుశరీరంలో అమ్మవారిని ఆవాహన చేసుకునేందుకు రుత్విజులు పాటించే సంప్రదాయ కార్యక్రమమే ఏకాదశి న్యాసంయాగశాల ప్రాంగణాన్ని చామంతి, బంతి పూలతో  ప్రత్యేకంగా అలంకరించి ఆకర్షణీయంగా మార్చారు. గురు ప్రార్థన, పూర్వాంగం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు యాగశాలను కలియతిరిగి రుత్విజులకు అభివాదం చేశారు.


          శృంగేరి పీఠం నుంచి వచ్చిన  ప్రధాన రుత్వికుల్లో  ఒకరైన  ఫణి శశాంక శర్మ అయుత చండీ యాగం  నేపథ్యాన్ని వివరించారు.    నవ చండీ, శత చండీ, సహస్ర చండీ యాగాలను  చాలా మంది కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా చేస్తారని, అయుత చండీ యాగం మాత్రం విశ్వ శాంతి కోసం చేస్తారన్నారుఇది చాలా అరుదుగా చేస్తారన్నారుఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మొదటి నాలుగు రోజులు సప్తశతి  చండీ పారాయణం పదివేలుకోటి నవార్ణవ పూజ ఉంటాయి. అయుత చండీ యాగం పద్దతులు డామర తంత్రంలో, సప్తశతీ సర్వస్వంలో, చండికోపార్చన రహస్యంలో  దొరుకుతాయి. 1200 సంవత్సరాల క్రితం  జగద్గురు ఆది శంకరాచార్యులు శృంగేరి శారదా పీఠం నెలకొల్పినప్పుడు ప్రతిష్ట చేసిన ఉభయ  భారతీ దేవి అమ్మవారి దగ్గర సప్తశతీ పారాయణం జరగాలని, దానికి కొన్ని నియమ, నిష్టలు ఉండాలని ఆది శంకరాచార్య సూచించారు.   దాని ప్రకారమే ప్రస్తుత చండీ యాగం జరుగుతున్నది.


            శుక్రవారం నాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్  స్వామి, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణా నంద స్వామిలకు ముఖ్యమంత్రి స్వాగతం  పలికి, పాదాభివందనం చేశారువారిద్దరూ ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఆంధ్రప్రదేశ్  శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాద్ రావు, తెలంగాణ మంత్రులు టి. హరీష్ రావు, కె.తారక రామారావుఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిచందూ లాల్టూరిజం  కార్పోరేషన్  చైర్మన్  పేర్వారం రాములు, మీడియా సంస్థల అధిపతులు గిరీష్ సంఘిగౌతమ్వి.రాధాకృష్ణ, శైలజా కిరణ్, పలువురు అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర  గవర్నర్  విద్యాసాగర్ రావు దంపతులు  ఉదయం పూట  పూజల్లో  పాల్గొని, అన్న ప్రసాదాలు స్వీకరించారుయాగ శాలకు వచ్చిన అతిథులను ప్రధాన ద్వారం వద్ద మంత్రి  హరీష్ రావు ఆహ్వానించగా, యాగశాలలో  ముఖ్యమంత్రి కెసిఆర్  వారితో ప్రదక్షిణం చేయించారు


            కార్యక్రమంలో  భాగంగా చతుర్వేద  పారాయణ యాగ శాలల్లో  చేసిన పూర్ణాహుతి  కార్యక్రమంలో అతిథులతో సహా ముఖ్యమంత్రి పాల్గొన్నారురాజశ్యామల యాగశాలలో  కూడా పూర్ణాహుతి జరిగింది.    పదివేల జపాలతో  వేయి పుష్పాలతో యాగశాల నలు దిక్కులా శాస్త్రోక్తంగాసంప్రదాయ బద్దంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని  ప్రత్యేక అతిథులతో పాటు ప్రదక్షిణ చేసిన వేలాదిమంది  భక్తి శ్రద్దలతో  తిలకించారు.          చతుర్వేద శాలలు  సందర్శించే  ముందు ముఖ్యమంత్రి దంపతులు గోపూజ జరిపారుమూడవ  రోజు  కార్యక్రమంలో రెండు వేల సప్తశతీ  పారాయణాలు, 30 లక్షల నవావరణ జపాలుచతుష్షష్టి యోగినీ బలి, మహా గణపతి పూజలు జరిగాయి. మూడవ రోజు కూడా దర్శనం, ప్రదక్షిణలలో సుమారు రెండున్నర లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు.


