Sunday, January 10, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-18 : గర్భం ధరించిన శ్రీకౌసల్యాదేవి : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-18
గర్భం ధరించిన శ్రీకౌసల్యాదేవి
వనం జ్వాలా నరసింహారావు

పుత్రకామేష్టి యజ్ఞం పర సమాప్తం కాగానే, దేవతలందరూ, వారివారి హవిర్భాగాలు తీసుకొనిపోయిన తర్వాత, దశరథుడు దీక్ష విడిచి, ప్రియ భార్యలతో అయోధ్య చేరి, యజ్ఞంకొరకై వచ్చిన రాజులందరికీ - వారి పరివారంతో సహా, వస్త్రాభరణాలు - కానుకలు ఇచ్చి, సంతోషపర్చాడు. అందరినీ సంతోషంతో పంపిన తర్వాత, తన కొడుకులను ఎప్పుడు చూస్తానోనని ఉవ్విళ్ళూరుతూ, కోరికలు ఆకాశాన్నంటుతుండగా దశరథుడు తనలోతానే ఉబ్బి పోయాడు. కౌసల్యా దేవి గర్భం పెరుగుతోంది. గర్భం రాక ముందు కౌసల్య పొట్ట పల్చగా - మర్రి ఆకులాగా వుండేది. ఇప్పుడేమో గర్భంలో "వటపత్రశాయి" విష్ణువున్నందున, బలిసిన మర్రి ఆకులాగా వుంది. పాలసముద్రంలో పడుకొని, లోకాలనెల్ల రక్షించే పరమాత్ముడికి పాలిచ్చే భాగ్యం - అదృష్టం తమకు కలిగిందన్న భావనతో, సంతోషంతో, కౌసల్యా దేవి స్తనాలు వుబ్బాయి. అపరిమేయుడు (ఏ బంధం లేనివాడు) భక్తబాంధవుడైనందున, భక్తులై శరణుజొచ్చిన దేవతల బాధలను తొలగించి, రక్షించేందుకు, ఒక స్త్రీ - కౌసల్యా దేవి గర్భమనే చెరసాలలో బందీగా వున్నాడు.

యజ్ఞం అయిన ఆరు ఋతువుల తర్వాత, పన్నెండో నెలలో, చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య, గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్ఛ స్థలాల్లో(సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్ఛస్తానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి - శుభ లక్షణాలు కలవాడైన రఘువంశ వర్ధనుడిని, సర్వ లోకాలు నమస్కారం చేసేవాడిని, రాముడిని కనింది. శ్రీరామావతారానికి ముఖ్యకారణం దశరథుడి యజ్ఞంకంటే, కౌసల్య తప ప్రభావమేనని అనవచ్చు. ఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్లే భగవంతుడు నవమి నాడు జన్మించాడు. దేవతలకు ప్రభువైన ఇంద్రుడివల్ల అతిది ఎలా ప్రకాశించాడో, అపరిమిత తేజస్సుగల తన కుమారుడి (రాముడు) వల్ల కౌసల్య తేజోవతి అయింది. (లోకంలో సాధారణంగా బిడ్డలదేహకాంతి - ఇతర దేహ సంబంధ చిహ్నాలు తల్లివలన వస్తాయంటారు. రాముడి విషయంలో అలాకాదు. పుట్టిన కుమారుడివలన కౌసల్యకు కీర్తి వచ్చింది. కౌసల్య కొడుకైనందున రాముడు ప్రసిద్ధుడు కాలేదు. అంటే: మాతృ ప్రయుక్త ప్రకృతి సంబంధం కుమారుడిలో లేదనీ - ఆయన ప్రకృతి విలక్షణుడనీ అర్థమవుతోంది. "కౌసల్యా సుప్రజారామ"-ఎవరివలన కౌసల్య మంచి బిడ్డను కన్నదన్న పేరు తెచ్చుకుందోనని కదా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని సంబోధించాడు!).

ప్రత్యక్షవిష్ణువైన శ్రీరాముడిలో నాలుగో అంశతో, కైకేయికి, నేత్రానందకరుడు - సమస్త శుభగుణాకరుడు - సత్యవంతుడు - మిక్కిలి బలవంతుడైన భరతుడు, విష్ణువులో ఒకభాగమై సుమిత్రా దేవి గర్భంలో ఇద్దరు వీరులు -లోకోత్కృష్ట ప్రేమాదిగుణాలకు స్థానభూతులైన లక్ష్మణుడు - శత్రుఘ్నుడు అనే కవలపిల్లలు పుట్టారు. భరతుడు పుష్యనక్షత్రంలో - మీనరాశిలోనూ, ఆశ్లేషానక్షత్రంలో - కర్కాటకలగ్నంలో, మధ్యాహ్నం లక్ష్మణ - శత్రుఘ్నులు జన్మించారు. (శ్రీరాముడు జన్మించిన మరుసటి రోజున భరతుడు పుట్టాడు. చైత్ర మాసంలో కర్కాటక లగ్నం మిట్టమధ్యాహ్నం వస్తుంది. అంటే: భగవదవతారం పగటిపూట అయిందని అర్థం. లక్ష్మణశత్రుఘ్నులు దశమి తిథిన - ఆశ్లేషా నక్షత్రంలో జన్మించడం విశేషం. పంచ గ్రహాలు ఉచ్ఛస్థితిలో వుండడం గురుచంద్రయోగాన్ని తెలుపుతుంది). లోకరక్షణార్థమై భగవంతుడు అవతరించడంతో ఆకాశంలో గంధర్వులు పాడారు - అప్సరసలు ఆడారు - దేవతలు గుంపులుగా కూడారు. మిక్కిలి సంతోషంతో దేవతలు - స్త్రీలు రావణుడివలన భయం పోయినట్లు భావించారు. పూల వానలు కురిసాయి. దేవ దుందుభులు మ్రోగాయి. అయోధ్యా నగరంలో విశేషంగా ఉత్సవాలు జరిగాయి. భూ ప్రజలలో సంతోషం అతిశయించింది. దశరథుడు పుత్రోత్సవాన్ని చాటింపగానే, అయోధ్యా నగరంలో, ఆశ్చర్యం కలిగేలా, ప్రతివారు తమ ఇంటిలోనే తొలిచూలు కొడుకు పుట్టినట్లు ఉత్సవం చేసుకోసాగారు. రాజు ఇవ్వబోయే దానాలు స్వీకరించేందుకు దేశ దేశాలనుండి వచ్చిన బ్రాహ్మణులతో రాచబాటలు నిండిపోయాయి. రసాభినయనం చేసే నటులతో - భావాన్నభినయించే నర్తకులతో - సంకులమైన గాయకుల పాటలతో - వందుల స్త్రోత్ర వాక్యాలతో ప్రస్ఫుటమై - అతిశయించిన సంతోషం కలిగి, అందరి హృదయాలు ఉప్పొంగుతూ అయోధ్య విరాజిల్లింది.

పన్నెండో రోజుతో పురుడు పోవడంతో, పదమూడో రోజున కొడుకులకు నామకరణ ఉత్సవం జరిపారు. ఒక్క హేయ గుణం కూడా లేనివాడైనందున - లోకుల మనస్సులు ఇతనిలో రమించుచున్నందున - యోగుల హృదయాలలో ఇతను రమించినందున - తనగుణరూపాలతో వశీకృతులైనవారు తనయందు అనురాగం కలవారైనందున - తనకు వశులైనవారి విషయంలో రంజిల్లేవాడైనందున - సంసార బాధ తొలగినవారు ఆయనలో రమింతురు కనుక, పెద్దకొడుకుకు రాముడు అని పేరుపెట్టారు. శ్రీరామ కైంకర్యమే తనకు గుర్తుగా - సంపదగా తలంచేవాడైన సుమిత్రా దేవి పెద్దకొడుకుకు లక్ష్మణుడు అని పేరుపెట్టారు. రాజ్యాన్ని భరించాల్సిన భారం తనపైలేకున్నప్పటికీ, భరించవలసి వచ్చింది కనుక, తనను రక్షించే భారం శ్రీరాముడిదేనన్న నిశ్చయబుద్ధిగలవాడై - కేవలం రామపరతంత్రుడై వుండేవాడైనందున కైకేయి కుమారుడికి భరతుడు అని పేరుపెట్టారు. భరతుడి కారణాన్నే శ్రీరాముడు అడవులకు పోయాడని - తండ్రి మరణానికి మూలకారణం భరతుడేనని అనుకోకుండా, నిత్య శత్రువులైన కామ క్రోధాలకు వశ పడకుండా, వాటిని జయించిన సవతితల్లి కొడుకు భరతుడు భాగవతుడైనందున, భగవత్ సేవకన్న భాగవతసేవయే సుకరమని - నిశ్చిత ఫలమని ఎంచినవాడైనందునసుమిత్ర రెండో కొడుకుకు శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. ఇలా వారివారి గొప్పదనం తెలిసిన వాడైన వశిష్ఠుడు పేర్లు పెట్టాడు. నామకరణ మహోత్సవ సమయంలో నగరవాసులకు, పల్లెవాసులకు, దండిగా భోజనం పెట్టి - బ్రాహ్మణులకు మణులను, మాణ్యాలు, దక్షిణలు ఇచ్చి సత్కరించాడు దశరథుడు.