          వివిధ జిల్లాలు, పరిసర గ్రామాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు చేస్తున్న ప్రదక్షిణ, భక్తి శ్రద్దల కోలాహలం, చండీ మాత నామస్మరణ మధ్య నాలుగవ రోజు అయుత చండీ మహాయాగం సాగింది.   ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దంపతులు యాగశాల ప్రవేశం చేశారుముందు మహా సరస్వతి, మహకాళి, మహలక్ష్మి విగ్రహాల ముందు గరుప్రార్థన చేశారువివిధ రకాల పూలతో అలంకరించడంతో అమ్మవారి విగ్రహాలు, చండీ యాగం ప్రాంగణం సువాసనలతో, ఆకర్షణీయమైన ఆకృతులతో ఆకట్టుకుంది. శృంగేరి పీఠం నుంచి చండీ యాగం నిర్వహణ కోసం వచ్చిన ప్రధాన యజ్ఞ బ్రాహ్మణులు నరహరి సుబ్రహ్మణ్య భట్‌, తంగిరాల శివకుమార్‌ శర్మ ఆధ్వర్యంలో  రుత్విజులు, ముఖ్యమంత్రి సహా ప్రాంగణంలో ఉన్న వారంతా కృతజ్ఞతా, ఆరాధనా భావంతో చేసిన గురు ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి.   "శంకరాచార్యమాశ్రయే... శ్రీ సచ్చిదానంద స్వామినాం... భారతీ తీర్థ మాశ్రయే... ఓం శాంతి శాంతి శాంతి.. శ్రీమత్‌ జగద్గురు... గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః" అంటూ రుత్విజులు చేసిన భారతీ తీర్థ గురు స్తోత్ర పఠనంతో ప్రాంగణం మారు మోగిందిమహా గణపతి పూజ, సప్తశతి చండీ పారాయణం, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం తదితర కార్యక్రమాలు ఉదయం పూట జరిగాయి


      మొదటి రోజు ఆరంభ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ నాలుగవ రోజు కూడా ఉదయమే సతీ సమేతంగా యాగ శాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పూజల్లో పాల్గొన్న నరసింహన్‌ దంపతులు యాగశాల చుట్టూ సిఎంతో పాటు ప్రదక్షిణ చేశారు. పలువురు అధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, పత్రికాధి పతులు, సినీ తారలు, నాలుగవ రోజు వచ్చారుతమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణసుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి, తమిళనాడు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుభాషణ్‌ రెడ్డిమాజీ న్యాయమూర్తులు స్వరూప్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, రాష్ట్ర  హైకోర్టు న్యాయమూర్తులు నవీన్‌ రావు, రాజశేఖర్‌ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి శరద్‌ పవార్‌, టిటిడి జెఇఒ శ్రీనివాస రాజు, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి, మాజీ మంత్రులు జె. గీతారెడ్డిదానం నాగేందర్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వి ఎస్‌. ప్రభాకర్‌సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌, శివాజి రాజా, మిమిక్రీ శివారెడ్డిసీనియర్‌ ఎడిటర్‌ కె.రామచంద్రమూర్తి, టివి 5 చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారుటిఆర్ఎస్‌ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు అధికార హోదాలను పక్కనబెట్టి వచ్చిన ప్రముఖులు, భక్తులకు స్వాగతం పలుకుతూ, సౌకర్యాలు చేస్తూ, సూచనలు ఇస్తూ వలంటీర్లుగా పనిచేశారు. పుష్పగిరి పీఠాధిపతి, హలిదీపురం పీఠాధిపతి, గోపాలకృష్ణ మఠ పీఠాధిపతి, మాదవీనంద స్వామి, కపిలేశ్వరస్వామికమలానంద భారతి తదితరులు పాల్గొని కెసిఆర్‌ దంపతులను ఆశీర్వదించారు