శ్రీరాముడి శైశవ వర్ణన

మొసలికి చిక్కిన గజరాజు రక్షించమని వేడుకున్నప్పుడు, ఏనుగును రక్షించగల సమర్థుడు తాను తప్ప మరెవ్వరూ లేనందున, కాపాడేందుకు పరుగెత్తిన వేలుపు, నేడు కావ్‌కావ్ మని ఏడుస్తున్నాడు రాజకుమారుడై పుట్టిన చిన్ని శ్రీరాముడు. ఆయనను-తమ్ములను అంతఃపుర స్త్రీలు, ఉవ్విళ్ళూరే కోరికలతో, ఉయ్యాలల్లో వుంచి, పంచమ ధ్వనితో - కంకణాల ధ్వనినే చప్పుళ్ళుగా చేసి - రాగం తప్పకుండా, విలాసం వల్ల కలిగిన వికాసంతో ప్రకాశిస్తూ లాలి పాటలు పాడారు. " నాయనా నిద్రపో - రఘునందనా నిద్రపో - తండ్రీ నిద్రపో - బంగారు కొండా ఆటలు చాలించి నిద్రపో - తండ్రీ! నిద్రపోకపోతే దేహం అలసిపోతుంది" అని అంటూ, ఏనాడూ కళ్ళు మూయని దేవాదిదేవుడిని సంబోధిస్తూ ఆ ముద్దుగుమ్మలు పాటలు పాడారు. ఎల్లవేళలా నీళ్లలోనే నివసించే దేవుడికి ఆ స్త్రీలు స్నానం చేయిస్తుంటే, ఏమీ తెలియనివాడిలాగే, వారి ఉత్సాహానికి - తనకై వారు పడే శ్రమకూ - వారి అజ్ఞానానికీ నవ్వుకున్నాడు రాముడు. స్నానం చేయించిన తర్వాత, కౌసల్య, తన చేతిలో నీళ్ళు తీసుకొని, "శ్రీరామా నారాయణా  - ఈ బాలుడిని రక్షించు" అంటూ రక్షగా చుట్టూ తిప్పింది. దుష్టులైన వారు, ఎప్పుడు శ్రీరాముడు వస్తాడో - ఎప్పుడు మనల్ని చంపుతాడోనని తమ ప్రాణాలను భయంతో పిడికిట్లో పెట్టుకొని వున్నారని అభినయిస్తున్నట్లుగా, కొన్ని రోజులు, శ్రీరాముడు తనబాలక్రీడలతో తల్లి మోహాన్ని తీర్చేందుకు, పిడికిలి విడువకుండా వేళ్ళు ముడుచుకొనే వుండేవాడు. బాలురను చూడడానికి వచ్చిన పురస్త్రీలు, శ్రీరాముడిని తమ చేతులతో ఎత్తుకుంటే, బాలుడు కందిపోతాడేమోనని-ఆయన దేహం మురికిపడుతుందేమోనని, పొత్తిగుడ్డలతొనే ఎత్తుకొని - తమ స్తనాలకు హత్తుకొని-చిటికెలు వేసి-ఈలలు వేసి-నవ్వించి, తిరిగి తల్లిచేతికిచ్చేవారు. సమస్త భూమండలాధిపతైన చక్రవర్తి వినోదంకొరకై చెండాడినట్లే, ప్రపంచ సృష్ఠి - స్థితి - లయ లాంటి వ్యాపారాలు పెట్టుకొన్నదేవాదిదేవుడు, శత్రువులను వధించే కార్యక్రమంలో ఆసక్తి వున్నవాడైనప్పటికీ, తనను ఆడిస్తున్న స్త్రీలను, తన ఆట - పాటలతో ఆడించాడు.


శ్రీరామచంద్రమూర్తి తనతమ్ములతో ఆడుకొనేటప్పుడు, అతడు ఆడి-ఆడి అలసిపోయాడని, పాలు తాగేందుకు రమ్మనీ, కౌసల్య ఎత్తుకోపోగా, తల్లిచంకెక్కి, తమ్ములకు పాలిమ్మని సైగచేసేవాడు. ఆవయస్సులోనే ఆయనకంత భాతృవాత్సల్యం. నిదురించేటప్పుడు, తన ఉయ్యాల పక్కనే తమ్ముడు లక్ష్మణుడి ఉయ్యాల లేకపోతే సంతోషంగా ఆడుకొనేవాడు కాదు - నిదురపోడు. ఏమైనా సరే - తల్లి పాలుకూడా తాగడు. అన్నప్రాశనం కాకముందే, పాలు తాగే వయస్సులోనే, రోజుకొక్కమారైనా, తమ్ములను చూసేందుకు సవతి తల్లుల ఇళ్ళకు తీసుకెళ్ళమని సైగలు చేసేవాడు. ఎత్తుకొనిపోయేవరకూ విడువడు. మంచిపరిమళంగల సంపెంగ నూనెతో తలంటి పోసి - పన్నేటిలో స్నానం చేయించి - దశాంగంతో ధూపం వేసి - వెంట్రుకల తడి ఆరకముందే గట్టిగా జడ వేస్తే బిసకపట్తుందికాబట్టి బింపిణీ జడ వేసి - వొంటినిండా బంగారు సొమ్ములు పెట్టి - ముఖంమీద కస్తూరి చుక్క పెట్టి - కళ్ళకు కాటుక పెట్టి - సంతోషంతో ముద్దుపెట్టి, తమ్ములతో ఆడుకునేందుకు శ్రీరామచంద్రమూర్తిని పంపేది కౌసల్య. తనకాలి గజ్జెలు - బంగారు అందెలు గల్లుగల్లుమని ధ్వనిస్తుండగా, వక్షస్థ్సలమందుండే హారాలు వెనక్కూ-ముందుకూ - పక్కలకూ ఉయ్యాలలాగా వూగుతుంటే, చెవుల పోగులు తళుక్కు-తళుక్కుమని మెరుస్తుంటే, చేతులమీద ధరించిన కంకణాలు జిలిబిలి ధ్వనులు చేస్తుంటే, పిల్లతనం నటించేందుకు తై-తై అని ఎగురుకుంటూ, గంతులు పెట్తూ, మెల్ల-మెల్లగా పోరా నాయనా అని తల్లి హెచ్చరిస్తున్నా, పట్టుకోవచ్చినవారికి చిక్కకుండా, తమ్ముళ్లతో ఆడుకునేందుకు ప్రతిరోజూ వెళ్ళేవాడు శ్రీరామచంద్రుడు.  