            యాగానికి వచ్చిన ప్రముఖులను సిఎం తన వెంటబెట్టుకుని విష్ణు యాగం, శివపార్వతుల ప్రాంగణం, పూర్ణాహుతి జరుగుతున్న చతుర్వేద యాగ శాలలురాజశ్యామల యాగ శాలలు తిప్పి, చండీ యాగం విశేషాలు, మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రముఖులను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందచేశారు. వారంతా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. జస్టిస్‌ రమణ పండ్ల బుట్టలతో వచ్చి  చండీ రూపాలకు సమర్పించారుటిటిడి తరపున జెఇఒ శ్రీనివాసరాజు ముఖ్యమంత్రికి స్వామి వారి ప్రసాదం అందించారు. మఠాధిపతులకు పండ్లు, వస్త్రాలను ముఖ్యమంత్రి అందించి, పాదాభివందనం చేశారు.



            యాగం చివరి రోజు కెసిఆర్‌ ధరించే పట్టు వస్త్రాలను శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి పంపారు. ప్రత్యేక దూత ద్వారా ముఖ్యమంత్రికి ఆశీర్వచనంతో పాటు, ఈ పట్టు వస్త్రాలు పంపారుముఖ్యమంత్రి వాటినే ధరించి చివరి రోజు పూజలో పాల్గొనాలని పీఠాధిపతి సందేశంగా ప్రత్యేక దూత తెలియ చేశారు. శృంగేరి పీఠం నుంచి ప్రత్యేకంగా సిఎం కోసం ప్రసాదం పంపారు. వేద విద్యా వికాసానికి ఆరు దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న కార్యదీక్షకు గుర్తింపుగా మాడుగుల మాణిక్య సోమయాజులు దంపతులకు ముఖ్య మంత్రి దంపతులు, దంపతీపూజప్రత్యేక సన్మానం చేశారు. స్వర్ణ కంకణం తొడిగి సోమయాజులును ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి వారు ఆశీర్వాదం అందించారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగించే శక్తి, సామర్ధ్యాలు, ఆయురారోగ్యాలు కెసిఆర్‌ కు కలగాలని, కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని వారు ఆకాంక్షించారు.  

            అయుత మహా చండీ యాగం, అయిదవ రోజైన ఆదివారం, సాయంత్రం పూర్ణాహుతితో ముగిసింది. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నాలుగు రోజుల మాదిరిగానే  గురు ప్రార్థనమహా గణపతి పూజ, పుణ్యాహవచనం, కుండ సంస్కారం జరిగిన తర్వాత  ప్రధాన హోమ గుండంలో అగ్ని ప్రతిష్టను రుత్విజులు నిర్వహించారు.   యాగశాల  లోపల వున్న 101 హోమ గుండాల దగ్గర 1100 మంది రుత్విజులు, వారికి కావాల్సిన సమిధలు, పాయసం, నెయ్యి, కర్పూరం తదితర పూజా సామాగ్రిని ఇతర బ్రాహ్మణులు సమకూర్చారుప్రధాన గుండంలో  అగ్ని ప్రతిష్ట తర్వాత అగ్నిని ఆవాహన చేశారుదానిని అగ్ని విహరణము అనే ప్రక్రియ ద్వారా మిగిలిన నూరు గుండాలలో ప్రతిష్ట చేశారు. మహా పూర్ణాహుతి చేయడానికి ముందు చతుర్వేద, మహారుద్ర, రాజశ్యామల యాగ శాలల్లో పూర్ణాహుతి జరిగిందిఅగ్ని విహరణలో భాగంగా జరిగిన హోమంలో ప్రతి రుత్విజులు సప్తశతి మంత్రాలతో 700  ఆహుతులను పరమాన్న ద్రవ్యంగా ఇచ్చారు1000 ఆహుతులను ఆజ్య ద్రవ్యంగా ఇచ్చారు7 లక్షల పరమాన్న ద్రవ్యం, 10 లక్షల ఆజ్య ద్రవ్యం ఆహుతి చేశారుఅంతకుముందు జరిగిన తర్పణంలో వంద మంది రుత్విజులు పూర్వాంగ, ఉత్తరాంగ సహితంగా 700 మంత్రాలతో తర్పణం ఇచ్చారు. 7 లక్షల నవాక్షరీ మంత్రం కూడా జపించారు. అభిషేక జలాలతో యజమాని (కెసిఆర్‌) దంపతులకు అవభృతం చేయించారు. శృంగేరి పీఠం అధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి పంపిన పట్టు వస్త్రాలు ధరించి ముఖ్యమంత్రి దంపతులు ఆదివారం నాటి పూజలో పాల్గొన్నారు.