రాజకుమారుల గుణ వర్ణన

ఈ విధంగా రాజకుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ, విద్యలలో ఆసక్తిగలిగి, సమస్త విద్యలను శ్రేష్ఠులైన గురువుల దగ్గర నేర్చుకున్నారు. నలుగురిలో శ్రీరాముడు ప్రజల పొగడ్తకు యోగ్యుడై, తండ్రికి-సేనకు ధ్వజంలాగా, భూత కోటులకు బ్రహ్మదేవుడిలాగా, అందరికీ మిక్కిలి ప్రియుడయ్యాడు. దశరథుడి నలుగురు కొడుకులూ నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారే. అందరూ శూరులని పేరుతెచ్చుకున్నవారే. అందరూ ప్రజల క్షేమం కోరేవారే. అందరూ జ్ఞానవంతులే-దయావంతులే-సత్య వాక్య దురంధరులే-సత్త్వగుణం ప్రధానంగా వున్నవారే-సాధువులందు రత్నాలలాంటివారే-గొప్పమనస్సుకలవారే-అరవైనాలుగు విద్యలలో ప్రవీణులైనవారే. శ్రీరామచంద్రుడు మంచినడవడనే సంపదతో మనోహరుడు-సత్యమై వంచనలేని విక్రమంతో గొప్పవాడు-సత్యంతోనే పరులను ఆక్రమించే కార్యక్రమంలో గొప్పవాడు-ఎప్పటికీ ఒకే విధమైన సద్గుణం కలవాడేకాని, సమయానికితగ్గట్లు రకరకాలుగా ప్రవర్తించనటువంటివాడు-శత్రువులనీ, మిత్రులనీ, గొప్పవారనీ, తక్కువవారనీ తారతమ్యాలు చూపకుండా సర్వసముడై సమస్త జీవకోటులను నిర్మల పూర్ణ చంద్రుడిలాగా ఇష్టపడేవాడు-సాధు చిహ్నాలే పూల హారాలుగా కలవాడు-వర్షించడానికి సిద్ధంగానున్న కారుమేఘంలాంటివాడు-దేహ సౌందర్యంతో మన్మధుడినే ధిక్కరించగల ప్రకాశవంతుడుగా పేరొందాడు. ఏనుగు పైనుండికాని, గుర్రం పైకెక్కిగాని, రథస్థుడైకాని, ఎటువంటి వాహనం లేకుండా కాళ్లపై నిలబడి కాని, వింటితోకాని, కత్తితో కాని, మరేదైనా అస్త్రం ధరించి కాని, యుద్ధంచేయడానికి - శత్రువులను సంహరించడానికి, మానమే ధనంగా కల రామచంద్రమూర్తి నేర్చుకున్నాడు.

చిన్నతనంనుండే, తనకంటే పెద్దవాడు-గుణాలలో శ్రేష్ఠుడు-ప్రజలను రంజింపచేసేవాడైన శ్రీరాముడితో స్నేహం-భక్తి మాత్రమే తనకు ఐశ్వర్యమని భావించి, లక్ష్మణుడు ఆయనకు బహిప్రాణమై -స్వశరీరానికంటే ఎక్కువగా వుండేవాడు. సకల కార్యాలలో సర్వదా తన సౌఖ్యం ఉపేక్షించైనా హితమే చేసేవాడు. తన ప్రాణంకంటే, రాముడి సుఖమే శ్రేష్ఠమని, స్వంత ప్రాణ రక్షణ విషయంలో లక్ష్యంచేయకుండా, రాముడికి హితమైన పనులే చేసేవాడు. స్వయంగా వండి - మంచి పరిశుద్ధంగా, రుచిగా వున్న అన్నాన్ని తెచ్చి, వెన్నతో సహా తినిపిస్తానని కౌసల్య రాముడిని బుజ్జగించినప్పటికీ, లక్ష్మణుడు తనపక్కనలేకపోతే-ఆయన ముందు భుజించకపోతే, అన్నాన్ని వేలేసైనా ముట్టడు శ్రీరాముడు. ముందుగా లక్ష్మణుడు నిద్రపోకపోతే తానూ నిదురించడు. ప్రాణాధారాలైన నిద్రాహారాల పై ప్రీతికంటే, శ్రీరాముడికి లక్ష్మణుడిపైనే అతిశయ స్నేహముండేది. శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడు సేవించడం కేవలం ఇంట్లో వున్నప్పుడు మాత్రమే కాదు. ఇతరుల సహాయం కోరకుండా, గొప్ప పరాక్రమం - అసహాయ శూరత్వంతో గుర్ర మెక్కి అడవికి వేటకై శ్రీరాముడు వెళుతుంటే, నీడలాగా లక్ష్మణుడు, శరశరాసనపాణిగా తోడుంటాడు. భక్తి రసావేశంతో అన్నను విడిచి ఒక్క క్షణమైనా ఏమరకుండా, వెంటనే వుంటాడు. రాముడంతటి గొప్పవాడికి, పరాపేక్షలేనివాడికి, తన సహాయమెందుకని అనుకొనేవాడుకాదు లక్ష్మణుడు. సేవచేయించేది స్నేహభావం కాని, సామర్థ్య జ్ఞానం కాదు. శక్తివంచన లేకుండా చేయడమే ప్రధానం. లక్షణుడు ఎలా శ్రీరాముడి పై  ప్రీతితో - విశ్వాసంతో వుంటాడో, ఎట్లా ఆయన సేవ చేస్తాడో, అదేవిధంగా, ఆయన తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి పట్ల ప్రవర్తించేవాడు. తన ప్రాణంకంటే కూడా భరతుడి ప్రాణాలే శత్రుఘ్నుడికి ప్రియమైనవి. భరతుడు కూడా అలాగే శత్రుఘ్నుడి విషయంలో వుండేవాడు.

రాజనీతి చక్కగా తెలిసినవారు - సరైన సమయంలో ఉపనయనం చేయబడినవారు - హేయ గుణాలు లేనివారు - సమస్త విద్యలు నేర్చినవారు - చెడు కార్యాలు చేయడమంటే సిగ్గుపడేవారు - కీర్తివల్ల లోకమంతా అందరికీ తెలిసినవారు - శూరులు - తమ తేజస్సుతో సూర్యుడిని జయించినవారు - శాస్త్రాది విద్యల్లో పండితులు -మన్మధుడి లాంటి సౌందర్యం కలవారు - పితృశుశ్రూషాపరులైన తన నలుగురు కుమారులకు వివాహం చేయాలనుకున్న దశరథుడు, బాగా ఆలోచించి, తన గురువులను - బంధువులను - తన హితమందు ఆసక్తి గల వారిని - మంత్రులను చూచి, కొడుకులకు తగిన రాచకన్నెలు ఏ రాజ్యంలో వున్నారో చెప్పమని అడుగుతాడు.

దశరథుడిని చూడడానికి వచ్చిన విశ్వామిత్రుడు

ఇలా మంత్రులతో దశరథుడు ఆలోచన చేసే సమయంలో, ఆయన సంకల్పబలానికి అనుగుణంగానే, జగత్ప్రసిద్ధిగాంచిన - మహాతేజస్సుగల విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. వచ్చిన మహర్షి, ద్వారం వద్దనే నిలబడి, ద్వారపాలకులనుద్దేశించి, విశ్వామిత్రుడు వచ్చి వాకిటిలో నిలబడి వున్నాడని తమ రాజుతో చెప్పమన్న వెంటనే, వారు రాజు వద్దకు పరుగెత్తారు. వారు ఆయన పేరు వినగానే, భయంతోనూ - భక్తితోనూ, ఒకరికంటే మరొకరు కాలికొలది పరుగెత్తిపోయి, రాజగృహంలోకి ప్రవేశించి, మాట తడబడగా - కాళ్ళువణకగా - గుండెలు కొట్టుకుంటుంటే, "రాజా - రాజా, విశ్వామిత్రుడు వచ్చి వాకిటిలో నిలబడ్డాడు" అని దశరథుడికి విన్నవించుకుంటారు. ద్వారపాలకులు చెప్పిందాన్ని విన్న దశరథుడు సంతోషంతో, పురోహితులను వెంటబెట్టుకొని, బ్రహ్మకెదురెళ్ళి పిలిచే ఇంద్రుడిలాగా, విశ్వామిత్రుడిని సమీపించి, అర్ఘ్యపాద్యాదులతో పూజించి, గౌరవించి, సంతోషింపచేసి, రెండు చేతులు జోడించి నిలబడ్డాడు. వాటిని గ్రహించిన విశ్వామిత్రుడు దశరథుడిని, ఆయన భార్యా పిల్లల క్షేమ సమాచారాలను, అడిగి తెలుసుకున్నాడు. " రాజేంద్రా" అని సంబోధిస్తూ: పట్టణ ప్రజల సంతోషం గురించి, ధనాగారం కొరతలేకుండా నిండుగా వున్న విషయం గురించి, పల్లె ప్రజల హాయైన జీవనం గురించి, అథిదులను ఆయన గౌరవంగా చూసుకుంటున్న విషయం గురించి, దేవతలను - మనుష్యులను పూజిస్తున్న సంగతి గురించి, శత్రువులను దండిస్తున్న వ్యవహారం గురించీ ప్రశ్నించి సరైన సమాధానం పొందుతాడు. దశరథుడి క్షేమ సమాచారాలను తెలుసుకున్న అనంతరం, విశ్వామిత్రుడు, వశిష్ఠ - వామదేవాది ఋషుల వద్దకు వెళ్ళి, వారినీ కుశలప్రశ్నలడిగి, ఉభయకుశలోపరి ముగిసిన పిదప, అందరూ కలిసి సభా భవనంలోకి ప్రవేశించి, సంతోషమతిశయింపగా వారివారి ఆసనాలపై కూర్చున్న తర్వాత, విశ్వామిత్రుడు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్తాడీవిధంగా.