       పూర్ణాహుతి కార్యక్రమాల్లో హాజరైన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రి కెఇ.కృష్ణమూర్తి, మంత్రి ఘంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు, తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌ మధుసూధనాచారి, రిటైర్డ్‌ జడ్జి ఎల్‌. నర్సింహరెడ్డి, సినీ ప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డి. సురేష్‌బాబు వున్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యాగశాలలో ఘనస్వాగతం లభించిందిహెలిప్యాడ్‌ వద్ద మంత్రి హరీష్‌రావు స్వాగతం పలకగా, యాగశాల ప్రధాన ద్వారం వద్ద రుత్విజులు పూర్ణ కుంభ స్వాగతం పలికారుచంద్రబాబు, ఆయన వెంట వచ్చిన కెఇ. కృష్ణమూర్తిసుజనా చౌదరిఘంటా శ్రీనివాసరావు తదితరులకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారుచంద్రబాబు బృందం మొదటి యాగశాలలో ప్రదక్షిణ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారిని శివపార్వతుల విగ్రహం వద్దకు తీసుకెళ్లారుకెసిఆర్‌ తో పాటు చంద్రబాబు బృందం అక్కడ పూజల్లో పాల్గొన్నారువారికి చండీమాత విగ్రహాన్ని బహూకరించి, శాలువాతో సత్కరించారు.

            అంతకు ముందు, యాగశాలలో ఆగ్నేయం దిక్కున కొద్దిపాటి నిప్పు రవ్వలు ఎగిసి పడడంతో కొద్దిగా మంటలు లేచాయి. చాలా వేగంగా అగ్నిమాపక దళం స్పందించడంతో కొద్ది నిమిషాల్లోనే  మంటలు ఆరిపోయాయి. మంటలు ఆర్పడం వల్ల పూర్ణాహుతి కోసం నిమిషాల్లోనే ఏర్పాట్లు జరిగాయి. దాదాపు రెండు వేల మంది రుత్విజులు తిరిగి యాగ శాలకు చేరుకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి  ప్రారంభించారు. చివరి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు యాగ శాలకు వచ్చారు. అందరికీ అన్ని విధాలైన ఏర్పాట్లను నిర్వాహకులు సమకూర్చారు.


            యాగం ముగిసిన తరువాత ఆ ప్రాంగణంలోనే వున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ..."అద్భుతమైన అయుత చండీమహాయాగం దిగ్విజయంగా జరిగింది. యాగశాలలో చోటుచేసుకున్న స్వల్ప అగ్నిప్రమాదం అరిష్టమేమీ కాదు. క్రతువులో భాగంగా పూర్ణాహుతి జరిగిన అనంతరం యాగశాలను అగ్నికి అర్పించాలని చండీ యాగం చెపుతున్నది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఆందోళన అక్కర్లేదు. యాగానికి సంతుష్టురాలైన చండీ అమ్మవారే ఈ రకంగా అనుగ్రహించారు. ఈ యాగంతో రాష్ర్టానికి, లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన రీతిలో, దేశంలో ఇంతవరకూ హిందూ వాదులమని చెప్పుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ యాగం చేయలేదు. యజ్ఞ యాగాదులు, క్రతువులు చేస్తే మంచి జరుగుతుందనే భావనతోనే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు అందరూ సుఖంగా ఉండాలనేదే ఈ క్రతువు ముఖ్య ఉద్దేశం. స్వల్ప అగ్నిప్రమాదం అమ్మవారి అనుగ్రహం. శుభసూచకం. భద్రాచలంలో అతిరాత్రం నిర్వహించాక అక్కడి యాగశాల పాకలను కాల్చివేశారు. విశాఖ శారదా పీఠం అమ్మవారి పాదాల సాక్షిగా ఇక్కడ జరిగింది మొత్తం శుభసూచకమేనని నేను స్పష్టం చేస్తున్నాను" అన్నారు.