(ఇంతవరకు భగవదవతారాన్ని గురించే చెప్పబడింది. ఇక ఇక్కడినుంచి, చివరివరకూ, భగవదవతార ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయోజనాల్లో, శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన ముఖ్యమయినవి. ఈ ప్రయోజనాల్లో సేద్యం చేసేవారికి, ధాన్యంలాగా లభించే ప్రధాన ఫలం, శిశ్ఠపరిపాలనే. పైరు బాగుపడేందుకు ఏ విధంగానైతే కలుపు మొక్కలను పీకేస్తామో, అదేవిధంగా, శిష్ఠరక్షణార్థమై నడుమంత్రపు సిరైన దుష్ట శిక్షణ తప్పనిసరిగా జరగాల్సిందే).

విశ్వామిత్రుడొచ్చిన కారణాన్నడిగిన దశరథుడు

కొడుకులు లేనివాడు దీర్ఘకాలం తర్వాత, కులంలోనూ, గుణంలోనూ, తనతో సమానమైన భార్యలద్వారా పుత్రులు కలిగినప్పుడు - నష్టపోయిన నిక్షేపం తిరిగి లభించినప్పుడు - ఎడారిలో వానకురిసినప్పుడు - అమృతం తాగినప్పుడు - అధికమైన మేలు కలిగినప్పుడు, ఎలాంటి సంతోషం కలుగుతుందో అలాంటి పరిపూర్ణానందం విశ్వామిత్రుడి రాకతో తనకు కలిగిందని అంటాడు దశరథుడు ఆయనతో. "మహానుభావా! నీవు నా దగ్గరకు రావడానికి కారణం: నన్ను కృతార్థుడను చేయడానికే కాని మరెందుకూ కాదు. ఏదో ఒక కారణం కల్పించుకొని, నాతో ఏదో ఒక మంచిపని చేయించి - దానివల్ల నాకు శ్రేయస్సు కలిగించేందుకు నీవొచ్చావు. నా శ్రేయస్సుకొరకు, నేను చేయాల్సిన పనిని, నేను చేస్తే - నాతో నీవు చేయిస్తే, నీకు కలిగేమేలుకాని, చేయకపోతే నీకు జరిగే నష్టం కానీ లేదు. అందుకే దయతో, నీవొచ్చిన పని తెలుపుతే, అది ఎట్లాంటిదైనా, నేను సంతోషంతో చేస్తాను. నన్ను మన్నించి నీవొచ్చిన పని చెప్తే, నీ పాదాలపై పడి ప్రార్థిస్తాను" అని దశరథుడంటాడు విశ్వామిత్రుడితో.

"మహానుభావా! నీవు ఇతర సామాన్య ఋషులలాంటివాడివి కావు. బ్రాహ్మణుడిగా జన్మించి - పుట్టినప్పటినుండే అడవుల్లో వనవాసం చేస్తూ-బాల్యంనుండే తపస్సు, వ్రతం, అనుష్ఠానపరుడై శిక్షణ పొందినవాడు బ్రహ్మర్షి కావడం పెద్ద విశేషం కాదు. అలాకాకుండా, నీవు, రజోగుణం అధికంగావుండే క్షత్రియుడివిగా పుట్టి - క్షాత్రంలో పెరిగి పెద్దై - రాజర్షివై - సుకుమారుడివై వున్నప్పటికీ, క్షణంలో రాజ్యం - భోగం-సర్వం త్యజించి, గొప్పతపస్సుచేసి, సత్త్వాతిశయంగల బ్రాహ్మణ్యాన్ని సంపాదించి, బ్రహ్మర్షివయ్యావు. ఇలా చేసినవాడు లోకంలో ఇంకెవరూ లేరు. అలా కావడం ఎంత దుస్సాధ్యమో ప్రపంచానికి తెలియచేసినవాడివి నువ్వే. అందుకే నువ్వు మరెంతగానో పూజింపతగినవాడివి. అంతటి మహానుభావుడివైన నువ్వు చేసుకోలేని పనికాని - పరులు నీకు చేయగలిగిన పనికాని ఏదీ లేదు. అవాస్తసమస్తకాముడవు నీవు. అఘటనాఘటన ధురీణుడవైన నువ్వు నా దగ్గరకు కార్యార్థివై రావడమంటే, నా జన్మ సఫలమైనట్లే. నా జన్మ ఫలం నాకివ్వాళ లభించింది. నా జన్మ సార్థకమయింది. నువ్వేమన్నా సామాన్య ఋషివా? నాకేదో గొప్ప శుభం కలిగించేందుకు నావద్దకొచ్చావు. నీరాకతో నాకు తప్పక శ్రేయస్సే కలుగుతుంది. ఎలాంటి దానానికైనా - ఎంతటి దానానికైనా, నీవు యోగ్యుడవే. నీకివ్వతగని పదార్థం ఈలోకంలో లేనేలేదు. నాపూర్వజన్మలో నేను చేసిన గొప్ప పుణ్యం వల్లనే నువ్వు నావద్దకొచ్చావు. సనత్కుమార తేజా! నీ పాదం మాఇంటిలో పెట్టగానే మా గృహం పవిత్రమైంది. అది పవిత్రమవడమే కాకుండా, ఇతరులను పావనం చేసే సుక్షేత్రమయింది. దివ్య క్షేత్రాలలో నివసించేవారికి కలిగే ఫలం నాకు కలిగింది. నీ దర్శనం, దివ్య క్షేత్రాలలోని దేవతల దర్శనంలాంటిదే కనుక, నువ్వు నన్ననుగ్రహించి నీకోరికేదో తెలియచేయాలి. నీ కార్యాన్ని నేను చేస్తానో -లేదో - చేయిజాపి, అడిగి, లేదనిపించుకోవడం మంచిదేనా - వూరకుండడమే శ్రేయస్కరం కదా - చెప్పాల్నా - వద్దా, అని సందేహించ వద్దు. గాధినందనుడవైన నీవు నా పాలిట దేవుడవు. దేవుడే పని చెప్తే చేయని మనిషి వుంటాడా? నువ్వేదిచెప్పినా నెరవేరుస్తాను. నా శ్రేయస్సు కోరే నువ్వొచ్చావు కనుక, నువ్వు చెప్పింది నేను చేయకపోతే, నా శ్రేయస్సుకు నేనే భంగం కలిగించుకొన్నట్లవతుందికదా! ఏది ధర్మం అని నువ్వు భావిస్తావో, దాన్నే చెప్తావుకాని, అధర్మాన్ని చెప్పవు కదా! నువ్వు ధర్మమని చెప్పింది చేయడం వల్ల, నాకెంతో ధర్మాభివృద్ధి కలుగుతుంది." అని విన్నవించుకుంటాడు దశరథుడు విశ్వామిత్రుడితో. 

2 comments:

  1. చాలా బాగా రాస్తున్నారు.అయితే వీటికి ఒక సంబ్నధం కలిపి తొలి నుంచీ చివరి వరకూ వెతుక్కోకుండా వుందే ఏర్పాటు చెయ్యగలరా!

    ReplyDelete
    Replies
    1. సర్గ ఒకటి నుండి అన్నీ నా బ్లాగ్ లో వున్నాయి. ముందుమాట కూడా వుంది. బాల కాండ ఎందుకు చదవాలో కూడా వుంది. దయచేసి చూడండి. అన్నీ వెంట వెంటనే దొరుకుతాయి. జ్వాలా

      Delete