          అవధాన సరస్వతి, ద్వి సహస్రావధాని మాడుగుల నాగ ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ... "సర్వ సంపూర్ణంగా ఈ అయుత చండీమహాయాగం సఫలమైంది. భారతీ తీర్థ, శంకరాచార్య పర్యవేక్షణలో జరిగిన యాగం సుసంపన్నమైంది. అభిజిత్ లగ్నంలో పూర్ణాహుతి జరగాల్సి ఉంది. అది ముందే శాస్త్రోక్తంగా జరిగిపోయింది. యాగ నిర్వాహకులు, యాగ కర్త కేసీఆర్ యాగ విభూతి కూడా ధరించారు. అందువల్ల యాగం దిగ్విజయమైనట్టే. 14 ఏళ్ల దృఢ దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అంతే దీక్షతో ఇప్పుడు అయుత చండీ యాగాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ సంకల్పబలంతో బంగారు తెలంగాణను కూడా సాధిస్తారు. ఆయన ఎంతో విజ్ఞుడు. పూర్వ యుగాల్లో రాజులు యాగాలు చేసిన విధంగానే కలియుగంలో అయుత చండీ యాగాన్ని నిర్వహించి ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. యాగ నిర్వహణలో భాగంగా కేవలం బ్రాహ్మణులతోనే కాకుండా సమస్త పరివారంతో మడి కట్టించి యాగాన్ని విజయవంతం చేశారు" అన్నారు.


            యాగం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీ మాతను కోరుకున్నట్లు చెప్పారు. అనుకున్న లక్ష్యాలు నెరవేరితే, ప్రాజెక్టులన్నీ పూర్తయి తెలంగాణ రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే నియుత చండీ మహా యాగాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నానని వెల్లడించారు. అయుత చండీ యాగం ఏ ఒక్కరి కోసమే చేసినది కాదని… ఇది విశ్వ కల్యాణం, లోకహితం కోసం చేసిన యాగమని కేసీఆర్‌ అన్నారు. అనంతరం యాగంలో పాల్గొన్న రుత్విజులకు కేసీఆర్‌ సత్కారం చేశారు. యాగాలు నిర్వహించడం తనకు కొత్తేవిూ కాదని సీఎం అన్నారు. తాను ఈ యాగం నిర్వహిస్తున్న సమయంలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు విజయవంతం కావాలని చండీ అమ్మవారిని కోరుకున్నానని వెల్లడించారు. నియుత చండీ యాగానికి కూడా ప్రయోక్తలు విూరే కావాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, కులాల ప్రజలు సుసంపన్నంగా బతికితే తనకు అంతకన్నా సంతోషమేముంటుందని తెలిపారు. తెలంగాణలో అందరూ చిరునవ్వులతో బతకాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. అయుత మహా చండీ యాగం ముగిసిన తర్వాత రుత్వికులను, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఈ యాగం తలపెట్టినపుడు ఎందరో అవాకులు చెవాకులు పేలారని, ఈ యాగం ఏ ఒక్కరి కోసమో చేసింది కాదని, సర్వ మానవాళి క్షేమం కోసం చేశామని, అమ్మవారి సేవలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు ధన్యావాదాలని అన్నారు. చండీ మాతాకీ జై అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.


            యాగాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఎర్రవల్లికి పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. యాగాన్ని తిలకించేందుకు వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సులతో రవాణా ఏర్పాట్లు చేయడమే కాక అతిథులందరికీ భోజన వసతి కల్పించారు. యాగం జరిగిన ఐదు రోజులు ఎర్రవల్లి జన సంద్రాన్ని తలపించింది.

చండీ యాగం నిర్వహణతో పాటు యాగ కర్త, రుత్విజులు ధరించిన వస్త్రధారణ కూడా ప్రజల్లో ఆసక్తి రేపింది. యాగంలో పాల్గొన్న వారంతా తొలిరోజు పసుపు, రెండో రోజు గులాబీ, మూడో రోజు తెలుపు, నాలుగోరోజు ఎరుపు, ఐదో రోజు పసుపు వస్త్రాలు ధరించారు.End


No comments:

Post a Comment